జంగిటి వెంకటేష్:
ఫూలే కలలు కన్న సమానత్వం రావాలన్నా.. బహుజనులు రాజకీయ అధికారం పొందాలన్నా, కులాధిపత్యాన్ని తరిమి కొట్టడమే ఏకైక పరిష్కారం. అప్పుడే తరతరాలుగా అణచివేతకు గురవుతూ వస్తున్న అణగారిన వర్గాలు విద్యావంతులై.. అధికారంలో భాగస్వాములై సమాజంలో సమానత్వాన్ని పొందగలుగుతారు. మేధావులు ఈ బాధ్యతను తమ భుజాలపై మోయాల్సిన అవసరం ఉంది. ఊకదంపుడు ఉపన్యాసాలతో సరిపెట్టడం కాదు.. ఈ అసమానతలను కూల్చడానికి, వెనుకబడిన వర్గాలను విద్యావంతులుగా మార్చడానికి ఫూలే పడ్డ కష్టాలు.. ఆయన త్యాగాల స్ఫూర్తిని నేటి తరానికి అందించాలి. ఫూలే అంటే ఓ యుద్ధమని గుర్తించాలి. ఆ యుద్ధాన్ని కొనసాగించాలి. అదే ఆయనకు నిజమైన నివాళి.
మహాత్మా జ్యోతిరావు ఫూలే ఒక జ్వాల.. చీకటిని తరిమే వెలుతురు. తొలితరం సామాజిక శాస్త్రవేత్త. కొలిమిలో కాలిపోతున్న జీవితాలను నిప్పు కణాలుగా మార్చిన యోధుడు. సామాజిక అసమానతల్లో నలిగిపోతున్న బతుకుల్లో విద్య ద్వారా కొత్త వెలుగులు నింపిన మహానీయుడు. అగ్రవర్ణాల ఎదురుగా నిల్చోవడానికే సాహసించని జాతిలో పుట్టిన ఆ వీర కిశోరం.. తరతరాలుగా తమను అణచివేస్తూ.. చదువుకోకుండా అడుగడుగునా కుట్రలు.. కుటిల యత్నాలు సాగించిన కులాధిపత్యాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు తన జాతిని అక్షరాస్యులుగా మలిచిన వైతాళికుడు. దేవుడు.. దెయ్యాల పేరిట అమాయకులను భయం గుప్పిట్లోకి నెట్టి వారి కష్టాన్ని దిగమింగే పరాన్నభుక్కులైన అగ్రవర్ణ ఆధిపత్య కులాలు శూద్రులు, అతిశూద్రులుగా పిలవబడే వెనుకవేయబడ్డ కులాలు.. దళితులనే అణచివేయబడ్డ వర్గాలను తమ బానిసలుగా మార్చుకున్న తీరును ఫూలే తన కండ్లారా చూశారు. బ్రిటీష్ పాలకులు మనదేశాన్ని ఆక్రమించే వరకూ అప్పటి రాజ్యాలలో రాజులను మాయమాటలతో తమ గుప్పిట్లో పెట్టుకుని రాజులు తమ ఆదేశానుసారమే పాలన సాగించేలా చేసింది బ్రాహ్మణవాదం. జ్యోతిరావు ఫూలే కాలం నాటికి దేశంలో ఇదే పరిస్థితి కొనసాగింది. అంటే ఇప్పుడు కొనసాగడం లేదని కాదు. బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలాన్ని సమాజం నుండి పారదోలేం దుకు.. తన జాతిని చైతన్యవంతంగా తీర్చిదిద్దేందుకు.. తన జీవితాన్నే ధారపోసిన త్యాగధనుడు ఫూలే. ఆ యోధుడు సాగించిన పోరాటాన్ని... బహుజనులను అక్షరాస్యులుగా.. చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు సాగించిన కషిని ఆ తరువాతి తరాలకు తెలియకుండా తొక్కిపెట్టడం ద్వారా ఆధిపత్య శక్తులు ఈ జాతికి మరోసారి అన్యాయం తలపెట్టాయి. ఫూలే ఎవరో కూడా తెలియకుండా ఉండేందుకు అనేక కుట్రలు పన్నారు. ఈ కారణంగానే ఫూలే సాగించిన పోరాటం తోనే తమకు విద్యా జ్ఞానం అందిందనే అక్షర సత్యాన్ని మనలో చాలామంది గ్రహించలేకపోయారు. అంతేకా దు ఏ ఆధిపత్యాన్ని ఫూలే