వైజ్ఞానేంద్రప్రసాద్
నేను గుర్తున్నానా తాతయ్య... అదే తాతయ్య నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో హన్మకొండ మాది. మా అమ్మానాన్నలు జగన్, రచన. ఇలా చెబితే మీకు గుర్తుకు రాదులే తాతయ్య. నాలుగున్నర కోట్ల మందిలో వాళ్లు ఓ సాధారణ కుటుంబానికి చెందినవారు. మీరెలా గుర్తు పడుతారు. హన్మకొండలో 9 నెలల పాపపై ఓ యువకుడు లైంగికదాడి చేసి చంపేశాడని రాష్ట్రమంతా సంచలనమైంది గుర్తుందా. ఆ ఘటనలో అభంశుభం తెలియని బాధితురాలిని తాతయ్య.. ఇప్పటికైనా గుర్తుకొచ్చిందా...? ఒకవేళ గుర్తుంచుకుంటే నా దురదృష్టమే అనుకుంటా తాతయ్య... ఎందుకంటే నా గురించి ఇంత నీచంగా పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు...
బంగారు తెలంగాణ చేయాలని మీరు కలలుగంటున్నారని 9 నెలలుగా విన్నా.. అంటే ఏంటి తాతయ్య...? చిన్నపిల్లలకు కూడా రక్షణ లేకపోవడమేనా...? అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని వయస్సు తాతయ్య నాది. ఇంత వరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నన్ను చాలా బాధపెడుతోంది తాతయ్య. వాడిని శిక్షిస్తే నేనేదో మళ్లీ బతుకుతానన్న ఆశ కాదు తాతయ్య. నా చెల్లెళ్లు, అక్కలు ఎవరూ నా బాధను అనుభవించొద్దన్న స్వార్థం తాతయ్య నాది. నా ఘటనకు కొద్ది రోజుల ముందే హాజీపూర్‌లో కూడా జరిగింది. వాడిని ఏం చేశారు తాతయ్య. నాలుగురోజులు హడావుడి చేసి వదిలేయడమేనా...? ఎంత పెద్ద తప్పు చేసినా శిక్షించకుండా రక్షించడమేనా తాతయ్య... ఎందుకు తాతయ్య ఇంత నిర్లక్ష్యం మీకు...?
అయినా మిమ్మల్ని ఎన్నుకున్నది తెలంగాణ ప్రజలు కదా తాతయ్య. మరి మీకెందుకు ఆంధ్ర మీద అంత ప్రేమ. 'తెలంగాణను సర్వనాశనం చేసిన దుర్మార్గుడు రాజశేఖర్‌రెడ్డి' అని మీరు ఏదో మీటింగులో అంటే... మా నాన్న యూట్యూబ్‌లో చూస్తుంటే విన్న. మరి అతని కొడుకుపై ఉన్న ప్రేమ ఓట్లేసి గెలిపించిన మా అమ్మానాన్న మీద ఎందుకు లేదు తాతయ్య...? మీరు ఆయన్ని కలిసినప్పుడల్లా హత్తుకుంటుంటే నాకు చాలా బాధేస్తుంది తాతయ్య.
పూర్తికాని కాళేశ్వరం ప్రారంభం మీద ఉన్న శ్రద్ధ పిట్టల్లా రాలుతున్న ఆడపిల్లల బతుకుల మీద ఎందుకు లేదు తాతయ్య?. వాస్తు లేదని, నీ కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే కొత్త సచివాలయం కట్టాలని చెప్పిన జోతిష్యుడు... ఆడపిల్లలు, మహిళలు బాధపడితే రాష్ట్రం సంతోషంగా ఉండదని చెప్పలేదా తాతయ్య. ఇదే నీ మనుమరాలికి జరిగితే ఊరుకునేవాడివా తాతయ్య?. ఫాం హౌస్ నుంచి ప్రగతి భవన్‌కు రాకముందే శిక్షించేవాడివి కాదా తాతయ్య. మరి మేమంటే ఎందుకు తాతయ్య అంత చిన్నచూపు...?
మీరేదనుకున్నా క్షణాల్లో పనులు జరిగిపోతారు... మరి పేదలంటే అంత అలుసెందుకు తాతయ్య. ఒక్క రోజులో మంత్రివర్గ ఆమోదాలు వస్తాయి, జీవోలు జారీ అవుతాయి, భూమి పూజలవుతాయి, ప్రతిపక్ష పార్టీలు విలీనం అవుతాయి. మరి పేదోళ్ల మీద జరిగిన అఘాయిత్యాలకు పరిష్కారాలు ఎందుకు తాతయ్య ఏండ్లకేండ్లు పడతాయి. మీ పార్టీ కార్యాలయాలకు అప్పనంగా ప్రభుత్వ భూములు కట్టబెట్టే మీరు... డబుల్ బెడ్ రూంలు ఎందుకు కడతలేరు తాతయ్య. ప్రాజెక్టులు పూర్తి చేసి కోటి ఎకరాల మాగాణి చేస్తానని హామీలు ఇస్తున్నారు... మరి ఆ ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన నిర్వాసితుల పట్ల ఎందుకు తాతయ్య అంత చిన్నచూపు.
మీరు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడే నేను ప్రపంచాన్ని వినడం, చూడటం నేర్చుకుంటున్న. అప్పుడు చాలా సంతోషం అనిపించింది తాతయ్య.... మీరు గెలిచారని మా అమ్మనాన్న సంబురాలు చేసుకుంటుంటే. కానీ ఆర్నెళ్లు తిరగకముందే మీరు గెలిచినా... మాకు రక్షణ లేదని తెలిసింది తాతయ్య. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రక్షణ లేకపోలే ఎలా తాతయ్య. నాకు నిజంగా తెల్వకనే అడుతున్నా... నిన్నగాక మొన్న జరిగిన సార్సాల దాడిలో తప్పెవరిది తాతయ్య. మీది కాదా. రైతుల పక్షాన నిలిచి మహిళా అధికారిపై దాడి చేసినందుకు కృష్ణారావును రాజీనామా చేయించి మంచి పని చేశారు. వందల ఏండ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనుల భూముల్లోకి అటవీ అధికారులను పంపిన మీకు ఏ శిక్ష వేసుకున్నారు తాతయ్య. మీ ఆదేశాలతో వచ్చిన అధికారులపై... మీ అండతో టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడికి ప్రధాన ముద్దాయి మీరే కదా తాతయ్య. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో తాతయ్య... ఎన్నికలప్పుడే కాకుండా మామూలు సమయంలో కూడా బయటికొచ్చి చూడు తాతయ్య... అంత టైం లేదనుకుంటా మీకు. సరే తాతయ్య ఉంటా మరి. నాకు అక్కడి కంటే ఇక్కడే బాగుంది. బై బై తాతయ్య...
ఇట్లు
- ఎప్పటికీ ఈ లోకంలోకి రాని, రావాలని కోరుకోని చిన్నారి
సెల్ : 9618068673
Authorization