అల్ఫోన్సో కారోన్..విలక్షణ కథలతో భిన్న జోనర్ చిత్రాలను తెరకెక్కించి అశేష ప్రేక్షకలోకాన్ని మెప్పించిన మెక్సికన్ అగ్ర దర్శకుడు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా అత్యద్భుత ప్రతిభను చాటి ఆస్కార్ అవార్డుల చరిత్రలోనే ఐదు ఆస్కార్లను
సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించారు. ఇటీవల 91వ ఆస్కార్ వేడుకల్లో 'రోమా' చిత్రానికి దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా, నిర్మాతగా మూడు ఆస్కార్లను దక్కించుకుని యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అల్ఫోన్సో కారోన్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
తల్లి ప్రోత్సాహంతోనే సినీ రంగం వైపు అడుగులు..
పూర్తి పేరు అల్ఫోన్సో కారోన్ ఓరోజ్కో. 1961, నవంబర్ 28న మెక్సికో సిటీలో జన్మించారు. తండ్రి అల్ఫ్రెడో కారోన్, అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలో న్యూక్లియర్ ఫిజిసిస్ట్‌గా పనిచేసేవారు. అల్ఫోన్సోకి ఇద్దరు సోదరులు కార్లోస్, ఆల్ఫ్రెడో ఉన్నారు. కార్లోస్ దర్శకుడు, రైటర్.
ఆల్ఫ్రెడో బయాలజిస్ట్. కారోన్ మెక్సికోకి చెందిన నేషనల్ అటానమస్ యూనివర్సిటీలో ఫిలాసఫీ చదివారు. ఆ తర్వాత సెంట్రో యూనివర్సిటారియో దె ఇ స్టూడియోస్ సినిమాటోగ్రాఫికాస్లో ఫిల్మ్ మేకింగ్ స్టడీస్ చేశారు. ఈ క్రమంలో ఆయనకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎమ్మాన్యూయెల్ లుబెజ్కీ, దర్శకుడు కార్లోస్ మార్కోవిచ్ పరిచయం అయ్యారు. వీరు కలిసి మొదటగా 'వెంజీయన్స్ ఈజ్ మైన్' అనే లఘు చిత్రాన్ని రూపొందించారు. కారోన్ సినిమా రంగం వైపు అడుగులు వేయడానికి తల్లి ప్రోత్సాహమే ప్రధాన కారణం. చదువుకునే రోజుల్లోనే అవిడ్ టెక్నాలజీపై కారోన్కి మంచి అవగాహన ఉండేది.
బుల్లితెర టు వెండితెర..
అల్ఫోన్సో కెరీర్ టెలివిజన్ నుంచి ప్రారంభమైంది. మొదట పలు విభాగాల్లో టెక్నీషియన్‌గా పనిచేశారు. అనేక టెలివిజన్ సిరీస్‌లకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ప్రొడక్షన్స్లోనూ వర్క్ చేశారు. వాటిలో 'లా గ్రాన్ ఫీస్టా', 'గ్యాబీ: ఏ ట్రూ స్టోరీ', 'రోమియో' టెలివిజన్స్ ప్రధానంగా ఉన్నాయి. 1991లో దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంగా ఆయన సెక్స్ కామెడీ 'సోలో కాన్ టు పరేజా' చిత్రాన్ని రూపొందించారు. మెక్సికన్ చిత్రమిది. దీనికి తన సోదరుడు కార్లోన్ కారోన్ స్క్రిప్ట్ అందించడం ఓ విశేషమైతే, దర్శకుడు అల్ఫోన్సో దీనికి నిర్మాతగా, రైటర్‌గా, ఎడిటర్‌గా వ్యవహరించారు. క్యాబరే సింగర్ ఆస్ట్రిడ్ హడాడ్, మోడల్ క్లాడియా రామిరెజ్ ప్రధాన పాత్రలు పోషించారు. మెక్సికన్ ప్రభుత్వం దీనికి ఫండ్ సమకూర్చింది. కానీ తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసేందుకు తిరస్కరించింది. అయినప్పటికీ అల్ఫోన్సో సొంతంగా విడుదల చేశారు. ఇది బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. ఆ తర్వాత టెలివిజన్ ఆఫర్ రావడంతో టీవీ రంగంలోకి వెళ్ళారు. దాదాపు నాలుగేండ్ల తర్వాత 'ఏ లిటిల్ ప్రిన్సెస్' చిత్రాన్ని రూపొందించారు. హాలీవుడ్లో ఆయన రూపొందించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయింది. మరో మూడేండ్ల తర్వాత కాంటెంపరరీ కథాంశంతో 'గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్' చిత్రాన్ని రూపొందించారు. 