మిలా కునీస్..
భిన్న, విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన
గ్లామర్ క్వీన్. 'బేవాచ్' టెలివిజన్ సిరీస్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం మెప్పించిన అందాల తార.స్టార్ హీరోలకి దీటుగా రాణిస్తూ అత్యధిక పారితోషికం అందుకుంటున్న అగ్ర కథానాయిక. పలు సేవా కార్యక్రమాలతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మిలా కునీస్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
బేవాచ్ సిరీస్‌తో మంచి గుర్తింపు..
మిలా కునీస్ పూర్తి పేరు మిలేనా మర్కోవ్నా కునీస్. 1983 ఆగస్ట్ 14న రష్యాలోని చెర్నివిస్ట్లో జన్మించారు. ఆమె తల్లి ఎల్విరా ఫిజిక్స్ టీచర్, ఫార్మసీని నడిపించేవారు. తండ్రి మార్క్ కునీస్ మెకానికల్ ఇంజనీర్. ఆమెకు అన్నయ్య మైఖేల్ ఉన్నారు. తల్లిదండ్రులు మంచి ఉద్యోగాలు చేయడంతో చిన్నతనంలో చెప్పుకోదగ్గ ఆర్థిక ఇబ్బందులేం లేవు. అయితే తల్లిదండ్రులతోపాటు రష్యాలోనే ఉంటే తమకి భవిష్యత్ లేదని భావించిన మిలా, ఆమె సోదరుడు మైఖేల్‌తో కలిసి ఏడేండ్ల వయసులో 250 డాలర్లతో లాస్ ఏంజెల్స్‌కి వెళ్ళారు. అమెరికా కల్చర్ అలవాటు లేక అక్కడి మనుషులు, వారి భాష అర్థంకాక రోజూ ఏడ్చేవారట. అక్కడే స్కూల్ విద్య చేశారు. తొమ్మిదేండ్ల వయసులో స్కూల్ పూర్తయిన తర్వాత ఇద్దరూ యాక్టింగ్ క్లాస్‌లకు వెళ్ళేవారు. బెవెర్లీ హిల్స్ స్టూడియోస్‌లో నటన నేర్చుకున్నారు. అక్కడే సుసాన్ కర్టీస్ పరిచయం అయ్యారు. ఆ తర్వాత కాలంలో ఆమె మిలాకి మేనేజర్‌గా పనిచేశారు. మిలా తొలిసారి బార్బీ కమర్షియల్ యాడ్‌కి ఆడిషన్ ఇచ్చారు. అలాగే లిసా ఫ్రాంక్ అనే సంస్థ యాడ్ చేశారు. ఈ క్రమంలో 1994లో టెలివిజన్‌లో నటించే అవకాశం లభించింది. 'డేస్ ఆఫ్ అవర్ లైవ్స్' అనే టీవీ సిరీస్‌లో చిన్న పాత్రలో మెరిశారు. అదే ఏడాది హాలీవుడ్ ప్రముఖ టెలివిజన్ సిరీస్ 'బేవాచ్'లో మెరిశారు. 'బేవాచ్' సిరీస్ అత్యంత విశేష ఆదరణ పొంది మిలాకి మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత 'సెవెన్త్ హెవెన్', 'హానీ, వి ష్రక్ అవర్సెల్వ్స్', 'గియా' వంటి టెలివిజన్స్‌లో చిన్న చిన్న పాత్రలు పోషించిన బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించారు.
ఒడిదుడుకుల సినీ ప్రయాణం..
వరుసగా టెలివిజన్స్‌లో నటించిన మిలా పూర్తి స్థాయి సినిమా ప్రయత్నాల్లో భాగంగా 1996లో 'సాంటా విత్ మజిల్స్' చిత్రంలో చిన్న పాత్రలో నటించే అవకాశం లభించింది. రెండేండ్ల తర్వాత 'క్రిప్పెండార్ఫ్ ట్రైబ్'లో పెద్దగా గుర్తింపు లేని పాత్రే దక్కింది. టెలివిజన్స్ చేస్తూ సమయం చిక్కినప్పుడల్లా సినిమాల కోసం ప్రయత్నం చేశారు. 2001లో టీనేజ్ కామెడీగా వచ్చిన 'గెట్ ఓవర్ ఇట్'లో మరో చిన్న పాత్ర దొరికింది. 2002లో హర్రర్ బ్లాక్ కామెడీ 'అమెరికన్ సైకో 2'లో ప్రధాన పాత్రలో నటించే అరుదైన అవకాశం లభించింది. ఇందులో సీరియల్ కిల్లర్‌గా మెప్పించారు. తనే మెయిన్ రోల్లో నటించిన ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. దీంతో డైరెక్ట్ డీవీడీ రూపంలో విడుదల చేశారు. ఇక 2004లో నటించిన 'టోనీ ఎన్ టినాస్ వెడ్డింగ్' మూడేండ్ల వరకు విడుదల కాలేదు. 2005లో ప్రముఖ నటుడు జాన్ హెడర్‌తో కలిసి 'మూవింగ్ మెక్ ఎల్లిస్టర్'లో నటించారు. ఈ సినిమా కూడా రెండేండ్ల వరకు విడుదల కాలేదు. 2007లో రొమాంటిక్ చిత్రం 'ఆఫ్టర్ సెక్స్' మిశ్రమ స్పందననే చవిచూసింది. 2006లో నటించిన 'బూట్ క్యాంప్' సినిమా సైతం విడుదలకు నోచుకోలేదు. చివరకు డీవీడీ రూపంలోనే రిలీజ్ చేశారు. వరుస పరాజయాలు, మరికొన్ని విడుదల కాకపోవడం వంటి వాటితో మిలా కెరీర్ స్ట్రగుల్స్‌లో పడింది. ఈ క్రమంలో రొమాంటిక్ కామెడీ చిత్రం 'ఫర్గెట్టింగ్ సరా మార్షల్' విజయంతో కొంత ఊరట లభించింది. అయితే మిలా ఇందులో సెకండ్ హీరోయిన్ మాత్రమే. కానీ తన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. 