విల్‌స్మిత్ నట విశ్వరూపంతో ప్రేక్షకుల్ని మెప్పించిన పవర్ఫుల్ ఆల్‌రౌండర్.
యాక్షన్ కామెడీ చిత్రాలకు కేరాఫ్. వెండితెరతోపాటు బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం ఫిదా చేసిన నటుడు. నటుడిగా, ర్యాపర్‌గా, నిర్మాతగానే కాకుండా సామాజిక సేవలోనూ స్ఫూర్తిదాయకంగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అత్యధిక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి క్రేజీ స్టార్‌గా వెండితెరపై చెరగని ముద్ర వేసిన విల్‌స్మిత్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
ర్యాపర్‌గా గుర్తింపు కోసం
విల్ స్మిత్ 1968 సెప్టెంబర్ 25న అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జన్మించారు. ఆయన అసలు పేరు విల్లార్డ్ కరోల్ స్మిత్ 2. వెస్ట్ ఫిలడెల్ఫియాలో పెరిగారు. ఆయనకు అక్క పమేలా ఉన్నారు. తన 13ఏండ్ల వయసులో తల్లిదండ్రులు సపరేట్ అయ్యారు. కానీ 2000 వరకు విడాకులు తీసుకోలేదు. అవర్ లేడీ ఆఫ్ లార్డర్స్ అనే ప్రైవేట్ క్యాథలిక్ ఎలిమెంటరీ స్కూల్లో స్మిత్ ప్రైమరీ విద్యని పూర్తి చేశారు. ఆ తర్వాత ఓవర్ బ్రూక్ హై స్కూల్‌కి వెళ్ళారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి కాలేజ్ విద్య కోసం వెళ్ళారు. కానీ అక్కడ తనకు స్కాలర్ షిప్ రాలేదు. దీంతో స్టడీస్‌పై కాకుండా ర్యాపర్‌గా రాణించాలని నిర్ణయించుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అయినా అటెండ్ కాలేదు. ర్యాప్‌పై దృష్టి పెట్టారు.
గ్రామీ అవార్డు విజేత
1985 నుంచి హిప్ హాప్ మ్యూజికల్ షోస్‌పై దృష్టి పెట్టారు. డీజే జాజీ జెఫ్ అండ్ ది ఫ్రెష్ ప్రిన్స్ టీమ్‌లో భాగమయ్యారు. తన చైల్డ్‌హుడ్ స్నేహితుడు జెఫ్రీ దీన్ని స్థాపించారు. తొలుత చిన్నగా దీన్ని ప్రారంభించి లోకల్‌గా షోస్ ఇచ్చేవారు. ఆ తర్వాత హైప్ మ్యాన్(మ్యూజిక్‌లో అదో రకం) షోస్ చేశారు. వీరికి మరో స్నేహితుడు క్లారెన్స్ కలిశారు. ఫిలడెల్ఫియాలో వరల్డ్ అప్ రికార్డ్ పేరుతో మొదటి సింగిల్‌ని విడుదల చేశారు. 'గర్ల్స్ ఐనాట్ నథింగ్ బట్ ట్రబుల్' అంటూ సాగే ఈ పాట మంచి ఆదరణ పొందింది. ఆ టైమ్‌లో స్మిత్, డీజే వీరి పార్టనర్ మార్క్ ఫారెస్ట్ మధ్య సమస్యలు తలెత్తాయి. 'ఐ డ్రీమ్ ఆఫ్ జీన్నీ' కార్యక్రమంలో ఓ పాటతో స్మిత్ బాగా పాపులర్ అయ్యారు. లైట్ హార్టెడ్ స్టోరీలను చెప్పే ర్యాపర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో అతనిపై ప్రముఖ జీవీ రికార్డ్స్ కంపెనీ, ప్రముఖ రికార్డింగ్ అధినేత రస్సెల్ సిమ్మన్స్ దృష్టి స్మిత్‌పై పడింది. ఆయనకు మంచి ఆఫర్స్ ఇచ్చారు. ఈ ఛాన్స్‌లను అందిపుచ్చుకుని 'రాక్ ది హౌస్' పేరుతో 1986లో తొలి ఆల్బమ్‌ని రూపొందించారు. 1989లో రూపొందించిన 'పేరెంట్స్ జస్ట్ డోన్ట్ అండర్‌స్టాండ్' ఆల్బమ్‌కి గ్రామీ అవార్డు వరించడం విశేషం. అలాగే 'సమ్‌టైమ్' అనే సింగిల్‌కి రెండో గ్రామీ అవార్డునందుకున్నారు.
వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు
మ్యూజికల్‌గా కెరీర్ మంచి స్థాయిలో పుంజుకుంటున్న సమయంలో ఇన్కమ్ టాక్స్‌కి సంబంధించిన కేసులు వెంటాడాయి. అరెస్ట్ కూడా అయ్యారు. దీంతో 1990లో ఆర్థిక ఇబ్బందులతో స్ట్రగుల్ అయ్యారు. ఆ టైమ్‌లో సిట్కమ్లో 'ది ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్ ఎయిర్' కార్యక్రమం చేశారు. దీంతో మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాకూడదని, సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి హాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ మూవీ స్టార్‌గా ఎదగాలనుకున్నారు. సినిమాల్లోకి వెళ్ళాక కూడా మ్యూజిక్‌ని వదల్లేదు. 1997లో సొంతంగా ఆల్బమ్ చేయడం ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా 'బిగ్ విల్లీ స్టయిల్' సింగిల్‌ని రూపొందించారు. 'బెన్ ఇన్ బ్లాక్' చిత్రంలోని సాంగ్ ట్రాక్ ఆధారంగా దీన్ని చేశారు. ఇది బిల్బోర్డ్ 200 జాబితాలో నిలిచింది. మూడో సింగిల్ 'గెట్టిన్ జిగ్గీ విట్ ఇట్' బిల్బోర్డ్ 100 జాబితాలో స్థానం సంపాదించింది. దీంతోపాటు 'విల్లీనియమ్', 'బోర్న్ టు రీజైన్', 'లాస్ట్ అండ్ ఫౌండ్' స్టూడియో ఆల్బమ్స్ చేశారు. ఇవి మంచి ఆదరణ పొందాయి. 'గ్రేటెస్ట్ హిట్స్' అనే కంపైలేషన్ ఆల్బమ్, 'ది విల్ స్మిత్ మ్యూజిక్ వీడియో కలెక్షన్' అనే వీడియో ఆల్బమ్, 'జస్ట్ ది టూ ఆఫ్ అజ్', 'మియామీ', 'విల్ 2కే', 'ఫ్రీకిన్ ఇట్', 'బ్లాక్ సూట్స్కామిన్', 'స్విచ్', 'పార్టీ స్టార్టర్' సింగిల్స్‌లో లీడ్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ రూపొందించారు. ఇవే కాకుండా20 మ్యూజికల్ వీడియోస్, 18 సింగిల్స్ చేసి, వాటిలో నటించి మ్యూజికల్ రంగంలోనూ అగ్ర స్థానానికి చేరుకున్నారు. తన సంగీతానికిగానూ ఆరు అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, నాలుగు గ్రామీ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఐదు ఎమ్‌టీవీ వీడియో మ్యూజిక్ అవార్డులు, నాలుగు వరల్డ్ మ్యూజిక్ అవార్డులు పొందారు.
