అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఒంటరిగా పర్యటించిన మహిళల ప్రత్యేకం
పొద్దునలేస్తే పొట్టచేత బట్టుకుని ఉరుకులు పరుగులు.. అదే పనిగా పనిచేస్తూ నెల జీతానికి జీవితాన్ని తాకట్టుపెడుతూ బ్యాంక్ బాలెన్సులూ.. తెచ్చిపెట్టుకున్న నవ్వులూ.. బలవంతపు బంధాలనూ, పిప్పిలోంచి ఆనందం పిండుకుందామనే ఆశలు కొందరివైతే... వీలైనంత ఆహారాన్ని పొట్టలోకి కుక్కుతూ, జీవితంలో ఆనందం కోసం ఎగబడుతూ.. డబ్బే లోకంగా నకిలీ ఆనందాన్ని కొనుక్కుంటూ ప్రకృతినీ, ప్రపంచాన్ని తమ కాళ్ళకింద శాసించాలనుకుటారు ఇంకొందరు. ఈ యాంత్రిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో తమతో తాము ఉండాలనుకుంటారు. తమలోని ఆనందాన్ని.. భావాలనీ .. భావోద్వేగాలని అన్వేషించాలనుకుంటారు. తమకీ ప్రకృతికీ ఒక అనుబందాన్ని ఏర్పరచుకుంటారు, ప్రకృతి రహస్యాలని వింటారు. పరికిస్తారు.. ఆనందిస్తారు.. కాలువగట్టున కూర్చొని ఉదయిస్తున్న సూర్యుడినీ.. నిద్రలేస్తున్న ప్రకృతినీ ఆస్వాదిస్తారు. నీటివలయాల్లో విశ్వరహస్యాలని శోధిస్తారు. ఎగిరే పక్షి స్వేచ్ఛ్చ తమదిగా చేసుకుంటారు. విచ్చుకున్న పువ్వులోని నవ్వు వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది. తమలోకి తామూ తొంగి చూసుకోవడానికి, ఆ ప్రకృతిని తమదిగా చేసుకోవడానికి అప్పుడప్పుడు ఆ ప్రకృతిలోకి పయనించే వాళ్లు కొందరైతే... శాశ్వతంగా ఆ ప్రకృతి వెంటే తిరిగేవారు మరి కొందరు. అలాంటి వాళ్ళే ఈ పది మంది పర్యాటక ప్రేమికులు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ పదిమంది సోలో పర్యటకుల గురించి జర దేఖో పాఠకుల కోసం....
రేణుక సింగ్ : పర్యాటకులకు ఒక ప్లేస్ అంటూ ఉండనట్లే రేణుకకు కూడా సొంత ఉరూ అంటూ లేదనే చెప్పాలి. ప్రస్తుతం ముంబాయిలో ఉంటున్న అప్పటికి నాలుగు ఊర్లు మారింది. పర్యటన పట్ల ఇష్టం ఉండటంతో జాబును వదిలిపెట్టి. పర్యటననే జీవితంగా మలుచుకుంది. జీవితమే శాశ్వతం కానప్పుడు ఇక ఒక జాబ్ అంటూ మనిషికి ఎందుకూ అంటూ ఆమెకు.. నచ్చిన పని కొంతకాలం చేస్తూ కొంత కూడబెడుతూ పర్యటన చేయడం అలవాటు చేసుకుంది. మొదట్లో రైటర్‌గా, నవలా రచయితగా, స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసినప్పటికీ వేటిలో ఆనందం కనిపించకపోవడంతో ట్రావెల్ బ్లాగ్‌నే వృత్తిగా మలుచుకుంది. తను తిరిగిన ప్రదేశాలను, బంధించిన చిత్రాలను ఆ బ్లాగ్‌లో ఉంచుతూ ప్రఖ్యాత బ్లాగర్‌గా పేరు సంపాధించింది.
