నవ్వని వారంటూ ఉండరు. హాస్యానికి నవ్వే ఆనవాలు. అసలు నవ్వెందుకు వస్తుందంటే ఏదయినా జోక్ విన్నా, నవ్వుకునే సంఘటన జరిగినా, మెదడులోని ఒక నాడికి ప్రేరేపణ కలిగి నవ్వు వస్తుంది. మెదడులోని రెండు భాగాల్లో ఒకటి ముఖంలో నవ్వు తాలుకు భావాన్ని, మరొకటి నవ్వు శబ్దాన్ని ప్రేరేపిస్తాయి. అప్పుడు మనకు తెలియకుండానే పెద్దగా నవ్వుతాం. నవ్వడం వల్ల నాడులన్నీ ఉత్తేజం పొంది, మెదడు చురుకుగా పనిచేస్తుంది. హాయిగా, ఆనందంగా నవ్వుతూ ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. భయం, ఆందోళన, దిగులు, విచారం తదితర భావాలన్నీ నవ్వుకోవడం వల్ల మటుమాయం అవుతాయి. జంతువులలో హైనా ఒక్కటే నవ్వగలదు. మిగతా జీవులకు నవ్వులాంటి హాయి అయిన భావన కలిగినా, ఆ భావాన్ని మరో విధంగా వ్యక్తం చేస్తాయి తప్ప మనలా నవ్వలేవు.