పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్న కాలమిది. ఒకపక్క ఉద్యోగరీత్యా పనులు చూసుకుంటూనే మరోపక్క ఇంటిని, పిల్లలనూ చూసుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు మహిళలు. అలాగే ఒంటరిగా విహాయయాత్రలు చేయడానికి కూడా సిద్దమవుతున్నారు. అలా ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలు కొన్ని భద్రతా చిట్కాలు పాటిస్తే ఎంతో మంచిది. అవేంటో చూద్దాం..
ఎప్పటికప్పుడు సమాచారం: కొత్త ప్రదేశంలో మీరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు మీ కుటుంబసభ్యులలో సమాచారం తెలియజేయండి. క్రమం తప్పకుండా మీ ప్రయాణం ముగిసే వరకు వాళ్ళకు అందుబాటులో ఉండడానికి ప్రాధాన్యమివ్వండి. మీరు ఎక్కడున్నారో ఆన్లైన్లో తరుచూ పోస్ట్ చేయడం ద్వారా మీ గురించి మీ వాళ్లకు ఎప్పటికప్పుడు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే మీ ఫ్లైట్ నెంబర్, వసతి చిరునామాలు వంటివి సోషల్ మీడియాలో పొందుపర్చడం కన్నా మీ దగ్గరవాళ్లకు మాత్రమే ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం. ఇలా చేస్తే అనవసరపు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండవు.
బాగా పరిశోధించాలి: మీరు ఎక్కడికైతే వెళ్లాలనుకుంటున్నారో ఆ ప్రదేశం గురించి మీరు ఎంతో బాగా పరిశోధించాలి. అక్కడి సంప్రదాయాలు, చట్టాల గురించి పూర్తిగా తెలుసుకోగలగాలి. అక్కడి సురక్షితమైన ప్రాంతాల గురించి అలాగే రాత్రి వేళలో అక్కడ వెళ్లకూడని ప్రాంతాల గురించి అవగాహన ఉండటం ఎంతో అవసరం. అక్కడి రవాణా సంస్థ గురించి కూడా బాగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే అక్కడి మనషుల హావభావాలను ముందుగానే పసిగెట్టగలగడం, అక్కడి రాజకీయ, మతపరమైన పరిస్థితులు ఏమిటో తెలుసుకోవడం కూడా మంచిదే.
వస్తువులకు భద్రత: విలువైన వస్తువులను కోల్పోతే ఎంతో బాధగా ఉంటుంది. అందుకే ప్రయాణం చేసేటప్పుడు ఖరీదైన నగలు, మీ మనసుకు దగ్గరైన వస్తువులు మీతో తెచ్చుకోకుండా ఉండడమే మంచిది. ఈ రోజులలో ఏ ప్రదేశానికైనా స్మార్ట్ ఫోన్, కెమెరా, లాప్టాప్ వంటివి తీసుకెళ్లడం సర్వసాధారణమైపోయింది. ఒక స్థలం నుంచి మరొక స్థలానికి ప్రయాణం చేస్తున్నప్పుడు విలువైన వస్తువులను ఎంతో భద్రంగా చూసుకోవడం మంచిది. అలాగే వాటిని ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా మీతో పాటే ఉంచుకోవడం శ్రేయస్కరం. ఒక్క క్షణం మీరు ఏమరపాటుగా ఉన్నా మీ విలువైన వస్తువులను మీరు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది.
స్థానిక భాష నేర్చుకోండి: మీరు వెళ్లదలుచుకునే ప్రాంతపు స్థానిక భాషను మీరు కొంచమైనా నేర్చుకోవడం మంచిది. 'నమస్కారం', 'దయచేసి', 'కృతజ్ఞతలు', 'వద్దు', 'వెళ్తాను' వంటి పాదాలను ఆ ప్రాంతపు స్థానిక భాషలో ఎలా అంటారో తెలుసుకోవడంతో పాటు 'బస్టాప్ ఎక్కడీ', 'మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతారా?' తదితర వాఖ్యాలను ఆ స్థానిక భాషలో ఎలా సంభాషిస్తారో తెలుసుకోవడం ఉత్తమం.
మెయిల్‌కు పెట్టుకోండి:పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బుకింగ్ నిర్ధారణలు, ప్రయాణ భీమా తదితర ముఖ్యమైన పత్రాలను మీరు డిజిటైజ్ చేయడం ఎంతో మంచిది. వాటిని స్కాన్ చేసుకుని మెయిల్‌కు యటాచ్ చేసుకుంటే ఏదైనా కారణంగా ఆ పత్రాలు పోయినా, పాడైపోయినా, దొంగలింపబడినా పెద్దగా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉండవు.
అన్నింటికంటే ముఖ్యమైనది ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ధైర్యంగా ఉండటం ఎంతో అవసరం. చుట్టూ పరిస్థితులను ఎప్పుడూ గమనిస్తూ అసౌకర్యం కలిగించే పరిస్థితుల్లో 'నో' చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.
Authorization