క్రిస్టోఫర్ నోలన్..మూసధోరణిలో ఉన్న హాలీవుడ్ గమనాన్నే మార్చేసిన దర్శకుడు. ఓటమి ఎరుగని అత్యద్భుతమైన చిత్రాల దర్శకుడు. అన్నింటికిమించి నాటి తరం,నేటి తరమే కాదు భవిష్యత్ తరం కూడా స్ఫూర్తిగా తీసుకునే దిగ్దర్శకుడు. అద్భుత ప్రతిభగల దర్శకుడిగా, ఉత్తమాభిరుచిగల నిర్మాతగా, వినూత్న కథల రచయితగా యావత్ ప్రేక్షకలోకాన్ని ఫిదా చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి క్రిస్టోఫర్ నోలన్ గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
చిన్నప్పట్నుంచే సినిమాల ప్రభావం
క్రిస్టోఫర్ ఎడ్వర్డ్ నోలన్ 1970 జులై 30న ఇంగ్లాండ్‌కి చెందిన లండన్‌లోని వెస్టిమిస్టర్లో జన్మించారు. తండ్రి బ్రెండన్ జేమ్స్ నోలన్ అడ్వటైజింగ్ ఎగ్జిక్యూటివ్. తల్లి క్రిస్టినా ఫ్లైట్ అటెండెంట్, ఇంగ్లీష్ టీచర్. అన్నయ్య మాథ్యూ ఫ్రాన్సిస్ నోలన్ నేరస్థుడు. తమ్ముడు జోనాథన్ రైటర్, దర్శకుడు, నిర్మాతగా రాణిస్తున్నారు. తన ఏడేండ్ల వయసు నుంచి సినిమాలు తీయడం ప్రారంభించారు. సూపర్ 8 కెమెరాతో అప్పట్లోనే లఘు చిత్రాలు తీయడం ప్రారంభించారు. ఆయన దర్శకుడిగా మారడానికి 1968లో వచ్చిన '2001:ఏ స్పేస్ ఓడెస్సీ', 'స్టార్‌వార్స్' చిత్రాలు ప్రధాన కారణం. తన ఎనిమిదో ఏటనే 'స్టాప్ మోషన్ యానిమేషన్' టెక్నిక్స్‌ని కనిపెట్టారు. యావయ్య వరసయ్యే ఒకరు నాసాలో పనిచేసేవారు. అపోలో రాకెట్ పంపించినప్పుడు దానికి సంబంధించిన ఫూటేజి ఆధారంగా సినిమా తీయాలని, తెరపై దాన్ని ఎలా ఆవిష్కరించాలనే దానిపై ప్రయోగాలు చేశారు.
లఘు చిత్రాలతో ప్రయోగాలు
క్రిస్టోఫర్ పదకొండేండ్ల వయసు నుంచే సినిమా మేకింగ్‌పై దృష్టి సారించారు. ప్రముఖ దర్శక, నిర్మాత రోకో బెలిక్, ఆండ్రియన్లతో కలిసి సినిమా తీయడం ప్రారంభించారు. కానీ వర్కౌట్ కాలేదు. హైలీబరీ అండ్ ఇంపెరియల్ సర్వీస్ కాలేజ్‌లో ఉన్నత విద్య, యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. ఆ తర్వాత యూనియన్ ఫిల్మ్ సొసైటీకి అధ్యక్షుడిగానూ ఎంపికయ్యారు. ప్రియురాలు ఎమ్మా థామస్‌తో కలిసి 35ఎంఎం చిత్రాన్ని రూపొందించి స్కూల్లో ప్రదర్శించారు. దీంతోపాటు మరో రెండు లఘు చిత్రాలని తీశారు. 1989లో 'టారంటెల్లా' పేరుతో 8ఎంఎంతో మొదటి లఘు చిత్రం తీశారు. అలాగే మరిన్ని ప్రయోగాలు చేస్తూ 'లెర్సెనీ'ని రూపొందించారు. 1993లో ఇంగ్లీష్ లిటరేచర్ చేసే సమయంలో స్క్రిప్ట్ రీడర్, కెమెరా ఆపరేటర్‌గా, ఇండిస్టీయల్ చిత్రాలకు, కార్పొరేట్ వీడియోస్‌కి డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. 1997లో 'డూడ్లెబగ్' పేరుతో మూడో లఘు చిత్రం తీశారు.