1998లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇందులో రాబర్ట్ డీ నిరో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. హాలీవుడ్ నుంచి తిరిగి మెక్సికో లాంగ్వేజ్‌లో స్పానిష్ మాట్లాడే కాస్టింగ్‌తో 'వై టు మామా టంబీన్' చిత్రాన్ని రూపొందించారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో విజయాన్ని సాధించింది. మెక్సికోలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచి, విమర్శకుల ప్రశంసలందుకుంది. అంతేకాదు ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. దీనికి కూడా రైటింగ్ పరంగా సోదరుడు కార్లోస్ క్వారోన్ భాగస్వామి కావడం విశేషం.
అగ్ర దర్శకుడిగా తిరుగులేని అంతర్జాతీయ గుర్తింపు..
'వై టు మామా టంబీన్' ఇచ్చిన సక్సెస్ అంతర్జాతీయ ప్రాజెక్ట్‌ని తెచ్చిపెట్టింది. 2004లో 'హ్యారీపోటర్' సిరీస్‌లో మూడో సినిమా 'హ్యారీ పొట్టర్ అండ్ ది ప్రిజనర్ ఆఫ్ అజ్కాబన్' చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే అల్ఫోన్సో దర్శకత్వం వహించే విషయంలో ఈ చిత్ర అభిమానులు వ్యతిరేకించారు. కానీ ఆథర్ జె.కె.రౌలింగ్ 'వై టు మామా టంబీస్' చిత్రాన్ని చూసి ఈ అవకాశం కల్పించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. 130 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 800 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. దీంతో ఆల్ఫోన్సో తిరుగులేని దర్శకుడిగా గుర్తింపు పొందారు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు పొందారు. రెండేండ్ల గ్యాప్‌తో 'చిల్డ్రన్ ఆఫ్ మెన్' చిత్రాన్ని రూపొందించారు. 2006లో తెరకెక్కిన ఈ చిత్రం కూడా మంచి విజయాన్నే సాధించింది. అంతేకాదు ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. ఈ సినిమాకి కారోన్ ఎడిటర్‌గానూ వ్యవహరించారు. దాదాపు నాలుగేండ్ల తర్వాత 2010లో సైన్స్ ఫిక్షన్ 'గ్రావిటీ' చిత్రాన్ని ప్రారంభించారు. స్పేస్ డ్రామాగా 130 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ సినిమా 2013లో విడుదలై 730 మిలియన్ డాలర్లని కలెక్ట్ చేసింది. దీంతోపాటు దర్శకుడిగా ఆల్ఫోన్స్కి తిరుగులేని ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. యావత్ ప్రపంచాన్ని మెప్పించగల దర్శకుడిగా ప్రశంసలందుకున్నారు. అగ్ర దర్శకుల జాబితాలో ఒకరిగా నిలిచారు. ఈ సినిమా పది విభాగాల్లో ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. ఏడు విభాగాల్లో ఆస్కార్‌ని దక్కించుకుని రికార్డ్ సృష్టించింది. దాదాపు ఎనిమిదేండ్ల గ్యాప్ తర్వాత ఆద్యంతం నాటకీయంగా సాగే 'రోమా' చిత్రాన్ని రూపొందించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చెందింది. కానీ ఇటీవల 91వ ఆస్కార్ వేడుకలో మూడు అవార్డులని గెలుచుకుంది. అనేక ఇతర పురస్కారాలనూ కైవసం చేసుకుంది. వీటితోపాటు 'హుజ్ హీ ఎనీవే', 'వెంజీన్స్ ఈజ్ మైన్', 'కార్టెటో పారా ఎల్ ఫిన్ డెల్ టీయెంపో', 'పార్క్ మోన్సీయు', 'ది పాజిబిలిటీ ఆఫ్ హౌప్', 'ది షాక్ డాక్టరీనె', 'అనింగాక్' వంటి లఘు చిత్రాలతో వెండితెరపై సరికొత్త ఆవిష్కరణలు చేసి తానేమిటో నిరూపించుకున్నారు.
