- గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం
- పట్టించుకోని ఎక్సైజ్ శాఖ..!
- బెల్టు షాపులు ఎత్తి వేయాలని పలువురు సీఐకి ఫిర్యాదు
నవతెలంగాణ-హుజూరాబాద్
పట్టణాల్లో ఉండాల్సిన మద్యం దుకాణాలు నేడు పల్లెల్లో గల్లీకొకటి వెలుస్తున్నాయి. మద్యం విక్రేతలు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో బెల్టుషాపులతో మద్యం ఏరులై పారుతోంది. బెల్టుషాపులు లేవని అధికారులు చెబుతున్నా అవి లెక్కల వరకే పరిమితమవుతున్నాయి. నూతన ఎక్సైజ్ మద్యం పాలసీని తీసుకువచ్చి ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించేలా, కల్తీ మద్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో బెల్టుషాపు నిర్వాహకులకు హద్దు లేకుండా పోతుంది. దీంతో వారి వ్యాపారం మూడు క్వాటర్లు, ఆరు బీర్లుగా కొనసాగుతోంది.
హుజూరాబాద్ మండంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో ఒకటి నుంచి రెండు బెల్టు షాపులు నిర్వహణ కొనసాగుతుందంటే ఎక్సైజ్ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్టుషాపుల్లో సమయపాలన లేకుండా తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అందుబాటులో ఉంటుంది. గ్రామాల్లోని కూలీ పనులు చేసుకునే నిరుపేదలు బెల్టుషాపులకు అలవాటుపడి కూలీ పనులకు సైతం పోకుండా నిత్యం గ్రామాల్లో మద్యం మత్తులో ఉంటున్నారు. హుజూరాబాద్ పట్టణ ప్రాంతాల నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామాలకు తీసుకువెళ్లి ఒక మద్యం బాటిల్‌పై ఎంఆర్పీ రేటు కంటే రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు..
గ్రామాల్లో మద్యం అమ్మకాలు సిండికేట్‌గా మారడంతో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. హోటళ్లు, కిరాణషాపులు బెల్టు షాపులుగా తయారవుతున్నాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లాభార్జనే ధ్యేయంగా గ్రామీణ ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారు. మద్యం షాపులను రహదారుల పక్కన నిర్వహించరాదని అధికారికంగా వెళ్లడించినప్పటికి గ్రామాల్లో రోడ్ల పక్కనే దర్జాగా మద్యం విక్రయిస్తున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో ఉండి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
నిషేధం బుట్టదాఖలు..
గ్రామాల్లో మద్యానికి బానిసైన కొందరు వ్యక్తులు అనారోగ్యం పాలవడంతో పాటు కుటుంబాలు అప్పుల కొరల్లో చిక్కుకోవడం, గొడవలు వంటి సంఘటనలు చోటు, చేసుకోవడంతో సైదాపూర్ మండలం లస్మన్నపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో బెల్టు షాపులు ఎత్తివేయాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు.
కేసులు నమోదు చేస్తాం...
గ్రామాల్లో బెల్టుషాపులను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో తనిఖీలు చేపట్టి నిర్వాహకులపై కేసులు నమోదు చేశాం. గ్రామాల్లో మద్యం విక్రయాలను నివారించేందుకు నిరంతర తనిఖీలు చేస్తూనే ఉన్నాం. గ్రామాల్లో ఎవరైన మద్యం విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చినవారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.
దుర్గా భవాని ఎక్సైజ్ సీఐ, హుజూరాబాద్
నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి
గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహించడం వలన మద్యానికి బానిసైన కుటుంబాలు అప్పుల పాలై రోడ్డున పడుతున్నాయి. చేసిన కష్టమంతా తాగుడికే దారపోస్తున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి ఆకర్షితులవుతున్నారు. గ్రామాల్లో ఎక్కువగా ప్రజల మధ్య అల్లర్లు, గొడవలు జరుగడానికి మద్యం కారణమవుతోంది. బెల్టుషాపుల నిర్వాహకులపై ఎక్సైజ్ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.
కాయిత రాములు, లస్మన్నపల్లి సర్పంచ్
Authorization