ఛార్లెస్ థెరాన్..భిన్న, వైవిధ్య, ప్రయోగాత్మక పాత్రలతో స్టార్ హీరోలకి దీటుగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న కథానాయిక. మహిళా కథా చిత్రాలకు కేరాఫ్. విలక్షణ పాత్రలతో నటిగానే కాకుండా అభిరుచిగల నిర్మాతగానూ ప్రేక్షకుల్ని అలరించారు. సౌత్ ఆఫ్రికా నుంచి సినీ ప్రస్థానం ప్రారంభించి హాలీవుడ్లో తిరుగులేని కథానాయికగా, ఆస్కార్ విజేతగా, స్ఫూర్తిదాయక సామాజిక సేవకురాలిగా పేరొందిన ఛార్లెస్ థెరాన్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
పాఠం నేర్పిన విషాదభరిత సంఘటన
చార్లెస్ థెరాన్ 1975 ఆగస్ట్ 7న సౌత్ ఆఫ్రికాలోని గ్రాన్వ్సాల్ ప్రొవిన్స్కి చెందిన బెనోనిలో జన్మించారు. గెర్రా, చార్లెస్ థెరాన్ల ఏకైక కూతురు. 1991 జూన్ 21న థెరాన్ తండ్రి బాగా మద్యం సేవించి భార్యతోపాటు థెరాన్ని గన్‌తో కాల్చాడు. అదృష్టం కొద్దీ ఇద్దరూ తప్పించుకున్నారు. కానీ తన దగ్గరున్న గన్‌తో భర్తని థెరాన్ తల్లి కాల్చడంతో చనిపోయాడు. తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కాల్చిన నేపథ్యంలో వీరికి ఎలాంటి శిక్ష పడలేదు. ఈ విషాదభరిత సంఘటన వల్ల చిన్నతనం నుంచి మనుగడ కోసం థెరాన్ చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని, తన జీవితానికొక పాఠం నేర్పిందని పలు సందర్భాల్లో థెరాన్ తెలిపారు. తన స్కూల్ విద్య పుట్ఫాంటీన్ ప్రైమరీ స్కూల్లో చేశారు. ఆ తర్వాత బోర్డింగ్స్కూల్లో జాయినై నేషనల్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్‌లో స్టడీస్ చేశారు.
డైలాగ్స్ లేని తొలి సినిమా
థెరాన్ మంచి డాన్సర్‌గా ఎదగాలనుకున్నప్పటికీ 16ఏండ్ల వయసులో ప్రముఖ మోడలింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని యూరప్‌లో మోడలింగ్ చేశారు. ఆ తర్వాత తన తల్లితో కలిసి అమెరికా వెళ్ళారు. న్యూయార్క్‌లో జోఫ్రే బ్యాలెట్ స్కూల్లో బ్యాలెట్ డాన్సర్ శిక్షణ కోసం జాయిన్ అయ్యారు. డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో మోకాలికి గాయం కావడంతో డాన్స్‌ని పూర్తిగా మానెయ్యాల్సి వచ్చింది. ఆ టైమ్‌లో మానసికంగా డిప్రెషన్లోకి వెళ్లారు. 19వ ఏట లాస్ ఏంజెల్స్‌కి మకాం మార్చి సినిమాల్లో రాణించాలని నిర్ణయించుకున్నారు.లాస్ ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు తన తల్లి పంపించిన డబ్బుని ఇచ్చేందుకు బ్యాంక్ ఉద్యోగి ఇబ్బంది పెట్టడంతో థెరాన్ గొడవ పడటాన్ని చూసిన క్యాస్టింగ్ ఏజెంట్ థెరాన్లోని చురుకుదనం గమనించి తన క్యాస్టింగ్ ఏజెన్సీకి పరిచయం చేయడంతోపాటు యాక్టింగ్ స్కూల్లోనూ జాయిన్ చేశారు. యాక్టింగ్ నేర్చుకున్నాక ఛాన్స్‌ల కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో1995లో తొలిసారి హర్రర్ చిత్రం 'చిల్డ్రన్ ఆఫ్ ది కర్న్ 3: అర్బన్ హార్వెస్ట్'లో నటించే అవకాశం వచ్చింది. అయితే ఇందులో ఆమెకు డైలాగులు లేవు. ఏడాది తర్వాత '2 డేస్ ఇన్ ది వాలే' చిత్రంలో హిట్ ఉమెన్‌గా అతిథి పాత్రలో కాసేపు మెరిశారు. ప్రారంభ సినిమాల్లోనే ఇలాంటి పాత్రలు చేస్తే కెరీర్లో లాంగ్రన్ ఉండదనే విమర్శలు రావడంతో థెరాన్ ఆలోచనలో పడ్డారు.
