మిల్లా జోవోవిచ్..
ప్రేక్షకులు మెచ్చిన క్రేజీ యాక్షన్ క్వీన్. ఒళ్ళు గగుర్పొడిచే సాహసభరిత యాక్షన్ సన్నివేశాలకు కేరాఫ్. గ్లామర్‌తోపాటు యాక్షన్‌తో స్టార్ హీరోలకు దీటుగా హాలీవుడ్లో సత్తా చాటిన అగ్ర నటి.
భిన్న, వైవిధ్యమైన, ప్రయోగాత్మక విలక్షణ పాత్రలతో ఆడియెన్స్‌ని ఫిదా చేసి అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయిక. నటిగా, మోడల్‌గా, సింగర్‌గా, లిరిక్ రైటర్‌గా, మ్యూజిక్ కంపోజర్‌గా అందర్నీ అలరిస్తున్న మిల్లా జోవోవిచ్ గురించి ఈ వారం అందిస్తున్న
స్పెషల్ 'షో'...
భిన్న నేపథ్యం.. వైవిధ్యమైన మనస్తత్వం..
మిల్లా జోవోవిచ్ 1975లో డిసెంబర్ 17న సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఉక్రెయిన్‌కి చెందిన కీవ్‌లో జన్మించారు. రష్యన్ నటి గాలినా లాగినోవాకి కూతురు. తండ్రి బాగిచ్ జోవోవిచ్ సెర్బియన్ డాక్టర్. తన ఐదేండ్ల వయసులో జోవోవిచ్ ఫ్యామిలీ లాస్ ఏంజెల్స్‌లో సెటిల్ అయ్యారు. అక్కడికి వెళ్ళిన కొన్ని రోజులకే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. నటనపరంగా అవకాశాల కోసం మిల్లా తల్లి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ భాషాపరమైన ఇబ్బందుల వల్ల ఛాన్సులను దక్కించుకోలేకపోయింది. దీంతో చేసేది లేక దర్శకుడు బ్రియాన్ డె పాల్మా ఇంట్లో పనికి చేరారు. లాస్ ఏంజెల్స్‌లోని పబ్లిక్ స్కూల్లో మిల్లా జాయినై ఇంగ్లీష్‌లో మంచి పట్టు సాధించారు. మిల్లా రష్యా నుంచి వచ్చిందని తోటి విద్యార్థులు టీజ్ చేసేవాళ్ళు. టీనేజ్‌లో మిల్లా రెబల్‌గా ఉండటంతోపాటు డ్రగ్స్ వాడకం, షాపింగ్ మాల్స్ విధ్వంసం, క్రెడిట్ కార్డ్ మెసాలకు పాల్పడం వంటివి చేశారు. సెవెన్త్ గ్రేడ్ చదువుకునే టైమ్‌లోనే మిల్లా మోడలింగ్‌పై దృష్టి సారించారు.
మోడలింగ్ నుంచి సినిమా వైపు అడుగులు..
1985 తర్వాత మిల్లా తల్లికి నటిగా అవకాశాలు రావడంతో మిల్లాని యాక్టింగ్ స్కూల్‌కి పంపించారు. నటనపై మంచి పట్టు సాధించడంతోపాటు మిల్లా మోడలింగ్‌లోనూ బాగా రాణించారు. 1988లో మొదటిసారి టెలివిజన్ ఫిల్మ్ 'ది నైట్ ట్రెయిన్ టు ఖాట్మండు'లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఏడాదిలోపే సినిమాలో నటించే ఆఫర్ కూడా వరించింది. రొమాంటిక్ థ్రిల్లర్ 'టు మూన్ జంక్షన్'లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. అదే సమయంలో 'పారడైజ్', 'మ్యారీడ్ విత్ చిల్డ్రన్', 'పార్కర్ లెవిస్ కెనాట్ లాస్' వంటి టెలివిజన్స్తో బుల్లితెరపై మంచి గుర్తింపు పొందారు. 15వ ఏట 'రిటర్న్ టు ది బ్లూ లాగూన్'లో అప్పటి పాపులర్ హీరో బ్రియాన్ క్రాజ్తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. అయితే పలు సన్నివేశాల్లో న్యూడ్‌గా కనిపించడంతో ఈ సినిమాలోని ఆమె పాత్ర పలు వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ ఉత్తమ యువ కథానాయికగా యంగ్ ఆర్టిస్ట్ అవార్డుని, వరస్ట్ న్యూ స్టార్‌గా గోల్డెన్ రాస్బెర్రీ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషం.
