ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులను ఈ ఏడాది ఎవరు గెల్చుకుంటారనే ఉత్సుకత అందరిలోనూ ఉంది. 91వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) ప్రదానోత్సవం ఫిబ్రవరి 24న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్లో అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ విశ్లేషకులు ఫలానా చిత్రానికి, ఫలానా నటుడికి.. ఆస్కార్ గ్యారంటీ అంటూ జోస్యం చెబుతున్నారు. మరి వారి జోస్యాన్ని నిజం చేసేందుకు ఆస్కార్ బరికి అర్హత సాధిస్తాయని విశ్లేషకులు భావిస్తున్న సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
ఉత్తమ చిత్రాల విభాగంలో పోటీ పడుతున్న కొన్ని చిత్రాలు
బ్లాక్ పాంథర్
కెప్టెన్ అమెరికా సివిల్ వార్ తర్వాత కింగ్ టి చల్లా తన వాకండా రాజ్యానికి తిరిగి వస్తాడు. తన దేశ ప్రజలను లీడ్ చేస్తూ భవిష్యత్‌ని సరికొత్తగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ తన తండ్రి చేసిన కొన్ని తప్పిదాల వల్ల అతని శత్రువుల పిల్లలు టి.చల్లాని, అతని దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటారు. కొత్తగా పుట్టుకొచ్చిన శత్రువులను లీడర్ టి.చల్లా, అత్యంత శక్తింతమైన అతని టీమ్ ఎలా ఎదుర్కొందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. మార్వెల్ సంస్థ నుంచి వచ్చిన 18వ అమెరికన్ సూపర్ హీరో చిత్రమిది. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో టి.చల్లా పాత్రలో చాడ్విక్ బోస్మాన్ నటించగా, ప్రధాన పాత్రల్లో మైఖేల్ బి. జోర్డాన్, టుపిటా న్లైంగ్వో, డానై గురిరా, మార్టిన్ ఫ్రీమాన్, డానియల్ కలుయా తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా దర్శకత్వం, విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్‌ప్లే, నటీనటుల నటన పరంగా విశేష ప్రశంసలందుకుంది. 200 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 1.34 బిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డ్ కూడా సృష్టించింది.
బ్లాక్క్లాన్స్మ్యాన్
ఆఫ్రికన్-అమెరికన్ పోలీస్ అధికారి రాన్ స్టాల్వార్త్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. కోలోరాడో స్ప్రింగ్స్ పట్టణంలోకి అక్రమంగా చొరబడుతున్న 'కు క్లుక్స్ క్లాన్' (కేకేకే) టెర్రరిస్ట్‌లను అంతం చేసేందుకు రాన్ స్టాల్వార్త్ ఓ మిషన్ చేపడతారు. అత్యంత ప్రమాదకరమైన ఈ మిషన్‌ని తను ఎలా ఛేదించాడనే ఇతివృత్తంతో బయోగ్రాఫికల్ కామెడీగా రూపొందిన చిత్రమిది. స్పైక్ లీ దర్శకత్వం వహించారు. పోలీస్ అధికారి రాన్ స్టాల్వార్త్ రియల్ లైఫ్‌లో రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రాన్ స్టాల్వార్త్ పాత్రలో జాన్ డేవిడ్ వాషింగ్టన్ నటించారు. అతని నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమా గతేడాది ఆగస్ట్‌లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కేన్స్‌లో ప్రదర్శితమై గ్రాండ్ ప్రిక్స్ అవార్డుని గెలుచుకుంది. 15 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 89 మిలియన్ డాలర్లను వసూలు చేసి చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని సాధించింది.
కెన్ యు ఎవర్ ఫర్ గీవ్ మీ?
