పెరటి కోళ్లు అంటే పెరట్లో పెంచుకునే సాధారణ రకాలు. నాటు కోళ్లనూ పెరట్లోనే పెంచుతాం. అవి ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి. కాళ్లు బలంగా ధృడంగా ఉండి వేగంగా పరిగెత్తడానికి అనువుగా ఉంటాయి. అయితే వీటి ఉత్పాదక శక్తి తక్కువ. శరీర బరువు పుంజులు2.5 నుండి 3.5కిలోల వరకు, పెట్టలు1.5నుంచి 1.8 కిలోల వరకు తూగుతాయి. పెట్టలు సాధారణంగా సాలుకు 40నుంచి 50 గుడ్లు పెడతాయి. వీటిలో పొదిగే లక్షణం ఎక్కువ. వీటిని పురిపెట్టలంటారు. ఈ దేశవాలీ రకాలకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే కొక్కెర, మశూచి వంటి వ్యాధులు ప్రబలినప్పుడు మాత్రం 40 నుంచి 60శాతం మరణాలు సంభవిస్తాయి. ఈ దేశవాలీ కోళ్లు ఇళ్ల చుట్టుపక్కల తిరుగుతూ క్రిమి కీటకాలను తింటాయి. వంటగదిలో లభించే పదార్ధాలు, నూకలు, జొన్నలు, సజ్జలు వంటివి వీటికి వేస్తారు. సాధారణంగా 7నుంచి 8 నెలల వయసులో గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. పుంజులను మాంసం కొరకు, పందాల కొరకు, పెట్టలను గుడ్ల ఉత్పత్తికి, గుడ్లను పొదగటానికి చివరి దశలో మాంసం కొరకు పోషిస్తారు. ఈ విధంగా ఈ కోళ్ల నుంచి లభించే మాంసం, గుడ్లను సేంద్రియ పద్ధతిలో తయారైన మాంసం, గుడ్లుగా భావించవచ్చు. ఈ విధంగా ఉత్పత్తి అయిన మాంసం, గుడ్లలో ఎటువంటి క్రిమి సంహారకాలుగానీ, వాటి అవశేషాలుగానీ వుండవు. ఒక వేళ ఉన్నా చాలా తక్కువ మోతాదులో ఉండవచ్చు. కనుక ఈ మధ్య నాటుకోడి గుడ్లకు, నాటుకోడి మాంసానికి డిమాండ్ పెరుగుతోంది. అయితే నాటు కోళ్లను సంకరపర్చి, అభివృద్ధి పరిచి పెరటి పెంపకానికి అనువైన రకాలను పెరట్లో పెంచుకుంటే ఎక్కువ లాభసాటిగా ఉంటుంది. అభివృద్ధి చేసిన రకాల్లో మన రాష్ట్రంలో రూపొందించిన రకాలైన వనరాజా, గ్రామప్రియ, రాజశ్రీ, కృషిబ్రో ముఖ్యమైనవి. అభివృద్ధి పర్చిన రకాలు కూడా వివిధ రంగురంగు ఈకలతో ఆకర్షణీయంగా ఉంటాయి. వాటికి అనుకూల పరిస్థితులను తట్టుకునే శక్తి ఉంటుంది. దేశవాలీ కోడికంటే ఎక్కువ బరువు తూగుతాయి. గుడ్ల ఉత్పత్తి, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. ఇవిసాలుకు 160 నుంచి 180 గుడ్లు పెడతాయి. శరీర బరువు 3.5నుంచి 4.5కిలోల వరకు ఉంటాయి. ప్రథమంగా అయిదు నుంచి అయిదున్నర మాసాల వయసులో గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఈ కోళ్లకు గుడ్డు పొదుగు లక్షణం లేదు. కనుక ఈ కోళ్ల నుంచి వచ్చే గుడ్లను దేశీయ కోళ్లతో లేదా ఇంక్యుబేటర్‌లో పొదిగించాలి. ఈ విధంగా అభివృద్ధి పరిచిన కోళ్లు దేశవాలీ కోళ్ల మాదిరిగానే పెరట్లో తిరు గుతూ దొరికిన ఆహార పదార్ధాలను తింటాయి. రాత్రి వేళల్లోనూ ఇంటిలో లేదా ఒక కోళ్లగూటిలో కప్పి ఉంచవచ్చు.
