ప్రపంచ సినిమాల్లో ఇరానియన్ చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉంది. వాస్తవికతకు దగ్గరగా,
అత్యంత సహజంగా ఉండటమే ఇందుకు కారణం. కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాలు, అనుబంధాలు, భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఇరానియన్ సినిమాలు వాటికవే సాటి.ఈ చిత్రాల స్ఫూర్తి, ప్రేరణతో విశ్వవ్యాప్తంగా ఎన్నో భాషల్లో సినిమాలు రూపొంది విశేష ప్రేక్షకాదరణ పొందడం విశేషం.మనసు పొరల్ని సున్నితంగా స్పృశించే కొన్ని ఇరానియన్ చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్నస్పెషల్ 'షో'...
లైఫ్ ప్లస్ వన్ డే
చిన్న కూతురు సోమాయి ఇంటిని మొత్తం తనే చూసుకుంటూ పెద్ద దిక్కుగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అందులో తల్లి తీవ్ర అనారోగ్యంతో దీనస్థితిలో ఉంటే, అన్నయ్య డ్రగ్స్‌కి బానిసవుతాడు. పెద్దన్నయ్య మోసపూరితమైన వైఖరితో డబ్బు గుంజాలని చూస్తుంటాడు. సోదరి డిజార్డర్‌తో, తమ్ముడు చిల్లర పనులు చేస్తూ ఉంటాడు. ఇలా ఎవరికి వారు తమ ధోరణిలో ఉంటారు. ఈ నేపథ్యంలో పెళ్ళీడుకొచ్చిన సోమాయికి ఓ సంపన్న ఆఫ్ఘాన్ కుటుంబానికి చెందిన మంచి పెళ్ళి సంబంధం వస్తుంది. సోమాయి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయాక ఆ కుటుంబం సమస్యల వలయం నుంచి ఎలా బయటపడిందనేది ఈ చిత్ర ఇతివృత్తం. సయీద్ రూస్టారు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కుటుంబం అనుబంధాలను, బాధ్యతను, సమస్యలను అనేక కోణాల్లో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించింది. ఇందులో సోమాయి పాత్రలో పరినాజ్ ఇసడియర్, ఇతర ప్రధాన పాత్రల్లో పెయ్మాన్ మోయడీ, నవిద్ మహమ్మడ్జదె తదితరులు నటించి మెప్పించారు. అత్యంత సహజంగా సాగే ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది.
ఐ యామ్ ఏ మదర్
తనని అత్యాచారం చేసేందుకు పాల్పడిన సయీద్ అనే వ్యక్తిని అవా హత్య చేస్తుంది. దీంతో ఆమెకు కొన్నేండ్లు జైలు శిక్ష పడుతుంది. హంతకురాలిగా జైల్లో అవా ఎటువంటి ఇబ్బందులు పడింది?, తన ప్రియుడికి, అత్యాచారం చేయబోయిన సయీద్‌కి ఉన్న సంబంధం ఏంటనేది ఈ చిత్ర కథాంశం. ఆద్యంతం నాటకీయంగా సాగే ఈ ఇరానియన్ చిత్రాన్ని దర్శకుడు ఫెరిడౌన్ జేరేని రూపొందించారు. 2012లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు కలెక్షన్ల పరంగా సత్తా చాటింది.
ఇందులో అవా పాత్రలో బరన్ కొసరి, సయీద్ పాత్రలో హబీబ్ రెజాయి నటించారు. ముఖ్యంగా బరన్ కొసరి నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది.
ది పాస్ట్
ఇరాన్‌కు చెందిన అహ్మద్ నాలుగేండ్ల పాటు ఫ్రాన్స్‌లో ఉంటాడు. అహ్మద్‌కు భార్య, ఇద్దరు పిల్లలుంటారు. భార్య మారీతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని అహ్మద్ తిరిగి ఇరాన్ వెళ్ళిపోయేందుకు సన్నాహాలు చేస్తుంటాడు.
