ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా తెలియని సముద్ర ప్రయాణం అనుక్షణం సవాల్ విసురుతూనే ఉంటుంది. అటువంటి సముద్రంపై దేశ రక్షణ కోసం సైనిక దళాలు చేసిన సాహసోపేత పోరాటాలకు, అనుకోకుండా సముద్రంలో చిక్కుకుపోయి మనుగడ కోసం పోరాటం చేసిన సాధారణ మనుషుల జీవితాలకు వెండితెర రూపంగా ఎన్నో చిత్రాలొచ్చి ఆదరణ పొందాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ జీవితం విలువను తెలియజేసే కొన్ని సాహసోపేత సముద్ర నేపథ్య చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ 'షో'..
ఆల్ ఈజ్ లాస్ట్
సముద్రంలో సంభవించిన అల్లకల్లోలం కారణంగా ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ నావికుడి షిప్ తునాతునకలై పోతుంది. అన్ని కోల్పోయిన ఆ నావికుడు సముద్రం నుంచి బయటపడేందుకు చేసే పోరాట నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు జె.సి. చండోర్ తెరకెక్కించారు. ఇందులో కొన్ని మాత్రమే డైలాగ్స్ ఉంటాయి, మిగతాదంతా నావికుడు మనుగడ కోసం చేసే సాహసమే ఉంటుంది. నావికుడిగా రాబర్ట్ రెడ్ఫోర్డ్ నటన ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. 2013లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలూ పొందింది.
డీప్ బ్లూ సీ
అల్జీమర్ డిసీజ్‌ని నయం చేసేందుకు కొంత మంది శాస్త్రవేత్తల బృందం సముద్ర గర్భంలో పరిశోధన చేస్తుంటుంది. ఈ తరుణంలో వెంటాడుతున్న ఓ పెద్ద షార్క్ చేప బారి నుంచి ఈ బృందం ఎలా బయట పడిందనేదే అసలు కథ. రెన్నీ హర్లిన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ హర్రర్ 1999లో విడుదలై 165 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది.
స్పియర్
సముద్రానికి వెయ్యి అడుగుల లోతులో నేవీ అధికారులు, ఓ పరిశోధక బృందం గోళం ఆకారంలో ఉన్న ఒక షిప్ స్పియర్‌ను కనిపెడతారు. అదొక అద్భుతమైన ఆవిష్కరణ. దాన్ని ఎవరు తయారు చేశారు?, ఎందుకు తయారు చేశారు?, అందులో ఉన్న మర్మమేంటనేది మిస్టరీ. ఆ మిస్టరీని ఛేదించేందుకు శాస్త్రవేత్తలు సముద్రంలో చేసిన పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. బారీ లెవిన్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1998లో విడుదలైంది.
ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ రష్యా మోస్ట్ అడ్వాన్డ్స్ న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ను తయారు చేస్తుంది. సముద్రగర్భ రక్షణ వ్యవస్థలోనే అదొక విప్లవాత్మకమైన చోదక వ్యవస్థ. సముద్రంలో అనుకోకుండా అమెరికా సబ్‌మెరైన్, రష్యా సబ్‌మెరైన్ ఒకదానికొకటి ఎదురుపడతాయి. దీంతో నియంత్రణ రేఖల వద్ద యుద్ధ వాతావరణం నెలకొంటుంది. రష్యా సబ్‌మెరైన్ కెప్టెన్, యుఎస్ సబ్‌మెరైన్ కెప్టెన్ తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయనేది ఈ సినిమా. కోల్డ్‌వార్‌గా చెప్పుకునే ఈ యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు జాన్ మెక్ టెర్నాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. 1990లో విడుదలైన ఈ చిత్రం 30మిలియన్ డాలర్లతో తెరకెక్కి 200మిలియన్ డాలర్లను వసూలు చేసింది. సౌండ్ ఎడిటింగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును దక్కించుకుంది.
