ఏంజెలీనా జోలీ.. వెండితెర సంచలనం. హాలీవుడ్‌నే కాదు వరల్డ్ సినిమానే ప్రభావితం
చేసిన అతిలోకసుందరి. కుర్రకారుని మెస్మరైజ్ చేసిన యాక్షన్ క్వీన్. నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా సత్తా చాటిన ఆల్‌రౌండర్. అగ్రహీరోలకు దీటుగా రాణించిన మూడున్నర దశాబ్దాల సినీ ప్రస్థానం, సామాజిక సేవ స్ఫూర్తిదాయకం. పడి లేచిన కెరటానికి ప్రతీకగా నిలిచిన
బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఏంజెలీనా జోలీ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో...
హాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికల్లో ఏంజెలీనా జోలీ ఒకరు. ప్రముఖ హాలీవుడ్ నటుడు జాన్ వోయిట్, నటి మార్చేలైన్ బెట్రాండ్ ముద్దుల తనయ. నటుడు జేమ్స్ హవెన్ జోలీకి సోదరుడు. లాస్ ఏంజెల్స్‌లో జూన్ 4న జోలీ జన్మించారు. పూర్తి పేరు ఏంజెలీనా జోలీ వోయిట్. పేరెంట్స్ ఇద్దరూ నటులు కావడంతో జోలీకి కూడా సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. దీంతో ఐదేండ్ల వయసులోనే తండ్రి నటించిన 'లుకిన్ టు గెట్ ఔట్' చిత్రంలో నటించింది. టీనేజ్‌లో మోడల్‌గా రాణించాలని ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. నటిగా మారాలనే బలమైన కోరికతో యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యింది.
నట జీవితం..
జోలీ సినీ కెరీర్ 16ఏండ్ల నుంచే ప్రారంభమైంది. విద్యార్థులు రూపొందించిన 'టూ డార్క్' చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించింది. 'స్టాండ్ బై మై ఉమెన్', 'ఆల్టా మారియా', 'ఇట్స్ ఎబౌట్ టైమ్', 'రాక్ అండ్ రోల్ డ్రీమ్స్ కమ్ త్రూ' వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ మెరిసింది. ప్రొఫెషనల్‌గా 1993లో సినిమా జీవితాన్ని ఆరంభించి, సైన్స్ ఫిక్షన్ వీడియో 'సైబర్గ్ 2', 'వితౌట్ ఎవిడెన్స్' చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత పూర్తి స్థాయి కథానాయికగా నటించిన 'హ్యాకర్స్' చిత్రంలోని తన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతోపాటు 'రొమియో జూలియెట్' కథ స్ఫూర్తిగా రూపొందిన 'లవ్ ఈజ్ ఆల్ థేర్ ఈజ్' చిత్రం మంచి ఆదరణ పొందింది. అలాగే 'మోజేవ్ మూన్', 'ఫాక్స్ఫైర్', 'ప్లేయింగ్ గాడ్', 'ట్రూ ఉమెన్' చిత్రాలు విశేష ఆదరణ పొందడంతో జోలీకి మంచి గుర్తింపు లభించింది. వెండితెరపైనే కాకుండా 'జార్జ్ వాల్లేస్' సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులనూ అలరించింది. కమర్షియల్‌గా గుర్తింపు తెచ్చిన టెలివిజన్ చిత్రం 'గియా'. సూపర్ మోడల్‌గా జోలీ నటనకు ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. ఆ తర్వాత నటించిన గ్యాంగ్‌స్టర్ చిత్రం 'హెల్స్ కిచెన్', కామెడీ డ్రామా 'ప్లేయింగ్ బై హార్ట్', 'పుషింగ్ టిన్' చిత్రాల్లో జోలీ నటనకు ప్రశంసలు దక్కాయి.
ఆస్కార్‌తో అంతర్జాతీయ గుర్తింపు..
