హైదరాబాద్: ప్రోస్టేట్ పెరగడాన్ని వైద్యపరంగా బీపీహెచ్ లేదా బెనిగన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లాసియాగా వ్యవహరిస్తుంటారు. వయసు మీద పడిన వారిలో హార్మోన్ల మార్పుల కారణంగా అతి సాధారణంగా కనిపించే సమస్య ఇది. నిరపాయమైనది బీపీహెచ్. అంటే ఇది క్యాన్సర్ కాదు. అలాగే ఇది క్యాన్సర్ కారకం కూడా కాదు. అయితే బీపీహెచ్, క్యాన్సర్ ఒకే సారి ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యక్తులను బట్టి బీపీహెచ్ లక్షణాలు కూడా మారుతుంటాయి. ప్రోస్టేట్ పెరగడం వల్ల కలిగే అసౌకర్యం, సమస్యలు దీర్ఘకాలంలో అధికమయ్యే అవకాశాలున్నాయి. బీపీహెచ్ వృద్ధి చెందడానికి ప్రధానంగా వయసు, కుటుంబ చరిత్ర, వైద్య పరమైన కారణాలు అంటే ఊబకాయం వంటివి కారణం కావొచ్చు.
వయసుతో పాటుగా ప్రోస్టేట్ ప్రధానంగా రెండు దశలను చూస్తుంది. మొదటిది యుక్తవయసులో కనిపిస్తుంది. ఈ వయసులో ప్రోస్టేట్ రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. రెండవ దశలో ఈ వృద్ధి అనేది 25 ఏళ్ల వయసులో ప్రారంభమై జీవితాంతం ఉంటుంది. బీపీహెచ్ సాధారణంగా ఈ రెండవ దశలోనే వృద్ధి చెందుతుంది. ప్రోస్టేట్ పెరిగితే, మూత్రాశయంలో అవరోధాలు ఏర్పడి, తరచుగా మూత్రం పోయాల్సి రావడం, మూత్రం సరిగా రాకపోవడం, మూత్రం పలుమార్లు ఆపి ఆపి పోయాల్సి రావడం తదితర సమస్యలు రావొచ్చు. డాక్టర్ సీ రవీందర్ రెడ్డి, కన్సల్టెంట్ యురాలజిస్ట్, ఈఎస్ఐ హాస్పిటల్ మాట్లాడుతూ ‘‘ ఆశ్చర్యకరంగా ఇది అత్యంత సహజమైన పరిస్థితి. 50–60 సంంవత్సరాలు దాటిన సగం మందికి పైగా పురుషులలో ఈ స్థితి కనిపిస్తుంది.80 ఏళ్లు వచ్చేసరికి 90% మంది పురుషులకు బీపీహెచ్ వస్తుంది. చాలామంది ఇది వయసుతో పాటుగా వచ్చే సమస్యగానే భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే తరచుగా వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి రావడమనే సమస్య అకస్మాత్తుగా పెరిగినప్పుడే దానిని సమస్యగా పరిగణిస్తుంటారు’’ అని అన్నారు.
డాక్టర్ సీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బీపీహెచ్, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ దీనికి మూల కారణాలను మాత్రం మీ డాక్టర్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మీకు కనిపిస్తున్న లక్షణాలు స్వల్ప, మోస్తరు, తీవ్రమైనా సరే డాక్టరును సంప్రదించి, మీకు తగిన చికిత్సావకాశాలను పొందాల్సి ఉంది. బీపీహెచ్ నిర్వహించడానికి అతి సులభమైన జీవనశైలి మార్పులను చేసుకుంటే సరిపోతుంది. చురుగ్గా ఉండటం, బాత్రూమ్కు వెళ్లినప్పుడల్లా మూత్రాశయం ఖాళీ చేసుకునే ప్రయత్నం చేయడం, మీకు మూత్రం వస్తున్నా, రాకున్నా ప్రతి రోజూ నిర్థిష్ట సమయాలలో మూత్రం పోసేందుకు ప్రయత్నించడం, మద్య పానాన్ని పరిమితం చేసుకోవడం, రాత్రి 8 గంటల తరువాత ద్రవాహారం తీసుకోవడం మానివేయడం వంటివి చేస్తే సమస్యను కొంత మేర పరిష్కరించుకోవచ్చు.
తీవ్రమైన కేసులలో ప్రోస్టేట్ పెరగడం వల్ల మూత్రం రాకుండా ఆగిపోవచ్చు. దీనివల్ల మూత్రపిండాలు విఫలం కావొచ్చు. దీనికి తక్షణమే చికిత్స చేయాల్సి ఉంటుంది. కనుక లక్షణాలు కనబడితే తక్షణమే నిర్థారణ పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స పొందడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
Authorization