ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భిన్న నేపథ్య చిత్రాలొచ్చినప్పటికీ ట్విన్స్ బేస్డ్గా రూపొందిన చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఒకేలా ఉన్న కవలలు వెండితెరపై చేసే మ్యాజిక్ భలే గమ్మత్తుగా ఉంటుంది.
అన్ని రకాల జోనర్ బ్యాక్‌డ్రాప్స్‌లో తెరకెక్కిన ట్విన్స్ బేస్డ్ సినిమాలు మంచి విశేషాదరణ పొందాయి. అంతేకాదు వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షమూ కురిపించాయి. కవల పిల్లల నేపథ్యంలో మన దగ్గర కూడా ఎన్నో సినిమాలొచ్చి మంచి విజయాల్ని సాధించాయి. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటూ ప్రేక్షకుల్ని ఫిదా చేసిన రీసెంట్ ట్విన్స్ బేస్డ్ సినిమాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో...
లెజెండ్
లండన్‌కి చెందిన ఇద్దరు గ్యాంగ్‌స్టర్ కవలలు క్రే ట్విన్స్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఈ ఇద్దరు లండన్ నగరాన్ని తమ కంట్రోల్లోకి తీసుకుని గడగడలాడిస్తుంటారు. అనేక రాబరీలు, హత్యలు, స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో వారి జీవితంలోని ఎత్తుపల్లాలు, ఇద్దరి కవలల మధ్య ఉన్న బాండింగ్, వారి ప్రవర్తనని ప్రతిబింబించేలా రూపొందిన బయోగ్రాఫికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. దీనికి బ్రియాన్ హెల్గెలాండ్ దర్శకత్వం వహించారు. క్రే ట్విన్స్‌గా టామ్ హార్డీ నటన ఆడియెన్స్‌ని ఫిదా చేస్తుంది. రెండు పాత్రల్లో విలక్షణ నటనతో మైమరపించారు. 2015లో సినిమా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అనేక అవార్డులను అందుకుంది.
మెటల్ హార్ట్
ఇద్దరు మహిళా కవలలు ఎమ్మా, చంటల్ మంచి తెలివైనా, ప్రతిభావంతులు. ఎమ్మా తన డ్రీమ్ అయిన మ్యూజిక్ బ్యాండ్‌ని బెస్ట్ ఫ్రెండ్ గ్యారీతో కలిసి ప్రారంభిస్తుంది. అందులో రాణించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇక చంటల్ చాలా అందమైన అమ్మాయి. కాన్ఫిడెన్స్ ఎక్కువ. తాను ఏం అవ్వాలనుకుందో ఆ విషయంలో క్లారిటీగా ఉంటుంది. ఓసారి వీరి పేరెంట్స్ సమ్మర్ హాలీడేస్‌లో భాగంగా బయటకు వెళతారు. దీంతో ఇంట్లో వీరిద్దరే ఉండాల్సి వస్తుంది. అప్పుడే వీరికి ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. పేరెంట్స్ లేకపోవడంతో స్నేహంగా ఉండే వీరిద్దరు ఎందుకు శత్రువులుగా మారారు? ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా రూపొందింది. నూతన దర్శకుడు పాల్ ముర్రే దర్శకత్వం వహించగా, ఇందులో ఎమ్మాగా జోర్డన్నె జోన్స్, చంటల్గా లీహ మెక్ నామారా అద్బుత నటనతో మైమరపించారు. కమింగ్ ఏజ్ డ్రామాగా రూపొందిన ఈ ఐర్లాండ్ చిత్రం ఈ ఏడాది జులైలో విడుదలై మంచి ఆదరణ పొందింది. కుటుంబ పరిస్థితులు, ఆధునిక కాలంలో పిల్లలు పెరుగుతున్న తీరు, ప్రతిభ వంటి అంశాల ప్రతిబింబంగా ఈ సినిమా నిలిచింది.