సైకలాజికల్ థ్రిల్లర్ 'ది బోన్ కలెక్టర్'లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అత్యద్భుత నటన ప్రదర్శించింది. సైకలాజికల్ థ్రిల్లర్ 'గర్ల్ ఇంట్రప్టెడ్' చిత్రంలో పోషించిన రెబల్ యాటిట్యూడ్ పాత్రలో జోలీ నటన ఫిదా చేసింది. ఉత్తమ సహాయనటిగా ఆస్కార్‌ను అందుకోవడంతోపాటు అంతర్జాతీయ గుర్తింపునూ దక్కించుకుంది. అనంతరం చేసిన 'గాన్ ఇన్ 60 సెకండ్స్' చిత్రం విశేష ప్రేక్షకాదరణతో సంచలనం సృష్టించింది. 'లారా క్రాఫ్ట్: టాంబ్ రైడర్', 'టేకింగ్ లైవ్స్', 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్', 'ది గుడ్ షెప్పర్డ్', 'అలెగ్జాండర్' చిత్రాలు జోలీని స్టార్ హీరోయిన్‌గానే కాకుండా ప్రపంచంలోనే టాప్ మోస్ట్ నాయికల్లో ఒకరిగా నిలిపాయి. 'ఏ మైటీ హార్ట్', 'బేవుల్ఫ్', 'కుంగ్ ఫు పాండా'(క్యారెక్టర్ వాయిస్), 'వాంటెడ్', 'ఛేంజింగ్', 'సాల్ట్', 'ది టూరిస్ట్', 'కుంగ్ ఫూ పాండ్ 2' (వాయిస్), 'కుంగ్ ఫూ పాండా: సీక్రెట్స్ ఆఫ్ ది మాస్టర్స్', 'మేల్‌ఫిసెంట్', 'కుంగ్ ఫూ పాండా3'(వాయిస్), 'ది బ్రీడ్ విన్నర్' వంటి తదితర చిత్రాలు కమర్షియల్‌గానే కాకుండా, క్రిటికల్‌గానూ ప్రశంసలు పొందాయి. ఈ సినిమాల విజయాల్లో జోలీ పాత్ర కీలకంగా నిలిచింది. దీంతో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగానూ జోలీ రికార్డు సృష్టించింది.
ఆల్‌రౌండర్..
నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా తన సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేసింది. తొలి ప్రయత్నంగా 2007లో 'ఏ ప్లేస్ ఇన్ టైమ్' అనే డాక్యుమెంటరీ చిత్రానికి దర్శకత్వం వహించింది. గతంలో 'ట్రూడెల్' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన జోలీ ఈ చిత్రంతో నిర్మాతగానూ మారింది. సొంతంగా కథతో ద్వితీయ ప్రయత్నంగా 2011లో యుద్ధ నేపథ్యంలో 'ఇన్ ది లాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హానీ', 2014లో 'అన్బ్రోకెన్', 2015లో రొమాంటిక్ డ్రామా 'బై ది సీ', 2017లో 'ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్' వంటి విభిన్న కథా చిత్రాలను స్వీయ దర్శకత్వంలోనే నిర్మించింది. ఇక 'డిఫ్రెట్', 'మేల్‌ఫిసెంట్', 'ది బ్రీడ్విన్నర్' చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. అంతేకాకుండా పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌తో సింగర్‌గానూ తన ప్రత్యేకతను చాటింది.
ఒడిదుడుకుల జీవితం..