అమెరికాకు చెందిన నవలా రచయిత్ర లీ ఇజ్రాయిల్ జీవితాన్ని తెలిపే బయోగ్రాఫికల్ చిత్రమిది. లీ రైటర్‌గా ఎంతో పాపులర్ అవుతారు. కానీ తన బయోగ్రఫీ రాసే టైమ్‌లో క్రిటికల్‌గా, కమర్షియల్‌గా ఫెయిల్ అవుతారు. ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమవుతాయి. తన అవసరాల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతోపాటు ఆమెకు మతిమరుపు కూడా వస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే ఇతివృత్తంతో మహిళా దర్శకురాలు మెరియెల్లె హెల్లర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. లీ ఇజ్రాయిల్ పాత్రలో మెల్లీసా మెక్ కార్తీ అత్యద్భుతంగా నటించి మెప్పించారు. గతేడాది అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని రాబట్టుకుంది. కమర్షియల్గానూ యావరేజ్‌గా నిలిచింది.
ది ఫేవరేట్
ఇది ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య అధికారం కోసం జరిగే సంఘర్షణ నేపథ్యంలో సాగే హిస్టారికల్ పీరియడ్ కామెడీ డ్రామా. క్వీన్ అన్నే నుంచి సింహాసనాన్ని తన స్నేహితురాలు సారా పక్కా ప్లానింగ్ చేసి చేజిక్కించు కుంటుంది. ఆ తర్వాత ఎంటర్ అయిన సారా కజిన్ అబిగైల్ హిల్‌కి, సారాకు మధ్య తలెత్తిన వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీసిందనేది ఆసక్తికరం. 18వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రానికి యోగ్రాస్ లాంథిమాస్ దర్శకత్వం వహించారు. ఈ జనవరి 1న యుకేలో, గతేడాది నవంబర్‌లో అమెరికాలో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించుకున్నప్పటికీ క్రిటికల్‌గా మంచి ప్రశంసలందుకుంది.
అబిగైల్ హిల్‌గా ఎమ్మా స్టోన్, క్వీన్ అన్నెగా ఒలివర్ కాల్మన్, సారా పాత్రలో రచెల్ వైజ్ నటించి మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ చిత్రం ఇప్పటికే వెనిస్ వంటి పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. పలు విభాగాల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయి ఒలివర్ కాల్మన్ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్నారు.
ఫస్ట్ మ్యాన్
చంద్రుడిపై దిగిన తొలి వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్పేస్ జర్నీ, స్పేస్ మిషన్ ప్రధానంగా అతని జీవితాన్ని ప్రతిబింబించే కథాంశంతో రూపొందించిన చిత్రం 'ఫస్ట్ మ్యాన్'. బయోగ్రఫీ హిస్టరీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది అక్టోబర్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. డామియన్ చజెల్లే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం
58 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 100 మిలియన్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పాత్రలో ర్యాన్ గోస్లింగ్ నటించారు. ఆయన భార్య పాత్రలో క్లారీ ఫోరు మెప్పించారు. ఈ చిత్రం ఇప్పటికే వెనిస్ వంటి పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. పలు విభాగాల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేటై ఒరిజినల్ స్కోర్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ని గెలుచుకుని ఆస్కార్ కోసం పోటీపడుతుంది.
గ్రీన్ బుక్
1960కి చెందిన ఆఫ్రికన్ అమెరికన్ క్లాసికన్, జాజ్ పియానిస్ట్ డాన్ షిర్లే, అతని బాడీగార్డ్, కార్ డ్రైవర్ టోనీ వల్లెలాంగా మధ్య అనుబంధం, వారు చేపట్టిన టూర్లో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల సమాహారమే ఈ చిత్రం. ఈ బయోగ్రాఫికల్ కామెడీ చిత్రానికి పీటర్ పార్రెల్లీ దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. కథ, కథనాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డాన్ షిర్లీగా మహెర్షాలా అలీ, బాడీగార్డ్‌గా విగ్గో మోర్టెన్సన్ నటన కట్టిపడేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా టోరంటో ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. మ్యూజికల్ కామెడీ విభాగంలో ఉత్తమ చిత్రంగా, సహాయ నటుడిగా, స్క్రీన్‌ప్లే విభాగాల్లో గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలను ఇప్పటికే కైవసం చేసుకుంది.