వరుస పరాజయాలతో నటనకి బ్రేక్..
ప్రముఖ నటుడు క్రిస్టియన్ స్లాటర్తో కలిసి 'కుఫ్స్' చిత్రంలో, చార్లీ చాప్లిన్ జీవితం ఆధారంగా వచ్చిన 'చాప్లిన్'లో ప్రముఖ నటి మిల్డ్రెడ్ హర్రీస్ పాత్రలో, 1993లో 'డేజ్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్' చిత్రంలో కీలక పాత్రలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. వరుస పరాజయాలతో నటనని అస్యహించుకున్నారు. అంతేకాదు నటనకు బ్రేక్ ఇచ్చి యూరప్ వెళ్ళిపోయారు. మ్యూజిక్ వైపు దృష్టి సారించారు. దాదాపు నాలుగేండ్ల తర్వాత 1997లో రీఎంట్రీ ఇస్తూ 'ది ఫిఫ్త్ ఎలిమెంట్'లో బ్రూస్ విల్లిస్, గ్యారీ ఓల్డ్మన్లతో కలిసి నటించారు. లుక్ బెస్సాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె ఏలియన్‌గా నటించారు. అందుకు 400 పదాలు ఏలియన్ ఫిక్షన్ లాంగ్వేజ్‌ని కనిపెట్టారు. అందులో మిల్లా కూడా భాగమయ్యారు. ఇది కేన్స్‌లో ప్రదర్శించబడింది. ఇందులోని లీలూ పాత్ర తన కెరీర్లోనే బెస్ట్ రోల్ అని మిల్లా పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. ఈ చిత్రం తన కెరీర్‌కి తొలి బ్రేక్ నిచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. 1998లో స్పైక్ లీ దర్శకత్వంలో వచ్చిన 'హి గాట్ గేమ్'లో డెంజెల్ వాషింగ్టన్, రే అలెన్‌తో కలిసి నటించారు. పాపులర్ చిత్రం 'ది మెసెంజర్: ది స్టోరీ ఆఫ్ జోనా ఆఫ్ ఆర్క్'లో నటించే ఛాన్స్‌ని దక్కించుకున్నారు. దీనికి లుక్ బెస్సాన్(తన భర్త) దర్శకత్వం వహించడం విశేషం. 2000లో 'ది మిలియన్ డాలర్ హోటెల్'లో మెల్ గిబ్సన్‌తో కలిసి నటించారు. అంతేకాదు సినిమాలోని ఓ సౌండ్ ట్రాక్‌కి గాత్రాన్ని కూడా అందించారు. అలాగే 'ది క్లెయిమ్', 'జూలాండర్'లో భాగమైనప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి.
'రెసిడెంట్ ఈవిల్'తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు..
స్లోగా సాగుతున్న మిల్లా కెరీర్‌కి 2002లో విడుదలైన 'రెసిడెంట్ ఈవిల్' చిత్రం అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది. దీన్ని వీడియో గేమ్ ఆధారంగా రూపొందించడం విశేషం. ఈ సినిమాలో నటించేందుకు కారణం ఆ వీడియో గేమ్‌కి తన సోదరుడు మాక్రో పెద్ద అభిమాని. ఇందులో మిల్లా యాక్షన్ సన్నివేశాల్లో స్వయంగా నటించడం మరో విశేషం. ఇదే ఏడాది వచ్చిన 'యు స్టుపిడ్ మ్యాన్', 2003లో నటించిన 'డుమ్మీ' చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. 'నో గుడ్ డీడ్' మంచి ఆదరణ పొందింది. రెండేండ్ల తర్వాత 'రెసిడెంట్ ఈవిల్'కి సీక్వెల్‌గా 'రెసిడెంట్ ఈవిల్: అపోకలిప్సె' వచ్చింది. ఇందులో మరోసారి హర్రర్ ప్రధానంగా సాగే ఎలైస్ పాత్రలో కనువిందు చేశారు. అలెగ్జాండర్ విట్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కమర్షియల్‌గా సత్తా చాటింది. మరోసారి మిల్లా జోవోవిచ్కి పెద్ద బ్రేక్‌నిచ్చింది. 2006లో నటించిన 'ఆల్ట్రావాయిలెట్',
'45' చిత్రాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు.
