ఆసక్తికర భిన్న నేపథ్య సినిమాలకు మెక్సికన్ చిత్రాలు కేరాఫ్ .
మానవ సంబంధాలు, భావోద్వేగాలు, చరిత్ర, సంస్కృతి, ఆధునిక పోకడ తదితర భిన్న నేపథ్యాలతో రూపొందిన ఎన్నో మెక్సికన్ చిత్రాలు విశేష ప్రేక్షకాదరణతోపాటు విమర్శకుల ప్రశంసలూ పొందాయి. నవ్యతకు పెద్ద పీట వేస్తూ వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన కొన్ని మెక్సికన్ చిత్రాల గురించి
ఈ వారం 'నవచిత్రం' పాఠకులకు అందిస్తున్న స్పెషల్ 'షో'...
ఐ డ్రీమ్ ఇన్ అనదర్
తమ దేశంలో ఉన్న కొత్త రకమైన భాషను కనిపెట్టడానికి ఓ భాషా సాహితీ వేత్త మెక్సికోలోని అటవి ప్రాంతంలో ప్రయాణిస్తుంటాడు. అక్కడ నివసించే వారు ఆ భాష మాట్లాడేవాళ్లే అయినప్పటికీ వాళ్ళంతా అంతరించిపోయారు. ఈ ప్రయత్నంలో ఆ భాషను మాట్లాడేవాళ్ళు కేవలం ఇద్దరే బతికి ఉన్నారనే విషయం తెలుసుకున్న సాహితీ వేత్త తన స్నేహితుడితో కలిసి చేసిన పరిశోధన ఏమిటి?, అంతరించిపోతున్న ఆ భాషను వెలుగులోకి తెచ్చేందుకు ఎలాంటి ప్రయత్నం చేశారనేది సినిమా. ఎర్నెస్టో కాంట్రేరాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది విడుదలై మంచి ప్రశంసలందుకుంది.
ది అన్టమేట్
తమ కుమారుడితో కలిసి భార్యాభర్తలైన ఏంజెల్, అలెజెండ్రా మెక్సికోలోని ఓ చిన్న టౌన్లో నివసిస్తుంటారు. ఏంజెల్ సోదరుడు కాంపౌండర్‌గా పనిచేస్తుంటాడు. రహస్య మహిళ వెరోనికా రాకతో వీరి జీవితాలు పూర్తిగా మారిపోతాయి. శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో వారి జీవితాలే తలక్రిందులవుతాయి. ఈ నేపథ్యంలో రహస్య శక్తి గల వెరోనికా ఎవరు?, ఎందుకు వీరిని ఇబ్బంది పెడుతుంది?, వెరోనికాకు, ఏంజెల్‌కు ఉన్న సంబంధమేంటనేది అసలు కథ. ఈ హర్రర్ డ్రామా చిత్రాన్ని అమాట్ ఎస్కంటంటే రూపొందించారు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సాగే ఈ చిత్రం గతేడాది విడుదలై ఆకట్టుకుంది. వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో సిల్వర్ లయన్‌ను గెలుచుకుంది.
7:19
1985 సెప్టెంబర్ 19. సరిగ్గా ఉదయం ఏడు గంటల 19 నిమిషాలు..
మార్టిన్, ఫెర్నాండో ఓ ప్రభుత్వ కార్యాలయంలో రిసెప్షన్ విధులు నిర్వహిస్తుంటే, లోపల ఉద్యోగులంతా ఎవరి పనిలో వారు నిమగమై ఉన్న తరుణంలో భారీ భూకంపం సంభవిస్తుంది. దీంతో ఆ భవనం మొత్తం కుప్పకూలిపోతుంది. విభిన్న తరగతులకు చెందిన ప్రజలు అందులో చిక్కుకుంటారు. వారంతా ప్రాణాలతో బయటపడేందుకు తీవ్రమైన పోరాటం చేయడమే ఈ చిత్ర కథాంశం. అత్యంత హృదయ విదారకమైన పరిస్థితులను ప్రతిబింబించే ఈ చిత్రానికి జార్జ్ మైఖెల్ గ్రు దర్శకత్వం వహించారు. ఇందులో పెర్నాండో పాత్రలో డెమ్యాన్ బిచీర్, మార్టిన్ పాత్రలో హెక్టర్ బొనిలా నటించారు. ఇది విదేశీ విభాగంలో ఆస్కార్ ఎంట్రీకి ఎంపికైంది.
లిటిల్ బాయ్
రెండవ ప్రపంచ యుద్ధ తరుణంలో జరిగే మ్యాజిక్ నేపథ్య చిత్రమిది. ఎనిమిదేండ్ల కుర్రాడికి తండ్రి అంటే అమితమైన ప్రేమ. అలాగే తనయుడన్నా ఆ తండ్రికీ అపారమైన ప్రేమ. తండ్రి సహకారంతో ఈ కుర్రాడు మ్యాజిక్ నేర్చుకుంటాడు. రియల్ లైఫ్‌లో కూడా మ్యాజిక్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. తండ్రి కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. తండ్రి కూడా అలానే ఉంటాడు. ఈ క్రమంలో ఆ కుర్రాడు తన మాయాశక్తితో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నం చేస్తాడు. మరి అది సాధ్యమైందా లేదా అనేదే ఈ చిత్ర కథాంశం. వార్ డ్రామా నేపథ్యంలో అలెజండ్రో గోమెజ్ మొంటెవెర్డె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2015లో విడుదలై ప్రశంలందుకుంది. ఈ సినిమా ఆధారంగా బాలీవుడ్లో 'ట్యూబ్‌లైట్' చిత్రం తెరకెక్కింది. సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది.
