ఆఫ్రికాలోని మాగాణి నేలల్లో కనిపించే ఈ పక్షి పేరు స్పర్ వింగ్డ్ గూస్. ఇది బాతు కుటుంబానికి చెందినది. రెక్కలు రెండూ చాచినపుడు దాదాపు ఆరడుగుల వెడల్పు ఉంటుంది. అందుకే ప్రపంచంలో అతిపెద్ద అడవిబాతుగా పేరుపొందింది. సరస్సులు, నదుల లాంటి నీళ్లు సమృద్ధిగా ఉండే ప్రాంతాల్లో ఈ పక్షి కనిపిస్తుంది. వాటికి దగ్గర్లోని గుబురు పొదలు, చెట్టు, తొర్రలు, రాతి పగుళ్లలో గూడు కట్టి గుడ్లుపెడతాయి. కోడికి ఉన్నట్లే వీటి కాళ్ల వెనుకభాగంలో ముళ్లులాంటి ఆకృతి ఉంటుంది. మిగతా పక్షులతో గొడవపడినపుడు ఈ ముళ్లుతో వాటిని గుచ్చడానికి ప్రయత్నిస్తాయి. గుంపుగా నివసించడానికి ఇష్టపడే ఈ పక్షులు విషపూరితాలు. బ్లిస్టర్ అనే పురుగుల్ని ఇవి తిన్నపుడు వాటిలోని విషం ఈ పక్షుల్లోకి చేరుతుంది. అలాంటప్పుడు.. ఈ పక్షుల మాంసం తింటే చాలా ప్రమాదం.