అంగోలా ఆఫ్రికా దేశం. ఇది ఒకప్పుడు పోర్చుగీసు వలస దేశం. 1975లో వారి నుండి స్వతంత్రం పొందింది. అయినప్పటికీ ఇప్పటికీ అధికార భాషగా పోర్చుగీసు కొనసాగుతూనే ఉంది. అంగోలా ప్రజలు పోర్చుగీసుతో పాటు ఒకటి అంతకన్నా ఎక్కువ స్థానిక అంగోలా భాషలు మాట్లాడుతారు. జనాభాలో సగం మంది నిరుద్యోగితతో బాధపడుతున్నారు. మూడొంతులమంది దారిద్య రేఖకు దిగువన ఉన్నారు. ఆకలి అనేక ప్రాంతాల్లో విలయతాండవం చేస్తున్నది. కోస్తా ప్రాంతాలవారు ఆహారంగా సముద్రపు ఉత్పత్తులనే ఎక్కువగా తీసుకుంటారు. ఇక పశువులకాపర్లు పాల ఉత్పత్తులు, మాంసంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. రైతులు జొన్న వంటి పంటలపై ఆధారపడుతున్నారు. చాలా సంప్రదాయక ఆచారాలు, ఉత్సవాలు కనుమరుగవుతున్నాయి. పరిస్థితులు అనుకూలించి విందులు జరిగితే గ్రిల్డ్ చికెన్, సాఫ్ట్ డ్రింక్స్, బీరు అందులో భాగమవుతాయి. ఇవి ఖరీదైనవి కాబట్టి ఎక్కువగా స్థానిక పానీయాలనే విందుల్లో ఇస్తారు.
సంపదే గుర్తింపునిస్తుంది : సమాజం అనేక వర్గాల దొంతరగా ఉంది. 20వ శతాబ్దానికి ముందు పోర్చుగీసు పాలన వల్ల ఈ అంతరాలు ఏర్పడ్డాయి. వ్యాపార వాణిజ్యాలు చేసి బాగా డబ్బు సంపాదించిన ఆఫ్రికన్లు ఒక ప్రత్యేక ఉన్నత వర్గంగా ఏర్పడ్డారు. అట్లాగే పోర్చుగీసువాళ్ల ను అనుకరిస్తూ వారి జీవన విధానాన్ని అనుకరించినవారికీ వలసపాలకులు సామాజిక హోదాను పెంచారు. దీంతో వారు కూడా సమాజంలో ఒక ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డారు. ఇటువంటి తేడాలన్నీ రాజకీయపక్షాల ఏర్పాట్లలో ప్రతిఫలించాయి. వారి ప్రాపగాండాలో ఇవన్నీ ప్రతిఫలిస్తాయి. ఖరీదైన జీవితాన్ని గడపడం ద్వారా సమాజంలో తమ ఆధిక్యతను ప్రదర్శిస్తారు ఉన్నత వర్గీయులు. డిస్కోలు, నైట్క్లబ్లకు పోవడంద్వారా సంపన్న యువకులు తమ ఉన్నతిని చాటే ప్రయత్నం చేస్తారు. ఖరీదైన విందులు, బహుమతుల పంపకం ద్వారా ఉన్నత వర్గీయులు తమ సత్తా చాటుకోవడానికి ఇష్టపడతారు.
అంగోలాలోని అంతర్యుద్ధం కారణంగా మగవారు ఎక్కువగా యుద్ధంలో పాల్గొని చనిపోయారు. అందువల్ల చాలా కుటుంబాలకు స్త్రీలే పెద్దదిక్కుగా మారి నడిపిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పరుషులు అధికంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ జనాభా అధికంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. దీనిలో ప్రధానంగా పాల్గొనేవారు స్త్రీలే. అంతర్యుద్ధం కారణంగా రహస్యంగా దాచిన లాండ్ మైన్లు పేలి పొలంలో పనిచేసే ఎందరో స్త్రీలు చనిపోవడమో లేక వికలాంగులవ్వడమో జరిగింది.
పెండ్లి : పెండ్లి, సహజీవనం అనేది రకరకాల రూపాల్లో కనిపిస్తుతంది. కొన్ని పెండ్లిళ్లు చర్చి లేక ప్రభుత్వం చేస్తుంది. కొన్నింటిని తల్లి దండ్రులు చేస్తారు. కొందరు దంపతుల్లా కలిసి జీవించడానికి ఎటువంటి విందు, ఇతర తంతులు లేకుండానే సహజీవనం ప్రారంభిస్తారు. దంపతుల్లో ఎక్కువమంది సొంతంగా ఒక ఇంటిని ఏర్పాటుచేసుకోవడమో లేక పురుషుని (భర్త) తల్లిదండ్రులతో కలిసి జీవించడమో చేస్తారు. పురుషులు యుద్ధాల్లో మరణించడం వల్ల స్త్రీలే ఎక్కువగా ఉండటం వల్ల బహుభార్యత్వం కూడా ఎక్కువగానే ఉంది. యుద్ధం కారణంగా వితంతువులుగా మారే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. స్త్రీలపై అత్యాచారాలు తరచుగా జరుగుతుంటాయి. పెండ్లి చేసుకునే స్త్రీపురుషుల వయసులో తేడా క్రమంగా పెరుగుతూ పోతున్నది.
వారసత్వం : అంగోలాలోని చాలా సమాజాల్లో పితృస్వామ్యం ప్రకారం తండ్రి ఆస్తి పిల్లలకు వారసత్వంగా సంక్రమిస్తుంది. అయితే ఉంబుండి, నంగేలా, అంబో సమాజాల వంటివాటిలో మాతృస్వామ్యాన్ని అనుసరించి చనిపోయిన పురుషుని భార్య సోదరుల పిల్లలకు ఆస్తి చెందుతుంది. అయితే వలస పాలన ప్రభావం వల్ల ఇప్పుడు చాలా వరకు ఈ వారసత్వ ఆచారం తగ్గిపోతూ వస్తున్నది.
మొత్తంమీద పేదరికం, అంతర్యుద్ధం కారణంగా వెనకటి ఆచార సంప్రదాయాలను అనుసరించడం కష్టంగానే ఉంటోంది. మారుతున్న కాలంలో పాత ఆచారాలు కనుమరుగుకావడమో లేక కొత్త రూపాన్ని తీసుకోవడమో కనిపిస్తున్నది.
- భూపేంద్ర నాగ
Authorization