రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని డీలర్లు కొందరు నాసిరకం విత్తనాలు అంటగడుతుంటారు. రైతులను నట్టెట్ట ముంచేందుకు అడ్డదారులు తొక్కుతుంటారు. లైసెన్సు లేకున్నా అక్రమ వ్యాపారం చేస్తుంటారు. ఇలాంటి వారి ఆగడాలకు కళ్లెం చేసేందుకు చట్టాలున్నాయి. లైసెన్సు లేకుండా విత్తన వ్యాపారం నిర్వహించడం నేరం. ఇలాంటి విక్రయదారులెవరైనా ఉంటే రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. తద్వారా అలాంటి డీలరుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. విత్తన నియంత్రణ ఉత్తర్వులు -1983 క్లాజు 3, పత్తి విత్తన చట్టం 5(1)(ఏ), పత్తి విత్తన నిబంధనలు-2007 క్లాజు 7ను అతిక్రమిస్తే ఆ విత్తనాలను జప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. విత్తన నియంత్రణ ఉత్తర్వులు ప్రకారం అత్యవసర సరుకుల చట్టం-1955 సెక్షన్ 7, విత్తన చట్టం-2007 సెక్షన్ 12 ప్రకారం జరిమానా విధిస్తారు.
లైసెన్సు ప్రదర్శన తప్పనిసరి : విత్తన లైసెన్సును డీలరు తన షాపులో ప్రదర్శించడం తప్పనిసరి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన డీలరుపై ఫిర్యాదు చేస్తే తొలుత నోటీసులు జారీ అవుతాయి. తన పొరబాటును డీలరు సరిదిద్దుకోకపోతే విత్తన నియంత్రణ ఉత్తర్వులు-1993 క్లాజు 15 ప్రకారం అతడి లైసెన్సును రద్దు లేదా సస్పెండ్ చేస్తారు.
ధరల పట్టిక ఏర్పాటు చేయాలి : విత్తన డీలరు స్టాకుబోర్డు లేదా ధరల సూచిక బోర్డును విధిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే విత్తన అమ్మకాన్ని నిలుపుదల చేసి నోటీసులు జారీ చేస్తారు. తన పొరబాటును సరిదిద్దుకోకపోతే విత్తన నియంత్రణ ఉత్తర్వులు-1983 క్లాజు 15 ప్రకారం ఆ డీలరు లైసెన్సును రద్దు, లేదా సస్పెండ్ చేస్తారు.
రశీదు : విత్తన డీలరు కొనుగోలుదారుకు అమ్మకపు రశీదును విధిగా ఇవ్వాల్సి ఉంటుంది. రైతులు కూడా తప్పనిసరిగా అడిగి తీసుకోవాలి. దీన్ని పాటించని డీలరుకు విత్తన నియంత్రణ ఉత్తర్వులు-1993 క్లాజు 9, విత్తన నిబంధనలు-2007 క్లాజు 21 ప్రకారం నోటీసులు జారీ చేస్తారు. తన లోటును సవరించుకోకపోతే అతడి లైసెన్సు రద్దు లేదా సస్పెండ్ చేస్తారు.
లేబుల్ లేని ప్యాకెట్లు విక్రయిస్తే.. : విత్తన ప్యాకెట్‌పై కంపెనీ లేబుల్ ఉందా లేదా అనేది రైతులు చూసు కోవాలి. ఒకవేళ లేబుల్ పూర్తిగా లేకపోయినా సక్రమంగా లేకుండా విత్తనాలు అమ్మినా డీలరు శిక్షార్హడు. విత్తన చట్టం 1966 సెక్షన్ 7, విత్తన నియంత్రణ ఉత్తర్వులు-1983 క్లాజు 8 (ఆ), నిబంధనలు-2007 సెక్షన్ 3, 4, 5, 6 ప్రకారం ఆ విత్తనాలను జప్తు చేస్తారు. డీలరు లైసెన్సును రద్దు లేదా సస్పెండ్ చేస్తారు. అత్యవసర సరుకుల చట్టం-1955 సెక్షన్ -7, విత్తన చట్టం -2007 సెక్షన్ 12 ప్రకారం జరిమానా విధిస్తారు.
