మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు కలిసే ప్రదేశంలో ఉంటుంది లింగన్న పేట. గంభీరావు పేట మండలంలో లింగన్న పేట చిన్న గ్రామం. అప్పట్లో గంభీరావు పేట కూడా లింగన్న సంస్థానంలో భాగంగా ఉండేది. ఈ గ్రామం చుట్టూ దట్టమైన అడవి ఉంది. గ్రామానికి వెళ్లాలంటే ఘాట్ రోడ్డులో వెళ్లాలి. ఇదంతా ఘాట్ ఏరియా కావడంతో దొంగల బెడద, అడవి జంతువుల సమస్య కూడా ఉండేది. దీంతో గ్రామం చుట్టూ పెద్ద కందకం ఏర్పాటు చేశారు. దాదాపు వంద ఏండ్ల చరిత్ర ఉన్న లింగన్న పేట గడీ చాలా పెద్దది. గడీ లోపల ఉన్న ప్రాంగణమే ఐదు ఎకరాలు ఉంటుంది. గడీ బయట కూడా కొన్ని కట్టడాలు ఉన్నాయి. లింగన్న పేట గడీలో ముఖ్యంగా రెండు భాగాలు కనిపిస్తాయి. గడీ ఆవరణంలో పెద్ద ప్రహరీ గోడ, బురుజులతో పాటు 30 అడుగుల ఎత్తైన ముఖ ద్వారం ఇప్పటికీ గంభీరతను ప్రతిబింబిస్తాయి. గడీ లోపలికి వెళ్తే స్పష్టంగా రెండు భాగాలు కనిపిస్తాయి. ఒక ప్రాంతం పూర్తిగా శిథిలమైతే మరో ప్రాంతం చాలా శుభ్రంగా ఉంటుంది. గడీకి నాలుగు వైపుల నాలుగు ఎత్తైన బురుజులు ఉన్నాయి. ఆ బురుజులపైకి ఎక్కితే ఊరంతా కనిపిస్తుంది. గడీలో రాతి స్థంబాలు, చెక్కరేయిలింగ్లు, గూన పెంకులు ఎక్కువగా కనిపిస్తాయి. డంగు సున్నం, పెద్ద కొండ రాళ్లతో నిర్మించిన గోడలు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయి. నాలుగు వైపుల గదులు, మధ్యలో అద్దాల మేడ. గాలి, వెలుతురు బాగా వచ్చేలా దీన్ని నిర్మించారు. ఒకప్పుడు సామాన్యులు అడుగు పెట్టడానికి భయపడినా ఈ గడీ ప్రస్తుతం గ్రామ పంచాయతీగా మారింది. గడీలు దొరవారసుల ఆలోచన విధానాన్ని బట్టి మారుతూ వచ్చాయి. కొన్ని గడీలు బడులుగా మారితే, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలుగా, గ్రామ పంచాయతీలుగా మారాయి.
Authorization