స్టీవెన్ స్పీల్బర్గ్..
మూస ధోరణిలో కొట్టుకుపోతున్న ప్రపంచ సినిమాను సరికొత్త పంథాలో నడిపిన దిగ్దర్శకుడు. వైవిధ్యభరిత భిన్న నేపథ్యాలతో వెండితెరపై అద్భుతాలు సృష్టించిన మేధావి.మానవీయ విలువలను చాటుతూనే అత్యాధునిక సాంకేతిక పోకడకు పెద్ద పీట వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, నటుడిగా సినీ ప్రేమికుల మనసులపై చెరగని ముద్ర వేసిన
వెండితెర ఇంద్రజాలికుడు స్టీవెన్ స్పీల్బర్గ్ పుట్టినరోజు నేడు (సోమవారం).
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని 'నవచిత్రం' పాఠకులకు ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో...
హాలీవుడ్ సినిమానే కాదు యావత్ ప్రపంచ సినిమా గమనాన్నే మార్చేసిన దిగ్దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ అమెరికాలోని ఓహియోకు చెందిన సిన్సినట్టిలో 1946, డిసెంబర్ 18న జన్మించారు. ఆయన అసలు పేరు స్టీవెన్ అల్లాన్ స్పీల్బర్గ్. తల్లి లేV్‌ా పోస్నేర్ రెస్టారెంట్ హోనర్, పియానిస్ట్ట్. తండ్రి ఆర్నాల్డ్ స్పీల్బర్గ్. ఎలక్ట్రికల్ ఇంజనీర్.
స్టీవెన్‌కు ముగ్గురు సోదరీమణులు (అన్నె, నాన్సీ, సుయి) ఉన్నారు. ఆర్థోడాక్స్ జ్యూ కావడం వల్ల స్టీవెన్ ప్రైమరీ స్కూల్ రోజుల్లోనే తోటి విద్యార్థులతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జాతి పరమైన వివక్ష ఎదుర్కొన్నారు. సినిమా మేకింగ్‌పై చిన్నప్పట్నుంచే ఆసక్తి ఉండేది. యుక్త వయసులో అరిజోనా ప్రాంతంలో ఎక్కువగా గడిపారు. ఆ టైమ్‌లో ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు.
12ఏండ్ల వయసులోనే బొమ్మల ట్రైన్ నేపథ్యంలో లఘు చిత్రం తీసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత హైస్కూల్ టైమ్‌లో 8ఎంఎం 'అడ్వెంచర్' చిత్రాన్ని తీశారు. 1958లో బార్సు స్కౌట్స్ ఆఫ్ అమెరికాలో మెంబర్ అయ్యారు. 'ది లాస్ట్ గన్‌ఫైట్' అనే 9 నిమిషాల నిడివి గల సినిమా తీసి ఫొటోగ్రఫీ మెరిట్ బ్యాడ్జ్ అందుకున్నారు.
13 ఏండ్ల వయసులో ఫోయినిక్స్లో ఉండేవారు. అక్కడ 40 నిమిషాల నిడివితో 'ఎస్కేప్ టు నో వేర్' చిత్రాన్ని తీసి అవార్డునందుకున్నారు. అవార్డు వచ్చిన ఉత్సాహంతో వరుసగా చిన్నపాటి సినిమాలు తీయడం ప్రారంభించారు. అలా 15 చిత్రాలు రూపొందించారు. 16 ఏండ్ల వయసులోనే ఫీచర్ ఫిల్మ్ తీసే స్థాయికి ఎదిగారు. తనే సొంతంగా కథ రాసుకుని, దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'ఫైర్‌లైట్'. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందించిన ఈ సినిమాను 'క్లోజ్ ఎన్కౌంటర్స్'ను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించారు. తన తండ్రి సహకారంతో స్థానికంగా ఉన్న ఫిల్మ్ ఎక్విప్మెంట్తో కేవలం 500 డాలర్లతో తీశారు.
