నాటకాల ప్రేరణతో నటనపై ఆసక్తి
అద్భుతమైన అందంతో, మంత్రముగ్ధుల్ని చేసే నటనతో ఆకట్టుకుంటున్న గాంగ్లీ చైనాలోని లియావోనింగ్కి చెందిన షెనియాంగ్లో 1965, డిసెంబర్ 31న జన్మించారు. తండ్రి గాంగ్ లైజ్ ఎకనామిక్ ప్రొఫెసర్. తల్లి లియు యింగ్ టీచర్. వీరి ఐదుగురి సంతానంలో గాంగ్లీ అందరికంటే చిన్న అమ్మాయి. సినిమాలతో ఎలాంటి సంబంధం లేని కుటుంబం వీరిది. గాంగ్ ఎక్కువగా షాండాంగ్లోని జినన్లో పెరిగారు. అక్కడే తన ప్రాథమిక, ఉన్నత విద్య పూర్తయ్యింది. తల్లిదండ్రులు ఇద్దరూ టీచింగ్ ఫీల్డ్‌లో ఉండటంతో చాలా ఉన్నతంగా పెరిగారు. అప్పట్లో నాటకాలకు మంచి ఆదరణ ఉండేది. వాటి ప్రభావంతో లీకి నటనపై ఆసక్తి ఏర్పడింది. నటిగా రాణించాలనే నిర్ణయానికి వచ్చి 1985లో సెంట్రల్ అకాడమీ ఆఫ్ డ్రామా ఇన్ బీజింగ్ ఇనిస్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్స్‌లో చేరారు. చురుకైన స్వభావం కావడంతో నటనలో మెళకువలు నేర్చుకోవడానికి ఎక్కువ టైమ్ పట్టలేదు.1989లో నటనలో పట్టాపొందారు. ఓ వైపు యాక్టింగ్ కోర్స్ కొనసాగిస్తూనే తన సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
సంఘర్షణాభరిత పాత్రలకు కేరాఫ్
చైనాకు చెందిన యువ ఫిల్మ్ మేకర్ జాంగ్ యిమౌ దర్శకుడిగా మారి సినిమా తీయాలని భావించారు. నూతన నటీనటులను వెతికే క్రమంలో బీజింగ్ ఇనిస్టిట్యూట్‌లో గాంగ్లీ పరిచయం అయ్యారు. ఆమె అందానికి ముగ్ధుడైన జాంగ్ తన మొదటి సినిమాలో కథానాయికగా ఎంపిక చేశారు. 1988లో ఆయన దర్శకత్వం వహించిన 'రెడ్ సోర్గమ్' చిత్రంతో గాంగ్లీ కథానాయికగా మారారు. ఇందులో లైంగిక బాధితురాలిగా, శృంగారభరిత పాత్రలో కనువిందు చేశారు. తొలి సినిమాతోనే మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా అవి బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచాయి. మళ్ళీ ఆయన దర్శకత్వంలోనే 'కోడ్ నేమ్ కౌగర్'లో నటించగా ఇది విజయం సాధించింది. మధ్యలో నటించిన మరో సినిమా 'ఏ టెర్రాకోట వారియర్' అంతగా గుర్తింపు తేలేకపోయింది. మరోసారి జాంగ్ దర్శకత్వంలో 'జు డౌ'తోపాటు, 'రైజ్ ది రెడ్ లాంటర్న్'లో నటించి దేశ వ్యాప్తంగా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రాలతో గాంగ్లీకి భారీ బ్రేక్ లభించింది. 'రైజ్ ది రెడ్ లాంటర్న్' చిత్రంలో ఆమె నటనకు విశేష ప్రశంసలతోపాటు ఉత్తమ నటిగా ఆస్కార్‌కి కూడా నామినేట్ అయ్యారు. ఏడాది తర్వాత నటించిన 'ది స్టోరీ ఆఫ్ క్యూ జు' చిత్రంలోని ఆమె నటనకు వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు వరించింది. చైనాకు చెందిన 'ఆసియావీక్' మ్యాగజైన్ గాంగ్‌ని అత్యంత అందమైన సినీ తారగా అభివర్ణించింది. ప్రారంభంలో ఆమె ఎక్కువగా సంఘర్షణ పూరితమైన పాత్రల్లో, హింసాత్మకంగా ఉండే పాత్రల్లో, లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిగా నటించారు. దీంతో ఆమెపై సంఘర్షణ పాత్రలకు కేరాఫ్ అనే ముద్రపడింది.
