నేత వృత్తి పై ఆధారపడి జీవించే వారు తెలంగాణలో చాలామంది ఉన్నారు. మరమగ్గాలు వచ్చినా ఇంకా ప్రాచీన వృత్తి విజ్ఞానాన్ని అనుసరించి అద్భుతమైన వస్త్రాలు నేసేవారు ఇప్పటికీ కనిపిస్తారు. వస్త్రాలు నేయడానికి నేతన్నలు వాడే సంప్రదాయక పనిముట్లు ఇవి...
ఆసు:ముందుగా తాము తెచ్చిన దారాన్ని చిక్కులు లేకుండా ఆసుకు చుట్టి దానిని బండికి వేసి కండెలు చుడతారు.
సరి: సరి బిగించడానికి ఉడితె, ఉడితెను లాగి పట్టడానికి గొలుసులు, పోగుల మధ్యలో పెట్టే వెదురు బద్దలు గల ఒక స్టాండ్ వంటి దానిని 'సరి' అంటారు. స్టాండ్‌కు బిగించిన పోగులన్నింటిని సరి చూసి తర్వాత కుంచెతో గంజి పెడతారు.
రాట్నం: నూలు వడకడానికి, దారం పోగులు బండికి పెట్టి, ఆ బండి నుండి రాట్నం ద్వారా కండెలు చుడతారు.
మొగ్గం (మగ్గం): మగ్గం కోసం దొనుగ, నాలిక కొయ్యలు ఉంటాయి. అటు చివర ఇటు చివర ఉండే నాలుగు కొయ్యలకే గొనుగ బిగిస్తారు.
చౌడు కట్టెలు: నేసిన చీర ముడతలు రాకుండా సాఫుగా ఉండటం కోసం మధ్యన బిగించే వెదురు బద్దలను చౌడు కట్టెలు అంటారు.
సట్టరు:నాడె అటు ఇటు కదలటానికి ఉపయోగపడే దోనె వంటి సాధనం.
సట్టరు వనె:సరిపోగుల జాలీకి పైన ఉంటుంది.
అచ్చులు:పోగులను రెండు పాయలుగా విడతీయడానికి సహాయపడేవి. ఈ అచ్చులకు పావుకోళ్లుంటాయి. వీటిని కాళ్ళతో ఆడించడం వల్ల ఒకసారి ఒక పోగు పైకి వస్తే మధ్యనుండి కండె ఇటువస్తుంది.మళ్లీ ఇంకొక పోగు పైకి లేస్తే కండె అటువైపుకు వస్తుంది. దీంతోనే అల్లిక జరుగుతుంది.
పింజిరి:అంచులు పడటానికి అచ్చులకుండే దారం కాకుండా పైన వేలాడదీసే మగ్గానికి అనుసంధానం చేసిఉన్న పింజరి నుండి కూడా పోగులు వస్తాయి.హాండిల్‌తో నాడెను కదిపినప్పుడే ఇది కూడా కదిలి అంచులు డిజైన్ పడతాయి.
దండెదురు: మగ్గం మీద పోగుల కింద ఉండే చెక్క బల్ల. పోగులు తెగిపోతే దీని మీదే సర్దుతారు.
నాలిక్యొయ్యలు: దండెదురును బిగించే కొయ్యలు.వీటికే మగ్గం ఫ్రేమును కూడా బిగిస్తారు.
తాడుకొయ్య: బలిక్కొయ్య మలకవేసిన తాడు తిరిగి మగ్గం పక్కగా ఉన్న ఈ పరికరానికి బిగిస్తారు.ఈ తాడు వదులు చేస్తే బలికొయ్య ద్వారా తాడు వదులవుతుంది.అప్పుడు నేచిన చీరను దొనుకకు చుడతారు.
బలికొయ్య: నేసే చీర చివరి భాగం బిగించే కొయ్య.
పెడకోల: చీర నేసిన తరువాత మిగిలిన పోగులు అచ్చులోకి జారిపోకుండా ఈ 'పెడకోల'కు కట్టి దానిని బలికొయ్యకు కడతారు.
కుచ్చు: ఇది చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉండేది.దీని చివర్లు సట్టరుకు అనుసంధానం చేయబడి, సట్టరు లోపలి చెక్క బెండ్లకు కలిపి ఉంటాయి.ఈ చెక్కలను 'పికాసులు' అంటారు. పికాసు కదిలి నాడెను ఇటువైపుకు నెట్టేందుకు ఉపయోగించేదే 'కుచ్చు'.
పాకోళ్ళు/పావుకోళ్ళు: ఇవి మగ్గం గుంటలో ఉంటాయి.వీటిని అచ్చులకు అనుసంధానం చేస్తారు.వీటిని కాళ్లతో కదిలిస్తారు. కుచ్చును కాని, పాకోళ్లను కదిలించడానికి చాలా నైపుణ్యం అవసరం.
ఊసలు: దారం చుట్టడానికి ఉపయోగించే బెండ్లు.
కండెలు:బెండుకు దారం చుడితే కండె అవుతుంది.
సపరచ్చగుండు: దండెదురు లాగలు, సూరపుల్లలు దూరం పోకుండా కట్టి ఉంచే పరికరం.
Authorization