ప్రపంచ పర్యాటక ప్రదేశాల జాబితా మొదటి పదిలో ఒకటి. ప్రపంచదేశాల ముందు ఫ్రాన్స్ సగర్వంగా తలెత్తుకోవడమే లక్ష్యంగా నిర్మించిన స్వాగత నిర్మాణం ఐఫిల్ టవర్. ప్రపంచ వింత కాకపోయిన.... టాలెస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ ద వరల్ట్‌గా రికార్డుకెక్కిన కట్టడం ఈ టవర్.
- గొప్పదిగా కనిపించే ప్రతి వస్తువు వెనుకా గొప్ప కథలే ఉండవు. అలాగే ఓ గొప్ప నిర్మాణాన్ని ప్రారంభించిన కారణం చాలా సరదాగానూ ఉండొచ్చు. దాన్ని పూర్తి చేసేందుకు పనిచేసిన వారి శ్రద్ధ, అంకిత భావం మీదే ఆ కట్టడం గొప్పదనం, ప్రత్యేకతా ఆధారపడి ఉంటాయి. ఆ కోవలోనిదే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఐఫిల్ టవర్ కూడా..
- పారిస్ పేరు చెప్పగానే ఐఫిల్ టవరే గుర్తొస్తుంది. 81 అంతస్తుల ఎత్తుండే ఓ అంతర్జాతీయ ప్రదర్శనకు ముఖద్వారంగా నిర్మించారు. దాన్ని కట్టేప్పుడూ అక్కడి ప్రజల నుంచి ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. కానీ ఆ నిర్మాణ ప్రధాన ఇంజనీర్ వెనుకడుగు వేయలేదు. ఈ రోజు ఇక్కడి నుంచి చూస్తే 45 కిలోమీటర్ల దూరం వరకూ పారిస్ నగర అందాల్ని చూడొచ్చు.
- రాత్రిపూట ఈ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఏటా సందర్శించేవారి సంఖ్య దాదాపు ఆరుకోట్ల ఎనభై లక్షలు. అలెగ్జాండర్ గుస్తావా ఐఫిల్... ప్రసిద్ధి చెందిన నిర్మాణ రంగ ఇంజనీర్. ఫ్రెంచ్ రైల్వే రంగానికి సంబంధించి అప్పటికే ఎన్నో పెద్ద నిర్మాణాలు చేశాడు. ఎంత పెద్ద విషయమైనా మంచి ఉందంటే వెనుకాడని మనస్తత్వం. ఒకసారి మౌరిస్ కొయెచిన్, ఎమిలీ నౌగియర్ అనే యువకులు ఐఫిల్ టవర్‌కు చెందిన ప్లాన్ ప్రతిని ఐఫిల్ చేతికి అందించారు. అది ఐఫిల్కు ఎంతగానో నచ్చింది. అనుకున్నదే తడవుగా ఆ డిజైన్ నిర్మాణానికి ప్రభుత్వ అనుమతినీ పొందాడు.
- అయితే ఇది చాలా స్థలాన్ని ఆక్రమించడమే కాదు, నగర నడిబొడ్డున పెద్ద ఇనుప కట్టడంలా మారుతుండటంతో అక్కడి ప్రజలు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఆపేయాలంటూ ప్రభుత్వానికి వినతులూ సమర్పించారు. కానీ నిర్మాణం అయిపోయింది. అదీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడంగా (1933 వరకూ). ఇప్పటికీ ఇంజనీరింగ్ రంగంలో ఇదో అద్భుతం. 1889 మార్చి 31న ఈ కట్టడాన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణపు ప్రధాన ఇంజనీర్ గుస్తావా ఐఫిల్ పేరుమీదుగానే ఐఫిల్ టవర్ అని నామకరణం చేశారు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ రూపకర్త కూడా ఈయనే!
- ఈ టవర్‌ను కట్టేందుకు రెండు సంవత్సరాల, రెండు నెలల, ఐదు రోజుల సమయం పట్టింది.
దీని వైశాల్యం 2.5 ఎకరాలు. బరువు పదివేల టన్నులు. ఇందులోని మెట్ల సంఖ్య 1665
తుప్పు పట్టకుండా ఉండేందుకు ప్రతి ఏడేళ్లకొకసారి పెయింట్ వేస్తారు. అది మూడు బ్రౌన్ షేడ్స్‌లో ఉంటుంది. ఒకసారికి 60 టన్నుల పెయింట్ అవసరమౌతుంది. 25 లక్షల బోల్టులు, 18038 ఇనుప విడిభాగాలు ఈ నిర్మాణాన్ని పూర్తిచేశాయి.
- 1880లోనే దీని నిర్మాణానికి దాదాపు డెబ్భై ఎనిమిది లక్షల ఫ్రెంచ్ డాలర్లు వ్యయం అయ్యింది.
- ఇరవై ఏండ్ల తరువాత టవర్‌ను విడగొట్టి, ఇనుప సామాన్లకు అమ్మేయాలన్న ఆలోచనతో నిర్మించారు. 365 రోజులూ సందర్శకుల కోసం తెరిచే ఉంటుంది. కానీ కాలాన్ని బట్టి సందర్శించే వేళలు మారతాయి.
- రెండో ప్రపంచ యుద్ధ కాలంలో విదేశీయులు దీన్ని ఎక్కకుండా ఉండేందుకు ఎలివేటర్‌ను ఆపేశారు. అయినా జర్మనీ నియంత హిట్లర్, పారిస్ అందాలు చూసేందుకు అంత ఎత్తూ కాలినడకనే ఎక్కాడు.
- ఐఫిల్ టవర్ పర్యాటకులను ఆకర్షించడమే కాదు... ఎన్నో విధాలుగా ఉపయోగపడింది కూడా. మొదటి ప్రపంచ యుద్ధంలో అట్లాంటిక్ మహాసముద్రంలోని ఓడలకు వైర్లెస్ టెలిగ్రాఫ్ పంపేందుకు ఈ టవర్ ఉపయోగపడింది. శత్రువుల సందేశాలు ప్రసారం కాకుండా అడ్డుకునేందుకూ సాయపడింది.
- ఇప్పటికీ దీనిపై వివిధ ఛానెళ్లు, రేడియోలకు సంబంధించిన 120 యాంటెన్నాలున్నాయి. ఎంతో ఎత్తులో ఉండటం వల్ల వీటి ప్రసారాలు చాలా స్పష్టంగాఉంటాయి.
- ఐఫిల్ టవర్ నిర్మాణం చేసేప్పుడూ గుస్తావా ఐఫిల్ ఏ మాటలు చెప్పినా.. ఆ కట్టడం మాత్రం చిరకాలం ఉండాలనేది ఆయన కోరిక. అందుకే అంత పకడ్బందీగా దాని నిర్మాణం చేశాడు.
Authorization