ప్రేక్షకుల్ని మెప్పించిన అభిరుచిగల నిర్మాత..
2006 తర్వాత అల్పోన్సో 'ఎస్సరాంటో ఫిల్మోజ్' పేరుతో ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించారు. సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలు పెట్టారు. 'డక్ సీజన్', 'పాన్స్ లేబిరింత్, 'గ్రావిటీ' చిత్రాలని నిర్మించారు. నిజానికి తొలి చిత్రం 'సోలో కాన్ టు పరేజా'ని తనే నిర్మాతగా రూపొందించారు. 'వై టు మామా టంబీన్', ఎకుడేరియన్ థ్రిల్లర్ 'క్రోనికాస్' చిత్ర నిర్మాణంలో భాగమయ్యారు. దీనికి సెబాస్టియన్ కోర్డెరో దర్శకత్వం వహించారు. నీల్స్ బుయిల్లర్ దర్శకత్వంలో రూపొందిన 'ది అస్సాసినేషన్ ఆఫ్ రిచర్డ్ నిక్సాన్' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. గ్యారీ టామ్ రూపొందించిన డాక్యుమెంటరీ 'బ్లాక్ సన్'నికి కూడా తనే నిర్మాత. వీటితోపాటు 'రుడో వై కర్సీ', 'డెసీర్టో' చిత్రాలను, డాక్యుమెంటరీ చిత్రం 'ది ఛేంజెస్ ఎవ్రీథింగ్'లను కూడా నిర్మించి ప్రేక్షకుల్ని మెప్పించారు.
అత్యంత ప్రభావితం చేయగల వ్యక్తి..
సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలతోపాటు టెలివిజన్ సిరీస్‌లకు దర్శకత్వం వహించడమే కాకుండా రైటర్‌గా, నిర్మాతగా, ఎడిటర్‌గా కూడా పనిచేశారు. కారోన్కి దర్శకుడిగా అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో 2015లో 72వ వెనీస్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2014లో టైమ్ ప్రకటించిన 'ప్రపంచంలో అత్యంత ప్రభావితం చేయగల 100 మంది వ్యక్తుల్లో ఒకరిగా అల్ఫోన్సో నిలిచారు. ప్రముఖ దర్శకులు అలెగ్జాండ్రో గోంజలేజ్ ఇనర్రిటు, గిల్లెర్మో డెల్ టోరో, సినిమాటోగ్రాఫర్ ఇమ్మాన్యుయెల్ లుబెజ్కీ మంచి స్నేహితులు. తాను రూపొందించిన సినిమాలకు ఎక్కువగా ఇమ్మాన్యుయెల్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం.
ఆస్కార్ అవార్డుల్లో సరికొత్త రికార్డు..
అల్ఫోన్సో దర్శకత్వ ప్రతిభకి ఎన్నో అవార్డులు క్యూ కట్టాయి. ముఖ్యంగా ఐదు ఆస్కార్ అవార్డులను గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. 'గ్రావిటీ' చిత్రానికిగానూ దర్శకుడిగా ఆస్కార్‌ని అందుకున్నారు. దీంతోపాటు ఎడిటింగ్ విభాగంలో మార్క్ సాంగర్‌తో కలిసి మరో ఆస్కార్‌ని దక్కించుకున్నారు. ఇటీవల 91వ ఆస్కార్ వేడుకల్లో తాను రూపొందించిన 'రోమా' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఓ ఆస్కార్‌ని, సినిమాటోగ్రఫీ విభాగంలో మరో ఆస్కార్‌ని కైవసం చేసుకున్నారు. అంతేకాదు దీనికి తాను కూడా ఓ ప్రొడ్యూసర్. ఈ నేపథ్యంలో ఉత్తమ విదేశీ చిత్రంగా మరో అవార్డుని సొంతం చేసుకోవడం విశేషం. 'గ్రావిటీ' చిత్రానికి దర్శకుడిగా బ్రిటీష్ అకాడమీ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఆస్ట్రేలియా అకాడమీ పురస్కారం అందుకున్నారు. 'రోమా' చిత్రానికి నాలుగు బ్రిటీష్ అకాడమీ, రెండు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు దక్కాయి.
