హాయ్ చిన్నారులూ! మీరు జాయింట్ వీల్‌ని చూశారు కదా! దీనిపై ఎక్కి తిరగడం భలే సరదాగా ఉంటుంది. ఎగ్జిబిషన్లలో, పార్క్‌లలో, మన ఊరి జాతర్లలో ఇది తప్పకుండా ఉంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా ఈ జాయింట్ వీల్‌ని ఎక్కి సంతోషపడుతుంటారు.
- జాయింట్ వీల్ ఈనాటిది కాదు. 400 ఏండ్ల క్రితమే, పీటర్ మండీ అనే ఇంగ్లిషు యాత్రికుడు తను రచించిన ఓ పుస్తకంలో 'బల్గేరియాలోని ఓ జాతరలో కుర్చీలున్న చక్రాన్ని తిప్పుతూ పిల్లల్ని ఆడిస్తున్నారు' అని రాశాడు. అంటే ఎప్పటినుండో ఇది ఉందన్నమాట.
- 17వ శతాబ్దం నాటికి, మన దేశంతో సహా ప్రపంచమంతా వీటిని తయారుచేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ పల్లెటూరి జాతరల్లో, మనుషులే తిప్పే చిన్న జెయింట్ వీల్స్‌ని చూడవచ్చు
- ఆ తరువాత ఓ దేశప్రతిష్ట కోసం ఓ పెద్ద జాయింట్‌వీల్ నిర్మాణానికి రూపకల్పన జరిగింది. కొలంబస్ అమెరికాని కనుగొని 1893కి 400 ఏండ్లు దాటాయి. ఈ సందర్భంగా చికాగోలో, ఓ ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకున్నారు. ప్యారిస్‌లోని ఐఫిల్ టవర్ కంటే గొప్పదేదన్నా, చికాగోలో నిర్మించాలనుకున్నారు. అందుకు గేల్ ఫెర్రిస్ జూనియర్ అనే ఇంజినీరు ముందుకు వచ్చాడు. 260 అడుగుల ఎత్తు వరకూ వెళ్ల గలిగే అతిపెద్ద జెయింట్ వీల్‌ని నిర్మిస్తానన్నాడు ఫెర్రిస్. అప్పట్లో అది ఇంచుమించుగా అసాధ్యం.
- అయినా దాన్ని సాధ్యం చేయాలనుకున్నాడు గేల్ ఫెర్రిస్. వెంటనే పని మొదలెట్టాడు. 'మేం ఈ నిర్మాణానికి పైసా ఇవ్వం' అనేశారు ప్రదర్శన
నిర్వాహకులు. దాంతో జనం దగ్గర్నుంచే మూలధనాన్ని ఆహ్వానించారు. ముందుగా 140 అడుగుల పొడవుతో, రెండు ఇనుప స్తంభాలను పాతాడు. వాటిమధ్య ఇరుసుగా ఉండేందుకు 60 వేల కిలోల బరువున్న, 45 అడుగుల కడ్డీని పోతపోయించాడు. ఇదంతా చూసిన ఒకాయన 'ఇతనికి పిచ్చిపట్టింది. చక్రాలు ఇతని బుర్రలోనే తిరుగుతున్నట్లున్నాయి' అని విమర్శించాడట. కానీ ఫెర్రిస్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జాయింట్ వీల్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు.
- 1893, జూన్ 21న పేద్ద జాయింట్ వీల్ ప్రారంభమయింది. తడవకు రెండు వేల మంది పట్టే, ఈ భారీ చక్రాన్ని తిప్పేందుకు రెండు మోటర్లను అమర్చారు. ఫెర్రిస్ ఆశించినట్లుగానే ఈ జాయింట్ వీల్ గొప్ప విజయం సాధించింది. దాదాపు 14 లక్షల మంది జాయింట్ వీల్ ఎక్కి సంబరపడ్డారు. దీనికి చికాగో వీల్ అని పేరుపెట్టినా, అందరూ ఫెర్రిస్ వీల్ అనే పిలవసాగారు. ఇప్పటికీ యూరప్‌లో ఫెర్రిస్ వీల్ అనే అంటారు.
- చికాగో వీల్‌ని ఆర్నెల్ల తరువాత వేరేచోటుకి తరలించారు. తరువాత దాన్ని ఎక్కడ ఉంచాలో తెలియక డైనమైట్లతో పేల్చేసి తుక్కు కింద అమ్మేశారు. కానీ ఫెర్రిస్ వీల్స్‌కి ఆదరణ పెరుగుతూనే వచ్చింది. ఇప్పటికీ ఒకదేశాన్ని మించి మరో దేశం, అతి పెద్ద ఫెర్రిస్ వీల్‌ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
- మనదేశంలో ఢిల్లీలో ఉన్న 140 అడుగుల ఫెర్రిస్‌వీల్ అతిపెద్దది. దీనిపై తిరిగితే ఢిల్లీలోని అక్షరధాం, కుతుబ్‌మినార్ వంటి పర్యాటక ప్రదేశాలన్నీ కనిపిస్తాయట.
- ఫెర్రిస్ వీల్‌ని చూసినప్పుడల్లా, 'అమ్మో! అది పడిపోతేనో!' అన్న భయం చాలా మందికి కలుగుతుంది. నిజానికి వీటిని చాలా సాంకేతికతతో నిర్మిస్తారు. అందుకే చరిత్రలో ఫెర్రిస్ వీల్స్ వల్ల జరిగిన ప్రమాదాలు చాలా అరుదు. అయితే వీటిపై ఉన్నప్పుడు నిర్వాహకులు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Authorization