హోట్జిన్.. దక్షిణ అమెరికా నది సమీపంలో కనపడుతుంది. రెక్కల అంచున గోళ్ల కారణంగా పిల్లలు చెట్లకొమ్మలు పట్టుకుని ఉంటాయి. అమెజాన్, ఆరినోకో నదీ తీరంలో బురదలో లభించే రబ్బరులా సాగే పదార్థాలను కూడా తినగలవు. వంద మీటర్ల ఎత్తులో ఎగరగలవు. దక్షిణ అమెరికా ఈశాన్య ప్రాంతాల్లో గుయానా, బ్రెజిల్ నుంచి దక్షిణాన ఈక్వెడార్, బొలీవియ వరకూ ముఖ్యంగా అమెజాన్ పరిసరాల్లోని వర్షాధార అడవుల్లో ఉంటాయి. ఇది రంగు రంగులుగా ఉంటుంది గనుక దీన్ని జిప్సీ బర్డ్ అని పిలుస్తారు. దీని తలపై పెద్దపెద్ద ఈకలు పింఛంలా ఉంటాయి. మెడ, వీపు మీద నలుపు, తెలుపు పొడవాటి ఈకలు ఉంటాయి.. కంటి చుట్టూ నీలంగా ఉంటుంది. కంఠం, రెక్కలు, కాళ్లు నలుపు, ఎరుపు కలిసిన రంగులో ఉంటాయి. తోక నల్లని పొడవాటి ఈకలు కలిగి ఉంటుంది. చివర తెల్లగా ఉంటుంది. 28 ఔన్సుల బరువు, 24.4 అంగుళాల పొడవుండే ఈ పక్షి వర్షాకాలంలో లేదా సంవత్సరానికి రెండు పర్యాయాలు 3 లేదా 5 గుడ్లు పెడతాయి. ఇవి ఎక్కువగా పండ్లు, ఆకులు తింటాయి.