కెరీర్‌ని టర్న్ చేసిన మెమెంటో
లఘు చిత్రాలు, పలు ప్రయోగాల అనంతరం 1998లో దర్శకుడిగా మారుతూ 'ఫాలోయింగ్' అనే సినిమాని తన స్నేహితులతో కలిసి రూపొందించారు. లండన్‌లో ఉన్నప్పుడు తన అనుభవాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనికి నిర్మాత, కెమెరామెన్, ఎడిటర్, రైటర్‌గా వ్యవహరించారు. ఇది క్రిటికల్‌గా మంచి ప్రశంసలందుకుంది. పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమై అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమా తనకు మరో భారీ చిత్రం 'మెమెంటో'కి దర్శకత్వం వహించే ఛాన్స్ తెచ్చిపెట్టింది. నియో నాయర్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో గారు పీయర్స్, క్యారీ అన్నె మోస్ జంటగా నటించారు. ఇది 9మిలియన్ డాలర్లతో తెరకెక్కి, 40 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. భార్యని హత్య చేసిన నిందితులను పట్టుకుని హంతమొందించడమనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. దీని ఆధారంగానే 'గజిని' సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇది అమెరికన్ ఫిల్మ్ రిజిస్ట్రీకి ఎంపికైంది. తన కెరీర్లో రెండో సినిమాతోనే భారీ బ్రేక్‌ని అందుకున్నారు. ఈ సినిమా చూసి దర్శక, నిర్మాత స్టీవెన్ సోడెన్బర్గ్ తనకు సైకలాజికల్ థ్రిల్లర్ 'ఇన్సోమ్నియా'కి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. 2002లో తెరకెక్కించిన ఈ సినిమాలో ఆల్ పసినో, రాబిన్ విలియమ్స్, హిలరీ స్వాంక్ ప్రధాన పాత్రలు పోషించారు. 1997లో అదే పేరుతో వచ్చిన చిత్రానికిది రీమేక్. 46 మిలియన్ డాలర్లతో రూపొంది 113 మిలియన్ డాలర్లని వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అనేక ప్రశంసలందుకుంది. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త, దర్శకుడు, ఇన్వెస్టర్ హోవర్డ్ హఫ్స్ బయోపిక్ తీయాలని ప్లాన్ చేశారు. కానీ అప్పటికే మరో దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ 'ది అవైటర్' పేరుతో రూపొందించడంతో తాను వెనక్కి తగ్గారు. ఆ సమయంలో 'ట్రారు' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చినా వదులుకున్నారు. అప్పుడు ప్రముఖ క్రైమ్ నవల 'ది కీస్ టు ది స్ట్రీట్'ని సినిమాగా తీయాలని భావించారు. కానీ మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
వరుస బ్లాక్‌బస్టర్స్‌తో అగ్రదర్శకుడిగా గుర్తింపు
కొంత గ్యాప్ తీసుకుని 'బ్యాట్మన్' సిరీస్‌లో భాగంగా వచ్చిన 'బ్యాట్మన్ బిగిన్స్'కి దర్శకత్వం వహించారు. క్రిస్టియాన్ బాలె, మైఖెల్ కియానె, లియమ్ నీసన్, క్యాటీ హోల్మ్స్, గ్యారీ ఓల్డ్మన్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించగా, 150 మిలియన్ డాలర్లతో ఈ సినిమాని తెరకెక్కించారు. 2005లో విడుదలై ఏకంగా 374 మిలియన్ డాలర్లని వసూలు చేసి రికార్డు సృష్టించింది. నోలన్‌కి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. 'బ్యాట్‌మ్యాన్ బిగిన్స్' విడుదలైన ఏడాది గ్యాప్‌తో 'ది ప్రెస్టీజ్' చిత్రాన్ని రూపొందించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం 2006లో విడుదలై ఘన విజయం సాధించింది. హాఫ్ జాక్మన్, క్రిస్టియన్ బాలె, మైఖేల్ సియన్, స్కార్లెట్ జాన్సన్, రెబెకా హాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. 