హాలీవుడ్‌లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటి
వాంగ్ కార్ వాయి దర్శకత్వంలో నటించిన '2046', 'ఎరోస్' చిత్రాలతో లీకి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాదు హాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశాలనూ తెచ్చిపెట్టాయి. అయితే లీ ఇంగ్లీష్‌లో వీక్. ఆంగ్లం రాకపోవడంతో పలు హాలీవుడ్ ఆఫర్స్‌ని వదులుకోవాల్సి వచ్చింది. కొంత గ్యాప్‌తో ఎట్టకేలకు 2005లో 'మెమొరీస్ ఆఫ్ ఏ గీషా'లో నటించారు. రబ్ మార్షల్ దర్శకత్వం వహించిన ఈ హాలీవుడ్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ నిర్మించడం విశేషం. ఇందులో కూడా డైలాగ్‌లు చెప్పడం కోసం ప్రాంప్టర్ని పెట్టుకుని మరీ నటించారు. హాలీవుడ్లో నటించిన తొలి సినిమాతోనే గాంగ్ లీకి మంచి గుర్తింపుతోపాటు పాపులారిటీ వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ 'మియామీ వైస్', 'హన్నిబాల్ రైజింగ్'లో నటించి హాలీవుడ్‌లోనూ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. 'షాంగై', 'వాట్ ఉమెన్ వాంట్', 'కమింగ్ హౌమ్', 'ది మంకీ కింగ్ 2' చిత్రాలతో హాలీవుడ్‌లోనూ అగ్ర కథానాయికగా ఎదిగారు. ప్రస్తుతం 'సాటర్డే ఫిక్షన్', 'ములన్', 'అన' చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ వైపు హాలీవుడ్, మరోవైపు చైనీస్ చిత్రాల్లోనూ నటిస్తూ కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తున్నారు.
న్యాయం కోసం అలుపెరగని పోరాటం
చూడ్డానికి ఇన్నోసెంట్‌గా కనిపించే గాంగ్ లీకి నిజ జీవితంలో ధైర్య సాహసాలు ఎక్కువే. సక్సెస్, పాపులారిటీతో వచ్చిన ధైర్యంతో అన్యాయాన్ని ఎదిరించడం అలవాటు చేసుకున్నారు. తాను నటించిన 'ఫేర్వెల్ మై కాంకుబిన్', 'ది స్టోరీ ఆఫ్ క్యూ జు', 'జు డౌ' చిత్రాలను చైనాలో బ్యాన్ చేశారు. ఆయా సినిమాలు యువతపై చెడు ప్రభావాన్ని చూపుతాయని భావించి బ్యాన్ చేసినట్టు సెన్సార్ బోర్డ్, చైనా ప్రభుత్వం పేర్కొంది. దీంతో సెన్సార్‌పై అలుపెరగని పోరాటం చేశారు. ఆమె పోరాటానికి 'ఫేర్వెల్ మై కంకుబిన్', 'ది స్టోరీ ఆఫ్ క్యూ జు' చిత్రాలను కొద్ది రోజుల తర్వాత విడుదలకు అనుమతించగా, రెండేండ్ల తర్వాత 'జు డౌ' సినిమా విడుదలకు చైనా ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా గాంగ్ లీ ప్రతిభని గుర్తించడంతో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కూడా ఆమె పాల్గొన్నారు. తనకు సినీ జీవితాన్ని అందించి, సినీ కెరీర్‌కి ఓ గైడ్‌గా పనిచేసిన నటుడు, దర్శకుడు, నిర్మాత, రైటర్ జాంగ్ యిమౌతో అనుబంధం కొనసాగించారు. అప్పట్లో ఈ జంట బాగా పాపులర్ అవ్వడంతోపాటు మీడియాలో తరచూ టాక్ ఆఫ్ ది ఇండిస్టీ అయ్యేవారు. 'రెడ్ సోర్గమ్'తో ప్రారంభమైన వీరి జర్నీ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉండటం విశేషం. వీరి కాంబినేషన్లో 'రెడ్ సోర్గమ్'తోపాటు 'కోడ్‌నేమ్ కౌగర్', 'జు డౌ', 'రైజ్ ది రెడ్ లాంటెర్న్', 'ది స్టోరీ ఆఫ్ క్యూ జు', 'టు లైవ్', 'షాంగై ట్రైడ్', 'కర్స్ ఆఫ్ ది గోల్డెన్ ఫ్లవర్', 'కమింగ్ హౌమ్' వంటి తొమ్మిది చిత్రాలొచ్చాయి. ఈ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడం విశేషంగా చెప్పుకోవచ్చు. మిగతా సినిమాలు నిరాశ పరిచిన ప్రతి సందర్భంలో దర్శకుడు జాంగ్ యిమౌ తనకు మంచి విజయాన్ని అందిస్తూ వచ్చారు. గాంగ్ లీని తిరుగులేని నటిగా నిలబెట్టారు.
