ప్రజల జీవన సరళి, సామాజిక సమస్యలతోపాటు సంస్కృతి, సంప్రదాయాలను వెండితెరపై ఆవిష్కరించడంలో అరబిక్ చిత్రాలు విశ్వవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లోనూ సత్తా చాటి ఎన్నో పురస్కారాలతోపాటు విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకున్నాయి. వైవిధ్యభరిత నేపథ్యాలతో తెరకెక్కి ప్రేక్షకుల మెప్పు పొందిన
కొన్ని అరబిక్ చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
ఇన్లాండ్
తన స్నేహతుడు బలవంతంతో దాదాపు సన్యాసిగా మారిన మలెక్ పశ్చిమ అల్జీరియా ప్రాంతంలో ఉద్యోగం చేసేందుకు అంగీకరిస్తాడు. ఆ ప్రాంతంలో టెర్రరిస్టుల ప్రభావం ఉండటంతో ఆర్మీ దళాలు రోజూ తిరుగుతుంటాయి. ఈ క్రమంలో రాత్రి సమయాల్లో జరిగే భారీ పేలుడు శబ్దాలు మలెక్ నిద్రని చెడగొడతాయి. వరుసగా రెండు మూడు రోజులుగా రాత్రి సమయాల్లో పేలుడు శబ్దాలు వినిపిస్తుంటాయి. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో పేలుళ్లు సంభవించిన ప్రదేశాలకు వెళ్ళిన మలెక్ ఓ చోట దాక్కుని ఉన్న ఓ ఆఫ్రికన్ మహిళను గుర్తిస్తాడు. పేరు చెప్పడానికి నిరాకరించిన ఆ మహిళ ఎలాగైనా తన ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఈ క్రమంలో మలెక్, ఆ మహిళను తీసుకుని అక్కడ్నుంచి పారిపోతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమమే ఈ సినిమా.
తారిక్ తెగియూ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2009లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.
హెడీ
ఇతరులు ఆశించేలా జీవించడాన్ని హెడీ అనే యువకుడు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటాడు. తన జీవితానికి తానే కర్త, కర్మ, క్రియా అని భావిస్తుంటాడు. రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా తునిషియాలో మార్పు రావలన్నది హెడీ కల. ఆ కలకి అనుగుణంగా తన జీవితాన్ని సాగిస్తుంటాడు. తల్లి కూడా కొడుకు కోరిన జీవితానికే వదిలేస్తుంది. ఈ క్రమంలో తాను పెళ్ళి చేసుకోబోయే రీమ్ అనే యువతిని హెడీ కలుసుకుంటాడు. తన స్వభావానికి పూర్తి భిన్నంగా ఉన్న రీమ్ పరిచయం హెడీ జీవితంలో ఎటువంటి మార్పుని తీసుకొచ్చింది?, ఎలాంటి పరిణతి సాధించాడనేదే ఈచిత్రం. దర్శకుడు మహ్మద్ బెన్ అట్టాయా దర్శకత్వంలో రూపొందిన ఈ ట్యూనీషియన్ డ్రామా చిత్రం 2016లో విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాదు బెర్లిన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై అవార్డులను కూడా అందుకుంది. కలెక్షన్ల పరంగా సత్తా చాటింది. ముఖ్యంగా ఇందులో హెడీ పాత్రలో మజిద్ మాస్టౌరా నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
బ్లెస్డ్ బెనిఫిట్..
ఒక సాధారణ వ్యక్తి స్వేచ్ఛను కోల్పోయినప్పుడు ఏం చేస్తాడనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. అహ్మద్ కన్స్ట్రక్షన్ వర్కర్‌గా పనిచేస్తుంటారు. అనుకోని పరిస్థితుల్లో ఓ చీటింగ్ కేసులో అరెస్ట్ అవుతాడు. తాను అమాయకుడినని నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఇబ్రహీం అనే వ్యక్తి నాశనం చేస్తాడు. దీంతో అహ్మద్‌కు జైలు శిక్ష పడుతుంది. శిక్ష అనుభవిస్తున్న సమయంలో బయటి జీవితం కంటే జైలు జీవితమే బెటర్ అని ఫీలవుతాడు అహ్మద్. ఈ క్రమంలో అతని మనుగడ ఎలా సాగిందనేది సినిమా. ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి మహ్మాద్ అల్ మసాద్ దర్శకత్వం వహించారు. అహ్మాద్ పాత్రలో అహ్మాద్ తహర్ నటన కడుపుబ్బా నవ్విస్తూనే ఆలోచింప చేస్తుంది. 2016లో విడుదలైన ఈ సినిమా మంచి ప్రశంసలందుకోవడంతోపాటు టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శితమై విమర్శకులనూ మెప్పించింది.