40మిలియన్ డాలర్లతో తెరకెక్కి 110 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. గ్రిప్పింగ్, సస్పెన్స్‌ఫుల్, మిస్టీరియస్ డార్క్ ఫన్ సమాహార చిత్రంగా విశేష ప్రశంసలందుకుంది. అంతేకాదు ఈ సినిమాతో ఆయన నిర్మాతగానూ మారారు. తన భార్యతో కలిసి సిన్కాపీ ఫిల్మ్స్‌ని స్థాపించి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్ర ఘన విజయంతో 'బ్యాట్‌మ్యాన్' సిరీస్‌లో మరో సినిమాని 'ది డార్క్ నైట్' పేరుతో తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ఈ క్రైమ్ డ్రామాని మరింత విస్తృతంగా చూపించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌కి రూపం పోశారు. తన నిర్మాణంలోనే ఈ సూపర్ హీరో చిత్రాన్ని మరింత లావిష్‌గా 185 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. 2008లో సినిమా విడుదలై సరికొత్త రికార్డులు సృష్టించింది. ఏకంగా బిలియన్ డాలర్లని వసూలు చేసింది. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షను రాబట్టిన 39వ చిత్రంగా నిలిచింది. ఇందులో క్రిస్టియన్ బాలె, మైఖేల్ సియానె, హీత్ లెడ్గర్, గ్యారీ ఓల్డ్మన్, మోర్గాన్ ఫ్రీమన్ కలిసి నటించారు. బ్యాట్‌మ్యాన్‌గా క్రిస్టియన్ బాలె నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్ర విజయంతో వార్నర్ బ్రదర్స్ నోలన్‌తో 'ఇన్సెప్షన్' సినిమాకి దర్శకత్వం వహించేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ చిత్రాన్ని నోలన్ నిర్మించారు. లియోనార్డో డికాప్రియో హీరోగా రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా 2010లో విడుదలై ఘన విజయం సాధించింది. 160 మిలియన్ డాలర్లతో తెరకెక్కి 828 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. 'ఏ' ప్లస్ రేటింగ్ సంపాదించింది. అనంతరం 'బ్యాట్‌మ్యాన్' సిరీస్‌లోని మూడో సినిమాకి రూపకల్పన చేశారు. 'ది డార్క్ నైట్ రైజెస్' పేరుతో రూపొందించారు. ఈ చిత్రం కూడా సంచలన విజయం సాధించింది. బిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసింది. గత చిత్రాల్లో నటించిన తారాగణమే ఇందులోనూ నటించింది. అయితే ఈ సినిమా ప్రదర్శన టైమ్‌లో కోలోరాడో లోని ఔరోరాలో సెంచురీ 16 సినిమా హాల్లో రాత్రి సమయంలో కొందరు దుండగులు ఆడియెన్స్‌పై కాల్పులు జరిపారు. దీంతో 12 మంది చనిపోగా, 58 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనని నోలన్ తీవ్రంగా ఖండించారు. ఈ చిత్రం తర్వాత 'మ్యాన్ ఆఫ్ స్టీల్' అనే చిత్రానికి ఐడియా ఇవ్వడంతోపాటు నిర్మించారు. 2013లో ఆ సినిమా విడుదలైంది. ఈ చిత్ర కథలోనూ భాగమయ్యారు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
వినూత్న కథలతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన దిగ్దర్శకుడు
తీసే ప్రతి సినిమా ఓ ప్రత్యేకతతో రూపొందిస్తూ ప్రపంచ ప్రేక్షకులను మెప్పిస్తున్న క్రిస్టోఫర్ నోలన్ మరో సంచలనానికి 'ఇంటర్స్టెల్లార్' రూపంలో తెరలేపారు. సైన్స్ ఫిక్షన్‌గా 2014లో ఈ సినిమా విడుదలైంది. స్పేస్ ప్రధానంగా వచ్చిన ఈ సినిమాలో మాథ్యూ మెక్ కనాగీ, అన్నె హాత్వే, జెస్సికా చస్టైన్, బిల్ ఐర్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. 165 మిలియన్ డాలర్లతో రూపొంది 677మిలియన్ డాలర్లని వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలతోపాటు సైంటిస్ట్‌ల మన్ననలు కూడా పొందారు. ఈ చిత్రానికి తనే రైటర్, ప్రొడ్యూసర్ కూడా కావడం విశేషం. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంతో రూపొందించిన 'డన్కిర్క్' సినిమా 2017లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన చిత్రంగా ప్రపంచ సినీ లోకం దీన్ని ప్రశంసించింది. దాదాపు 150 మిలియన్ డాలర్లతో రూపొంది 526 మిలియన్ డాలర్లని వసూలు చేసింది. ప్రస్తుతం 'టెనెట్' పేరుతో యాక్షన్ థ్రిల్లర్‌గా ఓ సినిమాని రూపొందిస్తున్నారు.