బ్లాగ్:http://www.renuka-voyagerforlife.com/
చారుకేసి రమదూరై : బెంగుళూరులో నివసిస్తున్న చారుకేసి రమాదురై ట్రావెల్ ఫ్రీలాన్స్ రైటర్‌గా గత 11 సంవ్సరాలుగా పనిచేస్తుంది. ఇండియా వంటి దేశాల్లో ట్రావెల్‌ను వృత్తిగా చేసుకున్న వాళ్ళు వేళ్ళమీద లెక్కపెట్టే సంఖ్యలో ఉంటే వాళ్ళలో ముందు వరుసలో ఉండే వ్యక్తి రమాదురే. ఇప్పటికే ఆరు ఖండాలు, 42 దేశాలు, భారతదేశంలో 22 రాష్ట్రాలు చుట్టేసిన ఆమె తన అనుభవాలను నాలుగు వందలకు పైగా సోర్టీస్గా రచించింది. ఆ స్టోరిస్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ట్రావెల్ మాగజైన్స్ అయిన బీబీసీట్రావెలర్, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఔట్లుక్ ట్రావెలర్, జెట్ వింగ్ వంటి వాటిలో ప్రచురితమైంది. స్వతహాగా రైటర్ కావడం, దాంతో పాటు ఫొటో గ్రాఫర్ కావడంతో గత 14 సంవత్సరాలుగా ట్రావెల్ బ్లాగ్‌ను నడుపుతుంది. సోలో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి ఈమె బ్లాగ్ మంచి సోర్స్...
బ్లాగ్ : http://charukesi.com/itchyfeet/
మృదుల త్రివేది : ఐఐటి కాన్పూర్‌లో పిహెచ్డీ చేసిన మృదుల 2005 నుంచి ట్రావెల్ బ్లాగింగ్‌ను వృత్తిగా చేసుకుంది. స్వతహాగా స్పోర్ట్స్ ఉమెన్ కావడంతో తరచూ పర్యటనలు చేసేది. క్రమంగా ఆదే వ్యాపకంగా మారడంతో తన జాబ్‌ను కూడా వదిలేసి పర్యటననే వృత్తిగా చేసుకుంది. తాను చూసిన, పర్యటించిన ప్రదేశాల గురించి తన బ్లాగ్‌లో రాస్తూ పోయింది. ఆమె బ్గాగ్ రాతలు కొన్ని నెలల్లోనే బిబిసి, ద గార్డియన్, నేషనల్ జియోగ్రఫిక్ లో ప్రచురితం కావడమే కాకుండా 2007 సంవత్సరానికి గానూ ఇండియా వెబ్బ్లాగ్ అవార్ట్‌ను సొంతం చేసుకుంది. 2012 మేలో మలేషియా ప్రభుత్వ పర్యాటకు శాఖ అమెను ''బ్లాగింగ్ ఆండ్ టూరిజం'' అనే అంశంపై ఉపన్యసించడానికి అహ్వానించింది.
మృదుల త్రివేది బ్లాగ్ ::http://traveltalesfromindia.in/
అనురాధ శంకర్ :ఒక గృహిణిగా, యాత్రికురాలిగా, ఫ్రీలాన్స్ రైటర్‌గా ప్రఖ్యాతి గాంచిన మరో వ్యక్తి అనురాధ శంకర్. ఫిజిక్స్‌లో మాస్టర్స్ పూర్తిచేసిన ఆమె పిహెచ్డీలో ఎన్రోల్ కూడా చేసుకుంది. పెళ్లయ్యాక తరచూ భర్తతో టూర్‌కు వెళ్ళె ఆమె క్రమంగా దాన్నే వృత్తిగా చేసుకుంది. పెళ్లయిన స్త్రీలు ట్రావెల్ చేయడానికి ఇబ్బందులు పడతారు కానీ అనురాధ శంకర్ మాత్రం ఒంటరిగా ప్రయాణం చేయడంపైన ఇష్టం పెంచుకుంది. దేశంలోని వివిధ ప్రదేశాలను సందర్శిస్తూనే ఆసక్తి కరంగా అనిపించిన వాటిని వివిద మ్యాగజైన్స్‌కు, రాస్తూ ఉండేది. తర్వాత తనే ఒక బ్లాగ్‌ను మొదలుపెట్టి తన పర్యటన విశేషాలను పాఠకులతో పంచుకున్నది. అనురాధ శంకర్
బ్లాగ్ :http://www.awanderingmind. in/p/a bout.html
