కేథరిన్ జెటా జోన్స్..అటు బ్రిటన్‌లోను, ఇటు హాలీవుడ్‌లోనూ తనదైన బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ మార్క్‌తో అందరినీ ఫిదా చేసిన నటి. చూపు తిప్పుకోనివ్వని అందం, అంతకుమించి అభినయంతో స్టార్ హీరోలకు దీటుగా రాణిస్తున్న అగ్ర కథానాయిక. నటిగానే కాకుండా గాయనిగా కూడా ప్రేక్షకుల్ని అలరిస్తున్న గ్లామర్ క్వీన్ కేథరిన్ జెటా జోన్స్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
ఓ వైపు స్కూల్, మరోవైపు షోస్..
బేల్స్లోని స్వాన్సీయా పట్టణంలో 1969 సెప్టెంబర్ 25న కేథరిన్ జన్మించారు. తండ్రి డేవిడ్ జోన్స్ స్వీట్ ఫ్యాక్టరీని నడిపించేవారు. తల్లి పాట్రిసియా కాస్ట్యూమ్ డిజైనర్. తనకి అన్నయ్య డేవిడ్, తమ్ముడు లిండన్ ఉన్నారు. సేల్స్ మెన్స్లుగా పనిచేసిన వీరు, ఆ తర్వాత నిర్మాతలుగా మారారు. కేథరిన్ చిన్న తనం నుంచే చాలా చురుకైన అమ్మాయి. తన యాక్టివ్ నెస్ని చూసి నాలుగేండ్లలోనే పేరెంట్స్ ఆమెని డాన్స్ స్కూల్‌కి పంపించారు. డంబార్టన్ హౌస్ స్కూల్లో ప్రాథమిక విద్యని పూర్తి చేశారు. స్కూల్ టైమ్‌లోనే స్టేజ్ షోస్‌లో పాల్గొని స్థానికంగా బాగా ఆకట్టుకున్నారు. పలు డాన్స్ ట్రూప్‌లో భాగమై లండన్‌లో షోస్ ఇచ్చారు. జాతీయ ట్యాప్ డాన్సింగ్ ఛాంపియన్‌గా నిలిచారు. అనంతరం థియేటర్స్‌లో నటించేందుకు ప్రయత్నించి, 1981లో తొమ్మిదేండ్ల వయసులో 'అన్నీ' అనే నాటకంలో నటించే అవకాశం పొందారు. ఆ తర్వాత 'బగ్సీ మలోన్' నాటకంలో నటించారు. స్కూల్‌కి వెళ్తూ, యాక్టింగ్‌పై దృష్టి పెట్టడం కష్టమైంది. దీంతో స్కూల్ మానేసి పూర్తి స్థాయి మకాం లండన్‌కి మార్చి యాక్టింగ్‌పై దృష్టి పెట్టారు. టూరింగ్ ప్రొడక్షన్లో నటించిన మ్యూజికల్ డ్రామా 'ది పజమా గేమ్' మంచి పేరు తెచ్చింది.చిస్విక్ ఆర్ట్ ఎడ్యూకేషన్ స్కూల్లో మూడేండ్లపాటు మ్యూజికల్ థియేటర్ కోర్స్ చేశారు. 1987లో మ్యూజికల్ డ్రామా '42 స్ట్రీట్'లో, అమెరికన్ ఒపెరా నాటకం 'స్ట్రీట్ సీన్'లో మెప్పించారు.
టెలివిజన్ జీవితాన్నే మార్చింది..
