మా పిల్లలు సృజన్, స్వాప్నిక్లు మెడిసిన్, బయోటెక్నాలజీ పరీక్షలు రాసిన తర్వాత వచ్చే సెలవుల్లో ఏదైనా టూర్ వెళ్దామని అడిగారు. చదివి చదివి వేడెక్కిన వాళ్ళ బుర్రల్ని కాస్త చల్లబరిచి, మళ్లీ వచ్చే ఎగ్జామ్స్‌కు కొత్త శక్తినీ, ఉత్సాహాన్ని ఇద్దామని అండమాన్, నికోబార్ దీవులు చూసి రావాలని ప్లాన్ చేసుకున్నాం. చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రపంచ వాసులందర్నీ ఆకర్షించే బీచ్‌లూ చూడాలన్న ఆతృత ఒకవైపు, సునామీ సమయంతో అండమాన్ ఎంతగా నష్టపోయిందో గుర్తుకుతెచ్చుకుంటే బాధ ఒకవైపు ఇలా ఆలోచించుకుంటూ మేం నలుగురం (నేను, మా వారు, పిల్లలిద్దరు) చెన్నై మీదుగా జెట్ ఎయిర్ వేస్‌లో అండమాన్ బయలుదేరాం.
మధ్యహ్నానికి అండమాన్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ కు చేరుకున్నాం. పోర్ట్ బ్లయర్ లోని ''వీరసావర్కార్ అంతర్జాతీయ విమానాశ్రయం'' నుండి హౌటల్ కొచ్చి అన్నం తిని 'కోర్బియన్స్ కోవ్ బీచ్' చూడటానికి వెళ్లాం. కొబ్బరి తాటి చెట్లతో చిత్రకారుడు శ్రద్ధగా గీసిన చిత్రంలా 'కోర్బియన్స్ కోవ్' కనువిందు చేసింది. ఈ బీచ్ నుంచి సెల్యులార్ జైలు ఎదురుగా ఉన్న 'రాజీవ్ గాంధీ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్' కు వెళ్లాం. దారి పొడవునా ఇళ్లన్నీ చెక్కతో నిర్మించినవి కనిపించాయి. ఇదంతా కొండల మయం. రాజీవ్ గాంధీ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఒకవైపు చిల్డ్రన్స్ పార్కు, మరోవైపు మన టాంక్ బండ్లా నీళ్లూ, నీళ్ళ మధ్యలో రాజీవ్ గాంధీ పూలమాల విసురుతున్నట్టుగా విగ్రహం ఉన్నాయి. ఆ విగ్రహం దాకా ఒక వారధిలా కట్టి ఉన్నది. పార్కులో పిల్లలు ఆడుకోవడానికి సైకిళ్లు, ఉయ్యాలలు, డైనోసార్ లాంటి బొమ్మలూ ఉన్నాయి.
అండమాన్ దీవులనగానే ప్రతివారికీ మొట్టమొదటగా గుర్తుకొచ్చేది సెల్యులార్ జైలే. ఇదొక కొండపై ఉన్నది. దీన్ని కట్టడానికి కావలసిన ఇటుకలను బర్మా నుంచి తెప్పించారు. 1896 లో ఈ జైలు నిర్మాణం మొదలైంది. మధ్యలో ఒక టవర్లా ఎత్తుగా కట్టి దాని చుట్టూ ఏడు గీతల్లా అంటే సైకిల్ చక్రం ఆకారంలో నిర్మించారు. టవర్‌లో ఉండే సెక్యూరిటీ సిబ్బందికి జైలు మొత్తాన్ని ఒకేసారి పర్యవేక్షించే అవకాశం కలుగుతుందన్న మాట. ఒక్కొక్క విభాగం మూడు అంతస్థులుగానూ, మొత్తం కలిసి 698 సెల్స్ ఉన్నాయి. సోలిటరీ కన్ఫైన్మెంట్ పడిన వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల దీనికి సెల్యులార్ జైల్ అని పేరు వచ్చింది. మేమిక్కడ సౌండ్ అండ్ లైట్ షో చూశాం. అమరవీరులకు చిహ్నంగా ఒక జ్యోతి వెలుగుతూ ఉన్నది.
మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల కల్లా తయారై జెట్టీ దగ్గర కొచ్చేశాం. బస్సులు ఆగే స్థలాన్ని బస్టాండు అన్నట్టుగా ఫెర్రీలు ఉండే స్థలాన్ని 'జెట్టీ' అంటారు. ఫెర్రీ అంటే పెద్ద పడవ దీంట్లో సుమారు 300 మంది పడతారు. రెండు అంతస్థులు ఉంటుంది. విమానంలో వలె లగేజీ తీసుకొని రిసెప్ట్ ఇస్తారు.ఫెర్రీలో మాకు విండో పక్కన సీట్లు వచ్చాయి. నీళ్ళలో ఫెర్రీ వెళుతుంటే చాలా తమాషాగా ఉంది. మేం హావ్లాక్ ఐలాండ్ వెళుతున్నాం. నీళ్లు ముదురు నీలం రంగు లో ఎండకు మెరుస్తున్నాయి. ఫెర్రీ వెనుక భాగం అంతా నురగలుతో నీళ్లు తెల్లగా కనిపిస్తున్నాయి. రెండు గంటల ప్రయాణం తర్వాత హావ్లాక్ దీవిలో అడుగుపెట్టాం. ఇది అండమాన్ దీవులన్నింటిలోకి పెద్ద దీవి. పోర్ట్‌బ్లెయిర్‌కు నార్త్ ఈస్ట్ లో 57 కిలోమీటర్ల దూరంలో ఈ దీవి ఉన్నది. ఇండియా లోని బ్రిటిష్ జనరల్ హెన్రీ హావ్లాక్ పేరు మీద ఈ దీవి ని 'హావ్లాక్ దీవి' అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ దీవి బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడినవారితో నిండి ఉన్నది. ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ బీచ్, విజయానగర్ బీచ్ మొదలైన అనేక బీచుల్లో రాధానగర్ బీచ్ అందంగా ఉంటుంది. ఇది ''బెస్ట్ బీచ్ ఇన్ ఆసియా'' అని పేరు పొందింది. ఈ దీవిలో ఐదు గ్రామాలు ఉన్నాయి.
ఇక్కడ హౌటల్లో దిగి సాయంత్రం రాధానగర్ బీచ్ చూడటానికి వెళ్లాం. మెలికలు తిరిగిన సన్నని రోడ్లు, మమ్మల్ని పట్టుకోండి చూద్దామన్నట్టుగా మా కారు కన్నా ముందుగా మమ్మల్ని కవ్విస్తూ పరిగెడుతున్నాయి. దారికి అటువైపు ఇటువైపు అంతా పచ్చదనమే. దారిలో రోడ్డుపక్క బండ్లమీద బంగారం, పసుపు కలిపి నూరితే వచ్చే రంగుతో బొద్దుగా ముద్దుగా ఉన్న అరటి పండ్లు కనువిందు చేస్తున్నాయి. ఇవి ఆకలి తీర్చడానికి కాదు చూడటానికి అందంగా కనిపిస్తున్నాయని కొందామనిపిస్తోంది. బీచ్ దగ్గర కొబ్బరి చెట్లు ఎంత పొడవున్నాయంటే నేల మీద పడుకొని చూస్తే తప్ప వాటి తలలు కనిపించేలా లేవు. ఒక్కొక్క బొండా నుంచి దాదాపు లీటరు నీళ్లు వస్తున్నాయి. తెల్లని ఇసుక రేణువులపై మా పాదాలు మోపి సముద్రాన్ని చూస్తుంటే ఎన్నో రంగులుగా కనిపిస్తోంది. ముందున్న నీళ్లు నీలంగా, మధ్యలో ఉన్న నీళ్లు ఆకుపచ్చగా, దూరంగా వెనకున్న నీళ్లు నల్లగా ఇలా రంగులు మారుస్తూ గమ్మత్తుగా ఉంది సముద్రం. కాసేపటికి పెద్ద వర్షం కురిసింది. సముద్రం ఎదురుగా వర్షంలో తడుస్తూ, ఆకాశాన్ని తాకే చెట్ల మధ్యలో దూరంగా కొండల మధ్య పొగ మంచు తెరల్లో పల్చగా కనిపిస్తున్న ఇంద్రధనస్సు ఎంతో అద్భుతంగా ఉంది. ఆ వాన నీళ్ళను మా గుండె గదుల్లో నింపుకొని హావ్లాక్ దీవి నుంచి అండమాన్ వచ్చేశాం. వచ్చేటప్పుడు నీళ్లు ఏదో ప్రళయరూపంలా ఎగసిపడుతున్నాయి. నీళ్లు కూడా నల్లగా తారులాగా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు అంత ఆనందం కలిగించిన నీళ్ళు వచ్చేటప్పుడు ఎంతో భయపెట్టాయి.
తెల్లదారి రాస్ ఐలాండ్ కు వెళ్లాం. మా బోటు పేరు ఎమ్.వి. కింగ్ ఇరైజ్. డేనియల్ రాస్ అనే అతను ఈ దీవిని మొదటిసారిగా కనిపెట్టడం వల్ల ఈ దీవికి ఆ పేరు వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ బాంబ్ ఎటాక్ జరిగింది. తర్వాత వైపర్ ఐలాండ్, సాతామ్ ఐలాండ్ చూశాం. నార్త్ బే లో స్విమ్మింగ్ చేశాం. అక్కడ కోరల్స్ చాలా ఉన్నాయి. బోట్‌కు అడుగున ఉన్న అద్దం ద్వారా సముద్రం లోపల ఉన్న పెద్ద పెద్ద కోరల్స్ చూశాం. అండమాన్ లో 'సాగరిక' అనే గవర్నమెంట్ హాండిక్రాప్ట్స్ షాపుకు వెళ్లాం. అక్కడ అన్ని వస్తువులూ ఎంతో అందంగా ఉన్నాయి. నచ్చినవి కొనుక్కొని, అండమాన్ అందాల్ని కళ్లలో నింపుకొని తిరుగు ప్రయాణమయ్యాం.
- డా|| ప్రసాద్ రావు
Authorization