మూడేండ్ల తర్వాత స్టీవెన్ ఫ్యామిలీ కాలిఫోర్నియాకు మారింది. గ్రాడ్యుయేషన్ కోసం కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. ఆ టైమ్‌లోనే యూనివర్సల్ స్టూడియోస్‌లో చిన్న ఉద్యోగంలో చేరారు. అక్కడ ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు.
ఆ టైమ్‌లో అక్కడే లఘు చిత్రాలను రూపొందించే ఛాన్స్ అందుకున్నారు. 35ఎం.ఎం.లో 26 నిమిషాల నిడివిగల 'అంబ్లిన్' లఘు చిత్రాన్ని తీశారు. ఆ స్టూడియో వైస్ ప్రెసిడెంట్ సిడ్నీ షెన్బర్గ్ దాన్ని చూసి బాగా ఇంప్రెస్ అయ్యారు. అంతేకాదు ఏండేండ్లపాటు తన స్టూడియోలోని టెలివిజన్ సినిమాలకు దర్శకత్వం వహించే కాంట్రాక్ట్ ఇచ్చారు. అంత చిన్న వయసులో అన్ని ఏండ్లపాటు కాంట్రాక్ట్ దక్కించుకున్న దర్శకుడిగా అప్పట్లోనే స్టీవెన్ రికార్డు సృష్టించారు. ఛాన్స్‌లు రావడంతో తను చేస్తున్న చదువును మధ్యలోనే ఆపేశారు. ఇక పూర్తి స్థాయిలో సినిమా రంగంలోకి వచ్చేశారు. చివరికి 2002లో ఫిల్మ్ అండ్ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
మెయిన్ స్ట్రీమ్ సినిమా దర్శకుడిగా..
1969లో ప్రొఫెషనల్ టెలివిజన్‌లో పనిచేసే ఉద్యోగం పొందారు. అందులో 'నైట్ గ్యాలరీ'కి సంబంధించి పలు ఎపిసోడ్లను చిత్రీకరించారు. అట్నుంచి నాలుగేండ్లపాటు 'ది నేమ్ ఆఫ్ ది గేమ్' టెలివిజన్‌లోని పలు ఎపిసోడ్లను తెరకెక్కించారు. మొదటి సినిమాగా స్టీవెన్ భావించే చిత్రం 'డుయెల్'. ఆ తర్వాత 'పీటర్‌బిల్ట్ 281 ట్యాంకర్ ట్రక్', 'సమ్‌థింగ్ ఎవిల్' వంటి టెలివిజన్ సినిమాలను రూపొందించారు. ఇక మెయిన్ స్ట్రీమ్ సినిమా దర్శకుడిగా స్టీవెన్ రూపొందించిన చిత్రం 'ది షుగర్లాండ్ ఎక్స్‌ప్రెస్'. ఓ జంటను పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించే ఇతివృత్తంతో రూపొందించిన ఈ సినిమా మంచి ప్రశంసలందుకుంది. ఈ క్రమంలో నిర్మాత రిచర్డ్ ది. జానుక్, డేవిడ్ బ్రౌన్ కలిసి 1975లో 'జాస్' చిత్రాన్ని నిర్మించారు. స్టీవెల్ ఫస్ట్ మేజర్ సక్సెస్ సాధించిన చిత్రమిది. 470 డాలర్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. అంతేకాదు ఎడిటింగ్, ఒరిజినల్ స్కోర్, సౌండ్ విభాగాల్లో ఆస్కార్లను దక్కించుకుంది. దీంతో స్టీవెన్‌పై అందరి దృష్టి పడింది. ఇక వరుసగా 'జాస్ 2', 'కింగ్ కాంగ్', 'సూపర్ మ్యాన్', 'క్లోజ్ ఎన్కౌంటర్ ఆఫ్ ది థర్డ్ కైండ్' చిత్రాలను తెరకెక్కించి విజయాలను అందుకున్నారు.
ప్రపంచ స్థాయి గుర్తింపు..
