ఒక తోటలో మూడు చిలుకలు స్నేహంగా ఉండేవి. అవెప్పుడూ కలిసే ఎగరేవి, కలిసే పండ్ల్లు తినేవి. జట్టు వీడకుండా ఒకే చోట వాలేవి.
ఆ ఊరి వారంతా వీటిని చాలా ముచ్చటగా చూసేవారు. 'హారు! మన పెరటి జాంచెట్టు మీద మూడు చిలుకలు వచ్చాయంటే', 'మా ఇంటి గోడ మీద మూడు చిలుకలు వాలాయ'ని పిల్లలు రోజూ గొప్పగా చెప్పుకునేవారు. ఒకే పండుని మూడు చిలుకలూ కలిసి తినడాన్ని మరీ ఆశ్చర్యంగా చూసేవారు.
ఇలా ఉండగా ఆ ఊరికి పిట్టలమ్ముకొనే వాడొకడొచ్చాడు. వాడు చాలా నేర్పుగా ఈ చిలకల్లో రెండింటిని పట్టి పాపం పంజరంలో బంధించాడు. ఒక్క చిలుక మాత్రం ఒంటరిగా ఉండిపోయింది. పంజరంలో పెట్టి 'పిట్టలమ్మా పిట్టలు' అంటూ ఊరంతా తిరిగి అమ్ముకోసాగాడు. పొరుగూరి నుంచి ఆ ఊరి సంతకు వచ్చిన రమణయ్య... జంట చిలుకలున్న పంజరాన్ని కొనుక్కుని తనతో తీసుకుపోయాడు.
అది చూసిన మూడో చిలుకకు వల్లమాలిన దు:ఖం వచ్చింది. ఆటోలో వెళుతున్న రమణయ్యను వెంబడించింది. అతని చేతిలోని పంజరాన్ని, దాన్లోని పిట్టల్ని చూడగానే ఎగిరి గంతులేశారు అతని పిల్లలు.
రోజూ ఆ పిల్లలకు పంజరంలోని చిలుకలతో ఆడుకోవడమంటే ఎంతో సరదాగా ఉండేది.
మూడో చిలుక ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో వచ్చి, పంజరం మీదికి ఎక్కి కూర్చొని చాలాసేపు లోపలున్న చిలుకలతో కబుర్లాడుకొని వెళ్లిపోయేది. పాపం తన స్నేహితులిద్దరూ ఇలా పంజరంలో బందీలై ఉన్నందుకు బాధపడేది. ఈ కష్టం నుంచి ఎలాగైనా స్నేహితుల్ని తప్పించాలని ఆలోచించేది. ఒకసారి రమణయ్య తన కుటుంబంతో సహా పొరుగూర్లో చుట్టాల పెండ్లికని వెళ్లాడు. రెండు రోజుల వరకూ రావడం కుదరదని చిలుకలకు పండ్లు, నీళ్లు పంజరంలో పెట్టి వెళ్లాడు.
ఎప్పట్లా స్నేహితుల్ని పలకరించడానికి వచ్చిన చిలుకకు తన స్నేహితుల్ని విడిపించడానికి ఇదే అదను అనిపించింది. బాగా ఆలోచించింది. ఆ పంజరం తలుపునకు వేసి ఉన్న చిన్న కొక్కేన్ని ఎలాగైనా ఊడదీయాలని ప్రయత్నించింది. ముక్కుతో పొడిచి పొడిచి పైకి ఎత్తుతోంది. పాపం! ప్రయత్నంలో దాని ముక్కుకి గాయం అయ్యింది. నొప్పి పెట్టసాగింది. రక్తం కూడా చిమ్ముకొస్తోంది.
''బాధపడకు నేస్తం. మా బతుకులింతే. నువ్వైనా హాయిగా ఉండి ఎగిరిపో'' అన్నాయి పంజరంలోని చిలుకలు.
ఆపదలో ఉన్న స్నేహితుల్ని ఎలాగైనా రక్షించాలనే పట్టుదలతో ఆ రెండు రోజులూ దీక్షగా పనిచేసింది. ఆ గొళ్లెం ఇంక ఊడొచ్చేస్తుందనే సమయానికి రమణయ్య కుటుంబం ఆటోదిగిన శబ్దం వచ్చింది. చిలుక తన శక్తినంతటినీ ఉపయోగించి గొళ్లేన్ని గభాల్న లాగింది. ఇంకేం! రమణయ్య లోపలికి వచ్చేలోగా పంజరం తలుపు తెరచుకుంది. ఒక్కసారిగా ఎగిరిపోతున్న ఆ మూడు చిలుకల్నీ చూసి బిత్తరపోవడం రమణయ్య వంతయ్యింది. -
Authorization