అలీ, ది గోట్ అండ్ ఇబ్రహీం
చనిపోయిన తన ప్రియురాలి ఆత్మ మేకలో ఉందని భావించి, అలీ దాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు. తన స్నేహితుడు ఇబ్రహీం, మేకతో కలిసి వ్యాన్‌లో ఈజిప్ట్ మొత్తం తిరుగుతుంటాడు. ఈ క్రమంలో అలీ తనని తాను ఎలా తెలుసుకున్నాడు?, ఆ క్రమంలో ఆలీ ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటన్నది సినిమా. ఆద్యంతం వినోదాత్మకంగా ఫాంటసీ, డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి షెరీఫ్ ఎల్బెండరీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గతేడాది విడుదలై విజయం సాధించింది.
మావ్లానా
'ది రిలేషన్ బిట్వీన్ రిలీజీయన్ అండ్ పవర్' అనే నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఒక యువ షేఖ్ ఫత్వా గురించిన సంప్రదాయ బోధనలతో జర్నీ చేస్తుంటాడు. ఆకట్టుకునే విధంగా, అలరించే విధంగా ఉన్న అతని బోధనల పట్ల జనం ఆకర్షితులవుతారు. టీవీ సెలబ్రిటీగా లక్షల్లో అభిమానులను సొంతం చేసుకుంటాడు. అతని ప్రాభవాన్ని కంట్రోల్ చేయడం ప్రభుత్వానికి, ప్రత్యర్థులకు కష్టతరమవుతుంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల సమాహారమే ఈ చిత్రం. మాగీ అహ్మద్ అలీ దర్శకత్వంలో రూపొందిన ఈ డ్రామా, మిస్టరీ చిత్రం 2016లో విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. షేఖ్ పాత్రలో అమర్ సాద్ నటన కనువిందు చేస్తుంది.
ది వర్తీ
2033 నాటికి విశ్వవ్యాప్తంగా నీరు మొత్తం కలుషితమై పోతుంది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఒక గ్రూపుగా ఏర్పడి స్వచ్ఛమైన నీరు దొరికే ప్రాంతం కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో కొత్తగా ఓ ఇద్దరిని గ్రూప్‌లో చేర్చుకుంటారు. అన్వేషణ కొనసాగిస్తున్న వీరికొక నీళ్లున్న ప్రాంతం దొరికిన తర్వాత గ్రూప్ సభ్యులతో కొత్తగా చేరిన ఇద్దరు సభ్యులు ఆడిన మృత్యు క్రీడే ఈ సినిమా. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు అలీ ఎఫ్ ముస్తాఫా తెరకెక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది.
థ్రస్ట్
ఓ ఐదుగురు సభ్యులుగల కుటుంబం బొగ్గును అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుంటుంది. తండ్రి, కొడుకు వాళ్ళ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయి పది ఏండ్లు అయినా తల్లి, ఇద్దరు కూతుళ్ళు మాత్రం అదే గ్రామంలో ఉండి పోతారు. పైప్‌లైన్ దారి మళ్లించి చట్టవిరుద్ధంగా నీళ్ళను తమ ప్రాంతానికి వచ్చేలా చేసి కుటుంబ సభ్యులతో కలిసి పోవాలని తండ్రి చేసే ప్రయత్నంలో ఎదురైన సంఘటనలు ఏమిటి?, కుటుంబ సభ్యులందరూ కలిసి పోయారా?, లేదా అనేదే ఈ చిత్ర కథ. అరబ్ కంట్రీస్లోని సామాజిక పరిస్థితులను ప్రతిబింబించిన ఈ సినిమా ఆ దశాబ్ద కాలంలో వచ్చిన బ్యూటిఫుల్ చిత్రంగా, ధైర్యంతో చేసిన చిత్రంగా సినీ విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ ఇజ్రాయెల్-పాలస్తీనా డ్రామా చిత్రాన్ని దర్శకుడు తాఫ్ఫిక్ అబూ వేల్ తెరకెక్కించారు. 2004లో విడుదలై కేన్స్‌లో ప్రదర్శితమై క్రిటిక్స్ అవార్డునందుకుంది. ఇందులో హుస్సేన్ యాస్సిన్ మహజ్నె, అమల్ బ్వెరాట్, రుబ బ్లాల్, జమిలా అబు హుస్సేన్ నటించి మెప్పించారు.