పెరటి కోళ్ల పెంపకంలో మెలకువలు: నాటు కోళ్లు పొదిగిన సంరక్షణంతా తల్లికోడి చూసుకుంటుంది. అయితే ఇంక్యుబేటర్‌లో పొదిగిన గుడ్ల నుంచి లభించే పిల్లలను బ్రూడర్ కింద ఉంచి తగిన వేడి లభించేటట్టు చేయాలి. దీన్ని బ్రూడింగ్ అని అంటారు. దీని కొరకు 4 ఇంటు 3.5, ఇంటు 2.5 కొలతలతో అక్కడ లభించే ఎదురుబొంగులు, తడకలతో ఒక చిన్న వసతిని ఏర్పాటు చేసి దాని లోపల కరెంట్‌తో బ్రూడింగ్ వరకు కావాల్సిన వేడిమి లభించేలా బ్రూడర్ను ఏర్పాటు చేయాలి. ఈ విధంగా బ్రూడర్లో 4 వారాల వరకు కోడిపిల్లలకు రక్షణ కల్పించాలి. ఆ సమయంలో పిల్లలకు దాణాను, నీటికి అందించాలి. ఆ తరువాత పిల్లలను బయట తిరిగేందుకు వదలవచ్చు.
దాణా: నాటుకోళ్లకు ప్రత్యేకంగా దాణా అవసరం లేదు. అయితే అభివృద్ధి పరచిన రకాలను మాత్రం గుడ్లు పెట్టే దశలో సజ్జలు, జొన్నలు, రాగులు, నానబెట్టిన వేరుశనగ చెక్క కలిపి, 25 నుంచి 50 గ్రాముల వరకు అందించాలి. ఈ మోతాదు కోడి తిరుగాడే స్థలాన్ని బట్టి, ఆ స్థలంలో దొరికే గింజలు, మిగతా ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అలాగే అలిచిప్పల పొడి, సున్నపురాయిపొడి, మూడు నుంచి 4 గ్రాముల చొప్పున ప్రతి కోడికి, ప్రతి రోజూ అందిస్తే కోళ్లకు కావాల్సినంత కాల్షియం అందుతుంది. అవి ఇచ్చే గుడ్ల పెంకు నాణ్యత కలిగి ఉంటాయి. లేకపోతే కోళ్లు తోలుగుడ్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది.
వ్యాధులు : ఆరుబయట తిరిగే కోళ్లలో ముఖ్యంగా చెప్పుకోదగినది అంతర పరాన్నజీవుల బెడద. దీని నివారణకు ప్రతి 2 నెలలకొకసారి రివార్మింగ్ మందులను వాడాలి. దీని కొరకు మార్కెట్లో అల్బెండజోల్, పెన్బెండజోల్, ఎఫ్జోల్ వంటి మందులు లభిస్తాయి. వయసును బట్టి మందు మోతాదు మారుతూ ఉంటుంది. బాహ్యపరాన్న జీవులు అంటే పేలు కూడా కోళ్లలో ఎక్కువగానే కనిపిస్తాయి. వాటి నివారణకు కోళ్ల పాకలను పరిశుభ్రంగా ఉంచాలి. బ్యూటాక్స్ మందును నీళ్లలో కలిపి షెడ్లల్లో పిచికారి చేయాలి.
తాగేనీరు : రాత్రీ పగలూ తేడా లేకుండా అందుబాటులో ఉంచాలి.
వసతి : కోళ్లను రాత్రి సమయంలో కుక్కలు, పాములు, పిల్లులు వంటి వాటి నుంచి ఎండ, వాన, చలి నుంచి కాపాడే విధంగా ఏర్పాటు చేయాలి. ఈ విధంగా తగిన వసతి కల్పిస్తూ వయసును బట్టి టీకాలు ఇస్తూ దాణా లభించే ఏర్పాటు చేస్తే పెరట్లో పెంచుకునే అభివృద్ధి పరిచిన కోళ్ల ద్వారా అధిక ఉత్పత్తిని, ఆదాయాన్ని పొందవచ్చు.
Authorization