ప్రపంచాన్ని ప్లాస్టిక్ కబళించి వేస్తున్నది. ఇంట్లో వాడే ఎన్నో వస్తువులు ఇప్పుడు ప్లాస్టిక్‌తో తయారవుతున్నవే కదా గృహాలంకరణకు, దైవ కార్యక్రమ సంబంధమైన దండలు, పుష్పాలు, ఇంట్లోను, ఇంటి ముందర పచ్చగడ్డి తివాచీలుగా... ఇట్లా అనేక విధాలుగా ప్లాస్టిక్ మొత్తం మనిషి ఆవరణాన్ని ఆక్రమించేస్తున్నది. ఎన్నో రసాయనాల కలయికతో తయారయ్యే ఈ ప్లాస్టిక్ వస్తువులు, అలంకరణ సామగ్రి ప్రకృతికి, మానవులకు ఎంతో హానిచేస్తాయి. ప్లాస్టిక్‌తో చేసే అనేక అలంకార, పూజా సంబంధ కళాకృతులకు ప్రత్యామ్నాయం అనదగ్గవి బెంగాలీ కళాకారులు తయారుచేస్తున్నారు. ఇవన్నీ ప్రకృతికి ఏమాత్రం హానికలుగజేసేవి కాకపోవడం విశేషం 'షోలా' అనే మొక్క కర్ర నుంచి ఈ కళాకృతులు ఎట్లా తయారవుతాయో చూద్దాం.
బెంగాల్‌లోని 24 పరగణాలు ఆ చుట్టుపక్కల జిల్లాల్లో బెంగాలీలు 'షోలా' మొక్క కర్రలను సేకరిస్తారు. వాటిని ఎండలో ఎండబెడతారు. తగినంత ఎండిన తరువాత వాటిని కళాకారులు పనిచేసే షెడ్డుల్లో భద్రపరుస్తారు. ఈ కర్రలను చిన్న చిన్న ముక్కలుగా చేసి గోనె సంచుల్లోనో లేక పెద్ద వస్త్రాల్లోనో కట్టుకొని మార్కెట్‌కు తీసుకువెళ్లి కొందరు అమ్మి ఆదాయాన్ని పొందుతారు. కళాకృతులు తయారుచేసేవారికి ఈ షోలా కర్రముక్కలు ముడిసరుకు. ఈ కర్ర ముక్కలను ప్రత్యేకమైన కత్తులు, కత్తెర సహాయంతో ముందు ఉదా రంగులో ఉండే బెరడును తొలగించి, తెల్లని కర్రముక్కనుంచి పలుచని పొరలు (రేకులు) తీస్తారు. ఈ పొరలను చుట్టలుగా చుట్టి వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉంచుకుంటారు. ఉదా రంగు బెరడును, ఈ పొరలను కలిపి రకరకాల కళావస్తువులను సృష్టిస్తారు. బెంగాల్లో కొన్ని జిల్లాల్లో షోలా కర్రల నుంచి కళాత్మక వస్తువులు, దండలు తయారుచేయడం ఒక కుటీర పరిశ్రమగా ఉంది. వేలాదిమంది దీనివల్ల ఉపాధి పొందుతున్నారు. ఇటీవల కాలంలో ఇంంగ్లండు, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ ఆర్ట్ ఆబ్జెక్టులకు మంచి ఆదరణ లభిస్తూ ఉండటంతో కళాకారులకు మరింత ఆదాయం చేకూరుతున్నది. అయితే షోలా కర్రలు తగిన మొత్తంలో దొరక్క పోవడం వల్ల ముడిపదార్థం కొరత ఏర్పడుతున్నది.
ఏమిటీ షోలా ప్రత్యేకత?
షోలాను తెలుగులో జీలుగ అంటారు. ఈ జీలుగ కర్ర ప్రపంచంలోని అన్ని చెట్లు ఇచ్చే కర్రలకన్నా చాలా తేలికగా ఉంటుంది.కర్ర బెరడు తీస్తే తెల్లని పాలలాంటి తెలుపుతో స్పాంజి లాంటి దారువు కనిపిస్తుంది. ఈ మొక్కలు సాధారణంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, కొండ లోయల్లో పెరుగుతాయి. మోకాళ్ల లోతు నీళ్లల్లో పెరిగే ఈ జీలుగను బెంగాలీలు శ్రమకోర్చి సేకరిస్తారు. వీటిని కళాత్మక వస్తువులుగా తీర్చిదిద్దడానికి ఎంతో సమయం, శ్రమ అవసరమవుతుంది. ఇదే జీలుగను నీటి సౌకర్యం ఉన్న పొలాల్లో జులై నుంచి నవంబర్ వరకు సాగుచేయవచ్చు. పెద్దగా పెట్టుబడి అవసరం లేని ఈ జీలుగను పెద్ద ఎత్తున సాగుచేసి డిమాండ్ ఉన్న బెంగాల్, ఒడిషా వంటి రాష్ట్రాలకు పంపి లాభాలు ఆర్జించవచ్చు. అందువల్ల అక్కడి కళాకారులకు తగినంత ముడిపదార్థం అందించినట్లు అవుతుంది. అదే సమయంలో పెద్దగా సారంలేని భూముల నుంచి కూడా మంచి ఆదాయాన్ని ఈ జీలుగ సాగు ద్వారా పొందవచ్చు.
-మౌక్తిక్
Authorization