ఇన్ట్రూడర్స్
కవలల జీవితంలో ఎత్తుపల్లాలను తెలిపే చిత్రమిది. ఇద్దరు లేడీ ట్విన్స్ పాప్ మ్యూజిక్ రంగంలో మంచి మ్యూజిషీయన్లుగా రాణిస్తుంటారు. ఓ సందర్భంలో ప్రముఖ రికార్డింగ్ కంపెనీ వీరి ఆల్బమ్స్‌ని తిరస్కరిస్తుంది. దీంతో అప్పటి వరకు పాపులర్ మ్యూజిక్ స్టార్స్‌గా వెలిగిన వీరి జీవితం ఒక్కసారిగా ఎలా తలక్రిందులైందనే విషయాన్ని తెలిపే హర్రర్ థ్రిల్లర్ చిత్రమిది. మ్యూజిక్ రంగంలోని చీకటి కోణాలను ఆవిష్కరించిన ఈ యూకే సినిమా విశేష ఆదరణ పొందింది. దీనికి నయీమ్ మహ్మూద్ దర్శకత్వం వహించారు. ట్విన్స్‌గా బ్లూమ్ ట్విన్స్ నటించి, తమ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇది గతేడాది విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. కమర్షియల్గానూ సత్తా చాటింది.
డౌన్వార్డ్ ట్విన్
ఒకరి గుర్తింపు మరొకరు పొందే కథాంశంతో రూపొందిన చిత్రమిది. తన తల్లి చనిపోవడంతో ఇద్దరు కవలలు ఐడెంటిటీ క్రైసిస్‌లో పడతారు. సెలెస్టె హర్ట్కి తోడుగా వాళ్ళ అమ్మ ఉండేది. తనకు సంబంధించి అన్నీ తల్లి చూసుకునేది. అమ్మ మరణంతో తన గుర్తింపుని ట్విన్ స్టిస్టర్ లీన్ హర్ట్ కొట్టేస్తుంటుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సెలెస్టె రివర్స్ గేమ్ ప్రారంభిస్తుంది. మరి ఆ రివర్స్ గేమ్ ఏంటి?, తన ఐడెంటీని సోదరి ఎలా వాడుకుంటుంది?, చివరికి ఏం జరిగిందనే ఆసక్తికర అంశాల సమాహారమే ఈ చిత్రం. హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా గతేడాది విడుదలైంది. బుజ్ వల్లిక్ దర్శకత్వం వహించారు. కవలలు సెలెస్టె హర్ట్, లీన్ హర్ట్‌గా కవలలు కరిస్సా స్ట్రెయిన్, క్యాటీ స్ట్రెయిన్ నటించడం విశేషం.
ఫాదర్ ఫిగర్స్
కవలలు తమ తండ్రిని వెతికే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. కైల్, పీటర్ ఇద్దరు ట్విన్ బ్రదర్స్. వీళ్ళు పుట్టక ముందే తండ్రి చనిపోతాడు. దీంతో తల్లి హెలెన్ పలువురు విభిన్న నేపథ్యానికి చెందిన వివిధ దేశాలకు చెందిన ప్రముఖులతో డేటింగ్ చేస్తుంది. అయితే వీరు ఎవరి వల్ల పుట్టారనేది సస్పెన్స్‌గా మారుతుంది. ఈ క్రమంలో కైల్, పీటర్లకు తమ తండ్రి ఎవరని తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది. దీంతో తమ దగ్గరున్న ఆధారాలతో తండ్రిని కనిపెట్టేందుకు జర్నీ చేపడతారు. ఈ క్రమంలో వాళ్ళకి ఎదురైన సంఘటనలేంటి?, అంతిమంగా తండ్రిని కనుక్కొన్నారా లేదా అనే ఆసక్తికర అంశాల సమాహారంగా రూపొందిన చిత్రమిది. లారెన్స్ షేర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2017లో విడుదలై ప్రేక్షకుల్ని అలరించింది.