మరోసారి 'రెసిడెంట్ ఈవిల్: ఎక్స్టిన్షన్'లో భాగమయ్యారు. 2007లో విడుదలైన
ఈ సినిమా సైతం భారీ సక్సెస్ సాధించి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా హాలీవుడ్లో అగ్ర నటీమణుల జాబితాలోనూ చేర్చింది. ఇక వరుసగా 'పెలెర్మో షూటింగ్', 'ఏ పర్ఫెక్ట్ గెట్‌వే', 'ది ఫోర్త్ కైండ్', 'స్టోన్' చిత్రాల్లో నటించినా ఇవి పెద్దగా ఆదరణ పొందలేదు. మరోసారి 'రెసిడెంట్ ఈవిల్' సిరీస్‌లో భాగంగా వచ్చిన నాల్గో చిత్రం 'ఆఫ్టర్ లైఫ్'లో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో తిరుగులేని నటిగా ఎదిగారు. ఆ తర్వాత నటించిన 'డర్టీ గర్ల్', 'లక్కీ ట్రబుల్', 'బ్రింగింగ్ అప్ బాబీ', 'ది త్రీ మస్కీటీర్స్', 'ఫేసెస్ ఇన్ ది క్రౌడ్', 'రెసిడెంట్ ఈవిల్: రిట్రిబ్యూషన్', 'కింబ్లైన్', 'సర్వైవర్', 'జూలాండర్ 2', 'రెసిడెంట్ ఈవిల్: ది ఫైనల్ ఛాప్టర్', 'షాక్ అండ్ అవ్', 'పారాడైస్ హిల్స్' వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. అయితే ఇందులో 'రెసిడెంట్ ఈవిల్' చిత్రాలు, 'ది త్రీ మస్కీటర్స్' తప్ప మరే సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం 'హెల్బారు', 'మాన్స్టర్ హంటర్' చిత్రాల్లో నటిస్తున్నారు.
మ్యూజిక్‌లోనూ ఆల్‌రౌండర్..
1988లో మొదట ఎస్బీకే రికార్డ్స్‌లో చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్‌కి పనిచేశారు. సింగర్స్ కేట్ బుష్, సినియడ్ ఓ కన్నర్, దిస్ మోర్టల్ కోయిల్, కోక్టీయు ట్వీన్స్లతో కలిసి పలు ఆల్బమ్స్ చేశారు. పాప్ ఆల్బమ్‌కి సాధ్యమైనంత వరకు సొంతంగా లిరిక్స్ రాయడంతోపాటు ఇన్స్ట్రూమెంట్స్ కూడా సొంతంగా వాడి చేసే ప్రయత్నం చేశారు. మిల్లా రూపొందించిన మొదటి ఆల్బమ్ 'ది డివైన్ కామెడీ' 1994లో విడుదలై మంచి ఆదరణ పొందింది. తర్వాత 'జెంటిల్‌మ్యాన్ వు ఫెల్' మ్యూజిక్ సింగిల్‌ని రూపొందించారు. ఇదే ఏడాది తన ఆల్బమ్స్ ప్రమోషన్ కోసం అమెరికా టూర్ నిర్వహించారు. 'సాటర్ డే నైట్ లైవ్' ఆల్బమ్‌లో మెరిశారు. 1998లో 'ది పీపుల్ ట్రీ సెస్సన్స్' ఆల్బమ్, 1999లో క్రిస్ బ్రెన్నర్తో కలిసి ప్లాస్టిక్ హ్యాజ్ మెమరీ పేరుతో ఓ ప్రయోగాత్మక బ్యాండ్‌ని రూపొందించారు. దీనికి తనే పాటలు రాయడం, పాడటం, మ్యూజిక్ కంపోజ్ చేయడం చేశారు. ఎలక్ట్రానిక్ గీటార్ని కూడా వాయించారు. లాస్ ఏంజెల్స్, న్యూయార్క్ సిటీలో పలు షోస్‌ని నిర్వహించారు. దీంతోపాటు వర్జిన్ రికార్డ్స్‌ని విడుదల చేశారు. మ్యూజిక్ వీడియో 'ఇఫ్ యు కెనాట్ సే నో' పాటలో మెరిసారు. 