కొత్త కొత్త లొకేషన్లలో చిత్రీకరించడం, డైలాగ్స్ చెప్పే విధానాన్ని క్లోజ్‌గా చిత్రీకరించడం ఆయన స్టయిల్. ఈతరం కథకుల్లో బిగ్ కాన్వాస్ స్టోరీ టెల్లర్గా, మొదటి మేజర్ టాలెంటెడ్ దర్శకుడిగా వర్ణించారు. కమర్షియాలిటీ, ఆర్ట్‌ని మేళవించి అద్బుతాలు సృష్టించగల దర్శకుడిగా నిలవడమే కాకుండా తన మాస్టర్ వర్క్‌కి 'మెమెంటో', 'ఇన్సెప్షన్' చిత్రాలు ప్రతిబింబమని ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ వర్ణించారు. 2015లో టైమ్స్ ప్రకటించిన వంద మంది అత్యంత ప్రభావితం చేసే వ్యక్తుల్లో ఒకరిగా, 2011, 2013లో ఫోర్బ్స్ ప్రకటించిన వంద మంది శక్తివంతమైన సెలబ్రిటీల్లో ఒకరిగా స్థానం దక్కించుకున్నారు. ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడిగా నిలిచి, ఫిల్మ్ మేకింగ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా పేరొందిన నోలన్‌కి ఒక్క ఆస్కార్ కూడా దక్కకపోవడం గమనార్హం. కానీ ఆయన సినిమాలు దాదాపు అన్ని ఇతర విభాగాల్లో ఆస్కార్‌ని దక్కించుకోవడం విశేషం.
అత్యుత్తమ దర్శకత్వ ప్రతిభకి ప్రతిరూపాలు
తీసింది పది సినిమాలే అయినా ఒక్కొక్కటి ఒక్కో ట్రెండ్ సృష్టించాయని చెప్పొచ్చు.
దర్శకత్వం వహించిన తొలిచిత్రం 'ఫాలోయింగ్'. నియో నాయిర్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఓ యంగ్ రైటర్ ప్రయాణికులను గమనిస్తూ వెళ్తుంటాడు. తెలియ కుండానే ఆయన క్రిమినల్ అండర్‌వరల్డ్‌లోకి వెళ్ళిపోతాడు. దాన్నుంచి ఎలా బయటపడ్డాడు. ఆ తర్వాత చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం టైట్ ఫిల్మ్ మేకింగ్‌కి ప్రతిరూపంగా నిలిచి ప్రశంసలందుకుంది. దీని తర్వాత రూపొందించిన మరో నియో నాయిర్ సైకలాజికల్ థ్రిల్లర్ 'మెమెంటో' చిత్రం కూడా ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. భార్య హత్యకు కారణమైన వ్యక్తులను గతాన్ని మర్చిపోయే భర్త ఫొటో రూపంలో గుర్తుపెట్టుకుని అంతం చేసే కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రం హాలీవుడ్లో ఫాత్ బ్రేకింగ్ సినిమాగా నిలిచింది. వైద్యులు సైతం ఆంటెరోగ్రేడ్ అమ్నెసియా డిజార్డర్‌కి సంబంధించిన లక్షణాలను అత్యంత రియలిస్టిక్‌గా చూపించారని నోలన్ని ప్రశంసించారు. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో 'ఇన్సోమ్నియా'ని రూపొందించారు.