2008లో మార్క్ వాల్బెర్గ్ సరసన 'మ్యాక్స్ పేనె'లో మెయిన్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది. ఈ సినిమా కోసం ఆమె గన్ వాడటం, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. కమర్షియల్‌గా వర్కౌట్ అయినా క్రిటికల్‌గా విమర్శలెదుర్కొంది. ముఖ్యంగా ఇందులో మిలా మిస్ కాస్ట్ అంటూ విమర్శలొచ్చాయి. 2009లో బెన్ అఫ్లెక్, జాసన్ బ్యాట్మ్యాన్లతో కలిసి 'ఎక్స్ట్రాక్ట్'లో నటించింది. ఇది ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
కెరీర్‌కి అద్భుతమైన బ్రేక్‌నిచ్చిన ది బుక్ ఆఫ్ ఎలీ..
ఆటుపోట్లతో సాగుతున్న మిలా కెరీర్‌కి 'ది బుక్ ఆఫ్ ఎలీ'తో భారీ విజయం దక్కింది. ఇందులో ఆమె డేంజల్ వాషింగ్టన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మిలా కెరీర్లో భారీ హిట్ అందుకున్న చిత్రమిదే కావడం, తొలి బ్రేక్‌నిచ్చిన చిత్రం కావడం విశేషం. ఇందులో ఆమె నటనకి విశేష ప్రశంసలందుకుంది. ఆ తర్వాత ఆమె 2010లో కామెడీ చిత్రం 'డేట్ నైట్'లో మెయిన్ హీరోయిన్గా మెరిశారు. ఇందులో ఆమె టినా ఫే, స్టీవ్ కారెల్లతో కలిసి నటించారు.
ఈ చిత్రానికి కూడా విశేష ప్రశంసలు దక్కాయి. ఆమె కెరీర్లో మరో భారీ బ్లాక్‌బస్టర్ 'బ్లాక్ స్వాన్' రూపంలో లభించింది. సైకలాజికల్ హర్రర్‌గా వచ్చిన ఈ సినిమా కేవలం 13 మిలియన్ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 330 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. టైటిల్ పాత్రలో మిలా విశేష ప్రశంసలందుకోవడంతోపాటు అనేక అవార్డులు అందుకున్నారు. ఈ చిత్రంలో ఆమె నటాలియా పోర్ట్మన్తో కలిసి నటించారు. 2011లో రొమాంటిక్ కామెడీ 'ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్'లో జస్టిన్ టింబర్లేక్తో కలిసి నటించారు. ఈ సినిమా సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 35 మిలియన్ డాలర్లతో రూపొంది 150 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. ఇందులో మిలా, టింబర్కి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. 2012లో కామెడీ సినిమా 'టెడ్'లో మార్క్ వెల్బెర్గ్తో జోడీ కట్టారు. 50 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ సినిమా 550 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. మిలా కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో హాలీవుడ్లో అగ్ర కథానాయికగా ఎదిగింది.
హాలీవుడ్లో స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన హ్యాట్రిక్ హిట్స్..
ఇదే సంవత్సరం నాటకీయ భరితంగా తెరకెక్కిన 'ది కలర్ ఆఫ్ టైమ్'లో కీలక పాత్రలో మెరిశారు. కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కారు. హాలీవుడ్లో అగ్ర కథానాయికగా ఎదిగారు. స్యామ్ రైమీ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ 'ఆన్ ది గ్రేట్ అండ్ పవర్ఫుల్' చిత్రంతో తిరుగులేని హీరోయిన్గా ఎదిగారు. ఇది మరో కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇలా వరుసగా 'బ్లడ్ టైస్', 'థర్డ్ పర్సన్', 'ది ఆంగ్రీయెస్ట్ మ్యాన్ ఇన్ బ్రూక్లీన్', 'జూపిటర్ అస్సెండింగ్' చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. కానీ 'బ్యాడ్ మామ్స్', దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'బ్యాడ్ మామ్స్ క్రిస్మస్', 'ది స్పై హు డంప్డ్ మీ' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. 'అన్నీ' సినిమాలో గెస్ట్‌గా మెరిశారు. 'ది ఆంగ్రీయెస్ట్ మ్యాన్ ఇన్ బ్రూక్లిన్', 'ఏ బ్యాడ్ మామ్స్ క్రిస్మస్ ' చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారు. ప్రస్తుతం 'బ్రేకింగ్ న్యూస్ ఇన్ యుబా కంట్రీ' చిత్రంలో నటిస్తున్నారు.