ఈ క్రమంలో మారీ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్టు తెలుసుకుంటాడు. అంతేకాదు ఆమె గర్భవతి కూడా అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె నుంచి అహ్మద్ దూరమయ్యాడా?, మారీ మరో వ్యక్తితోనే జీవితం కొనసాగించిందా?, చివరికి కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది సినిమా. అస్గర్ ఫర్హాది దర్శకత్వంలో రూపొందిన ఈ డ్రామా చిత్రం 2013లో విడుదలైన విశేష ప్రేక్షకాదరణతోపాటు విదేశీ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఇందులో అహ్మాద్ పాత్రలో అలీ మోస్సాఫా, మారీ పాత్రలో బెరీనెస్ బెజో నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
గోల్డ్ అండ్ కాపర్
ఇరాన్‌కు చెందిన సయీద్ రెజాకు ఇద్దరు పిల్లలు, భార్య జహ్రా ఉంటారు. ఓ భయంకరమైన వ్యాధితో భార్య జహ్రా బాధపడుతుండటంతో ఇంటి పనులతోపాటు పిల్లల ఆలనా పాలనా మొత్తం సయీదే చూసుకోవాల్సి వస్తుంది. ఓ పక్క ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూనే మరో పక్క ముస్లిం సాహిత్యాన్ని అభ్యసిస్తుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఓ రోజు భార్య కింద పడిపోతుంది. హాస్పిటల్ నుంచి వచ్చినప్పట్నుంచి ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పుతో వీళ్లిద్దరికి రోజూ గొడవలవుతుంటాయి. దీంతో చివరికి వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది సినిమా. ముస్లిం కుటుంబాల్లో ఉన్న పరిస్థితితోపాటు మానవ సంబంధాల నేపథ్య ప్రధానంగా చూపించిన ఈ చిత్రానికి హోమాయున్ అస్టాడియన్ దర్శకత్వం వహించారు. 2011లో విడుదలైన ఈ సినిమా ఫజ్ర్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ఇందులో సయీద్ రెజా పాత్రలో బెరూజ్ షోయబీ, జహ్రా పాత్రలో నెగార్ జాహేరియన్ నటించి మెప్పించారు.
ఐస్ ఏజ్
బాబాక్, మనిజెహ్ భార్యభర్తలు. వీరి వైవాహిక జీవితం విజయవంతంగా పదేండ్లు పూర్తి చేసుకుంది. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో దుర్భర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. సామాజికంగా, ఆర్థికంగా వచ్చిన ఇబ్బందులను, అడ్డంకులను అధిగమించడానికి బాబాక్ విపరీతంగా శ్రమిస్తుంటాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య దూరం పెరగటంతో భార్య మరో వ్యక్తికి దగ్గరవుతుంది. ఆ తర్వాత బాబాక్ తెలుసుకున్న నిజమేంటి?, చివరికి వీరి కథ ఎలా ముగిసిందనేది సినిమా. ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయనేది ఈ చిత్రంలో దర్శకుడు ముస్తఫా కైయీ అద్భుతంగా చూపించారు. 2015లో విడుదలైన ఈ చిత్రంలో బాబాక్ పాత్రలో ఫర్హాద్ అస్లానీ, మనిజెహ్ పాత్రలో సహార్ డోలాత్షాహిల
నటన ఆకట్టుకుంటుంది.
బాడీగార్డ్
సూసైడ్ బాంబర్ నుంచి ఓ పెద్ద రాజకీయ నాయకుడిని ఒక ప్రభుత్వ బాడీగార్డ్ ప్రాణాలతో కాపాడతాడు. అందుకు అతని ధైర్యాన్ని మెచ్చుకోక పోగా, తన నిజాయితీని, నిబద్ధతను ప్రశ్నించడం మొదలు పెడతారు. దీంతో తన నిబద్ధతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఆ బాడీగార్డ్ తానేంటో నిరూపించుకోవడం కోసం ఏం చేశాడనే దాన్ని దర్శకుడు ఇబ్రహీం హటమికై అత్యద్భుతంగా తెరపై ఆవిష్కరించారు.
2016లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. ముఖ్యంగా బాడీగార్డ్ పాత్రలో నటించిన పార్వీజ్ పారాస్తిరు నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.
ఏ క్యూబ్ ఆఫ్ షుగర్
ఇరాన్‌లోని ఓ పాత నగరంలో ఉన్న ఒక పురాతన ఇంటిలో ఓ కుటుంబం నివసిస్తూ ఉంటారు. ఆ కుటుంబంలో నలుగురు ఆడపిల్లలు. ముగ్గురికి పెళ్ళిళ్లు అయిపోయాయి. చివరి అమ్మాయికి పెళ్ళి కుదరడంతో బంధువులంతా ఇంటికి వస్తారు. పెళ్ళి పనుల్లో ఇళ్లంతా సందడిగా ఉంటుంది. పెళ్ళికి సన్నాహాలు జరుగుతున్న క్రమంలో అనుకోకుండా ఓ సంఘటన చోటు చేసుకుంటుంది. ఇంతకి ఆ సంఘటనేంటి?, పెళ్ళి జరిగిందా ? లేదా అనేదే సినిమా. ఇరాన్ సంస్కృతిని, ముస్లిం గైడెన్స్‌ను తప్పుదోవ పట్టించేదిగా ఉందంటూ ఈ చిత్రాన్ని కొన్ని రోజులు ప్రభుత్వం బహిష్కరించింది. కానీ పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై అందరి ప్రశంసలందుకుంది. పెళ్ళి కూతురు పాత్రలో నెగర్ జాచేరియన్ నటన అద్భుతంగా ఉంటుంది.