హాలీవుడ్లో స్టీవెన్‌ను అగ్ర దర్శకుల స్థానంలో నిలబెట్టిన చిత్రం '1941'. రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 92 మిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇది విమర్శకుల మన్ననలను మాత్రం పొందలేకపోయింది. దీని ఫలితమే ఫిల్మ్ మేకింగ్‌లో స్టీవెన్ కొత్త పోకడలకు తెరలేపడానికి నాంది పలికింది. మూస ధోరణి హాలీవుడ్ సినిమాకు కొత్త దనాన్ని, కొత్త పంథాను పరిచయం చేశారు. స్నేహితుడు జార్జ్ ల్యూకస్తో కలిసి 'స్టార్‌వార్స్' సిరీస్‌ను సృష్టించారు. దీంతోపాటు 'రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్', 'ఇండియానా జోన్స్', 'బ్లేడ్ రన్నర్' చిత్రాలను రూపొందించారు. 1980లో హాలీవుడ్ దశ, దిశను మార్చిన చిత్రాలివి. యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాలుగా విశేష ప్రేక్షకాదరణతోపాటు విమర్శకుల మన్ననలూ పొందాయి. ఆ తర్వాత తనకు బాగా పట్టు ఉన్న సైన్స్ ఫిక్షన్స్ వైపు స్టీవెన్ మనసు మళ్ళీంది. 1982లో 'ఈ.టి. ది ఎక్స్ట్రా టెరిస్ట్రియల్'ను రూపొందించారు. గ్రహాంతర వాసి కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతేకాదు నాలుగు ఆస్కార్ అవార్డులనూ దక్కించుకుంది.
వెండితెర అద్భుతాలు..
'ఇండియానా జోన్స్', 'జురాసిక్ పార్క్' వంటి అద్భుత చిత్రాలను తెరకెక్కించిన ఘనత ఈయనదే. సరికొత్త మాయా ప్రపంచంలో వింతైన డైనోసార్స్తో వెండితెర అద్భుతంగా సృష్టించిన 'జురాసిక్' పార్క్' చిత్రానికి పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి లేదు. 'ట్విలైట్ జోన్ ది మూవీ', 'ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్', 'ది కలర్ పర్పుల్', 'ఎంఫైర్ ఆఫ్ ది సన్', 'ఆల్వేస్', 'ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రుసేడ్', 'హుక్', 'జురాసిక్ పార్క్', 'షిండ్లర్స్ లిస్ట్', 'ది లాస్ వరల్డ్: జురాసిక్ పార్క్', 'అమిస్టేడ్', 'సేవింగ్ ప్రైవేట్ రేయాన్', 'ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్', 'మైనాటరీ రిపోర్ట్', 'క్యాచ్ మి ఇఫ్ యు కెన్', 'ది టెర్మినల్', 'వార్ ఆఫ్ ది వరల్డ్స్', 'మ్యూనిచ్', 'ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్డమ్ ఆఫ్ ది క్రిస్టర్ స్కల్', 'ది అడ్వెంచర్స్ ఆఫ్ టిన్టిన్', 'వార్ హోర్స్', 'లింకన్', 'బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్', 'ది బిఎఫ్జీ' వంటి తదితర చిత్రాలన్ని వెండితెర అద్భుతాలుగా ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన 'ది పోస్ట్' చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. 'రెడీ ప్లేయర్ వన్', 'ఇండియానా జోన్స్ 5', 'క్రెన్షా', 'ది కిడ్నాపింగ్ ఆఫ్ ఎడ్గార్డో మోర్టారా', 'ఇట్స్ వాట్ ఐ డూ' వంటి తదితర చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
వైవిధ్యభరిత భిన్న నేపథ్యాలు..