శివ్యనాథ్ : 23 ఏండ్ల శివ్యానాథ్ ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుంది. డెహ్రడూన్‌లో గడిపిన తన బాల్యపు రోజుల్లో పర్వతాలకు అవతల ఏముండొచ్చు అనీ ఆలోచిస్తూ గడిపింది. సింగపూర్‌లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత, సింగపూర్ టూరిజం బోర్డులో జాయిన్ అయింది. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్రావెల్ బ్లాగర్లను ఫాలో కావడం మొద లెట్టింది. 2011లో ఆమె తన జాబుకు 2 నెలలు సెలవు పెట్టి పశ్చిమ యూరోప్ అంతటా చుట్టి వచ్చింది. ఈ ప్రయాణయే ఆమెను జాబు విడిచిపెట్టి, దేశాల గుండా ప్రయాణం చేసేలా చేసింది. తన పర్యటన అనుభవాలను ఎప్పటికప్పుడు తన బ్లాగ్‌లో రాస్తూ 2013 సంవత్సరానికిగానూ ఉత్తమ ట్రావెల్ బ్లాగర్ అవార్డ్‌ను కూడా సొంతం చేసుకుంది. బ్లాగ్:http://the-shooting-star.com/
అమృత దాస్ :షిల్లాంగ్‌కు చెందిన అమృత దాస్‌దీ మరో కథ. సౌత్ గోవాలోని పోర్చుగీసు విల్లాలో ప్రాపర్టీ మేనేజర్‌గా జాబ్ చేసేది. కానీ ప్రపంచ ప్రర్యటన పట్ల ఇష్టం ఉన్న ఆమె.. తన జీవితాన్ని ఉదయం 9 నుంచి 5 గంటల మధ్య కుదించడానికి ఇష్టం లేక 2014లో తన జాబ్‌ను వదిలేసింది. ప్రపంచాన్ని చుట్టేసేందుకు బయలుదేరింది. ఇప్పటికే దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలను చుట్టివచ్చిన ఆమె, నేపాల్, స్విట్జర్లాండ్, ఇటలీ, సింగపూర్, ఇండోనేషియా, పారిస్ వంటి దేశాలను కూడా పర్యటించింది. ఈ పర్యటన అనుభవాలనే ప్రఖ్యాత ట్రావెల్ మాగజైన్స్‌లో రాస్తూ ఫ్రీలాన్స్ ట్రావెల్ రైటర్‌గా మారిపోయింది. దాంతో పాటూ కొత్తగా ట్రావెల్ రచనల కోసమే ఒక బ్లాగ్‌ను నడుపుతున్నది.
బ్లాగ్http://travellingidesofmarch.com/
అంకిత సిన్హా: న్యూజెర్సిలో ఉంటున్న ప్రవాస భారతీయురాలు. ట్రావెలింగ్ పట్ల ఇష్టం ఉండటంతో ఐటి జాబ్‌ను వదిలేసింది. 2011 చివరలో తన ఉద్యోగాన్ని వదిలేసి పర్యటనే తన హాబీగా చేసుకుంది. ఇప్పటికే 18 దేశాలను తిరిగొచ్చిన ఆమె తన అనుభవాలను 300 స్టోరీస్‌గా టావ్రెలింగ్ బ్లాగ్‌లో రాసింది. స్వయంగా తను చూసిన ప్రదేశాలు, చేసిన సాహస కృత్యాలను తన బ్లాగ్‌లో కళ్ళకు కట్టినట్లూ రాయడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. క్రమంగా పర్యటననే తన వృత్తి, ప్రవృత్తిగా చేసుకొని త్వరలోనే అవుట్‌బ్యాక్ వెంచర్స్ అండ్ స్కైడైవింగ్ ఇన్ ఇండియా అనే సంస్థలను స్థాపించింది ఈ రెండు కూడా టూరిజంతో ముడిపడినవే. ఆమె సోలోగా చేసిన పర్యటన విశేషాలను బ్లాగ్‌లో ప్రాచుర్యం పొందడంతో 2014లో బెస్ట్ ట్రావెల్ అవార్డ్, 2013లో ఐబిఎం అవార్డ్, స్పెయిన్ప్రభుత్వం 'విన్నర్ ఎట్ ఎక్సలెన్స్ ఇన్ ట్రావెల్ ' అవార్డ్ బహుకరించారు.
అకింత సిన్హ బ్లాగ్ :http://www.ankionthemove.com/
- రూప
7661910634
Authorization