హిస్స్ దోఖ్తారా ఫరీద్ నేమిజానంద్
శిరిన్ అనే యువతికి ఇంట్లో వాళ్ళు చూసిన రెండు సంబంధాలు దాదాపు పెళ్ళి వరకు వచ్చి ఫెయిల్ అవుతాయి. మూడోసారి కూడా ఇంట్లో వాళ్ళు శిరిన్కి ఓ సంబంధం చూస్తారు. మరికొన్ని గంటల్లో పెళ్ళి జరుగుతుందనగా, అనుకోకుండా ఓ ఘటన చోటు చేసుకుంటుంది. దీంతో మానసిక పరిస్థితి గందరగోళం కారణంగా శిరిన్ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. దీని తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది?, చిన్నప్పుడు తన జీవితంలో చోటు చేసుకున్న చీకటి రోజు ఏంటి అనేది మిగిలిన సినిమా కథ. పౌరాణ్ దరాఖ్షాన్దే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఒక అమ్మాయిలోని సంఘర్షణను ఆవిష్కరించింది. మధ్య తరగతి కుటుంబంలో పెళ్ళి చేయాలంటే ఎలాంటి అవరోధాలుంటాయనేది కళ్ళకు కట్టినట్టు చూపించింది. శిరిన్ పాత్రలో టన్నజ్ తబటాబేయి నటన అలరిస్తుంది.
ది పేయింటింగ్ పూల్
దివ్యాంగులైన భార్యభర్తలకు ఎలాంటి లోపాలు లేని ఓ కుమారుడు జన్మిస్తాడు. ఈ భార్యభర్తలు తమ సమస్యను అధిగమించేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ క్రమంలో ఈ తల్లిదండ్రులకు, ఆ కుమారుడికి మధ్య చోటు చేసుకున్న సంఘర్షణ, వారి అనుబంధం, తమ సమస్యలను అధిగమించేందుకు వారు చేసే పోరాటం ఎలా సాగిందనేది సినిమా. మాజార్ మిరి దర్శకత్వంలో 2013లో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. దివ్యాంగులైన కుటుంబంలోని ఇబ్బందులను ప్రతిబింబించిన ఈ చిత్రంలో భార్యభర్తల పాత్రల్లో షహాబ్ హోస్సెని, నీగర్ జాహేరియన్ల నటన మనసు పొరలను సున్నితంగా స్పృశిస్తుంది.
గష్త్ ఇ ఇర్షద్
పేద కుటుంబంలో జన్మించిన ముగ్గురు యువకులు చిన్న చిన్న పనులు చేస్తూ శ్రామికులుగా జీవిస్తుంటారు. ఇలాగైతే ఎక్కువ డబ్బు సంపాదించలేమని మాయమాటలు చెబుతూ జనాన్ని మోసం చేస్తుంటారు. విచిత్ర దుస్తులు ధరించిన వీరిని పోలీసులు తరచూ అరెస్ట్ చేస్తుంటారు. విచిత్ర దుస్తులు ధరించిన ఈ ముగ్గురు యువకుల బండారం చివరకు బయటపడిందా? వారిని పోలీసులు అరెస్ట్ చేశారా లేదా అనేదే సినిమా. ఆద్యంతం హాస్యభరితంగా సాగే
ఈ చిత్రాన్ని సాయీద్ సోహీలి రూపొందించారు.
కామెడీ చిత్రంగా మంచి ఆదరణ పొందిన ఈ సినిమాలో ముగ్గురు యువకుల పాత్రల్లో హమీద్ ఫర్రోఖ్నేహాడ్, పౌలాడ్ కిమియా, సాద్ పోహీలి నటించారు.
స్పెషల్ లైన్
హ్యాకర్స్ గ్రూప్‌కు చెందిన బ్యాంక్ ఎకౌంట్స్‌లో మనీ అంతా ఖాళీ అవుతుంది. ఆ డబ్బును మరొక హ్యాకర్ గ్రూప్ కొట్టేస్తుంది. దీంతో ఆ డబ్బును ఈ హ్యాకర్స్ గ్రూప్ కట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో హ్యాకర్స్ గ్రూప్ ఏం చేసిందనేది సినిమా. ఆద్యంతం కామెడీని పంచే ఈ చిత్రాన్ని దర్శకుడు మోస్తాఫా కీయే కామెడీ, క్రైమ్ డ్రామాగా తెరకెక్కించారు. 2014లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇక ఇందులో సామ్ ఘారీబియన్, మిత్రా హజార్, పరినాజ్ ఇజడియర్లు నటించి ఆకట్టుకున్నారు.
