ఆంధ్రా ప్రాంతంలోని మచిలీపట్నం అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి బందరు లడ్డూలు. మచిలీపట్నం (బందర్) నకు 11 కి.మీ దూరంలో ఉండే చిన్న గ్రామం మంగినపూడి. కృష్ణాజిల్లాలోని బందరు తీరప్రాతం కావడంతో బీచ్‌లకు కొదవలేదు. అందులో చెప్పుకొదగినది మంగినపూడి బీచ్. ఈ బీచ్ లోతు తక్కువగా ఉంటుంది. వారాంతరాల్లో అనేకమంది దూర ప్రాంతాల నుండి వస్తుంటారు.
స్వాగతం పలికే ద్వారం: మంగినపూడి బీచ్ ఎంట్రెన్స్‌లో రెండు చేపలతో నిర్మించిన ద్వారం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. బీచ్ ఒడ్డున ఉన్న నాట్యశాలలో విద్యార్థులకు కూచిపూడి నృత్యం నేర్పిస్తారు. ఒడ్డునే దత్తాశ్రమము, పురాతన శివాలయం ఉన్నాయి. ఈ బీచ్‌లోనే లింగాకారంలో ఉండే 12 బావులున్నాయి. ప్రకృతి ప్రేమికులకు ప్రశాంతంగా గడపటానికి అనువైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఆ సముద్రపు అలలు పాదాలను తాకుతూ ఉంటే ఏదో చెప్పలేని అనుభూతి. అలా సముద్రంలో కాసేపు జలకాలాటలాడి కొన్ని ఫొటోలు, సెల్ఫీలు దిగవచ్చు. నిత్యం పర్యాటకులకు కళకళలాడుతూ మంగినపూడి బీచ్ అత్యంత రద్దీగా ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే బీచ్‌లో ఇసుకకి బదులుగా నల్లటి మన్ను ఉంటుంది. ఈ బీచ్ ను సందర్శించే పర్యాటకులంతా సాగరంలో స్నానాలు చేస్తారు, అలల సవ్వడిలో కేరింతలు కొడుతూ..ఈతకొడుతూ ఆనంద సాగరంలో తేలియాడుతారు.
హెలీరైడ్: బీచ్‌లో పారా రైడింగ్, హెలీరైడింగ్, కార్ రేసింగ్, సైకత కళ వంటి ఈవెంట్లకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది. ఆకాశపుటంచులను తాకే విధంగా పారాగ్లైడింగ్ ద్వారా ఎగిరిన పర్యాటకులంతా ప్రత్యేకమైన అనుభూతినికి లోనవుతారు. హెలీరైడ్ ద్వారా హెలీకాప్టర్‌లో బీచ్ పరిసర ప్రాంతాలన్నీ ఒక్కో ట్రిప్‌కు అరుగురు చొప్పున చుట్టి రావచ్చు.
బీచ్ ఫెస్ట్: ఇక్కడ బీచ్ ఫెస్ట్ ఘనంగా నిర్వహిస్తారు.ఫెస్ట్ సమయంలో సైకత శిల్పం ఆలోచింపచేసే విధంగా ఉంటుంది.ఆ సమయంలో ఇక్కడ అనేక క్రీడలను కూడా నిర్వహిస్తుంటారు. బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, పోటీల్లో క్రీడాకారులంతా హోరాహోరీ తలపడతారు.
బోటింగ్: మినీ బోటింగ్ జోన్లో చిన్నారులంతా ఉల్లాసంగా బోటింగ్ చేసి ఆనందోత్సాహాలలో తేలిపోతారు. ఇంకా కొంత మంది పర్యాటకులు గుర్రపు స్వారీలు చేస్తుంటారు. ఈ బీచ్ లో పిల్లల కోసం ఏర్పాటు చేసే హల్క్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మాన్, ఐస్ మ్యాన్, ఐరన్ మాన్ వంటి సూపర్ హీరోల బొమ్మల వద్ద చిన్నారులు ఫొటోలు దిగుతూ ఎంతో ఆనందాన్ని పొందుతారు.
సీ ఫుడ్స్: బీచ్‌లోని ఇసుక తిన్నెలపై వివిధ రకాల సీఫుడ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్‌లో రుచికరమైన రొయ్యలు, పీతలు, నత్తగుల్లలతో తయారు చేసిన ఆహారం అందుబాటులో ఉంటుంది.
Authorization