మిర్రర్ ఇమేజ్
తమ సోదరిని తానే చంపుకున్న కవలల ప్రధానంగా అత్యంత భయానకంగా రూపొందిన చిత్రమిది. జెస్సికా బ్రౌన్, ఏప్రిల్ మారియా ఎడెన్ ఇద్దరు కవలలు. జెస్సికాకి ఏదో తెలియని మైకం ఆవహిస్తుంది. దీంతో తన కవల సోదరి ఏప్రిల్ మారియాని చంపేస్తుంది. చంపిన తర్వాత సోదరి ఏమైంది? దెయ్యంగా మారిందా?, ఈ హత్యకి, అద్దానికి ఉన్న సంబంధమేంటి అనే భయానక, ఉత్కంఠభరిత సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. క్రిస్ డబ్ల్యూ ఫ్రీమన్, జస్టిన్ జోన్స్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. కవలలుగా ఏప్రిల్ ఎడెన్ అద్భుత నటనతో మెప్పించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా సైతం విశేషంగా ఆకట్టుకుంది.
ది బ్యాడ్ ట్విన్
తల్లి మానసిక వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెని సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కోసం పంపిస్తారు. దీంతో ఆ తల్లి తన ఇద్దరు కవల పిల్లలను సంపన్నురాలైనా మేనత్త దగ్గరికి పంపిస్తుంది. ఆ ఇంటికి వెళ్ళిన ఆ కవలలు ఆస్తి కోసం మేనత్త హత్యకు ప్లాన్ చేస్తారు. మరి ఆ ప్లాన్ నెరవేరిందా, లేదా? ఈ క్రమంలో కవలల మధ్య ఎలాంటి సంఘర్షణ జరిగింది?, అనంతరం ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే ఉత్కంఠ భరిత కథాంశంతో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. జాన్ ముర్లోవిస్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కవలలుగా గ్రేస్ వాన్ డీన్, తల్లిగా హాలీ డఫ్, మేనత్తగా జాసీ కింగ్ నటన ఆద్యంతం అబ్బుర పరుస్తుంది. 2016లో విడుదలైన ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.
దట్స్ నాట్ మీ
ట్విన్ సిస్టర్స్‌లో అసూయ ఎలాంటి చిచ్చు పెట్టిందనే కథాంశంతో ఈ సినిమా విడుదలైంది. ఇద్దరు కవల సోదరీమణుల్లో ఓ అమ్మాయి నటిగా స్టార్‌డమ్‌ని సొంతం చేసుకుంటుంది. అందనంత ఎత్తుకు ఎదుగుతుంది. మరో అమ్మాయి తను కూడా నటి కావాలని ప్రయత్నిస్తూ విఫలమవుతుంటుంది. దీంతో తన సోదరిపై అసూయ పెంచుకుంటుంది. ఆమె కీర్తిని పాడుచేయాలని భావిస్తుంది. అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే కథాంశంతో ఈ ఆస్ట్రేలియన్ ఇండిపెండెంట్ కామెడీ చిత్రం రూపొందింది. గ్రెగరీ ఎర్డ్స్టీన్ దర్శకత్వంలో రూపొంది 2017లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించడంతోపాటు అవార్డులను సైతం దక్కించుకుంది.
ది ఐడెంటికల్
కవల సోదరుల మధ్య వ్యత్యాసం తెలిపే చిత్రమిది. ఇద్దరు కవలలు పుట్టినప్పుడు అనుకోని పరిస్థితుల వల్ల విడిపోతారు. ఒకతను పెద్ద మ్యూజిక్ పాప్ రాక్ స్టార్‌గా పాపులర్ అవుతాడు. మరొకరు తనకిష్టమైన మ్యూజిక్ రంగంలో రాణించలేక, తన తండ్రిని సంతోషపెట్టలేక నలిగిపోతుంటాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కథ ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో ఈ మ్యూజిక్ కామెడీ డ్రామా రూపొందింది. దర్శకుడు డస్టిన్ మర్సెల్లినో తెరకెక్కించిన ఈ చిత్రంలో కవలలుగా బ్లాక్, రేనె అద్భుత నటనతో మైమరపించారు. 2014లో విడుదలైన మంచి కలెక్షన్లను వసూలు చేసింది.
