అజ్నెస్ జాయుయి.. విలక్షణ పాత్రలతో అద్భుత నటిగా, వైవిధ్యమైన చిత్రాల రూపకల్పనతో
అత్యద్భుతమైన దర్శకురాలిగా, ఆధునిక భావాలు కలిగిన రచయితగా, ఉర్రూతలూగించే
పాటలతో అలరించే గాయనిగా అటు ప్రేక్షకుల్ని, ఇటు శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నారు.
మూస ధోరణిలో వెళ్తున్న ఫ్రెంచ్ చిత్ర పరిశ్రమ తీరు తెన్నులను మార్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి అజ్నెస్ జాయుయి గురించి ఈవారం అందిస్తున్న స్పెషల్ షో...
ఎనిమిదేండ్ల ప్రాయం నుంచే నటనలో శిక్షణ..
1964లో అక్టోబర్ 19న ఫ్రాన్స్‌లోని హాట్స్ డె సినీలోగల ఆంటోని ప్రాంతంలో హుబెర్ట్ జాయుయి, గైజా జాయుయిలకు అజ్నెస్ జాయుయి జన్మించారు. అజ్నెస్ తల్లిదండ్రులిద్దరూ రచయితలైనప్పటికీ సినిమా పరిశ్రమతో సంబంధం లేదు. అయితే సోదరుడు లారెంట్ జాయుయి స్క్రీన్‌ప్లే రైటర్‌గా,దర్శకుడిగా రాణించారు. అజ్నెస్ ఎనిమిదవ ఏట తల్లిదండ్రులు పారిస్‌కి షిఫ్ట్ అయ్యారు. తల్లిదండ్రులు మంచి రచయితలు కావడంతో చిన్నప్పట్నుంచే అజ్నెస్కు సామాజిక అవగాహన కలగడంతోపాటు రైటింగ్‌పై కూడా పట్టు సాధించారు. హైస్కూల్ చదువుకునే సమయంలోనే థియేటర్ చేయడం ప్రారంభించారు. లైసీ హెన్రీ 4 కంపెనీలో థియేటర్ చేశారు. 15 ఏండ్ల వయసులో ఫ్రెంచ్ ప్రైవేట్ డ్రామా స్కూల్లో శిక్షణ తీసుకున్నారు. 1984 నుంచి థియేటర్ డైరెక్టర్, నటుడు, చిత్ర దర్శకుడు పాట్రిక్ చిరౌను అజ్నెస్ ఫాలో అవుతుండేవారు. ఆయన నిర్వహించే క్లాస్‌లకు కూడా వెళ్ళారు. 1987లో పాట్రిక్ చిరౌ రూపొందించిన 'హోటల్ డె ఫ్రాన్స్' చిత్రంలోనూ అగెస్కు నటించే అవకాశం ఇచ్చారు.
ఓ రకంగా ఆమెకిది రెండో చిత్రం. గతంలో 1983లోనే
'లె ఫాకాన్' అనే తునిషియా చిత్రంలో చిన్న పాత్రలో నటించారు. 1987లోనే హరోల్డ్ పింటర్స్ రూపొందించిన 'ఎల్ యానివర్సరీ'లో జీన్ పీర్రె బాక్రితో కలిసి నటించారు. వీరిద్దరు నిజాయితీ గల కొలిగ్స్‌గా తర్వాతి కాలంలో రాణించారు. అంతేకాదు ఇద్దరు కలిసి అనేక సినిమాలకు రైటర్స్‌గా పనిచేశారు. ఆ తర్వాత మూడేండ్ల గ్యాప్‌తో 'ఐవనోవ్', 'క్యాంటి', 'క్యూసినె ఎట్ డిపెండెన్స్స్'లో నటించారు. ఈ సినిమాలు అంతగా ఆదరణ పొందలేదు. అజ్నెస్కు ఆశించిన గుర్తింపు తేలేకపోయాయి. మరో మూడేండ్లపాటు నటిగా గ్యాప్ వచ్చింది.
ఫ్యామిలీ రిసెంబ్లెన్సెస్తో నటిగా తొలి విజయం..
