అప్పటి వరకు ఉద్యోగం, పిల్లలు, కుటుంబ బాధ్యతలు. రిటైర్ అయిన తర్వాత సరదాగా గడపాలని, అందమైన ప్రదేశాలను చుట్టి రావాలని చాలా మందికి ఉంటుంది. ఆ ప్రయాణం సొంత వాహనంలో అయితే. ఆ మజానే వేరు. ఏమంటారు... అందుకే ప్రస్తుతకాలంలో చాలామంది లాంగ్ డ్రైవింగ్ ఇష్టపడుతున్నారు. కొంతమంది సుదార ప్రాంతాలు పర్యటించేందుకు కారును స్వయంగా నడుపుతుంటారు. ఇలాంటి లాంగ్ టూర్లకు కారు మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోను వృద్ధులైతే మరీ అప్రమత్తంగా ఉండాలి. మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం...
కంటిచూపు సమస్య
మలివయసులో వున్నవారికి డ్రైవింగ్ చేస్తున్న సమయంలో చాలావరకు కండ్లు మసకమసకగా కనిపిస్తాయి. ఎదుటివాహనం చాలా దగ్గరగా వచ్చేంతవరకు సరిగ్గా కనిపించదు. అలాగే కండ్లు కొంచెం నొప్పిగా కూడా అనిపిస్తాయి. అటువంటి సమయాల్లో డ్రైవింగ్కి కొంత విశ్రాంతి ఇచ్చి కంటి చెకప్ చేయించుకుంటే మంచిది. లేకపోతే చాలా ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుంది.
వినికిడి సమస్య
60 సంవత్సరాలు దాటిన తర్వాత సాధారణంగా చాలామందికి వినికిడి సమస్య వుంటుంది. కొంతమందిలో ఇది ఒక మోతాదులో వుండే.. మరికొంతమంది ఎంతో గట్టిగా అరిస్తే తప్ప మాటలు వినిపించవు. అటువంటి సమస్యలే మీకు వున్నాయని అనిపిస్తే.. వెంటనే డ్రైవింగ్ చేయడం మానేయాలి. లేకపోతే వెనుక నుంచి వచ్చే వాహన హారన్ శబ్దం వినబడక.. ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి సాధ్యమైంత త్వరగా డాక్టర్ తో చెకప్ చేయించుకుంటే మంచిది.
రిఫ్లెక్స్ సమస్య (అసంకల్పిత చర్య)
వృద్ధాప్యంలో వున్నవారు ఎక్కువగా ఈ సమస్యనే ఎదుర్కొంటున్నారు. వయసు మీదపడేకొద్దీ శరీరంలో వుండే పోషకాలు పూర్తిగా తగ్గిపోతాయి. దాంతో శరీరంలో వుండే అవయవాలు ఒకదానితో ఒకటి సమన్వయంగా సహకరించవు. దీంతో శరీర అవయవాలు ఫ్లెక్సిబుల్ గా లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం చాలా వుంది.
ఈ సమస్యలను అధిగమించే
- కంటి సమస్య అధికమైనప్పుడు ముందుగా డాక్టర్ దగ్గర పరిశీలించుకోవడం ముఖ్యం. దానికి సంబంధించిన కండ్లజోడును నిత్యం వాడితే ఎలాంటి ప్రమాదం వుండదు. పైగా ఏడాదికొకసారి డాక్టర్ దగ్గరకు వెళ్లి కంటి చెకప్ చేయించుకోవాలి. దీంతో మీ దృష్టిలోపం కొంతవరకు తగ్గి, డ్రైవింగ్ చేయడానికి అనుకూలంగా వుంటుంది. అలాగే వినికిడి సమస్య అధికంగా వున్పప్పుడు డాక్టర్లు ఇచ్చిన సలహాల మేరకు హియరింగ్ ఎయిడ్స్ ను వాడాలి.
- ముఖ్యంగా మలివయసులో వున్నవారికి నిద్ర చాలా అవసరం. సమయానుకూలంగా సరిగ్గా నిద్రపోకపోతే ఆరోగ్యానికి సంబంధించిన ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి వెంటనే డాక్టర్ల సలహాల మేరకు ఆరోగ్యపద్ధతులను పాటించాలి.
- మీరు కారు నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కువ వేగంగా కాకుండా నెమ్మదిగా, ఒక పక్కకు వెళ్లాలి. అలాగే కారులో వుండే కిటికీలను దుమ్ము లేకుండా చూసుకోవాలి. ఇటువంటి పద్ధతులను అనుసరిస్తే.. డ్రైవింగ్ చేయడానికి కాస్త అనుకూలంగా వుంటుంది. అలాగే మీరు చూడాలనుకున్న అందమైన ప్రదేశాలను హాయిగా పర్యటించి రావచ్చు.
Authorization