వ్యక్తిగత జీవితంలో జోలీ ఎప్పుడూ సంతోషంగా లేదు. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో ఒంటరైపోయింది. టీనేజ్‌లో జోలీ అనేక మానసికమైన ఇబ్బందులను, సవాళ్ళను ఎదుర్కొంది. ఇతరులతో ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేక నిద్రలేమి, ఈటింగ్ డిజార్డర్‌తో బాధపడింది. ఆ తర్వాత డ్రగ్స్‌కు బానిసైంది. డిప్రెషన్లోకి వెళ్ళి రెండు సార్లు ఆత్మహత్యకు కూడా పాల్పడింది. 24ఏండ్ల వయసులో మెంటల్‌గా డిస్ట్రబ్ అయి 72 గంటలపాటు చికిత్స పొందింది. 'హ్యాకర్స్' సినిమా టైమ్‌లో సహ నటుడు జాన్లీ మిల్లర్‌కు దగ్గరైంది. వీళ్ళిద్దరూ 1995లో వివాహం చేసుకుని, 1999లో విడిపోయారు. అదే ఏడాది ఆస్కార్ విజేత బిల్లీ బాబ్ థోర్టాన్ను పెళ్ళి చేసుకుని 2003లో విడిపోయారు. చాలా కాలం ఒంటరిగా ఉన్న జోలీ మరో హాలీవుడ్ అగ్ర నటుడు బ్రాడ్పీట్తో ప్రేమాయణం కొనసాగిస్తూ 2014లో వివాహం చేసుకుంది. ఈ బంధం కూడా రెండేండ్లకే తెగిపోయింది. 2002లో కంబోడియాకు చెందిన మడాక్స్ అనే బాలుడిని కుమారుడిగా దత్తత తీసుకుంది. 2005లో కూతురు జహరాను, 2007లో వియత్నాంకు చెందిన మూడేండ్ల బాలుడు పాక్స్ థీన్ను దత్తత తీసుకుంది. బ్రాడ్పీట్తో 2008లో కవలలు నాక్స్ లియోన్, వివిన్నె మెర్చైలైన్లకు జన్మనిచ్చింది. ఆ తర్వాత షిలోV్‌ా అనే మగబిడ్డకు జన్మనిచ్చారు. 56 ఏండ్ల వయసులో తన తల్లి, నానమ్మ క్యాన్సర్ కారణంగా చనిపోయారు. అంతేకాదు తనకు బ్రెస్ట్ క్యాన్సర్ రాబోతోందని తెలుసుకుని 2013లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చికిత్స చేయించుకుంది. అంతేకాదు బ్రెస్ట్ కాన్సర్‌కు సంబంధించి పలు వైద్య సంస్థలకు ప్రచారకర్తగానూ విశేష సేవలు అందించింది.
గొప్ప సంఘ సేవకురాలు..
జోలీ గొప్ప సామాజిక కార్యకర్త. అంతకుమించిన సేవకురాలు. 20ఏండ్లు దాటినప్పట్నుంచే అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంది. 2001లో యుఎన్ రిఫ్యూజీ ఏజెన్సీకీ బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేసి, 2005లో గ్లోబల్ హ్యూమానిటేరియన్ యాక్షన్ అవార్డు అందుకుంది. జంతు సంరక్షణ కార్యకర్తగానూ పని చేసింది. అలాగే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిప్యూజీ (యుఎన్‌హెచ్‌సీఆర్) తరపున 30 దేశాల్లో తిరిగి అనాథలు, శరణార్థులకు రక్షణ, వారిలో సామాజిక అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. వారి జీవన స్థితిగతులపై తన అనుభవాలతో ఓ డాక్యుమెంటరీని కూడా తెరకెక్కించింది. 'నోట్స్ ఫ్రమ్ మై ట్రావెల్స్' పేరుతో ఓ పుస్తకాన్ని రాసింది. శరణార్థులకు, అనాథలకు, బాలకార్మికులకు అండగా నిలవడం, చైల్డ్ ఎడ్యూకేషన్ కోసం ఇప్పటికీ పాటుపడుతోంది. 2007లో హ్యూమన్ రైట్స్, ఉమెన్ రైట్స్‌కు సంబంధించిన 'కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్' సంస్థలో జాయిన్ అయ్యింది. లైంగిక హింసను అరికట్టడానికిగానూ బ్రిటన్‌కు చెందిన ఆర్డర్ ఆఫ్ సెయింట్ మైఖేల్ అండ్ సెయింట్ జార్జ్ డిపార్ట్మెంట్లో కమాండర్‌గా చేరి సేవలందించింది.
పురస్కారాలు..
పలుమార్లు గోల్డెన్‌గ్లోబ్ అవార్డుకు ఎంపికై, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్‌తో పాటు 'గర్ల్ ఇంట్రప్టెడ్' చిత్రానికి సహాయ నటిగా ఆస్కార్ అవార్డు పొందింది. 2013లో ఆస్కార్‌లో భాగంగా ఇచ్చే జీన్ హరషాల్ట్ హ్యూమానిటేరియన్ అవార్డు, చర్చ్ వరల్డ్ సర్వీస్ నుంచి ఇనాగరల్ హ్యూమనిటేరియన్ అవార్డు, సిటిజెన్ ఆఫ్ ది వరల్డ్ అవార్డు, గ్లోబల్ హ్యూమానిటేరియన్ అవార్డు, ఫ్రీడమ్ అవార్డు వంటి తదితర వాటిని జోలీ కైవసం చేసుకుంది.
