భిన్న చిత్రాలతో, ప్రయోగాత్మక చిత్రాలతో రష్యన్ సినిమాలు ప్రపంచ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. వినూత్న పంథాతో సినిమాలను తెరకెక్కించి రష్యన్ దర్శక, నిర్మాతలు కూడా
తమ ప్రత్యేకత చాటుకున్నారు. ఆద్యంతం అలరించే రీతిలో రూపొందిన ఎన్నో రష్యన్ చిత్రాలు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లోనూ ప్రతిష్టాత్మక పురస్కారాలను దక్కించుకున్నాయి. ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి మంచి విజయాలను సొంతం చేసుకున్న కొన్ని రష్యన్ చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో...
నేటివ్ డాన్సర్
ఎడారి పర్వత ప్రాంతం బక్సీలో ఐదై అనే హోమియో వైద్యురాలు నివసిస్తుంటుంది. అక్కడ అనారోగ్యం పాలైన వారికి వైద్యం చేస్తుంటుంది. ఏదో మ్యాజిక్ చేసి దంపతులకు పిల్లలు కలిగేలా చేస్తుంది. ఆమె ఉండే స్థలంపై కార్పొరేట్ల కన్ను పడుతుంది. అక్కడ గ్యాస్ స్టేషన్ నిర్మించాలనేది వాళ్ళ ప్లాన్. ఆ స్థలాన్ని ఎలాగైనా లాక్కోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ అందుకు ఐదై ఒప్పుకోదు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ శక్తులకు, వైద్యురాలికి మధ్య ఎలాంటి పోరాటం జరిగింది?, అక్కడి వారి సపోర్ట్ ఎలా ఉంది?, అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది సినిమా. గుల్షాట్ ఒమర్వా దర్శకత్వంలో 2008లో రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం నాటకీయంగా సాగుతూ ఆకట్టుకుంది. సాంప్రదాయ వృత్తులు చేపట్టే పేదవారి భూములపై కార్పొరేట్ల దాడి ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ చిత్రం స్పష్టంగా ప్రతిబింబించింది. ఐదై పాత్రలో నీసిపుల్ ఒమర్బెక్వో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.
ది ప్రీస్ట్
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది. 1941 తరుణంలో రెండో ప్రపంచ యుద్ధ కారణంగా నాజీల ఆక్రమణలో రష్యా ఉంటుంది. అలెగ్జాండర్ అనే చర్చ్ ఫాదర్ ప్రజలకు సేవ చేసుకుంటూ, చర్చ్‌ని చూసుకుంటూ ఓ పట్టణంలో శాంతియుతమైన జీవనం గడుపుతుంటాడు. ఈ నేపథ్యంలో చర్చ్‌ను ఆక్రమించుకోవడానికి నాజీలు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో అక్కడ నిర్వహిస్తున్న మిషన్‌ను, అక్కడి ప్రజలను కాపాడుకోవడానికి ఫాదర్ అలెగ్జాండర్ ఒంటరిగా చేసిన పోరాటమే ఈ చిత్రం. వ్లాదిమిర్ ఖటోనేంకో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2009లో విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంది. మంచి విజయం సాధించింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యాలోని పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇందులో చర్చ్ ఫాదర్ పాత్రలో సెర్గి మకోవెట్స్కీ నటన ఆద్యంతం అలరిస్తుంది.
తుల్పన్
కజక్స్తాన్లోని ఎడారి ప్రాంతంలో అసా అనే కుర్రాడు తన సోదరితో నివసిస్తుంటాడు. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలున్నారు. భర్త ఓండాస్ పశువుల కాపరి. కఠిన మనస్తత్వం కలిగిన ఓండాస్ పశువుల మేతకు సంబంధించిన భూమిని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఇక అసా పెళ్ళి కావాల్సిన అబ్బాయి. ఆ ప్రాంతంలో తుల్పన్ అనే ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటుంది. అసా ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కానీ తుల్పన్ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో ఎలాంటి ఉద్యోగం లేని అసాకు తుల్పన్ను ఇచ్చేందుకు ఆసక్తి చూపరు. అయినప్పటికీ తుల్పన్ను దక్కించుకునేందుకు అసా చాలా ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో భూమిని ఆక్రమించుకోవాలని చేస్తున్న ఓండాస్ ప్రయత్నాలు, మరో వైపు తుల్పన్ను సొంతం చేసుకునేందుకు అసా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయా లేదా అనేదే సినిమా. ఎడారి గ్రామీణ వాతావరణాన్ని, అక్కడి పరిస్థితులను ఈ చిత్రంలో అత్యంత సహజంగా దర్శకుడు సర్జీ డ్వోర్ట్సేవోరు తెరకెక్కించారు. 2008లో విడుదలైన ఈ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. అలాగే పలు అంతర్జాతీయ అవార్డులనూ దక్కించుకుంది. అసా పాత్రలో అస్కాట్ కుచెన్చెరెకోవ్, తుల్పన్ పాత్రలో టెల్పెర్బెర్న్ బైసాకాలోవ్, ఓండాస్ పాత్రలో ఓండాస్ బేసిక్టాస్ల నటన రక్తికట్టిస్తుంది.