అద్భుత ప్రతిభకి దక్కిన పురస్కారాలు
విలక్షణ నటనతో మెప్పించిన గాంగ్లీని అనేక అవార్డులు వరించాయి. 1992లో 'ది స్టోరీ ఆఫ్ క్యూ జు' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా వోల్పి కప్‌ని గెలుచుకున్నారు. 1993లో 'ఫేర్వెల్ మై కాంకుబిన్' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుని, 'మెమొయిర్స్ ఆఫ్ ఏ గీషా' చిత్రానికి సహాయనటిగా నేషనల్ బోర్డ్ రివ్యూ అవార్డుని, అలాగే రెండు గోల్డెన్ రూస్టర్ అవార్డులు, హండ్రెడ్ ఫ్లవర్స్ అవార్డు, కేన్స్ ఫెస్టివల్ ట్రోఫీని అందుకున్నారు. 2000లో 'బ్రేకింగ్ ది సైలెన్స్' చిత్రానికి మాంట్రియల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ ట్రోఫీని అందుకున్నారు. వీటితోపాటు 1997లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీకి, 2000లో బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ అంతర్జాతీయ జ్యూరీకి, 2002లో వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్లో, 2003లో టోక్యో అంతర్జాతీ ఫిల్మ్ ఫెస్టివల్‌కి, 2014లో షాంగై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్, 2018లో గోల్డెన్ హౌర్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జ్యూరీ సభ్యురాలుగా పనిచేశారు. ఇవే కాకుండా 2000లో యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌కి గుడ్‌విల్ అంబాసిడర్‌గా నామినేట్ అయ్యారు. 2006లో చైనాలోనే అత్యంత అందమైన మహిళగా నిలిచారు.
విలక్షణ నటనకు ప్రతిరూపాలు
అత్యద్భుతమైన అందంతోపాటు మెస్మరైజ్ చేసే నటనతో ప్రపంచ ప్రేక్షకులను ఫిదా చేస్తున్న గాంగ్ లీ నటించిన తొలి చిత్రం 'రోడ్ సోర్గమ్'. లిక్కర్ కంపెనీలో పనిచేసే ఓ అందమైన మహిళ జీవితాన్ని తెలిపే కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో గ్రాండ్ మదర్‌గా, లిక్కర్ కంపెనీలో అనేక మంది మగవాళ్ళతో వేధింపులకు గురయ్యే అందమైన అమ్మాయిగా విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు.
రాజకీయ కుట్రలో భాగంగా విమానం హైజాక్ నేపథ్యంలో రూపొందిన థ్రిల్లర్ చిత్రం 'కోడ్‌నేమ్ కౌగర్'లో కీలక పాత్రలో మెప్పించారు. క్విన్ అనే సామ్రాజ్యంలో ఓ సైనికుడికి, ఆ రాజ్యంలోని కోర్ట్ గర్ల్‌కి మధ్య ప్రేమ నేపథ్యంలో రూపొందిన లవ్, వార్ ప్రధాన చిత్రం 'ఫైట్ అండ్ లవ్ విత్ ఏ టెర్రకోట వారియర్'లో కోర్ట్ గర్ల్‌గా అందం, అభినయంతో కూడిన పాత్రలో మెస్మరైజ్ చేశారు. ఇందులో సోల్జర్‌గా దర్శకుడు జాంగ్యిమౌ నటించడం విశేషం. భార్యని అమ్ముకునే కథాంశంతో అత్యంత ట్రాజెడీగా సాగే రొమాంటిక్ డ్రామా 'జు డౌ'లో అమ్ముడు పోయే భార్యగా, ఓ బాబుకి తల్లిగా సంఘర్షణా భరిత పాత్రలో మంత్రముగ్ధుల్ని చేశారు. తన అద్భుతమైన నటనతో యావత్ ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. జూదం ఆడే రెండు వర్గాల మధ్య ఫైటింగ్ ప్రధానంగా హాస్యభరితంగా రూపొందిన 'గాడ్ ఆఫ్ గాంబ్లర్స్3: బ్యాక్ టూ షాంగై'లో కన్నింగ్ గ్యాంబ్లర్‌గా అలరించారు. వార్లార్డ్ యుగంలో ఓ సంపన్న వర్గానికి చెందిన వ్యక్తి వద్ద ఉండే ఒంపుడు గత్తె జీవితాన్ని ప్రతిబింబించిన హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా 'రైజ్ ది రెడ్ లాంటర్న్'లో వంపుడు గత్తెగా విలక్షణ నటనతో ఆడియెన్స్‌ని కనువిందు చేశారు.
