కంగారూ లాగా సంచిని కలిగి ఉంటుంది... కానీ కంగారు కాదు. నెమరు వేస్తుంది.. కానీ ఆవు కాదు. ఐల్యాండ్ పిల్లులుగా పేరొందింది.. కానీ పిల్లికాదు...ఒంటెల్లాగే బతికేస్తాయి... కానీ ఒంటె కాదు.. అచ్చం ఎలుక లాగే ఉంటుంది.. కానీ ఎలుక కాదు.. మరేంటీ అంటారా..? ఇన్ని విశేషాలు కలిగి ఉన్న ఈ జీవి పేరే క్యోక.
క్యోక శాస్త్రీయనామం సెటోనిక్స్ బ్రకైరస్. ఇది ఆస్ట్రేలియాలోని రాట్నెస్ట్ దీవికి చెందినది. వీటిని 350 ఏళ్ల క్రితం ఐరోపా నావికులు గుర్తించారు. ఇవి ఎలుకలను పోలి ఉండటం వల్ల వీటి మీదుగా ఆ దీవికి రాట్నెట్ అని పేరు పెట్టారు.
ఒకప్పుడు ఇవి ఆస్ట్రేలియా అంతటా ఉండేవి. కానీ పాపం వీటికి నక్కలు, కుక్కల బెడద ఎక్కువైపోయింది. దానికి తోడు గిరిజనుల వేట మరోకారణం. ఇవి ప్రస్తుతం రాట్నెస్ట్ ద్వీపంలోనే ఉన్నాయి. అదీ 10 వేలలోపే. అందుకనే ఆస్ట్రేలియాలోని పెర్త్ జంతు సంరక్షణాలయం క్యోకాల సంతతిని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేస్తోంది.
పొడి వాతావరణంలో జీవించే వీటికి తడవకు ఒకటే పిల్ల పుడుతుంది. అదీనూ.. జనవరి -మార్చి, సెప్టెంబరు-అక్టోబరు నెలల్లోనే పుడతాయి. ఇలా ఏడాదికి రెండు పిల్లల్నే కంటాయి. పిల్లని జోయి అంటారు. గర్భం దాల్చిన 4 వారాల్లోనే కనేస్తాయి. ఇవి క్షీరదాలు. అంటే పాలిచ్చి పెంచే జంతువులు.
కంగారూకి, క్యోకాల కాస్త పోలికలున్నాయి. ప్రపంచం మొత్తంలో ఆస్ట్రేలియాలో మాత్రమే ఈ రెండు జంతుజాతులు జీవించడం ఒకటయితే, కంగారూల్లానే పిల్లని, తల్లి క్యోకా తన కడుపుకి ఉండే ప్రత్యేకమైన తిత్తిలాంటి సంచిలో పెట్టుకుని మోస్తుంది. ఇలా 30 వారాలు పిల్ల తల్లి దగ్గరే పాలు తాగుతూ ఎదుగుతుంది. తరువాత మరో పదివారాలు బయట తిరుగుతున్నా, తల్లిపాలు తాగుతూనే ఉంటుంది. క్యోకాల జీవితకాలం 10 ఏళ్లే.
వీటిని ఐల్యాండ్ అడవి పిల్లులని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. పిల్లులంతే ఉంటాయి. అడుగు నుంచి అడుగున్నర పొడవున్నా, తోక మాత్రం 10-15 అంగుళాల పొడవుంటుంది. 5 నుంచి 6 కిలోల బరువుంటాయి. పిల్లులకున్నట్టే గుండ్రని చెవులున్నా, తలమాత్రం పెద్దగా ఉంటుంది. వీటి బొచ్చు పసుపు, గోధుమ రంగుల్లో ముతకగా తగులుతుంది. పంజాలయితే పిల్లి పాదాన్ని పోలి ఉంటాయి. అందువల్లే తేలికగా చెట్లు ఎక్కేస్తాయి.
చూస్తే ఎలుకజాతివేమో అన్నట్లుగా కూడా ఉంటాయి. మూతి భాగం, తోక చూస్తే అచ్చు ఎలుకలే గుర్తుకొస్తాయి. వీటి పద్ధతంతా ఎలుకల జాతిని పోలి సాగుతుంది. ఎలాగంటే .. అచ్చం ఎలుకల్లాగే కలుగులు తవ్వగలవు. అదీ రాత్రుళ్లే. భూమిలో సొరంగాలు తవ్వుకుంటూ ఆహారం వెతుక్కుంటాయి.
వీటికి ఆవులూ, గేదెల్లా ఒక వెసులుబాటుంది. రాత్రి తిన్నదాన్ని ఆహారపు సంచిలో దాచుకుంటాయి. పగలు హాయిగా విశ్రాంతి తీసుకుంటాయి. నిల్వచేసిన ఆహారాన్ని తీరిగ్గా నెమరువేస్తుంటాయి. స్థానికంగా పెరిగే గడ్డి, ఆకులు, విత్తనాలు, మొక్కల కాడలు, లేత చిగుళ్లే వీటి ఆహారం.
ఇవి ఒంటెలకేం తీసిపోవు. చుక్క నీళ్లు లేకున్నా నెలల తరబడి చక్కగా బతికేస్తాయి. ప్రత్యామ్నాయంగా కాక్టస్ మొక్క నుంచి ద్రవాల్ని సేకరించుకుంటాయి. కానీ ఒకోసారయితే నిర్జలీకరణానికి లోనై చనిపోతుంటాయట. ఇవి 44 డిగ్రీలసెల్సియస్ వరకు వేడిని తట్టుకోగలవు.
Authorization