టెలివిజన్ నుంచి సినిమా ప్రయత్నాలు ప్రారంభించి, ఎట్టకేలకు 1990లో ఫిలిప్ డె బ్రోకా దర్శకత్వంలో రూపొందిన '1001 నైట్స్' చిత్రంలో నటించే ఛాన్స్ అందుకున్నారు. ఇందులో గ్లామర్ పాత్రలో అలరించారు. సినిమా పరాజయం చెందినా, కేథరిన్‌కి గ్లామరస్‌గా నటిగా పేరొచ్చింది. ఆ వెంటనే టెలివిజన్ సిరీస్ 'ది డార్లింగ్ బడ్స్ ఆఫ్ మే'లో రెండేండ్లపాటు నటించారు. ఇది హైయెస్ట్ రేటెడ్ టెలివిజన్ షోగా పాపులర్ అయ్యింది. తనకు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చింది. 'ఓ గంట టెలివిజన్ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది' అని క్యాథరిన్ పలు ఇంటర్య్వూలో తెలిపారు. ఈ క్రమంలో 1992లో అడ్వెంచరస్ చిత్రం 'క్రిస్టోఫర్ కొలంబస్: ది డిస్కవరీ'లో చిన్న పాత్రలో నటించారు. ఇది కూడా పరాజయం చెందింది. ఇదే ఏడాది 'ది యంగ్ ఇండియానా జోన్స్ క్రోనికల్స్' టెలివిజన్స్‌లో నటించారు. అలాగే బ్రిటీష్ చిత్రం 'స్ప్లిట్టింగ్ హీర్స్'లో నటించగా, ఇది కూడా ఫ్లాప్ అయ్యింది. టెలివిజన్‌లోకి వెళ్ళిన కొన్ని రోజులకు తిరిగి 'బ్లూ జూస్' చిత్రంలో నటించారు. మొదటి బ్రిటన్ సర్ఫ్ చిత్రమిది. ఇది ఆశించిన ఫలితాన్ని అందుకోలేక బాక్సాఫీసు వద్ద డీలా పడింది. దీంతో కేథరిన్‌కి సక్సెస్ అందని ద్రాక్షగానే మిగిలింది. లండన్ నుంచి లాస్ ఏంజెల్స్‌కి షిఫ్ట్ అయ్యారు. 1996లో ఆస్ట్రేలియన్, అమెరికన్ చిత్రం 'ది ఫాంటమ్'లో ప్రధాన పాత్రలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమా సైతం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
ఎట్టకేలకు తొలి విజయం..
1998లో దర్శకుడు మార్టిన్ కాంప్‌బెల్ రూపొందించిన 'ది మాస్క్ ఆఫ్ జోర్రో' చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్నారు. ఇందులో మెక్సికన్ వారియర్ హాప్కిన్స్ కూతురిగా వీరనారి పాత్రలో అలరించారు. అందుకుగాను డాన్స్, గుర్రపు స్వారీ, కత్తిసాము, డైలాగ్ డిక్షన్‌పై శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సక్సెస్ సాధించడంతోపాటు కేథరిన్‌కి నటిగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. 1999లో 'ఎంట్రాప్మెంట్'లో అగ్ర నటుడు సీన్ కాన్నెరీతో కలిసి నటించారు. ఇది కమర్షియల్‌గా సక్సెస్ సాధించినా, విమర్శకులని మెప్పించలేకపోయింది. ఇదే ఏడాది ఆమె 'ది హంటింగ్' చిత్రంలో లియామ్ నీసన్, లిలి టైలర్లతో కలిసి నటించగా, ఆశించిన ఫలితానివ్వలేదు. 2000లో నటించిన కామెడీ డ్రామా 'హై ఫెడెలిటీ' కాస్త ఊరటనిచ్చింది. ఇక 'ట్రాఫిక్' చిత్రంతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. స్టీవెన్ సొడెన్బర్గ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తన భర్త కిర్క్ డగ్లస్‌తో కలిసి నటించారు. ఈ చిత్రంతో కేథరిన్ కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కారు.
హాలీవుడ్లో తిరుగులేని నాయికగా..