వెండితెరపై చెరగని ముద్ర
అల్ఫోన్సో కారోన్ దర్శకత్వ ప్రతిభలో తనకు తానే సాటి. విభిన్న జోనర్ చిత్రాలని తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. 'కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటాను. కొత్త ప్రపంచాన్ని చూసేందుకు, కొత్త సవాళ్ళని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాను. సినిమా తీయడమే నా లక్ష్యం. ఫలితాలని ఎప్పుడూ పట్టించుకోను. తర్వాత ఏం నేర్చుకోవాలనేదే ఆలోచిస్తా' అని కారోన్ ఎప్పుడూ చెప్పేమాట. ఆయన రూపొందించిన ప్రతి సినిమా సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. లేనిపోని ఆర్భాటాలకు పోకుండా సాధారణ ఆడియెన్స్‌కి కూడా అర్థమయ్యేలా రూపొందించి ప్రశంసలందుకుంటున్నారు. తొలి ప్రయత్నంగా రొమాంటిక్ కామెడీ 'సోలో కాన్ టు పరేజా' చిత్రాన్ని రూపొందించారు. ఉమెనైజర్ ఓ నర్స్‌తో ప్రేమలో పడతాడు. ఆమెతో శృంగారంలోనూ పాల్గొంటాడు. కానీ అతనికి ఎయిడ్స్ ఉందని నిర్థారణ అవుతుంది. దీంతో ఈ ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో దర్శకుడు ఆల్ఫోన్సో ఈ చిత్రాన్ని అత్యంత సహజంగా, అత్యద్భుతంగా తెరకెక్కించారు. కామెడీగా సాగే ఈ సినిమా ఘన విజయం సాధించింది. తొలి చిత్రంతోనే దర్శకుడిగా విశేష ప్రశంసలందుకున్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ ఫాంటసీ డ్రామా 'ఏ లిటిల్ ప్రిన్సెస్' చిత్రాన్ని రూపొందించారు. చిన్న పాప క్లాస్‌లో ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయినట్టు వార్త వస్తుంది. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురవుతుంది. బోర్డింగ్ స్కూల్లో సేవకురాలిగా ఉండిపోతుంది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెరకెక్కించారు. ఓ బాలిక భావోద్వేగభరిత జీవితాన్ని తెరపై కారోన్ ఆవిష్కరించిన తీరుకి ప్రేక్షకులు కంటతడి పెట్టకుండా ఉండలేరు. ఓ ఆనాథ పెయింటర్ చిన్నప్పటి ప్రేమను గుర్తు చేసుకుంటూ, కలని నిజం చేసుకునేందుకు పడే సంఘర్షణ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా 'ది గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్' చిత్రాన్ని రూపొందించారు. చార్లెస్ డిక్లెన్స్ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇద్దరు టీనేజ్ కుర్రాళ్ళు సమ్మర్లో రోడ్ జర్నీ చేపడతారు. మధ్యలో ఓ ప్లేస్‌లో పెళ్లైన అమ్మాయిని ఇంప్రెస్ చేసి తమతోపాటు రోడ్ ట్రిప్‌కి తీసుకెళతారు. అనంతరం వారి జర్నీ ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో అడ్వెంచరస్ కామెడీ డ్రామాగా 'వై టు మామా టంబీన్' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ద్వారా లైంగికత, అనాగరికమైన కామెడీ, నాటకీయతను ప్రతిబింబించారు.