ది ప్రెట్టీ వన్
లారెల్, ఆండ్రీ ఇద్దరు ట్విన్ సిస్టర్స్. ఆండ్రీ చాలా కాన్ఫిడెంట్, మంచి పాపులారిటీ పొందిన రియల్ ఎస్టేట్ ఉద్యోగి. లారెల్కి బిడియం ఎక్కువ. ఇంకా చిన్నపిల్లలా ప్రవర్తిస్తూ తన తండ్రి వద్దే ఉంటుంది. అయితే తను కూడా సోదరి ఆండ్రీలా మారాలనుకుంటుంది. ఇద్దరు కలిసి ప్రయాణిస్తున్నకారు ప్రమాదానికి గురవడంతో తన సోదరి ఆండ్రీ చనిపోయిందనే వార్త హాస్పిటల్లో లారెల్ తెలుసుకుంటుంది. దీంతో తన సోదరిలా తాను ఉండాలనుకుని గెటప్ మొత్తం మార్చుతుంది. ఆండ్రీలా తయారవుతుంది. ఆమెని చూసిన చాలా మంది ఆండ్రీనే అనుకుంటారు. కానీ ప్రవర్తన విషయంలో ఆమెని ఫాలో కాలేకపోతుంది. ఈ నేపథ్యంలో తను అబద్దమనే విషయాన్ని చెప్పిందా లేక ఆండ్రీలాగే కంటిన్యూ అయ్యిందా?, అనంతరం ఎలాంటి ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయనేది మిగిలిన సినిమా. కామెడీ డ్రామాగా దర్శకుడు జెనీ లామార్యూ ఈ చిత్రాన్ని రూపొందించారు. 2013లో విడుదలై ఆకట్టుకుంది. కవలలుగా జోయి కాజన్ ద్విపాత్రాభినయం చేసి అలరించారు.
జాకీ
ట్విన్ స్టిస్టర్ల ఆసక్తికర జర్నీని తెలిపే సినిమా ఇది. సోఫియా, డాన్ ఇద్దరు కవల సోదరీమణులు. వీరికి అమ్మ ఒక్కరే. కానీ తండ్రులిద్దరు. అమెరికాలో ఉన్న తల్లికి కాలు ఫ్యాక్చర్ అయిందనే విషయం తెలుసుకున్న ఈ ఇద్దరు అమ్మని చూసేందుకు బయలుదేరుతారు. ఈ ప్రయాణంలో చోటు చేసుకున్న ఆసక్తికర సంఘటనల సమాహారమే సినిమా. ఈ డచ్ కామెడీ డ్రామాకి ఆంటోయినెట్టీ బ్యూమర్ దర్శకత్వం వహించారు. 2012లో విడుదలైన సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందింది.
జాక్ అండ్ జిల్
లాస్ ఏంజెల్స్‌కి చెందిన సక్సెస్ఫుల్ అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ జాక్. తన భార్య, ఇద్దరు పిల్లలతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఇంతలో తన ట్విన్ సిస్టర్ జిల్ ఇంటికి వస్తుంది. అల్లరి చిల్లరగా, అమాయకత్వంతో, వింతగా చేసే జిల్ చేష్టలు ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి?, దీని వల్ల జాక్ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందనే కథాంశంతో ఆద్యంతం హాస్యభరితంగా ఈ సినిమా రూపొందింది. డెన్నిస్ డుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ట్విన్స్‌గా ప్రముఖ స్టార్ హీరో ఆడమ్ సాండ్లర్, కీలక పాత్రల్లో ఆల్ పసినో, కేటీ హౌల్మ్స్ నటించారు. 2011లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇదొక చెత్త సినిమాగా, చెత్త నటీనటుల విభాగంలో పలు అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం.
Authorization