మలుపు తిప్పిన వరుస విజయాలు
1997లో వచ్చిన హర్రర్ డ్రామా 'ది డెవిల్స్ అడ్వోకేట్'లో పూర్తి స్థాయి లీడ్ రోల్ పోషించారు. ఇది ఆమె కెరీర్‌కి మొదటి బ్రేక్‌గా భావించవచ్చు. ఇందులో కీను రీవెల్, ఆల్ పసీనోలతో కలిసి నటించడం విశేషం. 1998లో నటించిన అడ్వెంచర్ చిత్రం 'మైటీ జోయి యంగ్' పరాజయం చెందింది. 1999లో 'ది సైడర్ హౌస్ రూల్స్'తో మంచి విజయాన్ని అందుకున్నారు. 2000 నుంచి థెరాన్ కెరీర్ మలుపులు తిరిగింది. ఆ ఏడాది ఏరోటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'రీండీర్ గేమ్స్', క్రైమ్ నేపథ్య చిత్రం 'ది యార్డ్స్', స్పోర్ట్స్ డ్రామా 'ది లెజెండ్ ఆఫ్ బాగ్గర్ వాన్స్', డ్రామా చిత్రం 'మెన్ ఆఫ్ హానర్', 2001లో రొమాంటిక్ డ్రామా 'స్వీట్ నవంబర్', క్రైమ్ కామెడీ 'ది కర్స్ ఆఫ్ ది జేడ్ స్కర్పన్', 2002లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'ట్రాప్డ్'లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. ఈ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాలను అందుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. థెరాన్ని మంచి నటిగా నిలబెట్టాయి. అంతేకాదు హాలీవుడ్లో అత్యంత ఆకర్షించే కథానాయికగానూ పేరు తెచ్చుకున్నారు.
ఆస్కార్ విజేతగా నిలబెట్టిన మాన్స్టర్
2003లో మార్క్ వాల్బెర్గ్, ఎడ్వర్డ్ నార్టన్, జాసన్ స్టథన్లతో కలిసి నటించిన 'ది ఇటాలియన్ జాబ్' విజయం థెరాన్ని మరో మెట్టు ఎక్కించింది. 2003లోనే సీరియల్ కిల్లర్ ప్రధానంగా వచ్చిన 'మాన్స్టర్' చిత్రంలోని అద్భుత నటనతో విశేష ప్రశంసలందుకున్నారు. అంతేకాదు ఆస్కార్‌ని అందుకుని అంతర్జాతీయంగా తిరుగులేని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఆమెని సినీ చరిత్రలోనే అత్యద్భుత నటిగా సినీ విశ్లేషకులు అభివర్ణించారు. బ్రిటీష్ అమెరికన్ టెలివిజన్ ఫిల్మ్
'ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ పీటర్ సెల్లర్స్'లో అద్భుత నటనతో మెప్పించారు.
మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్ 2004లో సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ఏయాన్ ఫ్లక్స్'తో మరో విజయాన్ని అందుకున్నారు. అదే సంవత్సరం నటించిన 'నార్త్ కంట్రీ'తో హలీవుడ్‌లోనే అగ్ర నటిగా ఎదిగారు. అలాగే మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు. నటిగా తనని తాను తిరిగి రీకాల్ చేసుకోవడమే కాకుండా ఆస్కార్కీ నామినేట్ అయ్యారు. క్రైమ్ డ్రామా మిస్టరీ 'ఇన్ ది వాల్లే ఆఫ్ ఎలా', పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'బ్యాటిల్ ఇన్ సీటీల్', డ్రామాటిక్ 'స్లీప్‌వాకింగ్', సూపర్ హీరో కామెడీ 'హ్యాంకాక్', డ్రామా 'ది బర్నింగ్ ప్లేయిన్' చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇందులో 'హ్యాంకాక్' భారీ విజయాన్ని నమోదు చేసుకోగా, మిగిలిన సినిమాలు ఆశించిన స్థాయిలో సత్తా చాటలేదు. 2009లో పోస్ట్ అపోకలిప్టో చిత్రం 'ది రోడ్'లో కాసేపు మెరిశారు. ఆ తర్వాత 2010 ఫిఫా వరల్డ్ కప్‌కి కో ప్రజెంటర్‌గా వ్యవహరించారు. దీంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్, ఐర్లాండ్ జట్ల మధ్య వివాదం కారణంగా ఆమె రెండేండ్ల పాటు సినిమాలు చేయలేదు. 2011లో 'యంగ్ అడల్ట్'తో కమ్ బ్యాక్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా 'స్నో వైట్ అండ్ హంట్స్‌మన్', 'ప్రోమెథాస్', 'ఏ మిలియన్ వేస్ టు డై ఇన్ ది వెస్ట్', 'డార్క్ ప్లేసెస్', 'మ్యాడ్మాక్స్: ఫ్యూరీ రోడ్', 'ది హాంట్స్మన్: వింటర్స్ వార్', 'ది లాస్ ఫేస్', 'ఆటామిక్ బ్లాండే', 'ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్', 'టుల్లీ', 'గ్రింగో', 'లాంగ్ షాట్' చిత్రాల్లోని భిన్న పాత్రలతో మెప్పించి హాలీవుడ్లో తిరుగులేని నటిగా ఎదిగారు. ప్రస్తుతం ఆమె 'ది ఆడామ్స్ ఫ్యామిలీ', 'ఫెయిర్ అండ్ బ్యాలెన్డ్స్' చిత్రాల్లో నటిస్తున్నారు.