'బ్యాండ్ యువర్ హెడ్', 'ఇట్ ఈజ్ యువర్ లైఫ్', 'ఎలక్ట్రిక్ స్కై' సింగిల్స్ మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీంతోపాటు 'ది మిలియన్ డాలర్ హోటెల్' సౌండ్‌ట్రాక్‌కి చెందిన 'శాటిలైట్ ఆఫ్ లవ్', 'డుమ్మీ'లో రెండు పాటలు, 'అండర్‌వరల్డ్', 'బ్లడ్ ఇన్‌టూ వైన్'తోపాటు 'ఆన్ ది హిల్', 'ఫార్మర్ లవర్', 'ఐ నో ఇట్ ఈజ్ యు', 'ది మిషన్', 'ఇంట్రడక్షన్' సాంగ్స్‌లోనూ మెరిశారు. నటన, సంగీతంతోపాటు మోడలింగ్, ప్యాషన్ డిజైనింగ్ కూడా చేశారు. మోడల్‌గా 100కుపైగా మ్యాగజైన్స్‌కి ఫొజులిచ్చారు. ఎల్ ఓరియల్ కాస్మోటిక్ కంపెనీకి అధికార ప్రతినిధిగానూ ఉన్నారు. 2006లో ఫోర్బ్స్ ప్రకటించిన రిచ్సెస్ట్ సూపర్మోడల్స్ ఆఫ్ ది వరల్డ్ జాబితాలో స్థానం సంపాదించారు. పలు క్లోథింగ్ సంస్థలకి బ్రాండ్ అంబాసిడల్గానూ వ్యవహరించారు. 'జోవోవిచ్ హాక్' పేరుతో ఓ కొత్త బ్రాండ్‌ని తయారు చేసి షోరూమ్‌ని ప్రారంభించారు. అప్పట్లో జోవోవిచ్ హాక్ డిజైనింగ్‌కి మంచి క్రేజ్ ఉండేది. దీనికిగానూ పలు ఫ్యాషన్ అవార్డులను కూడా అందుకున్నారు. తనకి పేరు తెచ్చిన 'రెసిడెంట్ ఇవిల్' చిత్రాలతో పలు షార్ట్స్‌ని డిజైన్ చేశారు. వాటికి భారీ క్రేజ్ ఉంది. క్రియేటర్ ఎంటర్టైన్మెంట్ అనే కంపెనీ కూడా స్థాపించారు. జోవోవిచ్ 'రెసిడెంట్ ఈవిల్' చిత్రాలతో హాలీవుడ్ ఏ లిస్ట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. అనేక చిత్రాల్లో యాక్షన్ చిత్రాలతో అబ్బురపరచడంతో ఆమెని విహెచ్1 ఛానెల్ 'రీగ్నింగ్ క్వీన్ ఆఫ్ కిక్ బట్' (పాలించే రాణి)గా అభివర్ణించింది. ఎమ్‌టీవీ 'ఎవ్రీ గీక్స్ డ్రీమ్ గర్ల్‌గా' పిలిచింది. నటిగా తాను ఎంతో పాపులర్ అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రముఖంగా చెప్పుకునే ఏ అవార్డు మిల్లాకి దక్కకపోవడం గమనార్హం.
అబ్బురపరచే విలక్షణ పాత్రలు
మిల్లా జోవోవిచ్ ఎక్కువగా గ్లామర్, యాక్షన్ నేపథ్య పాత్రలతో పాపులర్ అయ్యారు.
ముఖ్యంగా ఆమె చేసే యాక్షన్‌కి ప్రపంచ ప్రేక్షకులు ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు.
నటిగా రొమాంటిక్ ఏరోటిక్ థ్రిల్లర్ 'టూ మూన్ జంక్షన్' చిత్రంలో కీలక పాత్రలో నటించారు.