క్రిమ్స్న్ టైడ్
రష్యా సమాఖ్యలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో అమెరికా, జపాన్ న్యూక్లియర్ మిసైల్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంటారు. ఈ సమయంలో అమెరికా న్యూక్లియర్ మిసైల్స్ సబ్ మెరైన్‌లోకి కొత్తగా వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు, కమాండింగ్ ఆఫీసర్‌కు మధ్య జరిగిన ఘర్షణ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనేది సినిమా. టోనీ స్కాట్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1995లో విడుదలై 3 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది.
53 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 164 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
మాస్టర్ అండ్ కమాండర్
దక్షిణ అమెరికాకు చెందిన నౌకలు తమ షిప్‌పై దాడి చేయడంతో తన షిప్‌ను, తమ బృందాన్ని కాపాడేందుకు, అదే సమయంలో ప్రత్యర్థులను తెలివితో ఓడించేందుకు ఓ బ్రిటన్ షిప్ కెప్టెన్ చేసిన పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. పీటర్ వెయిర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. 150 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 212 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. విజువల్‌గా మంత్రముగ్దుల్ని చేసే ఈ చిత్రం సినిమాటోగ్రఫీ, సౌండ్ ఎడిటింగ్ విభాగంలో ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది.
టైటానిక్
1912లో జరిగిన టైటానిక్ షిప్ ప్రమాద నేపథ్యంలో దర్శకుడు జేమ్స్ కామెరూన్ 1997లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. షిప్లో చోటు చేసుకున్న విషాదభరిత ప్రేమ కథా చిత్రంగా సినీ చరిత్రలో నిలిచిపోయింది. ఈ చిత్రం దాదాపు 220 కోట్ల డాలర్లకుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు ఏకంగా 11 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక ఆస్కార్లను గెల్చుకున్న రెండో చిత్రమిది.
యు-571
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఓ వైపు భూభాగంపై జర్మన్, అమెరికా కూటముల మధ్య యుద్ధం జరుగుతుంటుంది. మరోవైపు సముద్రంలోనూ అమెరికా సబ్‌మెరైన్ జర్మన్ బార్డర్‌ను క్రాస్ చేస్తుంది. దీంతో జరిగిన దాడిలో అమెరికాకు చెందిన యు సబ్‌మెరైన్ ఎక్కువ శాతం డ్యామేజ్ అవుతుంది. మనుగడ కోసం అందులోని సైనిక దళాలు చేసిన పోరాటమే ఈ చిత్రం. జోనాథన్ మోసోవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2000లో విడుదలై సౌండ్ ఎడిటింగ్‌లో ఆస్కార్ అందుకుంది. విశేష ఆదరణతో 127 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది.
ది పర్ఫెక్ట్ స్టార్మ్
1991 అక్టోబర్‌లో జరిగిన సంఘటన నేపథ్యంలో సెబాస్టియన్ జంగర్ రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. సముద్రంలో సంభంవించిన మృత్యు తుపాన్ కారణంగా ఓ కమర్షియల్ ఫిషర్ బోట్ మునిగిపోతుంది.అందులోని వారిని కాపాడేందుకు వచ్చిన రక్షణదళ హెలికాప్టర్ సైతం తుపాన్ ధాటికి సముద్రంలో కూలిపోతుంది.అత్యంత విషాదకరమైన ఈ ఇతివృత్తం ఆధారంగా వోల్ఫ్‌గంగ్ పీటర్సన్ 2000లో ఈ చిత్రాన్ని రూపొందించారు.
వైట్ స్క్వాల్
స్టడీలో భాగంగా ప్రాక్టికల్ ప్రాక్టీస్ కోసం కాలేజ్ విద్యార్థులు ఓడలో సముద్ర ప్రయాణం చేస్తున్న క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్న ఆటుపోట్లు ఏంటదనేదే ఈ చిత్ర కథ. రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1996లో విడుదలై మంచి విజయం సాధించింది. కమర్షియల్గానూ సత్తా చాటింది.