ఎవ్రీబడీ డైస్ బట్ మీ
మాస్కోలో హైస్కూల్ చదువుతున్న కట్యా, వికా, జాన్నా ముగ్గురు మంచి స్నేహితులు. తమ స్కూల్లో జరిగే డిస్కో కార్యక్రమంలో పాల్గొనాలని డిసైడ్ అవుతారు. దీని కోసం ఎఫెక్టివ్‌గా ప్రిపేర్ అవుతున్న క్రమంలో అనుకోకుండా వారి లైఫ్‌లో ఓ సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏంటి, ఆ తర్వాత వారి లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగిందనేది సినిమా. ఈ చిత్రం ప్రధానంగా రష్యాలో స్కూల్ పిల్లల్లో హింస, మాదక ద్రవ్యాల వాడకం ఏ రేంజ్లో ఉంది.
వాటి వల్ల వారి జీవితాలు ఎలా పాడవుతున్నాయనేది కళ్లకు కట్టినట్టు దర్శకుడు చూపించారు. వాలెరియా గై జర్మనీకా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2008లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. కేన్స్తోపాటు పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై అవార్డులను దక్కించుకుంది. ఇందులో ముగ్గురు స్నేహితుల పాత్రల్లో పోలియా ఫినోనెంకో, అగ్నీయ కుజ్నెట్సోవ, ఓల్గా షువలోవాల నటన ఆకట్టుకుంటుంది.
లిల్యా 4 ఎవర్
టీనేజ్ అమ్మాయి లిల్జా రష్యాలోని ఈస్టోనియాలో తన తల్లి కోసం వెయిట్ చేస్తుంటుంది. ఈస్టోనియాలో లిల్జాకు ఒక్కడే స్నేహితుడు వోలోడ్యా ఉంటాడు. వీరిద్దరు సరదాగా గడుపుతుంటారు. ఈ క్రమంలో లిల్జాకు ఓ కొత్త వ్యక్తి పరిచయమవుతాడు. పేరు ఆండ్రెజ్. అతనితో ప్రేమలో పడుతుంది. లిల్జాకు అమెరికాలో కొత్త లైఫ్ ఇస్తానని చెప్పి ఆమెను అమెరికాకి తీసుకెళ్తాడు. మరి అమెరికా వెళ్ళిన లిల్జాకు ఎదురైన పరిస్థితులేంటి?, లైంగికంగా ఎలా బాధించబడిందనేది సినిమా. లుకాస్ మూడ్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రధానంగా మానవ అక్రమ రవాణా, లైంగిక బానిసత్వం గురించి చర్చించింది. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 2002లో విడుదలైన విశేష ప్రేక్షకాదరణతోపాటు విమర్శకుల ప్రశంసలందుకుంది. లిల్జా పాత్రలో ఒక్సానా అకిన్షినా, వోలోడ్యా పాత్రలో అర్టిమ్ బోగుచర్క్సీ, అండేజ్ పాత్రలో పావెల్ పొనోమరియోవ్ నటించారు. ముఖ్యంగా ఒక్సానా అకిన్షినా నటన మంత్రముగ్దుల్ని చేస్తుంది.
హౌ ఐ ఎండెడ్ దిస్ సమ్మర్
ఆర్కిటిక్ సముద్ర తీరంలోని పోలార్ స్టేషన్ ప్రాంతానికి ఒక వాతావరణ శాస్త్రవేత్తతోపాటు తాజాగా గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన ఓ కుర్రాడు పరిశోధన నిమిత్తం వస్తాడు. వేసవి కాలం కావడంతో అక్కడి పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. పైగా ఆ కుర్రాడిని శాస్త్రవేత్త భయపెట్టడం, కొట్టడం చేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రాడ్యూయేట్కు ఓ సందేశం వస్తుంది. దాన్ని తన బాసైన వాతావరణ శాస్త్రవేత్తకు చెప్పాలనుకుంటాడు. కానీ చెప్పాలంటే భయం, చెప్పకపోతే పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది. మరి ధైర్యం చేసి ఆ సందేశాన్ని చెప్పాడా?, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది సినిమా. అద్యంతం నాటకీయకంగా సాగే ఈ చిత్రానికి అలెక్సే పొపగ్రెబ్క్సీ దర్శకత్వం వహించారు. 2010లో విడుదలైన ఈ రష్యన్ సినిమా క్రిటికల్గాను, కమర్షియల్‌గాను మంచి ప్రశంసలందుకుంది. అంతేకాకుండా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై అవార్డులనూ సొంతం చేసుకుంది. ఇందులో శాస్త్రవేత్తగా సెర్గీ పుస్కేపాలిస్, గ్రాడ్యూయేట్గా గ్రిగోరి డాబ్రిజిన్ల నటన ఆకట్టుకుంటుంది.
లవ్లెస్
ఓ జంట ఎప్పుడూ గొడవపడుతుంటారు. ఒకరిపై మరొకరికి ప్రేమ లేదనే వాదన వాళ్ళ మధ్య తరచూ జరుగుతుంటుంది. భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఓ గొడవ కాస్త పీక్ స్టేజ్‌కు వెళ్తుంది. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు.
ఈ గొడవ కారణంగా వాళ్ళ కుమారుడు తప్పిపోతాడు.
అతన్ని వెతికేందుకు చేసే ప్రయత్నంలో వాళ్ళలో వచ్చిన మార్పేంటి అనేదే సినిమా. ఆండ్రీ జ్వెయగింట్సెవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలై ప్రశంసలందుకుంది. విదేశీ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. కేన్స్‌లో ప్రదర్శితమై జ్యూరీ ప్రైజ్‌ను దక్కించుకుంది.
Authorization