1996లో వచ్చిన 'ఫ్యామిలీ రిసెంబ్లెన్సెస్' చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్నారు. కామెడీ ప్రధానంగా కెడ్రిక్ క్లాపిస్చ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు కమర్షియల్‌గా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇందులో తన నటనకు ఉత్తమ సహాయ నటిగా సెసర్ అవార్డుకు నామినేట్ అయ్యారు. 1997లో 'లె డిమేనేజ్మెంట్', 'సేమ్ ఓల్డ్ సాంగ్' చిత్రాలు చేశారు. ఇందులో 'సేమ్ ఓల్డ్ సాంగ్' ఫర్వాలేదనిపించుకుంది. నెక్ట్స్ ఇయర్ నటించిన 'లె కాసిన్' మంచి విజయాన్ని సాధించి నటిగా అజ్నెస్కు గుర్తింపు తెచ్చింది. మళ్లీ వరుసగా రెండు పరాజయాలు ఆమె తలుపు తట్టాయి. 1999లో వచ్చిన 'ఆన్ ది రన్', 2000లో నటించిన 'ఉనె ఫెమ్మె డిఎక్ట్సెరియర్' బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచాయి.
స్టార్ హీరోయిన్ హోదా తీసుకొచ్చిన చిత్రాలు..
ఇదే ఏడాది విడుదలైన 'ది టేస్ట్ ఆఫ్ అదర్స్' సినిమా విజయం నటిగా అజ్నెస్కు ఊరటనిచ్చింది. 2003లో '24 హవర్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఏ ఉమెన్', 2004లో నటించిన 'ది రోల్ ఆఫ్ హర్ లైఫ్', 'నినాస్ హౌస్', 'లుక్ ఎట్ మీ' చిత్రాలు వరుసగా మంచి విజయాలను సాధించాయి. నటిగా తనకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈవిజయాలతో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. నటిగా మళ్ళీ నాలుగేండ్లు గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్‌లో రైటర్‌గా, దర్శకురాలిగా బిజీ అయ్యారు. మరోవైపు సంగీతంపై దృష్టిపెట్టారు. పలు ఆల్బమ్స్‌ను రూపొందించారు. 2008లో విడుదలైన 'లెట్స్ టాక్ ఎబౌట్ ది రెయిన్' తన కెరీర్లో మరో విజయవంతమైన సినిమాగా నిలిచింది. మరో నాలుగేండ్ల గ్యాప్‌తో నటించిన 'ది డాండెలియన్స్' చిత్రం పరాజయం చెందింది. 2013లో నటించిన 'అండర్ ది రెయిన్బో', 2014లో 'ది ఈజీ వే ఔట్', 2015లో 'ది స్వీట్ ఎస్కేప్', 'ఐయామ్ ఆల్ యువర్స్', గతేడాది విడుదలైన 'ఐ గాట్ లైఫ్' చిత్రాలు ఘన విజయం సాధించి అజ్నెస్్ను ఫ్రెంచ్ చిత్ర సీమలో అగ్ర నటిగా నిలబెట్టాయి. ఈ ఏడాది 'బెస్ట్ ఇంటెన్షన్స్' చిత్రంలో నటించారు.
రచయిత, దర్శకురాలిగా..
కెరీర్ ప్రారంభం నుంచే అజ్నెస్ మంచి రచయిత. తల్లిదండ్రులు రైటర్స్ కావడంతో తనకీ ఆ ప్రతిభ అబ్బింది. నటుడు, రైటర్ జీన్ పీర్రె బాక్రితో కలిసి పలు సినిమాలకు కథలు రాయడం 1987 నుంచే మొదలెట్టారు. 'కూసినె ఎట్ డిపెండెన్సెస్' చిత్రం నుంచి ఇద్దరు కలిసి పనిచేయడం ప్రారంభించారు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాశారు. అదే ఏడాది 'స్మోకింగ్ - నో స్మోకింగ్' చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. అలైన్ రినైస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అనంతరం సెడిక్ క్లాపిస్క్ దర్శకత్వంలో వచ్చిన కామెడీ సినిమా 'ఫ్యామిలీ రిసెంబ్లెన్సెస్'కు కథ, స్క్రీన్‌ప్లే రాశారు. అంతేకాదు ఇందులోనూ జీన్ పీర్రెతో కలిసి నటించడం విశేషం. దీంతోపాటు 1997లో విడుదలైన 'సేమ్ ఓల్డ్ సాంగ్'కు ఈ ఇద్దరు రైటర్లుగా పనిచేయడంతోపాటు ఇందులో జంటగా నటించిన విషయం విదితమే. సినిమా విజయం సాధించి రైటర్లుగా ఈ ఇద్దరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. రైటర్స్‌గా వీరికి మంచి క్రేజ్ ఏర్పడింది. రైటర్‌గా తన సినిమాలు వరుసగా విజయాలను అందుకోవడం, దర్శకత్వ శాఖపై మంచి అవగాహన రావడంతో 2000లో అజ్నెస్ దర్శకురాలిగా మారారు.