ఎదురించాడో.. ఆ ఆధిపత్య శక్తుల పాదాల కిందే బహుజనులు నలిగిపోవడం అత్యంత దురదష్టకరం. ఆ మహాయోధుడు నడిపించిన పోరాట మార్గంలో బహుజనులు అడుగులు వేసినట్లయితే ఎప్పుడో ఈ కులాధిపత్యానికి నూకలు చెల్లి ఉండేవి. కానీ... నేటికీ కులం, మతం కర్మకాండలు.. పూజలు.. వ్రతాలు.. పెండ్లిల్లు మొదలైన ఆచార వ్యవహారాలతో బహుజనులను చైతన్యరహితులుగా మార్చి తమ పాదాలకింద నలిపేస్తోంది ఈ ఆధిపత్య భావజాలం. ఈ కుతంత్రాల కారణంగానే దేశంలో 85 శాతంగా ఉన్న బహుజనులు నేటికీ వంద శాతం అక్షరాస్యతకు చేరుకోలేక పోయారు. దేశానికి సంపదను అందిస్తూ కడుపునిండా తిండికి నోచుకోలేక ఆగర్భ దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతోంది ఈ జాతి. రాజ్యాంగం కల్పించిన అనేక హక్కులు కూడా ఈ జాతికి పూర్తిగా తెలియదంటే అతిశయోక్తి కాదు. కానీ.. ఇది నిజం. దేశానికి ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి సైతం గర్భగుడిలోకి అడుగు పెట్టేందుకు గజగజ వణికిపోయే పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది హైందవ సంస్కృతి. నేటి హైటెక్ యుగంలో కూడా కొత్త ఇంట్లో అడుగుపెట్టాలన్నా.. కత్రిమ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపాలన్నా.. ఓ ఆడా, మగా జంటగా మారాలన్నా.. భారసాల జరపాలన్నా.. పుట్టిన గుడ్డుకు పేరు పెట్టాలన్నా.. చివరకు ఆస్పత్రిలో డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నా ముహుర్తాలు పెట్టాల్సిందే. పూజలు.. పునస్కారాలు చేయాల్సిందే. ఈ పూజల వల్ల జనాలకు ఎటువంటి ప్రయోజనాలు ఒనగూరవు.. చరిత్రలో ఎక్కడా మేలు జరిగిన దాఖలాలు లేవు. ఉండవు కూడా. ఫూలే కలలు కన్న సమానత్వం రావాలన్నా.. బహుజనులు రాజకీయ అధికారం పొందాలన్నా, కులాధిపత్యాన్ని తరిమి కొట్టడమే ఏకైక పరిష్కారం. అప్పుడే తరతరాలుగా అణచివేతకు గురవుతూ వస్తున్న అణగారిన వర్గాలు విద్యావంతులై.. అధికారంలో భాగస్వాములై సమాజంలో సమానత్వాన్ని పొందగలుగుతారు. మేధావులు ఈ బాధ్యతను తమ భుజాలపై మోయాల్సిన అవసరం ఉంది. ఊకదంపుడు ఉపన్యాసాలతో సరిపెట్టడం కాదు.. ఈ అసమానతలను కూల్చడానికి, వెనుకబడిన వర్గాలను విద్యావంతులుగా మార్చడానికి ఫూలే పడ్డ కష్టాలు.. ఆయన త్యాగాల స్ఫూర్తిని నేటి తరానికి అందించాలి. నేడు బడుగులు ఈమాత్రం విద్యావంతులై స్థానాలకు చేరుకోవడం ఫూలే సాగించిన పోరాటాల ఫలితమే. కేవలం ఫూలే జయంతులు.. వర్ధంతుల సమయాల్లో విగ్రహాలకు దండలు వేసి.. దండాలు పెట్టి.. నినాదాలు చేసి.. ఆ తరువాత యథావిధిగా గుళ్లకు వెళ్లి రాతిబొమ్మలకు..పనిలో పనిగా పూజారుల కాళ్లకు దండాలు పెట్టే విధానాన్ని మార్చుకోవాలి. ఫూలే అంటే ఓ యుద్ధమని గుర్తించాలి. ఆ యుద్ధాన్ని కొనసాగించాలి. అదే ఆయనకు నిజమైన నివాళి.
సెల్ : 9052889696
Authorization