గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో చాలా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 30-38 డిగ్రీల సెల్సియస్ , రాత్రి ఉష్ణోగ్రతలు 20-30 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. తర్వాత మూడు రోజులు వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 22నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అయ్యే అవకాశం ఉంది.
రుతుపవనాలు బలహీన పడడం వల్ల 50నుండి 60 మి.మీ కంటే తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాలలో వర్షాధార పంటలైన జొన్న. సజ్జ,మొక్కజొన్న, సోయాచిక్కుడు, పెసర, పత్తి, కంది వంటి పంటలను విత్తుకోకూడదు.ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రుతుపవనాల వల్ల కురిసే వర్షాలు కానుందున ఈ వర్షాలను ఆధారంగా చేసుకొని వర్షాధార పంటలను విత్తుకోకూడదు. కంది పంటను, పత్తి, మొక్కజొన్న పంటల్లో అంతర పంటగా విత్తుకోవాలి. మొక్కజొన్న, జొన్న, సజ్జ, సోయాచిక్కుడు వంటి పంటలను బోదెలు, సాళ్ల పద్ధతిలో విత్తుకోవాలి. వరి సాగు చేసే పొలాల్లో తొలకరి వర్షాలను ఉపయోగించుకొని జనము, జీలుగను పచ్చిరొట్ట పైరుగా, ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాల్లో పెసరను పైరుగా లేదా పచ్చిరొట్టగా విత్తుకోవాలి. రైతులు తెలంగాణ సోన (ఆర్ఎన్ఆర్ 15048) వరి విత్తనాన్ని జూన్ నెలలో నారుమడి పోసుకోకూడదు. తేలికపాటి నేలల్లో పత్తి, సోయాచిక్కుడును వర్షాధార పంటలుగా సాగు చేయరాదు. దక్షిణ తెలంగాణ జిల్లాలో మొక్కజొన్న పంటను తేలికపాటి నేలల్లో వర్షాధార పంటగా సాగు చేయొద్దు. మధ్య కాలిక వరి రకాలను కిలో విత్తనానికి 1గ్రా. కార్బండజిమ్ లేదా1.5 గ్రా. మాంకోజెబ్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకొని నారుమళ్లు పోసుకోవాలి. పెసర, సోయాచిక్కుడు పంటలలో కిలో విత్తనానికి2.5గ్రా కార్బండజిమ్,30గ్రా కార్బోసల్ఫాన్ మందును కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.
కూరగాయలు: కూరగాయల పంటల్లో రసం పీల్చే పురుగులు గమనించినట్టయితే నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Authorization