'హై ఫెడెలిటీ', 'ట్రాఫిక్' ఇచ్చిన సక్సెస్‌తో మరింత పుంజుకున్న కేథరిన్ 2001లో జూలియా రాబర్ట్స్‌తో కలిసి 'అమెరికా స్వీట్‌హార్ట్స్'లో నటించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2002లో ఆమె నటించిన 'చికాగో' తన కెరీర్‌నే పూర్తిగా మార్చేసింది. రాబ్ మార్షల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రిచర్డ్ గెరె, రెనీ జెల్వెగర్లతో కలిసి నటించారు. ఇది బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించి, 45 మిలియన్ డాలర్లతో రూపొంది 306 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. ఇందులో నైట్ క్లబ్ సింగర్‌గా నటించి కనువిందు చేసింది. దీంతో హాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదగడంతోపాటు తిరుగులేని విధంగా అగ్ర కథానాయికల జాబితాలోకి చేరారు. ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్‌ని సైతం అందుకున్నారు. అనంతరం 'ఇంటోలేరబుల్ క్రూయెల్టీ' రూపంలో మరో విజయం దక్కింది. అంతలోనే మరో భారీ ఆఫర్ ఆమెని వరించింది. స్టీవెన్ స్పీల్బర్గ్ రూపొందించిన 'ది టర్మినల్'లో టామ్ హ్యాంక్స్ సరసన కథానాయికగా నటించే అరుదైన ఛాన్స్‌ని అందుకున్నారు. 2004లోనే స్టీవెన్ సొడెన్బర్గ్ రూపొందించిన 'ఓసియన్ ట్వెల్వ్'తో మరో బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. వరుస సినిమాలు, టెలివిజన్స్తో క్యాథరిన్పై పని ఒత్తిడి పెరగడంతో సినిమాలు తగ్గించుకుని టెలివిజన్స్పై దృష్టి పెట్టారు. ఏడాది గ్యాప్ తర్వాత 2007లో 'నో రిజర్వేషన్స్', 'డెత్ డెఫైయింగ్ యాక్ట్స్' చిత్రాల్లో, మళ్ళీ ఏడాది గ్యాప్‌తో 2009లో 'ది రీబౌండ్'లో నటించారు. ఇందులో 'నో రిజర్వేషన్స్' ఆకట్టుకుంది. మిగిలిన చిత్రాలు పరాజయం చెందాయి. మూడేండ్ల తర్వాత 2012లో నటించిన 'లే ది ఫేవరేట్', 'రాక్ ఆఫ్ ఏజేస్', 'ప్లేయింగ్ ఫర్ కీప్స్' చిత్రాలు వరుసగా పరాజయం చెందాయి. తిరిగి నిలదొక్కునేందుకు 2013లో చేసిన ప్రయత్నం ఫలించింది. ఈ ఏడాది ఆమె నటించిన 'బ్రోకెన్ సిటీ', 'సైడ్ ఎఫెక్ట్స్', 'రెడ్ 2' చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. చివరగా 'డాడ్స్ ఆర్మీ'లో నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా టెలివిజన్స్ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తున్నారు.
నటిగా నిలబెట్టిన టెలివిజన్..
తొలుత 'అన్నీ', 'బగ్సీ మలోన్', 'ది పజామా గేమ్', '42వ స్ట్రీట్', 'స్ట్రీట్ సీన్', 'అండర్ మిల్క్ వుడ్', 'ఏ లిటిల్ నైట్ మ్యూజిక్', 'ది చిల్డ్రన్స్ మోనోలాగ్స్' వంటి నాటకాల్లో నటించారు. అనంతరం టెలివిజన్స్లోకి ఎంటరై 'ది డార్లింగ్ బడ్స్ ఆఫ్ మే', 'ది యంగ్ ఇండియానా జోన్స్ క్రోనికల్స్', 'ది రిటర్న్ ఆఫ్ ది నేటివ్', 'ది సిండర్ పాత్', 'సాటర్డే నైట్ లైవ్', 'ఫూయిడ్: బెట్టీ అండ్ జోన్', 'కోకైన్ గాడ్‌మదర్', 'క్వీన్ అమెరికా' వంటి టెలివిజన్స్‌లో భిన్న పాత్రల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. టెలివిజన్ వార్ డ్రామా 'ది సిండర్ పాత్', టెలివిజన్ బయోపిక్ 'కేథరిన్ ది గ్రేట్', 1996లో సీబీఎస్ టెలివిజన్ మినీ సిరీస్ 'టైటానిక్'లో మెప్పించారు. కేథరిన్ మంచి గాయనీ కూడా. 'చికాగో' చిత్రంలో ఆరు పాటలు పాడి సింగర్‌గా తన ప్రతిభను చాటుకోవడంతోపాటు తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. 'రాక్ ఆఫ్ ఏజెస్'లో రెండు పాటలు ఆలపించి ఆకట్టుకున్నారు.