తొలి ప్రయత్నంగా 'ది టేస్ట్ ఆఫ్ అదర్స్' సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు రైటర్‌గా తన సహచరుడు జీన్ పీర్రె పనిచేశారు. సోషల్, కల్చర్ ప్రధానంగా తెరకెక్కించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. తొలి సినిమాతోనే దర్శకురాలిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. దీనికి నాలుగు సెసర్ అవార్డులు వరించాయి. అలాగే ఫారెన్ లాంగ్వేజ్ చిత్రం విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఇందులో అన్నె అల్వారో, అలైన్ చాబట్లతోపాటు జీన్ పీర్రె, అగెస్ నటించారు. 'లుక్ ఎట్ మీ', 'లెట్స్ టాక్ ఎబౌట్ ది రెయిన్' చిత్రాలకు అజ్నెస్ దర్శకత్వం వహించారు. కామెడీ డ్రామాగా తెరకెక్కించిన 'లెట్స్ టాక్ ఎబౌట్ ది రెయిన్' సినిమాలో జమెల్ డెబ్బౌజ్, పాస్కెల్ అర్బిల్లాట్లతో కలిసి నటించారు. ఇది ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. కానీ రైటర్‌గా, దర్శకురాలిగా అగెస్కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత కామెడీ చిత్రం 'అండర్ ది రెయింబో' విభిన్న కథాంశంతో తెరకెక్కి ఫర్వాలేదనిపించుకుంది. 2014లో 'ది ఈజీ వే ఔట్' చిత్రానికి రైటర్‌గా పనిచేశారు. గతేడాది 'ప్లేస్ పబ్లిక్' చిత్రానికి దర్శకత్వం వహించారు.
సింగర్‌గానూ అంతర్జాతీయ గుర్తింపు..
అజ్నెస్ బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా, రచయితగా, దర్శకురాలిగానే కాదు సింగర్ కూడా. తన 17 ఏండ్ల వయసులోనే మ్యూజిక్ స్కూల్‌కి వెళ్లారు. 2005 తర్వాత దర్శకత్వంతోపాటు మ్యూజిక్‌పై ఫోకస్ పెట్టారు. పలు అల్బమ్స్ చేశారు. 2006లో 'కాంటా' పేరుతో ఆల్బమ్‌ను రూపొందించారు. అందులో తనే పాటలు పాడటంతోపాటు నటించడం విశేషం. 'కాంటా'కు మంచి స్పందన రావడంతో పలు మిక్స్డ్ లాటిన్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. అంతేకాదు స్పానిష్, పోర్చుగ్రీస్ వంటి దేశాల్లో స్వతహాగా మ్యూజిక్ షోస్ ఇచ్చారు. తన మ్యూజిక్‌లో ఎక్కువగా సంప్రదాయ సంగీతానికి ప్రాధాన్యత నిచ్చారు. అందుకుగానూ 2007లో బెస్ట్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఆల్బమ్‌గానూ విక్టోరియా డె లా మ్యూజిక్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 2009లో 'డాన్స్ మాన్ పేస్' అనే ఆల్బమ్‌ను రూపొందించారు. ఇందులో తను నటించడంతోపాటు పాటలు పాడారు. 2014లో రూపొందించిన 'రియోపారిస్' ఆల్బమ్ తనకు గాయకురాలిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2015లో 'నోస్టాల్గియాస్' అనే ఆల్బమ్ చేశారు. సింగర్‌గా ఫ్రాన్స్లోనేకాదు, పోర్చుగ్రీస్, స్పానిష్ దేశాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'స్మోకింగ్ -నోస్మోకింగ్' చిత్రానికి రచయితగా సెసర్ అవార్డును, 'ఫ్యామిలీ రిసెంబ్లెన్సెస్' చిత్రానికి రైటర్‌గా ఒక సెసర్ అవార్డు, ఒక లుమియర్స్ అవార్డును సొంతం చేసుకున్నారు. 'సేమ్ ఓల్డ్ సాంగ్'కు రచయితగా, సహాయ నటిగా రెండు సెసర్ పురస్కారాలు వరించాయి. 'ది టేస్ట్ ఆఫ్ అదర్స్' చిత్రానికి ఉత్తమ చిత్రంగా ఒక సెసర్, ఒక లూమియర్, ఒక యూరోపియన్ అవార్డు, దర్శకురాలిగా లూమియర్ అవార్డు, రచయితగా ఒక లూమియర్, ఒక యూరోపియన్, ఒక సెసర్ పురస్కారం లభించింది. ఈ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. 'లుక్ ఎట్ మీ' చిత్రానికి రచయితగా కేన్స్ పురస్కారం, యూరోపియన్ అవార్డు దక్కింది. కెరీర్ ప్రారంభం నుంచి నటుడు, రైటర్ జీన్ పీర్రే బక్రితో మంచి అనుబంధం ఉంది. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలకు రైటర్‌గా పనిచేశారు. కలిసి అనేక సినిమాల్లో నటించారు. కొంత కాలం సహజీవనం చేసి విడి పోయారు. దీంతో అజ్నెస్ పెళ్ళి చేసుకోలేదు. అయితే 2012లో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు.
