గడిచిన మూడు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 26 నుంచి 35 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణ్నోగతలు 22 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
సూచనలు
మొక్కజొన్న: మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు విషపు ఎర తయారు చేసుకోవడానికి గాను 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లంను కలిపి 2 నుంచి 3 లీటర్ల నీటిని చేర్చి సుమారు 24 గంటలపాటు పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రా. థైడికార్బ్‌ను కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి మొక్క సుడులలో వేసుకోవాలి ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా క్లోరాన్ట్రినిలిప్రోల్ 0.4 మి.లీ నీటిలో కలిపి పిచికారి చేయాలి.
వరి: వరి నారు మళ్లలో కార్యోప్యూరాన్ 3 జి గుళికలను 200 చ.మీ నారుమడికి (5 సెంట్లకు) ఒక కిలో చొప్పున నారుపీకే వారం రోజుల ముందు చల్లుకోవాలి. దోమపోటు ఉదృతి తగ్గించేందుకు ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ కాలిబాటను వదులుకొని తూర్పు పడమర దిశలలో వరుసలను ఉండే విధంగా వరినాట్లు వేసుకోవాలి.
పత్తి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు మొనోక్రొటోఫాస్ మందును లీటరు నీటిలో 1:4 నిష్పత్తిలో కలిపి లేత కాండంపై మొత్తని బ్రష్‌తో విత్తిన 30 రోజుల పైరుకు పూయాలి. అధిక వర్షాల నుంచి పంట కోలుకొని త్వరగా అభివృద్ధి చెందుటకు 10 గ్రా. పొటాషియం నైట్రేట్ లేదా 20 గ్రా. యూరియా లేదా 10 గ్రా. నీటిలో కరిగే ఎరువులైన 19:19:19ని లీటరు నీటిలో కలిపి పంటపై వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు పిచికారి చేయాలి.పత్తిలో పొగాకు లద్దె పురుగు లద్దె పురుగు ఆశించుటకు కూడా అనుకూలం. పురుగు గమనించినట్టయితే నివారణకు 1.5 గ్రా. థయోడికార్బ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
జొన్న: ప్రస్తుతం జొన్న పంటలో కాండం తొలుచు పురుగు, గింజ బూజు తెగులును గమనించడం జరిగింది. కనుక కింద సూచించిన యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే పురుగుల ఉధృతిని, తెగులును తగ్గించవచ్చు. కాండం తొలిచే పురుగు నివారణకు కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలు 4 కిలోల మొక్కల సుడిలలో వేసుకోవాలి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పూత, గింజకట్టే దశలో గింజ బూజు తెగులు ఆశించే అవకాశం ఉన్నందున తెగులు ఆశించే పరిస్థితులలో ప్రొపికొనజోల్ 1 మి.లీ లీటరు నీటికి కలిపి గింజ ఏర్పడే దశలో పిచికారి చేయాలి.
సజ్జ: సజ్జ పంటను తేనెబంక తెగులు, అగ్గితెగులు ఆశించినట్టు గుర్తించడం జరిగింది. మొక్కలు పుష్పించే దశలో మబ్బులతో కూడిన ఆకాశం, వర్షం గనుక పడినట్టయితే వర్షపు తుంపరలు తేనెబంక తెగులు వ్యాప్తికి దోహదపడతాయి. తేనెబంక తెగులు నివారణకు పైరు పూత దశలో కార్బండజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లజోల్ 0.6 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కూరగాయలు: కూరగాయ పంటలో రసం పీల్చే పురుగులు గమనించినట్టయితే నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. టమాట, వంగ మిరప నారుమళ్లు పోసుకోవాలి. నీటి వసతిగల ప్రాంతాలలో బెండ, చిక్కుడు వంటి తీగజాతి కూరగాయలను విత్తుకోవాలి.
Authorization