నట విశ్వరూపం..
జోలీ విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. అందులో 'సాల్ట్' ఒకటి. తనపై వచ్చిన ఆరోపణలను తొలగించుకునేందుకు అమెరికా సిఐఏ ఏజెంట్ ఎవిలిన్ సాల్ట్ చేసిన పోరాట నేపథ్యంలో రూపొందిన అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ స్పై చిత్రమిది. ఇందులో జోలీ అందం, అభినయంతోపాటు అదిరిపోయే పోరాట సన్నివేశాల్లోనూ మెప్పించారు. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ జీవితం ఆధారంగా రూపొందించిన హిస్టారికల్ డ్రామా చిత్రం 'అలెగ్జాండర్'లోనూ వీరనారి పాత్రలో తనదైన నటనతో జోలీ ఆకట్టుకున్నారు. పదకొండు మంది ప్రేమికుల మధ్య చోటు చేసుకున్న సన్నివేశాల సమాహారంగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం 'ప్లేయింగ్ బై హార్ట్'లో జాన్ పాత్రలో జోలీ అందం, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
భిన్న సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలు..
సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే నేపథ్యంలో రూపొందిన 'ది బోన్ కలెక్టర్', 18నెలలు మెంటల్ ఇనిస్టిట్యూషన్‌లో గడిపిన రచయిత సుసాన్నా కాయిసెన్ అనుభవాలను ఇతివృత్తంగా తెరకెక్కిన 'గర్ల్, ఇంట్రప్టెడ్', ఒక సంపన్న వ్యక్తికి దగ్గరై అతని డబ్బునంతా కొట్టేయాలనే క్రమంలో చివరకు అతని ప్రేమలో పడటమనే కథాంశంతో రూపొందిన 'ఒరిజినల్ సిన్', త్వరలో చనిపోబోతున్న ఓ మహిళ ఇంటర్వ్యూ ప్రధానంగా తెరకెక్కిన 'లైఫ్ ఆర్ సమ్‌థింగ్ లైక్ ఇట్', ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రాంతంలో నివసిస్తున్న వారి జీవితాన్ని తెలిపే కథాంశంతో మార్టిన్ కాంబెల్ రూపొందించిన 'బియాండ్ బార్డర్స్', సీరియల్ కిల్లర్‌ను పట్టుకునేందుకు ఫ్రెంచ్ కెనాడియన్ పోలీస్ డిపార్ట్మెంట్కు సహయపడే ఎఫ్‌బీఐ ఏజెంట్ నేపథ్యంతో తెరకెక్కిన 'టేకింగ్ లైవ్స్', రెగ్యులర్ జాబ్స్, లైఫ్‌తో బోర్‌గా ఫీలైన ఓ జంట ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్ళడమనే కథాంశంతో డౌలిమాన్ దర్శకత్వంలో రూపొందిన 'మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్', రేస్ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్ చిత్రంగా రూపొందిన 'లారా క్రాఫ్ట్: టాంబ్ రైడర్', ప్రొఫెషనల్ హంతుకుడైనా తన తండ్రిని కనిపెట్టేందుకు కొడుకు చేసే ప్రయత్నంలో రూపొందిన 'వాంటెడ్', కిడ్నాప్ అయిన తన కొడుకు కోసం తల్లిపదే వేదన నేపథ్యంలో రూపొందిన 'ఛేంజిలింగ్', పోలీసులు వెంబడిస్తుండటంతో వారి నుంచి తప్పించుకోవడానికి ట్రైన్లో వెళ్లే టూరిస్ట్‌ను ప్రియుడిగా మార్చుకున్న తెలివైన మహిళ కథ ప్రధానంగా రూపొందిన చిత్రం 'ది టూరిస్ట్', అడవిని కాపాడుకునేందుకు అందమైన మహిళ చేసే పోరాటం నేపథ్యంలో రూపొందిన 'మేల్‌ఫిసెంట్' వంటి తదితర చిత్రాల్లోని వైవిధ్యమైన పాత్రల్లో జోలీ నటన అద్వితీయం. నటించిన ఏ పాత్రకైనా పూర్తి న్యాయం చేయటంలో జోలీ తనకు తానే సాటి అని నిరూపించుకుంది.
Authorization