అత్యద్భుత ప్రతిభకు వెండితెర రూపాలు
అజ్నెస్ జాయుయి నటిగా, రైటర్‌గా, దర్శకురాలిగా విభిన్న విభాగాల్లో ప్రతిభను చాటి తానేంటో నిరూపించుకున్నారు. ఆమె నటనకు, దర్శకత్వ ప్రతిభకు ప్రతిరూపాలుగా నిలిచిన సినిమాలు గురించి చూస్తే..
నటిగా తనకు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం 'ఫ్యామిలీ రిసెంబ్లెన్సెస్'. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందింది. ఓ ఎగువ మధ్యతరగతి కుటుంబం పుట్టిన రోజు వేడుక జరుపుకునేందుకు రెస్టారెంట్‌కు వెళ్తుంది. అందులో భోజనం పూర్తయ్యేలోపు వారి మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఇంటి పెద్ద సోదరిగా సింగిల్ లేడీ పాత్రలో అజ్నెస్ నటించారు.
ఓ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్ కోసం ఎస్టేట్ ఏంజెట్‌ను కలుస్తుంది. తన సోదరి, డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన కామిల్లె ఆ ఎస్టేట్ ఏజెంట్‌తో ప్రేమలో పడుతుంది. అనంతరం ఆద్యంతం అలరించే సన్నివేశాలతో మ్యూజికల్ కామెడీ డ్రామాగా రూపొందిన 'సేమ్ ఓల్డ్ సాంగ్' చిత్రంలో అప్పుడే డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన కమిల్లె పాత్రలో అజ్నెస్ నటించి అందం, అభినయంతో మంత్రముగ్దుల్ని చేశారు.
డ్రగ్ డీలర్స్‌కి, పోలీస్‌లకు మధ్య ఉన్న సంబంధం, వారిని ఇన్ఫార్మర్లు ఎలా డీల్ చేశారనే కథాంశంతో వచ్చిన థ్రిల్లర్ చిత్రం 'లె కాసిన్' చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. ముగ్గురు మగాళ్లు, ముగ్గురు మహిళలు, వారికున్న వ్యతిరేకతలు, సాధ్యాసాధ్యాలు, వారి అభిరుచులను తెలిపే కథాంశంతో రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన చిత్రం 'ది టేస్ట్ ఆఫ్ అదర్స్'. సోషల్ కల్చరల్ ఐడెంటిటీని తెలిపే ఈ చిత్రంలో అజ్నెస్ బార్ గర్ల్‌గా గామరస్ పాత్రలో నటించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. అంతేకాదు ఆమె దర్శకురాలిగా మారి రూపొందించిన తొలి చిత్రం కావడం ఓ విశేషమైతే, ఇది బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడం మరో విశేషం.
1913, 1936, 2001 కాలాల్లో ఓ మహిళ జర్నీని 24 గంటల్లో తెలిపే కథాంశంతో ఆద్యంతం నాటకీయంగా తెరకెక్కిన చిత్రం '24 హవర్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఏ ఉమెన్'. ఇందులో లీడ్ రోల్లో అజ్నెస్ మెప్పించారు.