ఫర్ పూనేహ్ సేక్
మజిద్ ఇరాన్‌కు చెందిన మధ్యవయస్కుడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా. సాంప్రదాయాలకు విలువిచ్చే వ్యక్తి. అతని భార్య పూనెహ్ విభిన్న నేపథ్యానికి చెందిన మహిళ. ఆమె ఆలోచన విధానం సైతం భిన్నంగా ఉంటుంది. భార్యపై అనుమానంతో మజిద్ మద్యానికి బానిసవుతాడు. దీంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగి,
అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని ఈ జంట ఎలా ఎదుర్కొన్నారనే కథాంశంతో దర్శకుడు హేటెఫ్ అలిమర్దాని ఈ చిత్రాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందించారు. 2013లో విడుదలైన ఈ చిత్రంలో మజిద్ పాత్రలో ఫర్హాద్ అస్లాని, పూనెహ్ పాత్రలో హానీ తవాస్సోలి నటించారు.
ఎట్ ది ఎండ్ ఆఫ్ 8 స్ట్రీట్
సంతోషకరమైన జీవితం కొనసాగిస్తున్న నిలోఫర్ కుటుంబంలో అనుకోకుండా ఓ సంఘటన జరుగుతుంది. దీంతో నిలోఫర్ కుటుంబమంతా తీవ్ర కష్టాల్లో, సమస్యల్లో కూరుకుపోతారు. కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నిలోఫర్‌కి మూడే మూడు రోజుల టైమ్ మాత్రమే ఉంటుంది. దీని కోసమై నిలోఫర్‌కి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. మరి నిలోఫర్ ఆ డబ్బు సంపాదించడానికి ఎలాంటి కష్టాలు పడింది?, చివరికి తన కుటుంబాన్ని కాపాడుకుందా, లేదా? అనే కథాంశంతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా దర్శకుడు అలిరేజా అమిని ఈ చిత్రాన్ని రూపొందించారు. 2012లో విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణతోపాటు కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. ఇందులో నిలోఫర్ పాత్రలో తరణే అలిడోయోస్టి నటన మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
ఫెసిలిటీ ల్యాండ్
ఓ మూడు జంటలు బర్త్‌డే పార్టీ రోజు కలుసుకుంటారు.
ఈ సందర్భంగా తమ జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలను, సరదా సన్నివేశాలను గుర్తు చేసుకుంటారు. మరి వారి జీవితంలో చోటు చేసుకున్న ఆ సంఘటనలేంటనేదే సినిమా. ఆద్యంతం నాటకీయంగా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు
మాజార్ మిరి 2014లో రూపొందించారు. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ చిత్రం పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో హామెడ్ బెహద్ద్, యాసిగా లీల, మహ్నాజ్ అఫ్షార్, బహ్రాంగా హుస్సెన్ యారీ, అమీర్ అఘేయి ప్రధాన పాత్రల్లో నటించారు.
ది సేల్స్‌మ్యాన్
భార్యాభర్తలైన ఎమాద్, రానాలు నాటకాల్లో నటిస్తూ లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు.
ఆర్థర్ మిల్లర్ ఫేమస్ నాటకం 'డెత్ ఆఫ్ ఏ సేల్స్‌మ్యాన్' నాటకం కోసం రిహార్సల్ చేస్తున్న క్రమంలో బలవంతంగా ఓ అపార్ట్మెంట్లో రెంట్‌కు ఉండాల్సి వస్తుంది.
ఆ సమయంలో భార్య రానాపై దాడి జరుగుతుంది. దానికి కారణం ఎవరు? వారుండే ఇంట్లో గతంలో ఏం జరిగింది?,అనంతరం వీరిమధ్య ఎలాంటి సంఘర్షణ చోటు చేసుకుందనే ఆసక్తికర అంశాల సమాహారమే ఈ చిత్రం. అస్గర్ ఫర్హాది దర్శకత్వంలో 2016లో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. విమర్శకులను సైతం మెప్పించి, ప్రేక్షకులనూ మంత్రముగ్దుల్ని చేసింది. గతేడాది విదేశీ విభాగంలో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని, కేన్స్‌లోనూ ప్రదర్శితమైంది. ఇందులో షహబ్ హోస్సెనీ, తరణె అలిదూస్తీల నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. భావోద్వేగ భరితమైన డ్రామాను ఈ చిత్రం అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించింది.
Authorization