టెలివిజన్ రంగంలో అరుదైన గుర్తింపు..
మిలా కునీస్ మొదట సినిమాల్లో కంటే టెలివిజన్స్లోనే బాగా రాణించారు. పలు పాపులర్ టెలివిజన్ సిరీస్‌లో భాగమైన బుల్లితెర స్టార్‌గానూ ఎదిగారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా దగ్గరయ్యారు. ఆమె మొదట 1994లో 'డేస్ ఆఫ్ అవర్ లైవ్స్' టెలివిజన్‌లో నటించిన విషయం విదితమే. ప్రముఖ హాలీవుడ్ పాపులర్ టెలివిజన్ షో 'బేవాచ్'లో దాదాపు రెండేండ్లపాటు రెండు సీజన్స్‌లో నటించారు. 'ది జాన్ లర్రోక్వెట్టె షో', టెలివిజన్ ఫిల్మ్ 'పిరాన్హా'తోపాటు వరుసగా 'హడ్సన్ స్ట్రీట్', 'అన్హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్', 'నిక్ ఫ్రెనో: లైసెన్డ్స్ టీచర్', 'సెవెన్త్ హెవెన్', 'వాకర్, టెక్సాస్ రేంజర్', 'గియా', 'సెన్సాకోలా: వింగ్స్ ఆఫ్ గోల్డ్', 'దట్స్ 70 షో', 'ఫ్యామిలీ గారు', 'గెట్ రియల్', 'పంక్డ్', 'రోబోట్ చికెన్', 'సీసేమ్ స్ట్రీట్', 'గుడ్ వైబ్స్', 'టూ అండ్ హాఫ్ మెన్', 'ది బ్యాచెలోరేట్', 'ది ఎలెన్ డెజెనెర్స్ షో' వంటి టెలివిజన్ సిరీస్‌లో నటించి బుల్లితెరపై స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.
యువ ప్రేక్షకులు మెచ్చిన సెక్సీయెస్ట్ ఉమెన్
టెలివిజన్స్తోపాటు 'సెయింట్స్ రా', 'ఫ్యామిలీ గారు వీడియో గేమ్', 'ఫ్యామిలీ గారు: బ్యాక్ టు ది మల్టీవర్స్', 'ఫ్యామిలీ గారు: ది క్వెస్ట్ ఫర్ స్టఫ్' వంటి వీడియో గేమ్స్, 'ఇన్ ది స్ట్రీట్', 'ది ఇట్చ్','రాక్ అండ్ రోల్ ఆల్ నైట్', 'జేడెడ్', 'ది ఎండ్ హ్యాస్ నో ఎండ్', 'లా గర్ల్స్' వంటి మ్యూజిక్ వీడియోస్‌లోనూ మెరిశారు. 2007లో 'ఫన్నీ ఆర్ డై' వీడియోలో జేమ్స్ ఫ్రాంకోతో కలిసి నటించారు. దీన్ని ఎంటీవీ షో 'ది హిల్స్'లో ప్రసారం చేశారు. దీనికి విశేష స్పందన రావడంతోపాటు పేరు వచ్చింది. ఆ తర్వాత 2010లో ఉమెన్ వి లవ్ అనే ఎస్వ్కైర్ వీడియోలోనూ మెరిశారు. అమెరికన్ ఉమెన్ వీడియోలోనూ నటించారు. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని న్యూయార్క్ సిటీ ఎయిడ్స్ ఫౌండేషన్‌కి అందించారు. అలాగే ఇండ్లు లేని వారికోసం సొంతిల్లు, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఎస్వ్కైర్ మ్యాగజీన్ 2012లో విడుదల చేసిన సెక్సీయెస్ట్ ఉమెన్ జాబితాలో చోటు సంపాదించారు. 2013లో ఫోర్బ్స్ ప్రకటించిన వంద మంది అత్యంత శక్తివంతమైన సెలబ్రిటీల్లో 89వ ర్యాంక్‌ని దక్కించుకున్నారు. 2013లో ప్రకటించిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో 14వ స్థానంలో నిలిచారు. ఇక ఆమె దీర్ఘ కాలంగా కనుగుడ్డు వాపుతో బాధపడ్డారు. వ్యక్తి గత జీవితానికి వస్తే మిలా వివాహ బంధం అంత సంతృప్తిగా కొనసాగలేదు.
ఇదిలా ఉంటే, అద్భుతమైన నటనతో మెప్పించిన మిలాకి చెప్పుకోదగ్గ గొప్ప అవార్డులు రాకపోవడం గమనార్హం.
Authorization