ఇఫ్ బీలె స్ట్రీట్ కుడ్ టాక్
ఓ ఆఫ్రికన్-అమెరికన్ యువతి వివాహానికి ముందే గర్భం దాల్చుతుంది. తన ప్రేమపై వచ్చిన అపవాదుని పోగొట్టి, తన ప్రేమికుడి నిజాయితీని, ఇన్నోసెంట్‌ని నిరూపించుకునేందుకు ఆ యువతి కాలానికి వ్యతిరేకంగా చేసే పోరాటం, పడే స్ట్రగుల్‌ని తెలిపే కథాంశమే ఈ చిత్రం. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి బేర్రీ జెంకిన్స్ దర్శకత్వం వహించారు.
జేమ్స్ బాల్డ్విన్స్ రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కికి లైనె, స్టీఫాన్ జేమ్స్, కోల్మన్ డామింగో ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా యువతి పాత్రలో కికి లైనె నటన కట్టిపడేస్తుంది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా పరాజయం చెందింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు ఎంపికై సహాయ నటి విభాగంలో అవార్డుని దక్కించుకుంది.
లీవ్ నో ట్రేస్
తండ్రి, అతని 13 ఏండ్ల కూతురు పోర్ట్లాండ్లోని ఓ పెద్ద ఫారెస్ట్‌లో నివసిస్తుంటారు. వాళ్లు చేసిన చిన్న తప్పిదం వల్ల కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుని, వారి లైఫ్ రిస్క్‌లో పెడుతుంది. మరి వాళ్ళు చేసిన తప్పేంటి?. తలెత్తిన ఇబ్బందులను ఎలా ఎదుర్కొన్నారనేది చిత్ర కథాంశం. ఆద్యంతం నాటకీయంగా రూపొందిన ఈ సినిమాకి డెబ్రా గ్రానిక్ దర్శకత్వం వహించారు.
తండ్రీ కూతుళ్ళుగా బెన్ ఫోస్టర్, థామాసిన్ మెక్ కెంజీ నటించి ఆకట్టుకున్నారు. గతేడాది జూన్‌లో విడుదలైన ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని రాబట్టుకుంది. పలు ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడి అవార్డులను గెలుచుకుంది.
రోమా
1970-71 మధ్య మెక్సికోలోని హౌస్ కీపర్స్‌గా పనిచేసే ఓ మధ్య తరగతి ఫ్యామిలీ జీవనం ఎలా సాగింది?, వారి కుటుంబం ఎలాంటి గందరగోళానికి గురైంది?, అందుకు కారణమేంటి? వారి జీవితంలోని భావోద్వేగాలు, ఆశలు, ఆనందాలను తెలిపే కథాంశంతో ఆద్యంతం డ్రామాగా రూపొందిన చిత్రం 'రోమా'. 'చిల్డ్రన్ ఆఫ్ మెన్', 'గ్రావిటీ'
వంటి సంచలనాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఆల్ఫోన్సో క్వారోన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.వెనిస్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి ప్రశంసలందుకుంది. ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయి ఉత్తమ దర్శకుడుతోపాటు ఫారెన్ లాంగ్వేజ్ విభాగంలో అవార్డుని అందుకుంది
ఏ స్టార్ ఈజ్ బోర్న్
తాగుడుకి బానిసైన ఓ మ్యూజిషియన్ తనని తాను వెతుక్కునే క్రమంలో ఓ యువ గాయనితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా 'ఏ స్టార్ ఈజ్ బోర్న్'. నటుడు బ్రాడ్లీ కూపర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారడం విశేషం. ఇందులో మ్యూజీషియన్‌గా బ్రాడ్లీ కూపర్, అతని లవర్‌గా లేడీ గాగా నటించి మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ సినిమా 1937లో అదే పేరుతో వచ్చిన చిత్రానికి రీమేక్. ఆ తర్వాత 1954లో, 1976లో రీమేక్ చేశారు. ఆ రెండు సినిమాలు విజయం సాధించాయి. అంతేకాదు 2013లో బాలీవుడ్లో దీన్ని 'అషిఖి 2'గా రీమేక్ చేశారు. ఇది కూడా ఘన విజయం సాధించింది.