స్టీవెన్ తన సినిమాలతో సమాజంలోని అసమానతలను తెలుపుతూనే, సాంకేతిక పోకడలను ప్రతిబింబించారు. విజువల్ వండర్స్‌ను క్రియేట్ చేశారు. ప్రాచీన నాగరికతలను ప్రతిబింబించేలా 'జాస్' చిత్రాన్ని రూపొందించారు. అలాగే ప్రపంచంలోని అద్భుతాలను రిఫ్లెక్ట్ చేసేలా, పిల్లలను అలరింప చేసేలా మార్వెల్ సంస్థలో 'క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్', 'ఇ.టి', 'బిఎఫ్జీ' చిత్రాలను తెరకెక్కించారు. సాహిత్యానికి పెద్ద పీఠ వేస్తూ 'కలర్ పర్పుల్', 'ఎంపైర్ ఆఫ్ ది సన్'లను రూపొందించారు. సాహసాలు, హీరోయిజం, యాక్షన్ నేపథ్యంలో 'ఇండియానా జోన్స్', 'టెంపుల్ ఆఫ్ డూమ్' చిత్రాలు తెరకెక్కించారు. సంప్రదాయిక చర్యలు, రాక్షసత్వం, భయానకం నేపథ్యంలో 'హుక్', 'జురాసిక్ పార్క్' సినిమాలను తీశారు. అంతేకాదు చరిత్రను బయటికి తీసే ప్రయత్నం చేశారు. హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో 'షిండ్లర్స్ లిస్ట్', అమెరికా పోలీస్ వ్యవస్థపై 'సేవింగ్ ప్రైవేట్ రేయాన్'ను తెరకెక్కించారు. ఆత్యాధునిక సాంకేతికతకు ప్రతీకగా 'ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్' చిత్రాన్ని రూపొందించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి..
దర్శకుడిగానే కాదు నిర్మాతగానూ తన అభిరుచి చాటుకున్నారు. అంబ్లిన్ ఎంటర్టైన్మెంట్పై పలు చిత్రాలను రూపొందించారు. అలాగే తన స్నేహితులు జెఫ్రీ కాట్జెన్బర్గ్, డేవిడ్ గిఫ్పెన్తో కలిసి డ్రీమ్‌వర్క్ ఎస్కేజీ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించి తన కలల ప్రాజెక్ట్‌లతోపాటు ఇతర సంస్థలతోనూ కలిసి 120 సినిమాలు నిర్మించారు. అలాగే 8 చిత్రాలకు రైటర్‌గా, దాదాపు 60 సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇక నటుడిగా తనదైన ప్రత్యేకతనూ చాటుకున్నారు. 'ది బ్లూస్ బ్రదర్స్', 'గ్రెమిలిన్స్', 'వనిలిన స్కై', 'ఆస్టిన్ పవర్స్ ఇన్ గోల్డ్మెంబర్' చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిశారు. వీటితోపాటు బోల్డెన్ని వీడియో గేమ్‌లను, టెలివిజన్ సిరీస్‌లు, టెలివిజన్ షోస్ తన సొంత బ్యానర్లోనే తీసి మెప్పించారు.
1976లో అమెరికన్ నటి అమీ ఇర్వింగ్తో 'ఇండియానా జోన్స్' టైమ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 1985 పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత మరో అమెరికన్ నటి కేట్ క్యాప్షాకు దగ్గరై 1991లో వివాహం చేసుకున్నారు. స్టీవెన్‌కు ఏడుగురు పిల్లలున్నారు. సేవా కార్యక్రమాల్లోనూ విస్తృతంగా పాల్గొన్నారు. ప్రపంచ సినిమాకు ఆయన చేసిన సేవలకుగానూ 1986లో ఆస్కార్‌కు చెందిన 'ఇర్వింగ్ జి.థాల్బెర్గ్ మెమోరియల్ అవార్డు అందుకున్నారు. 'స్కిండ్లర్స్ లిస్ట్' చిత్రానికి రెండు ఆస్కార్ అవార్డులు దక్కాయి. అలాగే 'సేవింగ్ ప్రైవేట్ రేయాన్' చిత్రానికి ఉత్తమ దర్శకుడి ఆస్కార్ సొంతం చేసుకున్నారు. 2004లో డైరెక్టర్స్ గిల్డ్ అమెరికా లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్ అవార్డు వరించింది. 2015లో ఐకానిక్ ఫిల్మ్ మేకర్‌గా అమెరికన్ అత్యున్నత పురస్కారమైన ఫ్రీడమ్‌కు చెందిన ప్రెసిడెన్షియల్ మెడల్ అందుకున్నారు. వీటితోపాటు లెక్కలేనన్ని పురస్కారాలను స్టీవెన్ అందుకున్నారు.
Authorization