ఓ మర్డర్ మిస్టరీని ఇద్దరు లాస్ ఏంజెల్స్ డిటెక్టివ్స్ చేధించే కథాంశంతో దీన్ని తెరకెక్కించారు. తన తల్లిదండ్రులను చంపి, గోథమ్ పట్టణాన్ని ఆధీóనంలోకి తీసుకుని అరచకాలు సృష్టిస్తున్న రాస్ ఆల్ గుల్, రాక్షస విలన్ స్కారెక్రౌలపై పోరాటం చేసి, తనదేశంలోని గందరగోళాన్ని అంతం చేయడానికి బ్యాట్మన్ చేసే సాహసం ఆధారంగా సూపర్‌హీరో చిత్రం 'బ్యాట్‌మ్యాన్'ని రూపొందించారు. ఏ ప్లస్ రేటింగ్‌ని అందుకుని, ఓ రీఫ్రెషింగ్‌గా చిత్రంగా నిలిచింది. ఓ విషాదం తర్వాత ఇద్దరు ఇంద్రజాలికులు మరో అంతిమ భ్రమని సృష్టించేందుకు చేసే పోరాటం నేపథ్యంలో సైకలాజికల్ థ్రిల్లర్ 'ది ప్రిస్టీజ్'ని తెరకెక్కించారు. ఇతర వ్యక్తుల సబ్కాన్షియస్ మైండ్(కలల్లో)లో తన ఆలోచనలను ఇన్సర్ట్ చేసి కార్పొరేట్ కంపెనీల విలువైన, రహస్యమైన సమాచారాన్ని దొంగిలించే అత్యంత టాలెంటెండ్ దొంగ పాత్ర ప్రధానంగా రూపొందిన 'ఇన్సెప్షన్' చిత్రం మరో సంచలనం. సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కి టేకింగ్ పరంగా మరో ట్రెండ్ సృష్టించింది. స్పేస్ బేస్డ్గా రూపొందిన 'ఇంటర్ స్టెల్లార్' అంతరిక్ష నేపథ్య చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది.
భూమిపై కరువు, ప్రకృతి విపత్తులు, భూకంపాలు సంభవిస్తుంటాయి. మానవ మనుగడ కష్టంగా మారుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మనుషులు జీవించేందుకు గ్రహాలను వెతికేందుకు వ్యోమగామల టీమ్ చేసే స్పేస్ జర్నీ నేపథ్యంలో సాగే చిత్రమిది. 'బ్యాట్‌మ్యాన్'కి సీక్వెల్‌గా 'ది డార్క్ నైట్'ని రూపొందించారు. గోథమ్ నగరం ప్రశాంతంగా ఉందనుకునే టైమ్‌లో సూపర్ విలన్ జోకర్ మరోసారి విరుచుకుపడతారు. ఆ జోకర్ ఆగడాలను బ్యాట్‌మ్యాన్ ఎలా కట్టడి చేశాడనే కథాంశంతో ఈ సినిమాని రూపొందించారు. దీనికి మరో సీక్వెల్‌గా 'ది డార్క్ నైట్ రైజెస్' తీశారు. ఎనిమిది ఏండ్ల తర్వాత గోథమ్ నగరంలోకి టెర్రరిస్ట్ బృందం ప్రవేశించి విధ్వంసం సృష్టిస్తుంటారు. మరోసారి బ్యాట్‌మ్యాన్ చేసే అంతిమ పోరాటం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
దర్శకుడిగా మరో సంచలనం సృష్టించిన చిత్రం 'డన్కిర్క్'. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఫ్రెంచ్ పట్టణం డన్కిర్క్ సముద్రతీరాన్ని నాజీ జర్మన్ సైన్యం ఆక్రమిస్తుంది. వీరి నుంచి తప్పించుకోవడానికి బ్రిటీష్, దాని మిత్ర రాజ్యాల సైన్యం ఎలాంటి పోరాటం చేశారు. తొమ్మిది రోజులపాటు జరిగిన భీకర యుద్ధం అనంతరం యుద్ధం కంటే ప్రాణం ముఖ్యమని బ్రిటీష్ సైన్యం సముద్రం గుండా పారిపోవాల్సి వస్తుంది. యుద్ధం చేసినా చనిపోతారు. సముద్రంలోకి వెళ్ళినా చనిపోతారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్రిటీష్ సైన్యం ప్రాణాలతో బయటపడేందుకు చేసే పోరాట నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించారు. ఆనాటి యదార్థ పరిస్థితులకు ప్రతిబింబంగా నిలిచేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Authorization