కాలం చెల్లిన విత్తనాలు అంటగడితే... : కాలం చెల్లిన విత్తనాలు అమ్మే డీలరు శిక్షార్హడు. విత్తన చట్టం 1966 సెక్షన్ 7, విత్తన నియంత్రణ ఉత్తర్వులు-1983 క్లాజు 8(ఆ), పత్తి విత్తన నిబంధనలు-2007 సెక్షన్ 4, 5 ప్రకారం విత్తనాలు జప్తు చేస్తారు. డీలరు లైసెన్సును రద్దు లేదా సస్పెండ్ చేస్తారు. అత్యావసర సరుకుల చట్టం-1955 సెక్షన్ 7, పత్తి విత్తన చట్టం 2007 సెక్షన్ 12 ప్రకారం జరిమానా విధిస్తారు.
నిర్ణీత ధరకే అమ్మాలి : ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పత్తి విత్తనాలు అమ్మాల్సి ఉంటుంది. దీన్ని ఉల్లంఘిస్తే పత్తి విత్తన చట్టం-2007 సెక్షన్ 11, నిబంధనలు 22 ప్రకారం ఆ విత్తనాలు జప్తు చేసి విత్తన చట్టం -2007 సెక్షన్ 12 ప్రకారం జరిమానా విధిస్తారు.
రైతు నష్టపోతే..
పత్తి పంట వేసే నిర్ణీత కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులకు జిల్లా స్థాయి కమిటీ లేదా రాష్ట్రస్థాయి కమిటీ నిర్ణయించిన నష్ణపరిహారం విత్తన కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. విత్తన చట్టం -2007 సెక్షన్ 7, నిబంధనలు 28 ప్రకారం విత్తన లైసెన్సు రద్దు లేదా సస్పెండ్ చేస్తారు. విత్తన చట్టం -2007 సెక్షన్ 12 ప్రకారం జరిమానా విధిస్తారు.
ఎరువుల విక్రయ నిబంధనలు
- ఎరువుల డీలరు కొనుగోలుదారుకు డీలరు అమ్మకపు రశీదు ఇవ్వాల్సి ఉంటుంది.
తన ఎరువుల లైసెన్సును షాపులో తప్పనిసరిగా ప్రదర్శించాల్సి ఉంటుంది. స్టాక్‌బోర్డు లేదా ధరల పట్టిక బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలు పాటించకుంటే అత్యవసర సరుకుల చట్టం-1955 సెక్షన్ 7 ప్రకారం ఏడేళ్ల జైలు, జరిమానా విధిస్తారు.
- లైసెన్సు లేకుండా ఎరువుల వ్యాపారం నిర్వహించినా, కాలం చెల్లిన ఎరువులు అమ్మినా, ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరకంటే ఎక్కువకు అమ్మినా, '0' ఫారం లేకుండా ఎరువులు విక్రయించినా అత్యవసర వస్తువుల చట్టం -1955 సెక్షన్ 7 ప్రకారం మూడు నెలల జైలు, జరిమానా విధిస్తారు.
లైసెన్సు లేకుండా పురుగు మందులు అమ్మినా, నిల్వ చేసినా, లైసెన్సు లేకుండా పురుగు మందులు తయారు చేసినా శిక్షార్హులు. మొదటిసారి తప్పు చేస్తే రెండేండ్ల కారాగార శిక్షతోపాటు 50 వేల రూపాయల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే మూడేళ్ల కారాగార శిక్షతోపాటు 75 వేల రూపాయల జరిమానా విధిస్తారు.
పురుగు మందు డీలరు ఇవి పాటించాల్సిందే..
తన దుకాణంలో డీలరు స్టాక్ బోర్డు పెట్టకపోయినా లేక తన దుకాణం పేరు గల బోర్డు పెట్టకపోయినా మొదటిసారి తప్పుకు ఏడాది జైలు, 25 వేల రూపాయల జరిమానా విధిస్తారు. రెండోసారి అదే తప్పు చేస్తే రెండేండ్ల జైలుతోపాటు 50 వేల రూపాయల జరిమానా విధిస్తారు.
Authorization