రైతు కుటుంబానికి చెందిన తన భర్తని ఊరు పెద్ద కొట్టడంతోపాటు కాలుతో తన్నడంతో సహించలేని ఆ రైతు భార్య న్యాయం కోసం చేసే పోరాటం నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా 'ది స్టోరీ ఆఫ్ క్యూ జు'లో న్యాయం కోసం పోరాడే మహిళగా గాంగ్ లీ అద్భుత నటనని, హాస్యాన్ని పండించారు. 'ఫేర్వెల్ మై కాంకుబిన్'లో నాటకాల ట్రూప్కి చెందిన అమ్మాయిగా మరో సంఘర్షణ పూరిత పాత్రలో అలరించారు. ఓ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి నిజమైన ప్రేమను వెతుకుతూ వెళ్తున్న క్రమంలో ఓ ఒంపుడు గత్తె తన హృదయాన్ని దోచుకున్న కథాంశంతో రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన 'ఫ్లిర్టింగ్ స్కాలర్'లో సంపన్నుడి హృదయాన్ని దోచుకున్న అందమైన అమ్మాయిగా మెస్మరైజ్ చేశారు. ఓ వేశ్య పెయింటర్‌గా మారిన కథాంశంతో వచ్చిన 'ఏ సోల్ హంటెడ్ బై పెయింటింగ్'లో వేశ్యగా, పెయింటర్‌గా మంత్రముగ్ధుల్ని చేశారు. ఓ జంట తమ అవకాశాలను అన్నింటిని కోల్పోయిన తర్వాత సాంస్కృతిక పరమైన, కుటుంబ పరంగా వచ్చే మార్పులను తట్టుకుని ఎలా మనుగడ సాధించారనే కథాంశంతో వార్ డ్రామాగా వచ్చిన 'టు లైవ్'లో పాపకి తల్లిగా, మనుగడ కోసం పోరాడే మహిళగా మెప్పించారు. షాంగై పట్టణంలోని నేర చరితని ప్రతిబింబించే క్రైమ్ డ్రామా 'షాంగై ట్రెయిడ్'లో క్రిమినల్ బాస్‌కి ఒంపుడు గత్తెగా, నైట్‌క్లబ్ సింగర్‌గా మెస్మరైజ్ చేశారు. పంగా రాజ్యానికి చెందిన పంగా కుటుంబం నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామా 'టెంప్ట్రెస్ మూన్'లో పంగా రాజు ఏకైక కుమార్తెగా అందమైన పాత్రలో కనువిందు చేశారు. విభిన్న కల్చర్, విభిన్న జీవితాలను ప్రతిబింబించే 'చైనీస్ బాక్స్'లో సంఘర్షణభరిత పాత్రలో ఆకట్టుకున్నారు.
హిస్టారికల్ రొమాంటిక్ చిత్రం 'ది ఎంపరర్ అండ్ ది అస్సాస్సిన్'లో అద్భుతమైన యాక్షన్ చేసే గూఢచారిగా, '2046'లో గ్యాంబ్లర్‌గా, 'ఏరోస్' చిత్రంలో కాల్ గర్ల్‌గా, 'మెమొరీస్ ఆఫ్ ఏ గీషా'లో అందమైన అమ్మాయిగా హీరోని మాయ చేసే లేడీగా అలరించారు. ఈ సినిమా పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ 'మియామీ వైస్'లో క్రిమినల్ హెడ్‌కి లవర్‌గా, మార్షల్ ఆర్ట్స్ ప్రధాన చిత్రం 'కర్స్ ఆఫ్ ది గోల్డెన్ ఫ్లవర్'లో రాణిగా, పోరాడే యోధురాలిగా అబ్బురపరిచారు. హర్రర్ ప్రధానంగా తెరకెక్కిన 'హన్నిబాల్ రైజింగ్'లో విడోగా, అమెరికన్ పొలిటికల్ థ్రిల్లర్ 'షాంగై'లో నేర సామ్రాజ్యానికి అధిపతికి భార్యగా, ప్రతిఘటన నాయకురాలిగా మెప్పించారు.
రొమాంటిక్ యాక్షన్ కామెడీగా వచ్చిన 'వాట్ ఉమెన్ వాంట్'లో అడ్వర్టైజింగ్ మేనేజర్‌గా అలరించారు. హిస్టారికల్ డ్రామా చిత్రం 'కమింగ్ హౌమ్'లో అకారణంగా అరెస్ట్ కాబడిన భర్త కోసం తపించే భార్యగా విలక్షణ పాత్రలో మెస్మరైజ్ చేశారు. యాక్షన్ ఫాంటసీగా వచ్చిన 'ది మంకీ కింగ్ 2'లో మనుషులను తినే వింత మాయా లేడీగా ఆకట్టుకున్నారు.
వీటితోపాటు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో హిస్టరీ డ్రామాగా తెరకెక్కుతున్న 'సాటర్డే ఫిక్షన్'లో అండర్ కవర్ ఏజెంట్‌గా, హిస్టారికల్ వార్ డ్రామా 'ములన్'లో మంత్రగత్తెగా నటిస్తున్నారు.
Authorization