సంవత్సరమంతా సగటున వర్షించే మేఘాలు, ఎత్తయిన కొండలపైనుంచి మంచు కురిసినట్టు నేలకు జారే జలపాతాలు.. ఒక్కటని కాదు ఎటూ చూసినా మనసుకు హత్తుకునే అందాల హరివిల్లు చిరపుంజీ. ఇది సముద్రమట్టం నుంచి దాదాపు 1300 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రదేశంలోనే దేశంలో అత్యధికంగా వర్షం పడే ప్రాంతం. కాలుష్య వాతావరణానికి దూరంగా ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరించే పర్యాటక ప్రాంతం చిరపుంజీ.
మేఘాలయా రాష్ట్ర రాజధాని షిల్లాంగుకు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజీ ఓ అందమైన ప్రకృతి నిలయం. చిరపుంజీని చిర్రాపుంజి అని కూడా పిలుస్తారు. ఇది మేఘాలయాలోని తూర్పు ఖాశీ హిల్స్ జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశంగా ఖ్యాతిగాంచింది. దీనికి సమీపంలో ఉండే మాసిన్రామ్లో అత్యధిక వర్షపాతం ఉంటోంది. చిరపుంజీ అసలు పేరు సొరా, దీన్ని చురా అని బ్రిటిష్ వారు పిలిచేవారు. కాలక్రమేణా అది చిరపుంజీగా మారింది. చిరపుంజీకి వెళ్లాలంటే ముందు షిల్లాంగ్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి ఘాట్ రోడ్లో సాగే ప్రయాణంలో చుట్టూ ఎత్తయిన పర్వతాలను చూస్తూ వాటినుంచి జాలువారే జలపాతాలను తన్మయత్వంతో తిలకించవచ్చు. చిరపుంజీ ప్రాంతం దాదాపుగా లైమ్ రాతిగుహలతో నిండి ఉంటుంది. ఇక్కడ పురాతన ప్రెస్బిటేరియన్ చర్చి, రామకృష్ణ మిషన్లను దర్శించవచ్చు. షిల్లాంగ్ చుట్టు పక్కల అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. దాదాపు ప్రతిరోజు టూరిస్టులతో సందడిగా ఉండే షిల్లాంగ్‌లో మ్యూజియం ఆఫ్ ఎంటోమాలజీ అనే సీతాకోక చిలుకల పార్క్ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రముఖ హిల్ స్టేషనైనా షిల్లాంగ్ కేవలం పర్యాటకులకే కాక సినిమా షూటింగ్‌లకు కూడా అనువైన ప్రదేశం.
చిరపుంజీలో నివసించే స్థానికులను ఖాసీలంటారు. వీరిలో మాతృవంశ పాలన ఉంటుంది. పెళ్లి తరువాత భర్త భార్య వెంబడి ఆమె ఇంటికి వెళతాడు. పుట్టిన పిల్లలు తల్లిపేరును ఇంటిపేరుగా పెట్టుకుంటారు. చిరపుంజీ లివింగ్ బ్రిడ్జ్‌లకు పెట్టింది పేరు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి చిరపుంజీవాసులు చెట్ల వేళ్లనే బ్రిడ్జిలుగా మార్చే విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటికీ ఉపయోగిస్తున్న ఒక పురాతన బ్రిడ్జి వయస్సు 500 ఏళ్లు ఉంటుంది. బంగ్లాదేశ్ ముఖంగా ఉన్న ఖాసీ కొండల దక్షిణ కొనకు చిరపుంజీ ఉంది. బంగాళాఖాతం నుంచి వీచే రుతుపవన గాలులు ఈ కొండశిఖరాలను తాకడం వల్ల చిరపుంజీలో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే ఈశాన్య, నైరుతీ రుతుపవనాల నుంచి వర్షాలు కురవడంతో, ఇక్కడ రెండూ కలిసి ఒకే ఒక రుతుపవన కాలంగా ఉంటాయి. శీతాకాలంలో బ్రహ్మపుత్ర వ్యాలీ గుండా ప్రయాణించే ఈశాన్య రుతుపవనాల వల్ల ఇక్కడ వానలు పడతాయి. ఒక సంవత్సర కాలంలో గరిష్ట వర్షపాతానికి సంబంధించి చిరపుంజీ పేరిట రెండు గిన్నీస్ రికార్డులున్నాయి.
Authorization