చందుపట్ల రమణ కుమార్ రెడ్డి
కులాలతో సంబంధం లేకుండా వైవాహిక బంధాలను పెనవేసుకున్న యువ ప్రేమికుల గురించి గతంలో విన్నాం, వింటున్నాం, వింటూనే ఉంటాం. అందులో పెద్దగా ఆశ్చర్య పడేదేమీ లేదు. రొటీన్‌కు భిన్నంగా కులాల ప్రసక్తి లేకుండా పెద్దలు కుదిర్చిన పెండ్లీలు ఈ మధ్యకాలంలో విరివిగా తారసపడటం ముదావహం. ముఖ్యంగా దశాబ్దాలుగా సమాజంలో అగ్రవర్ణాలుగా పిలవబడుతున్న వైశ్య, వెలమ, బ్రాహ్మణ, రెడ్డీ లాంటి కులస్తులు అన్యకులస్తులను తమ జీవితాలలోకి స్వచ్ఛందంగా ఆహ్వానిస్తుండటం, అక్కడక్కడా ఆయా కులసంఘాలే ఇతర కులాలతో వివాహ సంబంధాలను ఆమోదిస్తున్నామని తీర్మానించడం మహాత్ములు కలలుగన్న కులరహిత సమాజం దిశలో దేశం అడుగులు వేస్తుందనటానికి నిదర్శనం. కారణాలేమైనా కావచ్చు ఇది మాత్రం మంచి పరిణామమే అని చెప్పుకోవడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. కాపు, రెడ్డి కులాల మధ్య ఇంతకు ముందు ప్రేమ వివాహాలు మాత్రమే కనిపించేవి. కాని ఇప్పుడు పెద్దలు కుదిర్చిన సంబంధాల్లోనూ కుల రహిత వివాహాలు విరివిగా కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అంటీముట్టనట్టున్న రెడ్డి, గాండ్ల రెడ్డి కులస్తులు రాబోవు రోజుల్లో పూర్తిస్తాయి రెడ్డి కులస్తులుగా ఏకమైనా ఆశ్చర్యం లేదు. ఒకప్పుడు గోనె కాపు, చిట్టి కాపు, కొత్త కాపు అంటూ గిరిగీసుకున్న రెడ్డి కులస్తులు ఇప్పుడు కట్టుబాట్ల గోడలను దాదాపుగా కూలగొట్టిండ్రనే చెప్పవచ్చు. జనాభాలో అతి తక్కువగా ఉన్నా ప్రత్యేకంగా ఉండే వెలమ కులస్తులు కూడా ఇతర కులస్తులు ముఖ్యంగా రెడ్డి, కాపు, ఎల్లాపి, కమ్మ కులస్తుల నుండి వైవాహిక సంబంధాలను ఆహ్వాని స్తున్నారు. ఇంతకాలం కట్టుబాట్ల కట్టడిలో గిరిగీసుకుని గడిపిన కోమట్లు, వైశ్యులు మారిన పరిస్థితులకనుకూలంగా ఇతర కులస్తులతో వివాహ సంబంధాలను ఏర్పరచు కోవడం ఈ మధ్య చూస్తున్నాం. బ్రాహ్మణ సమాజం కూడా బ్రాహ్మ ణేతరులతో వైవాహిక బంధాలను ఆహ్వానిస్తుండటం హర్షణీయం.
చరిత్రను పరిశీలిస్తే అప్పుడెప్పుడో త్రిపురనేని రామస్వామి చౌదరి బ్రాహ్మణ, కమ్మ వర్ణాల మద్య వైవాహిక బంధాలను ప్రోత్సహించినట్టు చరిత్రలో చదువుకున్నాం. ఆ తరువాతి పరిణామక్రమంలో కులాల మధ్య ఎడబాటు విపరీతంగా పెరిగిపోయిందనేది వాస్తవం. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన కుటుంబాలలో రెండు దశాబ్దాల కిందటే మొదలైన ఈ నిశ్శబ్ద విప్లవం ఇప్పుడు పేద, మధ్యతరగతి వర్గాలను కూడా ప్రభావితం చేస్తున్నది. ముఖ్యంగా కట్టుబాట్లనే చక్రబంధనాలలో గిరిగీసుకుని ఆలోచించే మధ్యతరగతి కుటుంబాలు స్వచ్ఛందంగా, ధైర్యంగా ముందుకు రావడం శుభ సూచకం. పెరిగిన విద్యాధికుల సంఖ్య కావచ్చు, వర్గ భేదాలతో సంబంధం లేకుండా ప్రతిభ ఆధారంగా వృద్ధిలోకొస్తున్న కొత్తతరం తీరు కావచ్చు, సామాజిక మాధ్యమాల ద్వారా పెరిగిన సామాజిక స్పహ కావచ్చు, తరిగిపోతున్న ఆడపిల్లల సంఖ్య కావచ్చు. కారణాలేమైనా కులాల గోడలు మెల్లిమెల్లిగా కూలిపోతున్నాయనడానికి సాక్షాలెన్నో.
అక్కడక్కడా కులరక్కసి కాటువేసిందన్న కథనాలు వెలువడుతున్నా అందులో చాలా సందర్భాలలో కులంకన్నా ఆర్థిక అంతరాలే ప్రధాన పాత్ర పోషించాయన్నది వెలుగులోకి వస్తున నిజం. కులాంతర వివాహాల గురించి ప్రత్యేకంగా చర్చించుకునే స్థితి నుండి కులాంతర వివాహాలను సహదయంతో ఆహ్వానించే స్థితికి చేరుకోవడం మన సమాజం ముఖ్యంగా నేటి తరం సాధించిన ఘనత అనే చెప్పుకోవాలి. ఏది ఏమైనా రాబోయే దశాబ్దంలో కులాల ప్రసక్తి లేకుండా ముందుకు సాగే కొత్త తరాన్ని మనం చూడబోతున్నామన్నది వాస్తవం.
సెల్ : 9440449392
Authorization