వాటర్ వరల్డ్
ధృవ భాగంలో ఉన్న భారీ మంచు పర్వతాలు కరిగిపోవడంతో భూమి మొత్తం నీటితో మునిగిపోతుంది. దీంతో మనుగడ సాధించడం కోసం జనం పోరాడుతున్న క్రమంలో ఓ చోట చిన్న దీవి కనిపిస్తుంది. దాని కోసం రాక్షస జాతి, మనుషులు చేసే పోరాటమే ఈ చిత్రం. సముద్రంపై జీవనం, మట్టి కోసం పోరాటం చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కెవిన్ రేనాల్డ్స్ రూపొందిన ఈ చిత్రం 1995లో విడుదలై 264 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
కె-19: ది విడో మేకర్
సోవియట్ రష్యా తొలిసారి తయారు చేసిన న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ను ప్రయోగ నిమిత్తం సముద్రంలోకి పంపిస్తుంది. కానీ సబ్‌మెరైన్‌లో చోటు చేసుకున్న లోపాల వల్ల ఆ సబ్‌మెరైన్ పేలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం జరగకుండా ఉండటం కోసం అందులోని టీమ్ చేసే పోరాటమే ఈ చిత్రం. 2002లో విడుదలైన ఈ చిత్రాన్ని కేథరిన్ బిజిలో రూపొందించారు.
ఓపెన్ వాటర్
ఓ నవదంపతుల జంట హాలీడేస్‌లో భాగంగా ఓ రోజు స్యూబా డ్రైవింగ్ ట్రిప్‌ను ఎంజారు చేయాలను కుంటున్నారు. బోట్లో సముద్రం లోపలికి వెళ్తారు. ఈ ఇద్దరూ సముద్రంలోకి దూకి స్యూబా డ్రైవ్ చేసి వచ్చాక చూస్తే బోట్ మాయమవుతుంది. వీరిని పసిగట్టిన ఓ షార్క్ చేప దాడి చేసేందుకు వస్తుంటుంది. మరి ఆ షార్క్ నుంచి ఎలా తప్పించుకున్నారు. సముద్రం నుంచి ఎలా బయటపడ్డారనేది సినిమా. యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు క్రిస్ కెంటిన్ 2003లో
ఈ చిత్రాన్ని రూపొందించారు.
కాన్ టికి
నార్వేకు చెందిన అన్వేషకుడు థోర్ ఐదుగురితో కలిసి
బోట్లో పసిఫిక్ సముద్రంలో ప్రయాణిస్తుంటాడు.
ఈ క్రమంలో ఎదురైన బాల్సావుడ్ అలను తప్పించుకుంటారు. ఆ తర్వాత షార్క్ చేప దాడిని ఎదుర్కొంటారు. ఇలా 101 రోజులపాటు 8వేల కిలోమీటర్లు ప్రయాణించి పాలినేషియన్ దీవికి చేరుకుంటారు. 1947లో అత్యంత సాహసోపేతంగా సాగిన నిజమైన యాత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. జోచిం రెన్నింగ్, ఎస్పెన్ సాండ్బర్గ్ సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2012లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది.
ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన నార్వే చిత్రంగా నిలిచింది. అంతేకాదు విదేశీ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఇందులో థోర్ పాత్రలో పాల్ సువర్ వాల్మీం హెగెన్ నటించారు.
కెప్టెన్ ఫిలిప్స్
2009లో సోమాలియా సముద్ర దొంగలతో హైజాక్ చేయబడిన అమెరికా వ్యాపార నౌకను కాపాడిన కెప్టెన్ రిచర్డ్ ఫిలిప్స్ జీవితం ఆధారంగా 2013లో దర్శకుడు పాల్ గ్రీన్ గ్రాస్ రూపొందించిన చిత్రమిది. కెప్టెన్ రిచర్డ్ పాత్రలో టామ్ హాంక్స్ నటించిన ఈ చిత్రం దాదాపు 22కోట్ల డాలర్లు వసూలు చేయడంతోపాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది.
Authorization