క్రేజీ స్టార్‌గా చేసిన మూడు బ్లాక్‌బస్టర్స్
స్మిత్‌కి 1992లో 'వేర్ ది డే టేక్స్ యు' చిత్రంలో చిన్న పాత్రలో నటించే ఛాన్స్ వరించింది. ఆ తర్వాత రిచర్డ్ బెంజమిన్ దర్శకత్వంలో వచ్చిన కామెడీ సినిమా 'మేడ్ ఇన్ అమెరికా'లోనూ పెద్దగా గుర్తింపు లేని పాత్రే. అదే ఏడాది విడుదలైన కామెడీ డ్రామా 'సిక్స్ డిగ్రీస్ ఆఫ్ సపరేషన్'లో మేజర్ రోల్ పోషించారు. రెండేండ్ల గ్యాప్ తర్వాత 1995లో యాక్షన్ కామెడీ ఫిల్మ్ 'బ్యాడ్ బార్సు'లో ప్రముఖ నటుడు మార్టిన్ లారెన్స్‌తో కలిసి నటించారు. ఇందులో పోలీస్ పాత్రలో నటించి ఆద్యంతం ఆకట్టుకున్నారు. దీంతో విల్ స్మిత్‌పై అందరి దృష్టి పడింది. ఈ సినిమా 19 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 142 మిలియన్ డాలర్లని వసూలు చేయడం విశేషం. రోనాల్డ్ ఎమ్మెరిచ్ రూపొందించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం 'ఇండిపెండెన్స్ డే'తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇది బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డ్స్‌ని క్రియేట్ చేసింది. 75 మిలియన్ డాలర్లతో విడుదలై 817 మిలియన్ డాలర్లని వసూలు చేసి, అప్పటి వరకు ఉన్న వాటిల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన రెండో చిత్రంగా నిలిచింది. దీని కంటే ముందు 'జురాసిక్ పార్క్' ఉంది. ఇందులో కెప్టెన్ స్టీవెన్గా పైలట్ పాత్రలో నటించారు. ఇది విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్‌ని సొంతం చేసుకోవడం విశేషం. ఏడాది గ్యాప్‌తో మరో బ్లాక్ బస్టర్ 'మెన్ ఇన్ బ్లాక్'లో అగ్ర నటుడు టామీ లీ జోన్స్‌తో కలిసి నటించారు. 90 మిలియన్ డాలర్లతో వచ్చిన ఈ సినిమా సైతం 590మిలియన్ డాలర్లని వసూలు చేసింది. ఇందులో ఏజెంట్‌గా స్మిత్ పాత్రకి విశేషమైన ప్రశంసలు దక్కాయి. ఇలా బ్యాక్ టూ బ్యాక్ మూడు బ్లాక్ బస్టర్స్‌తో ఒక్కసారి విల్ స్మిత్ హాలీవుడ్లో క్రేజీ స్టార్ అయిపోయారు.
పవర్ఫుల్ పాత్రలతో వరుస విజయాలు
వరుస విజయాలతో అత్యంత క్రేజీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విల్ స్మిత్ విజయ పరంపరం కొనసాగుతూనే ఉంది. 1998లో 'ఎనిమీ ఆఫ్ ది స్టేట్', 1999లో 'విల్డ్ విల్డ్ వెస్ట్'లో, 2000లో 'ది లెజెండ్ ఆఫ్ బాగ్గర్ వాన్స్', 2001లో 'అలీ' వంటి భారీ సినిమాల్లో నటించారు. మొదటి రెండు సినిమా బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ అందుకోగా స్పోర్ట్స్ ప్రధానంగా వచ్చిన 'ది లెజెండ్ ఆఫ్ బ్యాగ్గర్ వాన్స్', బాక్సర్ మహ్మద్ అలీ లైఫ్ స్ఫూర్తితో తెరకెక్కిన 'అలీ' ఘోర పరాజయాలు చవిచూశాయి. కానీ ఉత్తమ నటుడిగా 'అలీ' చిత్రంలోని అలీ పాత్రకి ఆస్కార్‌కి నామినేట్ అయ్యారు. సక్సెస్ కోసం సీక్వెల్స్‌ని నమ్ముకున్నారు. 2002లో 'మెన్ ఇన్ బ్లాక్ 2'లో నటించారు. టామీ లీ జోన్స్‌తో కలిసి మరోసారి ఏజెంట్‌గా సందడి చేశారు. ఈ సినిమా పెద్ద హిట్‌ని అందుకుని స్మిత్‌కి సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. అలాగే 2003లో 'బ్యాడ్ బార్సు 2'తోనూ అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 2004లో విడుదలైన 'ఐ రోబోట్' సినిమా కూడా బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో తిరుగులేని స్టార్ హీరోగా హాలీవుడ్లో అగ్ర కథానాయకుల జాబితాలో చేరారు. ఇక వరుసగా బ్లాక్ బస్టర్స్ 'హిచ్', బయోగ్రాఫికల్ డ్రామా 'ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్', 'ఐ యామ్ లెజెండ్', 'హాంకాక్', 'సెవెన్ పాండ్స్', 'మెన్ ఇన్ బ్లాక్ 3', 'ఆఫ్టర్ ఎర్త్', 'ఫోకస్', 'సూసైడ్ స్వ్కాడ్', 'కొల్లేటరల్ బ్యూటీ' వంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో భాగమయ్యారు. మధ్యలో ఆయన నటించిన 'కాన్కాషన్', 'బ్రైట్' చిత్రాలు నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఆయన చిన్న పిల్లల కథ ఆధారంగా రూపొందిన 'అలాద్దీన్'లో నటిస్తున్నారు. దీంతోపాటు 'జెమినీ మ్యాన్', 'స్పైస్ ఇన్ డిస్గుస్', 'బ్యాడ్ బార్సు ఫర్ లైఫ్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
అభిరుచిగల నిర్మాత..
