పొడవాటి దేవదారు వృక్షాలతో నిండిన చిక్కటి అడవులు. ఎత్తయిన కొండలు. కొండకోనల మధ్యలోనే పామువలె మెలికలు తిరిగే రహదారి. ''చూసే కనులకు మనసుంటే ... ఎటు చూసిన అందమే'' అన్నట్టు నగర పర్యటనకి వచ్చే టూరిస్టులకి తన అందచందాలను ఆరబోస్తూ నిత్యం దర్శనమిస్తుంటుంది నైనిటాల్ . ఈ చిన్నకొండ నగరం... ఉత్తరాఖండ్ రాష్ట్రానికి జ్యూడిషల్ క్యాపిటల్ మాత్రమే కాకుండా ఓ సుందరమైన పర్యాటక స్వర్గధామంగా అలరారుతున్నది. ఈ ప్రాంతంలో ప్రతిచోటా దర్శనమిచ్చే చలిమంటలు (క్యాంప్ ఫైర్లు) నిజంగా అద్భుతమైన అనుభవాలు, అనుభూతులు ప్రతి ఒక్కరూ పొందవచ్చు. ఆ ప్రాంత ప్రత్యేకలేంటో జరదేఖో అంటున్నారు నవ తెలంగాణ ఢిల్లీ ప్రతినిధి సాగర్ వనపర్తి...
ఏ కాలమైనా రోజులో కనీసం ఒక్కసారైనా వర్షం పడే ప్రాంతం నైనిటాల్ కావడంతో రోజూ ఊరంతా తడితడిగా ఉంటుంది. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రదేశం కావడంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న నగరం అయినందున పర్యాటకులు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో మాల్ రోడ్డు చాలా ఇరుకుగా కనిపిస్తుంది. కొండ ప్రారంభం నుంచి ఊరిలోకి ప్రవేశించడానికే మూడు నాలుగు గంటలు పడుతుంది. భద్రతాదళాల ముఖ్యకార్యాలయం సైతం నైనిటాల్లో ఉండటంతో ఎక్కువ భాగం వారి ఇళ్లకు గెస్ట్ హౌసులు.. మొదలగు వాటికి కేటాయించారు. మిలిటరీ రాకపోకలతో మరింత రద్దీగా ఉంటుంది ఆ ప్రదేశం.
భలేగా ఉండే... బర్ఫ్ ఆట...
ఉత్తరాఖండ్‌కి ప్రత్యేకంగా వచ్చే టూరిస్టులంతా బర్ఫ్ (స్నో ఫాలింగ్)తో ఆడేందుకు వస్తుంటారు. ఇదే పర్యాటకులని మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఆ హిమగిరుల అందాలను కళ్ళకు కట్టినట్టు చూడాలంటే స్నో పాయింట్‌కి తప్పకుండా వెళ్ళాల్సిందే. అద్భుత హిమాలయ పర్వత శ్రేణులు నైనిటాల్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో స్నో వ్యూ పాయింట్ ఉంది. రోప్ వే కేబుల్ కార్ ద్వారా స్నో వ్యూ తేలికగా చేరవచ్చు. ఈ స్నో వ్యూ పాయింట్ నుంచి చూస్తే హిమాలయాలు పర్యాటకులకి కనిపిస్తూ ఉంటాయి. నడిచిగానీ, లోకల్ టాక్సీలలో గాని ప్రయాణించి ఈ ప్రదేశం చేరుకోవచ్చు.
నైనిటాల్లో చూడదగిన ప్రదేశాలు...
సాధారణంగా ఇక్కడ ఏ ప్రాంతానికైనా తాల్ అనే పేరు ఉంటుంది. తాల్ అంటే సరస్సు అని అర్థం. నైనిటాల్లో భీమతాల్, నౌకుచియాతాల్, నైనా పర్వతం, నైనా దేవి ఆలయం, గోరఖల్, గవర్నర్ హౌస్, ఎత్తయిన పర్వత ప్రాంతం కిల్బరీ, టిఫిన్ టాప్ లేదా డొరోతి సీట్, హనుమాన్ ఘరీ, అరబిందో ఆశ్రమం, పాన్గోట్, బారా బజార్, స్నో వ్యూ, కేవ్ గార్డెన్, సాత్ తాల్, హనుమాన్‌గర్హీ, మాల్ రోడ్, జీబీ పంత్ జూ, టిబెటిన్ మార్కెట్, హిమాలయ దర్శన్ తదితర ప్రాంతాలు చూడదగినవి. ఇక్కడ చూడాల్సిన ప్రాంతాలన్నీ స్వయంగా తిరుగుతూ చూడవచ్చు. ప్రత్యేకంగా గైడ్లు ఏమి అవసరం ఉండదు. ఎందుకంటే నగరమంతా చిన్నగానే ఉంటుంది.
ఆహ్లాదాన్నిచ్చే కేబుల్ కార్ పయనం...