వివా అల్జీరియా
ఇది అల్జీరియాలోని ఆధునిక సమాజం, ఇస్లామిక్ ఫండమెంటలిజమ్, స్వతంత్య్రంగా ఎదగడం, ఒకరిపై ఆధారపడటానికి మధ్య ఉన్న బేధాలను తెలిపే చిత్రం. గౌకెమ్ రిచ్ డాక్టర్. ఫొటోగ్రాఫర్‌గానూ పనిచేస్తుంటుంది. ఆమె తల్లి పపిచా మాజీ క్యాబరే స్టార్. ఆమె స్నేహితురాలు ఫీఫీ వేశ్యా వృత్తిలో ఉంటుంది. ఈ ముగ్గురు అల్జీరియాలోని ఓ హోటల్లో ఉంటారు. ఆ టైమ్‌లో ఈ ముగ్గురి వ్యక్తిగత జీవితాల్లో ఎదురయ్యే ఇబ్బందులు, అడ్డంకులు, ఎదిగేందుకు వారు పడే స్ట్రగుల్స్, వారిపై ఇస్లామ్ ప్రభావాన్ని స్పష్టంగా చూపించిన చిత్రమిది. నడిర్ మోకానెచె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు అల్జీరియాలోని ఇబ్బందుల్ని చూపించింది. 2004లో విడుదలైన ఈ చిత్రంలో లుబ్నా అజాబాల్, బియౌనా, నదియా కాసి ప్రధాన పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు.
డెలిస్ పాలోమా
అల్జీరియా స్వాతంత్య్రం నేపథ్యంలో ఒక మహిళ జీవితంలోని ఒడిదుడుకులను, తన మనుగడ కోసం ఆమె చేసే ప్రయత్నాలను తెలిపే చిత్రమిది. అల్డెరియా అందమైన మహిళా, అదే సమయంలో సుక్ష్మబుద్ధి కలిగి ఉంటుంది. బాగా సంపాదించి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని, అందరిలోనూ తాను ప్రత్యేక ఆకర్షణగా నిలవాలనుకుంటుంది. అందుకోసం ఆమె ఏం చేసిందనేది సినిమా. అల్డెరియా గత జీవితం, ఆమె పొందే కీర్తి, ఆమెపై వచ్చే వ్యతిరేకత, ఆమె పతనం వంటి అంశాలను ఈ చిత్రం ప్రతిబింబించింది. నాదిర్ మోక్నేచే దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్రెంచ్-అల్జీరియన్ చిత్రం 2007లో విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇందులో అల్డెరియా పాత్రలో బియువానా నటించారు. ఆమె నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగానూ ఈ చిత్రం సత్తా చాటింది.
మేకింగ్ ఆఫ్
ఇదొక బ్రేక్‌డాన్సర్ జీవితానికి తెర రూపమిచ్చిన చిత్రం. ఇంట్లో, స్కూల్లో సెంటిమెంటల్‌గా ఫెయిలైన బ్రేక్‌డాన్సర్ బహాట మానసికంగా కుంగిపోతాడు. ఇరాక్ వార్ జరుగుతున్న టైమ్‌లో బహాట రహస్యంగా పారిపోతాడు. అట్నుంచి ఇస్లాం సిద్ధాంతాలకు అడిక్ట్ అవుతాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలా సాగింది?, ఎదుర్కొన్న ఇబ్బందులు, స్ట్రగుల్స్ ఏంటి అనేది సినిమా. నౌరీ బౌజీద్ దర్శకత్వంలో 2006లో విడుదలైన ఈ చిత్రం అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై పలు అవార్డులను కైవసం చేసుకుంది. ఇందులో బహాట పాత్రలో లాట్ఫి అదెలి నటించి మెప్పించారు.
కారామెల్
ఐదుగురు లెబనీస్ మహిళల జీవితాలను ప్రతిబింబించే చిత్రమిది. లాయెలే బీరూట్‌లో ఇద్దరు మహిళలు నస్రీన్, రిమాతో కలిసి ఓ సెలూన్‌ను నడుపుతుంటుంది. ఈ ముగ్గురు ఎవరి సమస్యలతో వాళ్ళు సతమతమవుతుంటారు. పెళ్ళెయిన ఓ వ్యక్తితో లాయెలే అక్రమ సంబంధం పెట్టుకోవడం, సాంప్రదాయ కుటుంబానికి చెందిన నస్రీన్ పెళ్ళికి ముందే సెక్స్‌లో పాల్గొనటం, జమాలే అనే యువతితో రిమా ఆకర్షితురాలవడం, సెలూన్‌కి పక్కనే ఉన్న ఓ దుకాణంలో పని చేస్తున్న రోజ్, తన జీవితం మొత్తాన్ని మెంటల్‌గా డిస్ట్రబ్ అయిన చెల్లెలిని చూసుకోవడంలోనే గడపటం..