గ్లోరియా
గ్లోరియా త్రెవి అనే అమ్మాయి పాప్ స్టార్‌గా ఎదగాలనుకుంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా అతి తక్కువ టైమ్‌లోనే పాప్ స్టార్‌గా రాణిస్తుంది. ఆకట్టుకునే సెక్సీ డ్రెస్‌లతో, కుర్రకారును ఉర్రూతలూగించే పాటలతో, రెబల్ యాటిట్యూడ్‌తో తిరుగులేని రాక్‌స్టార్‌గా గుర్తింపు పొందుతుంది.
ఆమె పాప్ స్టార్‌గా ఎదగడంలో మేనేజర్ సెర్గియో కీలకంగా వ్యవహరిస్తాడు. ఆ తర్వాత అతని కారణంగానే ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా పడిపోతుంది. మరి ఆమె పడిపోవడానికి కారణమేంటి, సెక్స్ కుంభకోణానికి గ్లోరియాకున్న సంబంధమేంటనేది మిగిలిన సినిమా. మెక్సికన్ పాప్ సింగర్ గ్లోరియా త్రెవి జీవితం ఆధారంగా క్రిస్టియన్ కెల్లర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2014లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గ్లోరియా పాత్రలో సోఫియా ఎస్పినోసా నటించారు. ఆస్కార్ ఎంట్రీకి పంపినప్పటికీ ఎంపిక కాలేదు. ఈ చిత్రం అనేక ఇతర పురస్కారాలను సొంతం చేసుకుంది.
పర్ఫెక్ట్ ఒబిడియన్స్
క్రమశిక్షణ, విధేయత కలిగిన కుర్రాడిలా మారాలని జూలియన్ అనే కుర్రాడు నిశ్చయించుకుంటాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆధ్యాత్మికంగా అడుగులు వేస్తాడు. ఓ చర్చ్ ఫాదర్ ఆధ్వర్యంలో ఆయనేం చెబితే అది చేస్తూ జర్నీ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఫాదర్ శారీరకంగా, మానసికంగా జూలియన్‌ను ఎలా లోబర్చుకున్నాడు?, జూలియన్‌లో విధేయత వచ్చిందా లేదా అనేది మిగిలిన సినిమా. చర్చ్ ఫాదర్ అరాచకాలు, నీచ కార్యకలాపాలను తెలియజేసే ఈ చిత్రాన్ని దర్శకుడు లూయిస్ ఉరిక్విజ్ ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు. 2014లో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది.
ఆర్ఫన్స్
19వ శతాబ్దంలో మెక్సికోలోని ఓ నిషేధించబడిన యదార్థ ప్రేమ కథను తెలిపే చిత్రమిది. మెల్చోర్ ఓకంపో చర్చ్ నిబంధనలను ఉల్లంగిస్తూ ప్రేమాయాణం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన అడ్డంకు లేంటి?, వాటిని ఎదిరించి ఆధునిక సమాజ పోకడను ఎలా అందిపుచ్చు కున్నాడనేది తెలిపే చిత్రమిది. వ్యక్తిలోని ప్రేమ, భావవాదం ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు గిటా స్కిఫ్టర్ యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఆనాటి మెక్సికో సమాజంలోని మూస ధోరణులపై పోరాడే యువకుడిగా రాఫెల్ నటన ఆద్యంతం అబ్బురపరుస్తుంది.
కాంటిన్ఫ్లాస్
మెక్సికన్ పాపులర్ హాస్య నటుడు కాంటిన్ఫ్లాస్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన కాంటిన్ఫ్లాస్ క్రమక్రమంగా కామెడీ సినిమాలు చేస్తూ మెక్సికోతోపాటు హాలీవుడ్‌లోనూ పాపులర్ అయ్యారు. హాలీవుడ్ హాస్యనటులను మించి అభిమాన గణాన్ని, గుర్తింపు సంపాదించారు. ఈ క్రమంలో అతను ఎన్నో అవమానాలు, అవరోధాలను హాలీవుడ్ మేకర్స్ నుంచి ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ కామెడీ స్టార్‌గా ఎదిగిన వైనం స్ఫూర్తిదాయకం. ఈ కథాంశాన్ని దర్శకుడు సెబాస్టియన్ డెల్ అమో అంతే ఇన్స్పైర్ చేసేలా, ఆకట్టుకునేలా తెరకెక్కించి మెప్పించారు. 2014లో విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణతోపాటు విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆస్కార్ ఎంట్రీకి ఎంపికైంది. పలు ఇతర అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఇందులో కాంటిఫ్లాస్ పాత్రలో ఆస్కార్ జనదా నటన కట్టిపడేస్తుంది.
క్లబ్ సాండ్విచ్
అమ్మతో కలిసి హెక్టర్ అనే కుర్రాడు విహారయాత్రకు వెళతాడు. ఓ సాయం సంధ్యవేళ స్విమ్మింగ్ పూల్ దగ్గర కాలక్షేపం చేస్తున్న తరుణంలో జాజ్మిన్ అనే అందమైన అమ్మాయిని హెక్టర్ చూస్తాడు. ఆ అమ్మాయికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. దీంతో తనయుడిని కంట్రోల్ చేయడానికి అమ్మ ఏం చేసింది?, అమ్మాయికి దగ్గరయ్యేందుకు ఆ కుర్రాడు ఏం చేశాడనేది చిత్ర కథ. ఫెర్నాండో ఎంబెక్కే దర్శకత్వంలో రూపొందిన ఈ హాస్యభరిత చిత్రం 2013లో విడుదలై ఆకట్టుకుంది. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శితమై అవార్డులను అందుకుంది. ఇందులో హెక్టర్‌గా లూసియో గిమెనేజ్ కాచో, అందమైన అమ్మాయిగా డానా రేనాడ్, తల్లిగా మారియా రెనియే నటించారు.
Authorization