ఈ టూర్ మొత్తంలో కేబుల్ కార్ ప్రయాణం ఓ అద్భుతమైన ఆహ్లాదాన్ని ఇస్తుంది. అక్కడ బర్ఫ్ చూడాలంటే అందరూ స్నో వ్యూ పాయింట్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఏరియల్ కేబుల్ కార్ మిమ్మల్ని మాల్ రహదారి నుండి స్నో వ్యూ పాయింట్‌కు కనెక్ట్ చేస్తుంది. కేబుల్ కార్ నుండి చూస్తే అందమైన నగరం కనబడుతుంది. నైనితాల్ రోప్ వే మరోక ప్రసిద్ధ టూరిస్ట్ ఆకర్షణ. ఇది కుమావొన్ మండల వికాస్ నిగంచే నిర్వహించబడుతోంది. ఇది ఇండియాలో స్థాపించ బడిన మొదటి కేబుల్ కార్.
టిఫిన్ టాప్ కూడా పిక్నిక్కి ప్రత్యేక ప్రదేశమే!...
నైనిటాల్లో టిఫిన్ టాప్ అనే ప్రదేశంలో బ్రిటిషర్స్ కాలం నుంచి ఇది ఒక పిక్నిక్ స్పాట్‌గా గుర్తించబడింది. ఈ కొండలను ఆయార్పథ్ పర్వతశ్రేణులు అని అంటారు. అక్కడి స్థానిక భాషలో అయార్ అంటే కటిక చీకటి అని చెబుతుం టారు. ఈ కొండలలో ఉన్న అడవులు సూర్యకిరణాలను నేలపై పడకుండా అడ్డుకునేంత దట్టంగా ఉంటాయి. అందుచేతనే ఈపర్వతాలను ఆయార్ పథ అని పిలుస్తుంటారు. కానీ, కాలక్రమేణా వీటిని ఆర్యపథ్ అనడం ప్రారంభించారు. అందుకు గుర్తుగానే ప్రభుత్వం కూడా ఇక్కడ 'ఆర్యభట్ట రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్' 2004 లో నిర్మాణం చేపట్టింది. ఈ టిఫిన్ టాప్‌ని డోరతి సీటు అని కూడా అంటారు. రాళ్లు పరచిన నడక దారిలో కాస్త ముందుకు వెళితే కొండ పైన ఉంటుంది. ప్రసిధ్ద చిత్రకారిణి 'కెల్లెట్ డోరతి' ఆ ప్రదేశంలో కూర్చొని బొమ్మలు వేసుకొనేదట,
అందుకే ఆ ప్రదేశానికి డోరతి సీటు అనే పేరు వచ్చిందని అక్కడి స్థానిక ప్రజానీకం చెబుతున్నారు.
కృపాతాల్ : నైనిటాల్‌తో సహా పరిసర గ్రామాలకు మంచినీరు సరఫరా కృపాతాల్ సరస్సు నుంచి జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ సరస్సులో నీటి ఊటలు ఉన్నాయని ప్రసిద్ధి. అయితే, ఈ ప్రదేశం అంతగా చూడదగ్గ ప్రదేశం కాదు. నైనిటాల్ సరస్సుకే ఎక్కువ మంది పర్యాటకులు వెళుతున్నారు. ఆ సరస్సులో బోటింగ్ చేసిన తర్వాత కృపాతాల్ వద్దకు ఎవరూ రారు. కానీ, ఈ సరస్సులోనూ పలువురు టూరిస్టులు బోటింగ్ చేస్తూ ఉంటారు. దానికి సమీపంలోనే సరియతాల్ సరస్సు కూడా ఉంటుంది. ఈ రెండింటికి దగ్గరలోనే గర్నిహౌసు కూడా ఉంటుంది. ఆర్య పర్వతాలలో ఓ కొనకి ఇది ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వేటగాడు, జంతు అధ్యయన కర్తగా పేరొందిన జిమ్ కార్బెట్ ఇక్కడే నివసించారని చరిత్ర చెబుతోంది.
గౌన్ హిల్ : నైనిటాల్ నగరంలో మరొక చూడదగ్గ ప్రదేశం 'పంగొటి' గ్రామం. బూర్జువా, భూస్వామ్య సమాజపు ధోరణులు ఏమాత్రం అగుపించని గ్రామీణ వాతావరణ ప్రదేశానికి సొంతం. పర్యాటకులు చిన్న చిన్న ట్రెక్కింగులు చెయ్యడానికి ఈ గ్రామానికి వస్తుంటారు. చుట్టారా ఉన్న కొండలు ఓక్, దేవదారు, వెదురు వృక్షాలతో కూడిన అడవుల మధ్య నడక అహ్లాదకరంగా ఉంటుంది. టిబెట్, నేపాలు నుంచి వచ్చే పాదాచారులు, పర్యాటకులు, వ్యాపారవర్గాలు భీమతాల్ గ్రామంలో కనిపిస్తూ ఉంటారు. ఇన్ని అద్భుత అనుభవాలు.. అనుభూతులకి నెలవైన నైనిటాల్ మీరు కూడా తప్పక చూడాల్సిందే!
Authorization