ఒక్కోసారి కొన్ని సబ్జెక్టులు ఎన్నిసార్లు చదివినా గుర్తుండవు. అలాంటపుడు కంగారుపడకుండా .. జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. ఎలాగంటారా.. ఈ టిప్స్ చదవండి...
- ప్రహేళికలు, చిక్కు లెక్కలు మెదడుకు మంచి వ్యాయామాన్ని ఇస్తాయి.
కొత్తగా నేర్చుకునే ప్రతి పనీ మెదడును చైతన్యపరుస్తుంది. కొత్తపాఠం, భాష, ఆట, పాట.. ఇవన్నీ కూడా బుర్రను పదునెక్కించేవే!
- ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థిని చిత్తుచేసే ఆట 'చదరంగం'. అనుభవం ఉన్న వారితో ఆడితే, మీ మెదడుకి కావలసినంత వ్యాయామం. కంప్యూటర్లో కూడా ఆడొచ్చు. మనకు కుడి లేదా ఎడమ చేతి వాటం ఉంటుంది కదా! అప్పుడప్పుడూ చేతివాటం మార్చి పనులు చేయాలి. దానివల్ల మెదడులోని కుడి, ఎడమ భాగాలు రెండూ చురుగ్గా ఉంటాయి.
- ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆ రోజు కలిసిన వ్యక్తుల పేర్లు గుర్తు తెచ్చుకుని రాయాలి. ఇది మెదడుకు మంచి అభ్యాసం.
- ఒక్కోసారి ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నకు సమాధానం నాలుక చివర్లో ఆగిపోతూ ఉంటుంది. అంటే, మెదడులో జ్ఞాపకంగా నిల్వ ఉన్న సమాచారం బైటకు రాలేకపోతుందన్నమాట. ఇలా జరిగినప్పుడు నిరుత్సాహ పడకుండా, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ప్రయత్నం జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇంటి వరండాలో కూర్చుని, కళ్లు మూసుకుని వంట గదినో, పుస్తకాల అలమారానో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. చాలా వస్తువులు కనిపిస్తాయి కదా! ఇప్పుడు కలం తీసుకుని మీకు గుర్తొచ్చిన ఆ వస్తువుల పేర్లన్నీ రాయండి. తర్వాత రాసిన పేర్లు, ఆ వస్తువులతో సరిచూసుకోండి. ఇలాంటి అభ్యాసాలు జ్ఞాపకశక్తికి పరీక్షలు.
- మెదడు మన శరీరంలో ప్రవహించే 20 శాతం రక్తాన్ని, 20 శాతం ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటుంది. కాబట్టి, శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగేలా, ఆక్సిజన్ ఎక్కువగా అందేలా చూసుకోవాలి. అంటే, ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.
- విషయాలను గుర్తుపెట్టుకోవడానికి ఊహాశక్తిని ఉపయోగించాలి. బల్బు సృష్టికర్త థామస్ అల్వాఎడిసన్ కదా! ఆ పేరు గుర్తుండాలంటే, వెలుగుతున్న బల్బును పట్టుకుని నిలబడ్డ ఎడిసన్ చిత్రాన్ని ఊహించుకోవాలి. చిత్ర రూపంలోని జ్ఞాపకాలు శాశ్వతంగా గుర్తుంటాయి.
- కొత్త ఆలోచనలు, పాత జ్ఞాపకాలు మెదడు సామర్థ్యాన్ని పెంచుతాయి. కొత్త వస్తువులు తయారు చేయడం, జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేయడం వల్ల న్యూరాన్ల పనితీరు పెరుగుతుంది.
Authorization