తనకి మంచి పేరు తెచ్చిన సినిమా 'రిటర్న్ టు ది బ్లూ లాగూన్'. ప్రమాదవశాత్తు ఓ దీవిలో తప్పిపోయిన ఇద్దరు పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారిలో వచ్చిన మార్పేంటి?, ఇద్దరు ప్రేమలో పడటం, తర్వాత చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల సమాహారంగా రూపొందిన చిత్రమిది. ఇందులో దీవిలో చిక్కుకున్న అమ్మాయిగా మిల్లా ఇన్నోసెంట్, డీగ్లామర్ నటనతో మంత్రముగ్ధుల్ని చేశారు. ఇందులో ఆమె అందం, నటనని బ్రూక్ షీల్డ్స్‌తో పోల్చారు. అలాగే పలు సన్నివేశాల్లో న్యూడ్‌గా కనిపించారు. ఓ అల్లరి పోలీస్ చేసే కామెడీ, యాక్షన్ ప్రధానంగా రూపొందించిన 'కుఫ్స్' చిత్రంలో కామెడీ పోలీస్ ప్రియురాలిగా, ప్రెగెంట్గా తనదైన నటనతో మెస్మరైజ్ చేశారు. చార్లీ చాప్లిన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ కామెడీ డ్రామా 'చాప్లిన్'లో ఆయన మొదటి భార్య మిల్డ్రెడ్ హర్రీస్ పాత్రలో కనువిందు చేశారు. అడ్వెంచర్ కామెడీ చిత్రం 'డేజ్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్' చిత్రంలో స్కూల్ గర్ల్‌గా, సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ప్రధానంగా రూపొందిన 'ది ఫిఫ్త్ ఎలిమెంట్' చిత్రంలో ప్లానెట్ని సేవ్ చేసేందుకు వచ్చిన ఏలియన్‌గా, స్పోర్ట్స్ డ్రామా 'హి గాట్ గేమ్'లో వ్యభిచారి పాత్రలో మైమరపించారు. ఎపిక్ హిస్టారికల్ డ్రామా 'ది మెసెంజర్: ది స్టోరీ ఆఫ్ జాన్ ఆఫ్ ఆర్క్'లో యోధురాలిగా మంత్రముగ్ధుల్ని చేశారు. బ్రిటిష్-కెనాడియన్ వెస్ట్రర్న్ రొమాంటిక్ చిత్రం 'ది క్లైమ్'లో ఐరీష్ వలసదారుడి పోర్చ్‌గీస్ ప్రియురాలిగా, సెలూన్ నడిపించే అమ్మాయిగా, హోటల్ నేపథ్యంలో ఓ గ్యాంగ్ చుట్టూ సాగే మిస్టరీ థ్రిల్లర్ డ్రామా 'ది మిలియన్ డాలర్ హోటల్' చిత్రంలో సంఘర్షణ పడే అమ్మాయిగా, యాక్షన్ కామెడీ 'జూలాండర్'లో హంతకురాలిగా, 'రెసిడెంట్ ఈవిల్'లో ఉంబ్రెల్లా కార్పొరేషన్ క్రియేట్ చేయబడ్డ ఎలైస్గా అందర్ని అలరించారు. ఇదే కాదు ఈ సిరీస్‌లో భాగంగా వచ్చిన ఆరు సినిమాల్లోనూ ఎలైస్ పాత్రల్లో నటించి మెప్పించారు.
కామెడీ డ్రామా 'డుమ్మీ'లో రాక్ సింగర్‌గా, క్రైమ్ థ్రిల్లర్ 'నో గుడ్ డీడ్'లో మానిప్యులేటివ్ ముఠా భార్యగా, సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ట్రా వాయిలెట్'లో మూవ్మెంట్ ఫైటర్‌గా, థ్రిల్లర్ అడ్వెంచర్ 'ఏ పర్ఫెక్ట్ గేట్‌వే'లో మనుగడ కోసం పోరాడే జంటగా, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'ది ఫోర్త్ కైండ్'లో సైకాలజిస్ట్‌గా, క్రైమ్ థ్రిల్లర్ 'స్టోన్'లో జైల్లో ఉన్న భర్తని బయటకు తీసుకొచ్చేందుకు తపించే భార్యగా, కమింగ్ ఏజ్ కామెడీ డ్రామా 'డర్టీ గర్ల్'లో ట్రబుల్ హైస్కూల్ విద్యార్థిని తల్లిగా, ఆద్యంతం నాటకీయంగా సాగే 'బ్రింగింగ్ ఆప్ బేబీ'లో కాన్ ఆర్టిస్టుగా, రొమాంటిక్ యాక్షన్ అడ్వెంచర్ 'ది త్రీ మస్కీటర్స్'లో యోధురాలిగా నెగటివ్ తరహా పాత్రలో ఆకట్టుకున్నారు. ఫాంటసీ డ్రామా 'పారడైజ్ హిల్స్'లో రిఫామ్ స్కూల్ ఆడ్మినిస్ట్రేటర్‌గా ప్రేక్షకుల్ని ఫిదా చేశారు.
Authorization