చారడేసి కళ్లు, చురుకైన చూపులు, అందంగా.. అమాయకంగా చెంగుచెంగున ఎగురుతుంటే మనమూ సంతోషంగా చూస్తుంటాం... ఏంటదీ అంటారా..అదే లేడి పిల్ల. అప్పుడప్పుడు పెద్దవాళ్లూ పిల్లలను లేడితో పోలుస్తుంటారు. ఎందుకంటే వారు కూడా లేడిలా చెంగుచెంగున ఎగురుతుంటారు కదా... మరి ఆ జంతువు గురించి బోలెడు విశేషాలున్నాయి. మీరు కూడా తెలుసుకుంటారా?
- జింకల శాస్త్రీయనామం ఏంటిలోప్ సెర్వికాప్రా. ఇవి సర్విడే కుటుంబానికి చెందినవి. వీటిలో దాదాపు 62 జాతులుంటాయి. అందులో ఎక్కువగా కనిపించేవి మాత్రం తెల్లతోక జింక, ఎల్క, మూజ్, ఎర్రజింక, రెయిన్ డీర్, ఫాలోడీర్, చితాల్ సాంబార్.
- ఇవి ఎక్కువగా ఉత్తరఅమెరికా, యూరప్ దేశాల్లో నివసిస్తాయి. భారతదేశంలో ఎక్కువగా కృష్ణజింకలు (బ్లాక్ బక్) ఉంటాయి. ఇంకా నేపాల్, పాకిస్థాన్లలో కూడా ఉంటాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో జింక జాతులున్నా.... వాటర్ డీర్స్ మాత్రం కేవలం, చైనా, కొరియాల్లోనే కనిపిస్తాయి.
- జింకలను ఎన్నో పేర్లతో పిలుస్తారు. చాలా ఉంటే లేళ్లని, ఒకదాన్నయితే లేడి అని అంటారు. వీటిలో మగవాటిని 'బక్' అని, ఆడదాన్ని 'డో' అనీ పిలుస్తారు. బుల్, కౌ అని కూడా అంటారు. అదే ఎర్రజింకల్ని అయితే హార్ట్, హిండ్ అంటారు. ఇకపోతే .. ఫాన్, కాఫ్, కిడ్ అనేవి వీటి పిల్లల పేర్లు. ఇవి ఎక్కువగా గుంపుగానే తిరుగుతుంటాయి. ప్రతి గుంపులో 10-15 జింకలు ఉంటాయి. వీటి గుంపుని హెర్డ్ అంటారు.
- అయితే ప్రతి గుంపులో ఓ మగజింక ఉండాల్సిందే. ఎందుకంటే.. మగవాటిలో పెద్దవి 32-35 అంగుళాల పొడవుండి 40 కేజీల బరువుతో బలిష్టంగా ఉంటాయి. వాటి కొమ్ములు 28-30 అంగుళాల పొడవుతో మలుపులు తిరుగుతుంటాయి. అందుకే ... హైనా, నక్కల్లాంటివి దగ్గరకు రావడానికి భయపడుతాయి. రెయిన్డీర్స్్లో అయితే ఎంచక్కా ఆడవాటికీ కొమ్ములుంటాయి.
- ఇవి ఎక్కువగా పచ్చిక మైదానాల్లోనే కనిపిస్తుంటాయి. ఆకులు, పండ్లను లాగించేస్తాయి. గడ్డిని కూడా గుటకాయ స్వాహా చేస్తాయి. చలిప్రదేశాల్లో చలెక్కువైతే దాన్ని తట్టుకోలేక వెచ్చని ప్రాంతాలను వెతుక్కుంటూ వలస వెళ్తాయి.
- ఒళ్లంతా నలుపు, లేదా ముదురు గోధుమ రంగుంటే అవి మగవి. కడుపు కింద, కళ్ల చుట్టూ తెలుపుంటుంది. ఆడవైతే లేత గోధుమ రంగులో ఉంటాయి. మచ్చలుండే వాటిని బంగారు లేడి అని ముద్దుగా పిలుస్తారు.
- వీటిల్లో అతిపెద్ద జింకజాతి అలస్కస్ మూస్. మూడు మీటర్ల పొడవు, 7 వందల కిలోల బరువుంటుంది. వెడల్పయిన మూపురం, పొడవైన కొమ్ములుంటాయి. దీనికి కోపం వస్తే పెద్దగా రంకె వేస్తుంది. చుంచు జింక అతి చిన్నది. పుట్టినపుడు వందగ్రాములు, పెద్దది రెండు కిలోలకి మించి ఉండదు. వీటి పుట్టినిల్లు జావా. అక్కడ కూడా అరుదుగానే ఉంటాయివి.
- ఇవి ఎన్ని కిలోమీటర్ల దూరంలోని శబ్దాన్నయినా ఇవి వినగలుగుతాయి. ప్రమాదాన్ని గుర్తిస్తే తోటి జింకలకు తోకపైకెత్తి సంకేతాన్ని అందిస్తాయి. సాధుజంతువులయిన జింకల్ని చర్మం, మాంసం, కొమ్ముల కోసం కొందరు అన్యాయంగా వేటాడేస్తున్నారు. దాంతో వీటిలో కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. అందుకే వీటిని రక్షించడానికి 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టం వచ్చింది.
- మరో విశేషం ఏంటంటే సహారా ఎడారిలో జీవించే అడాక్స్ ఆంటీలోప్ అనే జింకలు కాలానికి అనుగుణంగా రంగులు మార్చుకుంటాయి. ఎండకాలం తెల్లగా, చలికాలం బూడిద-బ్రౌన్ రంగులోకి మారిపోతాయి. తెల్లగా ఉండడం వల్ల సూర్య తాపానికి గురికాకుండా ఉంటుంది. చలికాలం బూడిద-బ్రౌన్ రంగులో ఉండడం వల్ల వెచ్చగా ఉంటుంది.
Authorization