2002 నుంచి స్మిత్‌కి నిర్మాణంపై ఆసక్తి ఏర్పడింది. 'షోటైమ్' సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 'రైడ్ ఆర్ డై','ఐ రోబోట్','ది సీట్ ఫిల్లర్' కి పనిచేశారు. 'సేవింగ్ ఫేస్' చిత్రంతో నిర్మాతగా మారారు. 'హిచ్', 'ఏటీఎల్', 'ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్', 'హాంకాక్', 'ది సీక్రెట్లైఫ్ ఆఫ్ బీస్', 'లేక్‌వ్యూ టెర్రేస్', 'సెవెన్ పాండ్స్', 'ది కరాటే కిడ్', 'దిస్ మీన్స్ వార్', 'ఆఫ్టర్ ఎర్త్'(రైటర్ కూడా), 'అన్నీ'లని నిర్మించారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'లో గెస్ట్‌గా మెరిశారు. సినిమాలు, సంగీతం, నిర్మాణంతోపాటు స్మిత్ టెలివిజన్‌లోనూ రాణించారు. 13 టెలివిజన్ సిరీస్‌లో నటించి మెప్పించారు. అందులో 'ఏబీసీ ఆఫ్టర్స్కూల్ స్పెషల్', 'ది ఎర్త్ డే స్పెషల్', 'ది ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్ ఎయిర్', 'బ్లూసమ్', 'ఆల్ ఆఫ్ అజ్' ప్రధానంగా ఉన్నాయి. ఇవి కాకుండా పలు షోస్‌కి, అవార్డు ఫంక్షన్స్‌కి హౌస్ట్గానూ మెరిశారు. నటనకు ఆయనకు చాలా అవార్డులు వరించాయి. 'అలీ', 'ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్' చిత్రాలకు ఆస్కార్‌కి నామినేట్ అయ్యారు.
అత్యంత శక్తివంతమైన హాలీవుడ్ యాక్టర్
స్మిత్ సేవా కార్యక్రమాల్లోనూ ముందే ఉన్నారు. 2007లో 1.3 మిలియన్స్ క్రిస్టియన్ మినిస్ట్రీస్, మూడు సెంటోలజీ ఆర్గనైజేషన్స్‌కి ఛారిటీ కోసం విరాళంగా అందించారు. వీరికి కాలాబాసస్లో ప్రైవేట్ ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంది. 2008లో బరాక్ ఒబామా గెలుపుకోసం ప్రచారం నిర్వహించారు. స్మిత్ భార్యని నోబెల్ శాంతి బహుమతి వరించడం విశేషం. ఆయన సేమ్ సెక్స్ మ్యారేజ్‌ని సపోర్ట్ చేశారు. స్మిత్‌ని 2007లో న్యూస్ వీక్ సంస్థ అత్యంత శక్తివంతమైన హాలీవుడ్ యాక్టర్‌గా అభివర్ణించింది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఫోర్బ్స్‌లోకి ఎక్కారు. సిత్మ్ సినిమాలన్ని దాదాపు 7.5 బిలియన్ డాలర్లకుపైగా కలెక్షన్లని కలెక్ట్ చేయటం విశేషం.
Authorization