అభిరుచిగల నిర్మాతగానూ గుర్తింపు
2000లో డెన్వర్ అండ్ డెలిలా ప్రొడక్షన్ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించారు. తొలి ప్రయత్నంగా తనే కథానాయికగా నటించిన 'మాన్స్టర్' చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత 'ఈస్ట్ ఆఫ్ హవానా', 'స్లీప్‌వాకింగ్', 'యంగ్ అడల్ట్', 'ఆటామిక్ బ్లాండే' చిత్రాలను నిర్మించారు. 'ఈస్ట్ ఆఫ్ హవానా' డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో తప్ప మిగిలిన చిత్రాల్లో తనే కథానాయికగా నటించడం విశేషం. వీటితోపాటు 'డార్క్ ప్లేసెస్', 'బ్రెయిన్ ఆన్ ఫైర్', 'టుల్లీ', 'గ్రింగో', 'ఏ ప్రైవేట్ వార్', 'లాంగ్ షాట్', 'ఫెయిర్ అండ్ బ్యాలెన్డ్స్' చిత్రాలను ఇతర ప్రొడక్షన్ కంపెనీలతో కలిసి నిర్మించారు. అలాగే 'గిరిబాస్', 'మైండ్ హంటర్' టెలివిజన్స్ని కూడా నిర్మించారు. నిర్మించడమే కాదు, పలు టెలివిజన్స్లోనూ నటించారు. అందులో 'హాలీవుడ్ కాన్ఫిడెన్షియల్', 'సాటర్డే నైట్ లైవ్', 'ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ పీటర్ సెల్లర్స్', 'అరెస్టెడ్ డెవలప్మెంట్', 'రోబోట్ చికెన్', 'గిరిబాస్', 'మైండ్‌హంటర్', 'ది ఓర్విల్' వంటి సిరీస్‌లో నటించి ఆకట్టుకున్నారు. ఇవన్నీ మంచి ఆదరణ కూడా పొందాయి.
స్ఫూర్తిదాయక సామాజిక సేవకురాలు
థెరాన్ తన నటనతో ప్రేక్షకుల్ని ఫిదా చేయడంతోపాటు నిజ జీవితంలోనూ పలు సామాజిక, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొని సాధారణ ప్రజల మనసునీ దోచుకున్నారు. 2007లో ఆఫ్రికన్ ప్రజల్లో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో 'ది చార్లెస్ థెరాన్ ఆఫ్రికా ఔట్రిచ్' ప్రాజెక్ట్‌ని ప్రారంభించారు. సౌత్ ఆఫ్రికా మొత్తం విస్తృతంగా ప్రచారం నిర్వహించి అందరిలనూ అవగాహన కల్పించారు. దీంతో 2008లో ఆమె యునైటెడ్ నేషన్స్ మెసెంజర్ ఆఫ్ పీస్‌కి ఎంపికయ్యారు. అలాగే 2014లో మహిళలపై, బాలికలపై దాడులకు వ్యతిరేకంగానూ పలు కార్యక్రమాలు చేపట్టారు. మహిళా హక్కుల కోసం పోరాడారు. అలాగే మూగజీవాల హక్కుల కోసం పోరాడే 'పెటా'లో సభ్యురాలిగా చేరి, ఆయా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకున్నారు. 2009లో సేమ్ సెక్స్ మ్యారేజ్‌కి సపోర్ట్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. 86వ ఆస్కార్ అవార్డు ప్రదాన కార్యక్రమంలో తన ఆర్గనైజేషన్ ద్వారా ఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించారు. అలాగే పలు కమర్షియల్ యాడ్స్ కూడా చేశారు. పలు ప్రోడక్ట్స్‌కి అంబాసిడర్‌గా వ్యవహరించారు. 2016లో టైమ్ ప్రకటించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావితం చేసే వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. నటిగా, సామాజిక సేవకురాలిగా ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న థెరాన్ వ్యక్తిగత జీవితం మాత్రం సాఫీగా సాగలేదు. అయినప్పటికీ ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని పలువురికి ఆదర్శంగా నిలవడం విశేషం.
Authorization