సేవా, పాపులారిటీ..
నటిగా ఆకట్టుకునే అందం, మెస్మరైజ్ చేసే అభినయంతోనేకాదు రియల్ లైఫ్‌లో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని మనసున్న నటిగా పేరు తెచ్చుకున్నారు. అంగవైకల్యంతో బాధపడుతున్న పిల్లలకు అండగా నిలిచే 'స్వాన్సీయా లాంగ్ఫీల్డ్స్ డే సెంటర్' కోసం భారీగా విరాళాలు అందించారు. ఎయిడ్స్ పేషెంట్ కోసం తాను నటించిన 'ది మాస్క్ ఆఫ్ జోర్రో' చిత్రంలోని కాస్ట్యూమ్స్‌ని వేలం వేసి వచ్చిన డబ్బుని విరాళంగా అందించారు. చిల్డ్రన్ అబ్యూస్‌కి సంబంధించి పనిచేసే నేషనల్ సొసైటీ ఫర్ ది ప్రివెంటేషన్ ఆఫ్ క్రూయాల్టీ టు చిల్డ్రన్ ఛారిటీకి అంబాసిడర్‌గా పనిచేశారు. 'సినిమా ఫర్ పీస్ ఫౌండేషన్' కోసం పలు ఛారిటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక వ్యాపార ప్రకటనల ద్వారా అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న నటిగానూ నిలిచారు. కేథరిన్ పాపులారిటీ అంతా ఇంతా కాదు. కెరీర్ ప్రారంభంలో ఆమెపై బ్యూటీ, సెక్స్ సింబల్ పడింది. పీపుల్ మేగజీన్ 1998, 2003, 04లో 'మోస్ట్ బ్యూటిఫుల్ పీపుల్'గా అభివర్ణించింది. ఎస్క్వైర్ మేగజీన్ 'మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఆన్ ది ప్లానెట్' అని వర్ణించింది. 2011లో క్యూవీసీ టెలివిజన్ నెట్వర్క్ 'మోస్ట్ బ్యూటిఫుల్ బ్రిటీష్ ఉమెన్'గా పిలిచింది. ది డైలీ టెలిగ్రాఫ్ సంస్థ 2010లో 'ది అల్టీమేట్ సెల్ఫ్ మేడ్ సక్సెస్' నటిగా, 'ది ఇండిపెండెంట్' సంస్థ 'సెల్ఫ్ ఎఫెక్టింగ్ అండ్ ఎనర్జిటిక్'గా వర్ణించాయి.
వ్యక్తిగత జీవితంలో వివాదాలు..
కేథరిన్ టీవీ రంగానికి చెందిన జాన్ లెస్లీ, సింగర్ డేవిడ్ ఎస్సెక్స్, పాప్ స్టార్ మిక్ హక్నాల్లతో అనుబంధం కొనసాగించారు. తర్వాత నటుడు మైఖేక్ కిర్క్ డగ్ల్లస్కి దగ్గరయ్యారు. తనకంటే 25ఏండ్లు పెద్ద అయిన డగ్ల్లస్తో ప్రేమలో పడి 2000 నవంబర్ 18న పెళ్ళి చేసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్ళి అత్యంత గ్రాండ్‌గా జరిగింది. వీరికి కుమారుడు డైలన్ మైఖేల్, కూతురు కారీస్ జెటా ఉన్నారు. 2010లో డగ్ల్లస్ నాలుక కాన్సర్‌తో బాధపడ్డారు. దీంతో కేథరిన్ ఎమోషనల్‌గా డిప్రెషన్లోకి వెళ్ళి బైపోలార్ 2 స్టేజ్ డిజార్డర్‌తో బాధపడ్డారు. ఇద్దరూ అనారోగ్యంతో బాధపడుతుండటంతో 2013లో సపరేట్ అయ్యారు. కేథరిన్ తనపై అసత్య ఆరోపణలు చేసిన హలో మేగజీన్‌పై, తన అనుమతి లేకుండా తప్పుగా తన బయోగ్రఫీ రాస్తున్న క్లిఫ్ గుడ్విన్పై పరువునష్టం దావా వేశారు.
Authorization