ఆ తర్వాత సూపర్ హిట్ సిరీస్ 'హ్యారీ పొట్టర్ అండ్ ది ప్రిజనర్ ఆఫ్ అజ్కాబన్' చిత్రానికి దర్శకత్వం వహించారు. హ్యారీ పొట్టర్ మ్యాజిక్ స్కూల్లో మూడో సంవత్సరం చదువుతున్నాడు. తన మ్యాజికల్ ట్రావెల్లో భాగంగా ఓ జైల్‌కి వెళ్ళితే అక్కడ హంతకుడు తప్పించుకుంటాడు. అతన్ని పట్టుకునేందుకు హ్యారీపొట్టర్ చేసే సాహసమే ఈ చిత్రం. ఈ చిత్రాన్ని కొత్త తరహా టేకింగ్‌తో ఆల్ఫోన్సో రూపొందించిన తీరుపట్ల చిత్రసిరీస్ అభిమానుల నుంచి విమర్శలు వచ్చినా, గత చిత్రాలకంటే భారీ స్థాయిలో సక్సెస్ సాధించింది. ఇక 2017లో యుకేలో పరిస్థితి అంత అస్తవ్యస్థంగా తయారవుతుంది. ఆందోళనలు, వలసదారులపై దాడులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో వలస వచ్చిన ఓ అద్భుత మహిళ గర్భవతితో ఉంటుంది. ఆమెని సముద్ర తీర ప్రాంతంలోని అభయరణ్యంలోకి తీసుకెళ్లేందుకు ఓ మాజీ సోషల్ యాక్టివిస్ట్ సహాయం కోరతారు. ఆమెని సురక్షితంగా తీసుకెళ్లే క్రమంలో ఏం జరిగింది. ఆమె అద్బుత మహిళా ఎందుకయ్యిందనే ప్రశ్నలకు సమాధానంగా దర్శకుడు అల్ఫోన్సో ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా థ్రిల్లర్ 'చిల్డ్రన్ ఆఫ్ మెన్'ని రూపొందించారు. ఇందులో క్లివ్ ఓవెన్ ప్రధాన పాత్రలో మెప్పించారు. ఆద్యంతం ఆలోచింపచేసేలా, భావోద్వేగభరితంగా, ఆశ, విముక్తి, నమ్మకం వంటి సమకాలీన అంశాలను దర్శకుడు ఇందులో ప్రతిబింబించారు. ఈ చిత్ర టేకింగ్‌తో అందరూ అల్ఫోన్సోని ఓ గొప్ప దర్శకుడిగా అభివర్ణించారు. ఆ తర్వాత అల్ఫోన్సో ఓ సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారు.
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'గ్రావిటీి'ని రూపొందించారు. స్పేస్ జర్నీ చేస్తున్న క్రమంలో రాకెట్ మధ్యలో ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు వ్యోమగాములు తమ మనుగడ కోసం, తిరిగి భూమిపైకి వచ్చేందుకు చేసే పోరాట నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడి అద్భుత సృష్టికి, దర్శకత్వ ప్రతిభకిది ప్రతిరూపంగా నిలిచిందీ చిత్రం. ఈ సినిమా తర్వాత తరం ఎన్నో స్పేస్ బేస్డ్ చిత్రాలకి స్ఫూర్తిగా నిలిచింది. కమర్షియల్‌గా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఇక తన చిన్ననాటి జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఇటీవల 'రోమా' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ద్వారా ఓ పేద మధ్యతరగతి మెక్సికన్ పని మనిషి కుటుంబ జీవితాన్ని తెరపై ఆవిష్కరించారు. ఆద్యంతం భావోద్వేగభరితంగా ఈ సినిమా సాగుతుంది. ఇందు కోసం కొన్ని రోజులు తన కుటుంబ సభ్యులతో చర్చించి రూపొందించారు. కాస్టింగ్ కూడా అందరూ కొత్తవాళ్ళని, పెద్దగా పరిచయం లేని వాళ్లనే ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేదు. కానీ ఇటీవల ఆస్కార్ వేడుకల్లో మూడు ఆస్కార్లను కైవసం చేసుకోవడం విశేషం.
Authorization