ఓ రైతు తన పొలంలో పండిన మిరపకాయల్ని బస్తాలకెత్తాడు. బండిలో వేసి సంతకు బయలుదేరాడు. ఓ బస్తాకుండే చిన్న చిల్లుల్లోంచి తొంగి చూస్తున్న చిట్టి మిరపకాయకి రోడ్డు ప్రయాణం వింతగా తోచింది. ఆ చిరుగులోంచి నెమ్మదిగా జారి రోడ్డు మీదికి దూకింది.
రోడ్డు మీద వాహనాలు వేగంగా పోతుంటే మిరపకాయకి భయమేసింది. బండ్ల కిందపడకుండా తప్పించుకుని పక్కకు గెంతింది. అలా గెంతుతూ ముందుకుపోతున్న మిరపకాయని ఓ పిల్లాడు చూశాడు. చటుక్కున దాన్నందుకున్నాడు. రోడ్డుమీదనుంచి తను తీసిందేంటో వాడికి అర్థం కాలేదు. అటూ ఇటూ తిప్పి చూసి నోట్లో పెట్టుకోబోయి కిందపడవేశాడు. 'బతుకుజీవుడా' అనుకుంటూ మిరపకాయ ముందుకు సాగింది. ఇంతలో చిన్న కుక్కపిల్ల మిరపకాయను చూసింది. ఆ కుక్కపిల్ల ఆగి దానిచుట్టూ ఓసారి తిరిగింది. కాలితో అటుఇటు తంతూ ముందుకు తోసింది. ఆ దెబ్బలు తట్టుకోలేని మిరపకాయ 'ఉండు నీ పని చెప్తా' అనుకుంటూ చటుక్కున ఎగిరి కుక్కపిల్ల ముక్కులో దూరింది. దాంతో కుక్కపిల్లగట్టిగా తుమ్ముతూ దాన్ని బయటికి నెట్టేయాలని ప్రయత్నం చేసింది. మిరప ఘాటుకి ముక్కు మండిపోతోంది. విపరీతంగా తుమ్ములు వస్తున్నాయి. చివరికెలాగో కుక్కపిల్ల ముక్కులోంచి బయటపడింది మిరపకాయ. 'మరో గండం గడిచింది' అనుకుంటూ మిరపకాయ ముందుకు సాగింది.
ఇంతలో మిరపకాయలు కొని ఇంటికెళ్తున్న పదేళ్ల పాపకు చిట్టి మిరపకాయ కనిపించింది. దాన్ని తీసి మిరపకాయలున్న సంచిలో వేసుకుని ఇంటికెళ్లింది. కూతురు తెచ్చిన మిరపకాయల్లోంచి తాలింపు కోసం కొన్ని తీసి వంటగట్టు మీద పెట్టింది వాళ్లమ్మ. అందులో చిట్టి మిరపకాయ కూడా ఉంది. పొయ్యిమీద మూకుడు పెట్టి నూనె పోసి కాచసాగిందామె. అది చూసి మిరపకాయ గట్టుమీద నుంచి కిందకి దూకింది. పడ్డం పడ్డం వాళ్ల పిల్లి వీపుమీద పడింది. పిల్లి తన మీద బల్లిపడిందేమోనని విదుల్చుకుంటూ వీధిలోకి పరుగుతీసింది. అలా విదిలించేసరికీ వెంట్రుకల్లో చిక్కుకున్న మిరపకాయ రోడ్డుమీద పడింది. గండం గడిచినందుకు సంతోషిస్తూ హుషారుగా గెంతుకుంటూ ముందుకు నడిచింది. ఎలాగైతేనేం పొలంగట్టు దగ్గరకి చేరుకుంది. అక్కడ మిరప విత్తనాల సంచీ కనిపిస్తే దాన్ని చూస్తూ కూర్చుంది.
ఆ పొలంగల రైతు సంచిలోని మిరప విత్తనాలు తీసి తన పొలంలో జల్లసాగాడు. కిందున్న మిరపకాయని కూడా తీసి తుంచి పొలంలో చల్లేశాడు. గమ్మత్తుగా దాని విత్తులన్నీ ఒకేచోట పడ్డాయి. తర్వాత రైతు పొలానికి నీళ్లు పెట్టాడు. నాలుగురోజుల్లో మిరప విత్తనాల్లోంచి చిన్న చిన్న మొలకలొచ్చాయి. చిట్టి మిరప విత్తనాల్లోంచి కూడా చిట్టి మొలకలొచ్చాయి. అవి ఒకదాన్నొకటి చూసుకుని నవ్వుకున్నాయి.
హమ్మయ్య! ఇప్పుడు కదా మన జన్మకి సార్థకల లభించిందని మురిసిపోయాయి. ఆ మొలకలన్నీ నెమ్మదిగా పెరిగి పెద్దవై మిరపపంట కోసం మొక్కలుగాఎదగసాగాయి.
Authorization