హాయ్ ఫ్రెండ్స్..! మనం పక్షుల్ని, జంతువులని మచ్చిక చేయడం పూర్వం నుంచి వస్తోంది. అయితే మచ్చిక చేసుకునే పక్షుల్లో రామ చిలుక కూడా ఒకటి. ఎందుకంటే ఇది అందంగా ఉండటమే కాదు.. మాటలు కూడా చెబుతుంది. అందుకే చాలా మంది చిలుకల్ని ఇష్టపడుతుంటారు.. మరి ఆ చిలుక గురించి బోలెడన్ని విశేషాలున్నాయి తెలుసుకుందామా...!
- చిలుక అనగానే మనకి పచ్చగా, ఎర్రటి ముక్కున్నదే గుర్తొస్తుంది. కానీ వాటిలో దాదాపు 70 రకాలుంటాయి. ఇవి సిట్టఫార్మిస్ వర్గానికి చెందినవి. అందుకే వాటికి సిట్టసైనెస్ అనే పేరుంది. వీటిని ట్రూ పేరట్స్, కాకటూ అనే రెండు కుటుంబాలుగా విడదీశారు. అన్ని సమశీతోష్ణ ఉష్ణమండలాల్లోనూ జీవిస్తాయి.
- చిలుకల్లో అన్నిటి ముక్కూ వంకీ తిరిగే ఉంటుంది. కాళ్లు బలంగా ఉంటాయి. నాలుగు వేళ్లలో రెండు వేళ్లు వెనక్కి, రెండు ముందుకి ఉంటాయి. వీటి బరువు కొన్ని గ్రాముల నుంచి కిలోవరకూ ఉంటుంది. వీటి రంగు ఆకర్షణీయంగా ఉండి ఎన్నో రంగుల్లో కనిపిస్తాయి. అన్నిట్లోకి పంచరంగుల చిలుకలు చూడముచ్చటగా ఉంటాయి.
- చిలుకల ముఖ్య ఆహారం గింజలు. పండ్లు, మొగ్గలు, లేతచిగుళ్లు, విత్తనాలు, పుప్పొడి, పురుగుల్లాంటి వాటినీ ఆరగిస్తాయి. పక్షులేవైనా ముక్కుతో నేరుగా తింటాయి కదా! కానీ చిలుకలు మాత్రం కాళ్లని చేతుల్లా ఉపయోగిస్తాయి. వాటితో ఎంచక్కా ఆహారాన్ని అందుకుని నోట్లో పెట్టుకుంటాయి. మనకి చేతివాటం ఉన్నట్లే వీటికి కాలావాటం ఉంటుందట! ఏ కాలితో ఆహారాన్ని తీసుకు తింటే ఆ కాలి వాటానివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- చెట్టు తొర్రలు, కొండగుహలు, రాళ్ల సందుల్లో కర్రపుల్లలతో గూళ్లు నిర్మించుకుంటాయి. కొన్ని రకాలు రంధ్రాల్లోనే నివాసముంటాయి. సగటున వీటి ఆయుర్ధాయం 95 ఏండ్లు. కానీ చాలా సున్నితమైన ప్రాణులు కనుక ఎముకలు బలహీనంగా ఉండి చిన్నపాటి దెబ్బలకే ప్రాణాలు పోగొట్టుకుంటాయి.
- చిలుకలు భలే ముద్దు ముద్దుగా మాట్లాడుతాయి కదా! అదంతా వాటి జ్ఞాపకశక్తి ఫలితమే. అంతే తప్ప మనలా అన్నీ మాటల్నీ మాట్లాడలేవు. మనం మాట్లాడుతున్నప్పుడు విని ఆ తీరుని గ్రహిస్తాయి. ఆసక్తి కలిగించే చిన్న చిన్న పదాలని గుర్తుపెట్టుకుంటాయి. అలా వాటినే మార్చి మార్చి వల్లెవేస్తాయి. ఇంకో విషయం వీటికి మనుషుల్లా స్వరపేటిక ఉండదు. కేవలం శ్వాసనాళంలోకి శ్వాసను గట్టిగా పీల్చి వదలడం ద్వారా శబ్దాలను మాటల రూపంలో బయటకు వదులుతాయి.
- మనుషులకి త్వరగా మచ్చికవుతాయి. అందుకే పెంపుడు పక్షులుగా వీటికే ప్రాధాన్యమిస్తారు.
మిగతా పక్షులకన్నా చిలుకలకు వినికిడి శక్తి ఎక్కువ. అందుకే మనం చెప్పింది తొందరగా విని ఆచరిస్తాయి. ఇవి చాలా తెలివైనవి కూడా. ఆపద సమయంలోనూ త్వరగా స్పందిస్తాయి. అయితే కొన్ని రకాల జాతుల చిలుకలే మాట్లాడగలవు. ఆఫ్రికన్ గ్రే పేరట్ మాటల్ని అనుకరించడంలో ముందుంటుంది. 150 పదాల వరకు వల్లిస్తుంది.
- చిలుకలు చాక్లెట్లు తినవు. వాటి తయారీకి వాడే కోకో వాటికి విషంలా పనిచేస్తుంది. పొరపాటున తింటే చచ్చిపోతాయి కూడా.
- చిలుక జాతుల్లో కొన్ని రకాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. వాటిలో పొట్టభాగాన నారింజరంగు ఉండేవైతే దాదాపు అంతరించిపోయాయి కూడా. మనదేశంలో ఒకప్పుడు 150 జాతులు సంచరించేవట. ఇప్పుడు వాటి సంఖ్య 50కి చేరింది. దీనికి కారణం పెంపకం కోసం వాటిని బంధించడమేనట.
Authorization