ఈ క్రమంలో వాళ్ళ భావోద్వేగాలు, బాధలు, ఆనందాలను దర్శకురాలు, నటి నాడిల్ లాబాకి ఆద్యంతం హృద్యంగా తెరకెక్కించారు. 2007 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో డైరెక్టర్స్ ఫోర్ట్ నైట్ సెక్షన్లో ప్రదర్శితమై అవార్డు అందుకుంది. ఇందులో ఐదుగురు మహిళల పాత్రల్లో దర్శకురాలు నాడిన్ లబాకితోపాటు ఆడెల్ కరమ్, యాస్మినె అల్ మస్రీ, జోవన్నా మౌర్కెజెల్, గిసెల్ ఔడ్, డిమిట్రీ స్టనెయాస్కి తదితరుల నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.
బోస్టా
బీరూట్‌లోని తాను నివసిస్తున్న ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడు సంఘటన తర్వాత పదిహేను ఏండ్లకు యువకళాకారుడు కమల్ మఫౌస్ ఫ్రాన్స్ నుంచి తిరిగి వస్తాడు. మ్యూజిక్ కంపోజర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ప్రావీణ్యం సంపాదించిన కమల్ తాను చదువుకున్న స్కూల్లోని స్నేహితులందరిని రీ యూనిట్ చేయాలనుకుంటాడు. వీళ్ళందరూ కలిసి లెబనాన్ అన్యువల్ ఫెస్టివల్ సందర్భంగా మ్యూజిక్ బేస్డ్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటారు. దీని కోసం వీరొక ప్రత్యేక బస్‌ను తయారు చేసుకుని వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్న క్రమంలో సంప్రదాయ సంగీతం, మోడ్రన్ సంగీతం, డాన్స్ విషయంలో అభిప్రాయా బేధాలు రావడంతోపాటు వ్యక్తిగత అంశాలు కూడా వీరినెలా దూరం చేశాయన్నదే ఈ చిత్రం. మ్యూజికల్ జర్నీ నేపథ్యంలో సాగిన ఈచిత్రాన్ని దర్శకుడు ఫిలిప్ ఎథ్రాంటి 2005లో తెరకెక్కించారు. విశేష ప్రేక్షకాదరణ పొందడంతోపాటు విదేశీ విభాగంలో ఆస్కార్‌కు సైతం నామినేట్ అవ్వడం విశేషం. ఇందులో కమల్ పాత్రలో రోడ్ని ఎల్ హద్దడ్ నటన ఆద్యంతం అలరిస్తుంది.
డౌన్‌టౌన్ గర్ల్స్
ఉద్యోగం చేస్తున్న ఇద్దరు మహిళల జీవితాలకు సంబంధించి ఆటుపోట్లను తెలిపే చిత్రమిది. వృత్తిగత జీవితంలోను, సమాజంలోనూ వాళ్ళకు ఎదురైన సవాళ్ళను, నగరంలో వాళ్ళు చేసే సాహసాలకు తెరరూపమే ఈ చిత్రం. ఆద్యంతం నాటకీయంగా సాగే ఈ చిత్రాన్ని మహ్మద్ ఖాన్ రూపొందించారు. ఇందులో ఖలేద్ అబోల్ నాగా, హెండ్ సబ్రీ ప్రధాన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. వారి అందం, అభినయం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా వాళ్ళు చేసే సాహసాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తాయి.
ఏ పర్ఫెక్ట్ డే
స్లీపింగ్ డిజార్డర్తోపాటు మాజీ ప్రేమసి తాలూకా జ్ఞాపకాలతో బాధపడుతున్న కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకునే ఓ తల్లి కథే ఇది. అంతేకాదు 15 ఏండ్ల క్రితం సివిల్ వార్ జరుగుతున్న టైమ్‌లో కిడ్నాప్‌కి గురైన భర్తను వెతికే ఓ భార్య వ్యథ కూడా. తల్లిగా కొడుకు కోసం, భార్యగా భర్త కోసం ఓ మహిళ పడే మానసిక వేదనే ఈ చిత్రం. ఆద్యంతం నాటకీయంగా సాగే ఈ చిత్రాన్ని జోనాన్ హాజిజోమస్, ఖలీల్ జోరిగే సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 2005లో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇందులో మలెక్ పాత్రలో జియాద్ సాడ్, వాళ్ళ అమ్మ పాత్రలో అలెగ్జాండ్రా కాహ్వాగి, ప్రియురాలి పాత్రలో జూలియా కస్సార్ నటించారు.
Authorization