ఓ ఫ్రీలాన్స్ ఫ్యాషన్ మ్యాగజైన్ రైటర్ ప్రముఖ నటి దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయిన తర్వాత తన జీవితం ఒడిదుడుకులకు లోనవుతుంది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల సమాహారంగా తెరకెక్కిన 'ది రోల్ ఆఫ్ హర్ లైఫ్' చిత్రంలో ప్రముఖ నటిగా తన నట విలక్షణత చూపించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూదుకు చెందిన చిన్న పిల్లలను కోట నుంచి పంపించేస్తారు. అక్కడ వారంతా శరణార్థ శిబిరంలో ఉండాల్సి వస్తుంది. వారికి ఎవరు ఆశ్రయం కల్పించారనే ఇతివృత్తంతో హిస్టారికల్ వార్ డ్రామాగా తెరకెక్కిన 'నినాస్ హౌస్' చిత్రంలో చిన్న పిల్లల శరణార్థ క్యాంపులో వారికి బాగోగులు చూసుకునే మహిళగా అజ్నెస్ నటించి ఆకట్టుకున్నారు.
అజ్నెస్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం 'లుక్ ఎట్మీ'. మ్యూజికల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా.. బరువు ఎక్కువగా ఉన్న ఓ గాయని ఫ్యామిలీ స్ట్రగుల్స్‌ని తెలియజేస్తుంది. ఇందులో మ్యూజిక్ టీచర్‌గా అజ్నెస్ మెప్పించారు. తన తల్లి చనిపోవడంతో ఫెమినిస్ట్ రైటర్ పారిస్ నుంచి తన సొంత ఊరికి వచ్చి, ఇంటిని అమ్మేసి రాజకీయాల్లోకి వెళ్ళాలని ప్రకటిస్తుంది. అనంతరం చోటు చేసుకున్న సన్నివేశాల నేపథ్యంలో కామెడీ ప్రధానంగా రూపొందిన చిత్రం 'లెట్స్ టాక్ ఎబౌట్ ది రెయిన్'. మధ్య తరగతి జీవితాన్ని, అందులోని సంస్కృతి పరమైన సంఘర్షణను, వారి తప్పులను, శృంగారం, బలమైన కుటుంబ సంబంధాలు, అంతర్లీనంగా కొంత బాధ, చిన్న విషాదాన్ని ప్రతిబింబించే ఈ చిత్రానికి అజ్నెస్ దర్శకత్వం వహిస్తూ ఫెమినిస్ట్ రైటర్‌గా నటించి అబ్బుర పరిచారు.
ఫ్రెంచ్ ఆధునిక సమాజంలోని అస్తిత్వ వాదాన్ని తెలిపే కథాంశంతో రూపొందిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'అండర్ ది రెయింబో' చిత్రంలో ఆశ, ఊహల్లో బతికే మహిళగా అజ్నెస్ నటించారు. ఈ చిత్రానికి కూడా తనే దర్శకత్వం వహించారు. ముగ్గురు అన్నదమ్ముల జీవితాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'ది ఈజీ వే ఔట్'. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో డైనమిక్ లేడీగా అజ్నెస్ తనదైన నటనతో కట్టిపడేశారు. ఫ్లైట్ ఎక్కాలని, స్కూటర్ మీద తిరగాలని కలలు కనే ఓ మధ్యతరగతి గ్రాఫిక్ డిజైనర్ జీవితంలోని మలుపులు, మజిలీలను తెలిపే కథాంశంతో కామెడీ డ్రామాగా రూపొందిన 'ది స్వీట్ ఎస్కేప్' చిత్రంలో ఓ కీలక పాత్రలో అజ్నెస్ నటించి మెప్పించారు. దేనికైనా నో చెప్పలేని ఓ విచిత్రమైన సిండ్రోమ్‌తో బాధపడుతున్న అమ్మాయి హన్నా జీవితంలో ఆసక్తికర మలుపులను తెలిపే కథాంశంతో తెరకెక్కిన కామెడీ చిత్రం 'ఐయామ్ ఆల్ యువర్స్' చిత్రంలో హన్నా తల్లిగా, సైక్రియాటిస్ట్‌గా అజ్నెస్ నటించారు. త్వరలో నానమ్మగా మారబోతున్న 50 ఏండ్ల మహిళ జర్నీని, స్ట్రగుల్‌ను తెలిపే 'ఐ గాట్ లైఫ్' చిత్రంలో 50 ఏండ్ల మహిళగా అజ్నెస్్ అత్యద్భుతంగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు.
Authorization