ప్రపంచ వ్యాప్తంగా క్రైమ్ థ్రిలర్ నేపథ్యంలో రూపొందిన చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే ఈ సినిమాలు వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మరు క్షణంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠే ఈ సినిమాలకు ప్రాణం. ప్రేక్షకుల ఊహకి సవాళ్ళు విసిరి శభాష్ అనిపించుకున్న కొన్ని క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
కన్ఫెషన్స్
ఇది జపనీస్ డ్రామా క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. టెట్సుయా నకషిమా దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి టకకో మట్సు ప్రధాన పాత్రలో నటించారు. మహిళా ప్రధానంగా సాగే ఈ చిత్రం ప్రధానంగా మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. హైస్కూల్లో యుకో మోరిగుచి అనే లేడీ టీచర్ పనిచేస్తుంటుంది. ఆమె భర్త హెచ్ఐవీ బాధితుడు. దాని కారణంగా తన కూతురు కూడా అనారోగ్యానికి గురవుతుంది. అయితే వర్షాకాలంలో స్కూల్‌కి రిజైన్ చేయబోతున్నట్టు తన క్లాస్‌లో ప్రకటిస్తుంది. మరోవైపు స్కూల్‌కి వెళ్ళిన తన కూతురు కిడ్నాప్ కావడాన్ని యూకో గమనిస్తుంది. ఆమె కోసం వెతగ్గా ఓ స్విమ్మింగ్ ఫూల్లో చనిపోయి ఉంటుంది. అదే స్కూల్లోని కొంత మంది విద్యార్థులు ఆ బాలిక హత్యకు కారణమని అనుమానిస్తుంది. దోషులను వెతికే క్రమంలో బయటపడ్డా నిజాలేంటి?, ఓ తల్లి నేరస్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకుందనేది సినిమా. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. నాలుగు జపనీస్ అకాడమీ అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్స్ కోసం పంపారు.
ది బాడీ
ఇది స్పానిష్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. ఓరియోల్ పాలో దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2012లో విడుదలై ఆకట్టుకుంది. ఓ శవం మిస్సింగ్ ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. ఓ మధ్య వయస్కురాలైన అందమైన బిజినెస్ ఉమెన్ హార్ట్ ఎటాక్‌తో బాధపడుతుంది. ఆమె తన భర్తకి విడాకులిచ్చి తనకంటే తక్కువ వయసున్న వ్యక్తిని పెళ్ళి చేసుకుంటుంది. ఓ రోజు వ్యాపార పని మీద వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై చనిపోతుంది. శవాలను భద్రపరిచే గదిలో ఆమె మృతదేహాన్ని ఉంచుతారు. ఓ రోజు రాత్రి ఆ గది సమీపంలో కారు ప్రమాదం జరుగుతుంది. సెక్యూరిటీ గార్డ్ కోమాలోకి వెళతాడు. తీరా చూస్తే ఆమె శవం మాయమవుతుంది. మరి ఇన్స్పెక్టర్ జైమెపెనా ఆ శవాన్ని కనిపెట్టేందుకే చేసే ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా సినిమా సాగుతుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం మంచి విజయం సాధించడంతోపాటు కన్నడ, తమిళంలో 'గేమ్'గా, హిందీలో 'ది బాడీ'గా, కొరియన్లో 'ది వానిషెడ్'గా రీమేక్ అయ్యింది. ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్టర్గా జోస్ కోరోనాడో, వ్యాపారవేత్తగా బెలెన్ ర్యూడా అద్భుత నటనతో మెప్పించారు.
ది కీపర్ ఆఫ్ లాస్ట్ కాజెస్
డానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. ఓ రాజకీయ నాయకురాలి కిడ్నాప్ కేసు ప్రధానంగా సినిమా సాగుతుంది. దీనికి మైఖేల్ నోర్గార్డ్ దర్శకత్వం వహించారు. కార్ల్ మార్క్ డిటెక్టివ్. తాను చేసిన ఓ తప్పు కారణంగా అతని స్థాయిని తగ్గించి కింది డిపార్ట్మెంట్కి పంపిస్తారు. 'డిపార్ట్మెంట్ క్యూ' అనే కొత్త విభాగం సృష్టించి అందులో కోల్డ్ కేసులను ఇన్వెస్ట్గేట్ చేస్తుంటారు. అందులో భాగంగా ఐదేండ్ల క్రితం కిడ్నాప్‌కి గురై ఇంకా పూర్తి కాని ఓ రాజకీయ నాయకురాలి కిడ్నాప్ కేసు కార్ల్‌ని ఆకట్టుకుంటుంది. ఆ కేసుని ఛేదించేందుకు తన అసిస్టెంట్ అసద్‌తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేపడతారు. ఈ క్రమంలో వెలికి తీసిన అతి పెద్ద చీకటి కోణాల ఇతివృత్తంతో రూపొందిన చిత్రమిది. 2013లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇందులో కార్ల్గా నికోలాజ్ లీ కాస్, అసద్గా ఫరెస్ ఫరెస్ నటించారు.
ది కింగ్ ఆఫ్ ది మౌంటేన్
స్పానిష్ థ్రిల్లర్ చిత్రమిది. గోంజలో లోపేజ్ గల్లెడో దర్శకత్వం వహించారు. ప్రత్యర్థుల దాడి నుంచి తప్పించుకునేందుకు చేసే పరుగు నేపథ్యంలో సాగుతుంది. క్వీమ్ అనే ట్యాక్సీ డ్రైవర్ ఓ అడవిలోని పర్వత ప్రాంతంలో ప్రయాణిస్తున్న క్రమంలో పర్వతాల నుంచి బుల్లెట్ వచ్చి తన కారుని తగులుతుంది. అది చూసుకునే లోపు వరుసగా బుల్లెట్లతో దాడి చేస్తుంటారు. దీంతో పరిగెత్తుతుంటాడు. మధ్యలో ఓ బియా అనే లేడీ పరిచయమవుతుంది. ఆమె కారులో కొంత దూరం ప్రయాణిస్తారు. అయినా గుర్తుతెలియని వ్యక్తులు వీరిపై తుపాకులతో దాడి చేస్తుంటారు. ఇద్దరూ ప్రాణాలను కాపాడుకునేందుకు అడవిలో పరిగెడుతుంటారు. ఇంతకి వీళ్ళు ఎవరు?, వీళ్ళపై దాడి చేసేదెవరు? వీరి పరుగు ఏ తీరం చేరిందనేది సినిమా. విభిన్న కథతో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ 2007లో విడుదలై ఆకట్టుకుంది. ఇందులో క్విమ్ పాత్రలో లియోనార్డో బరాగ్లియా, బియాగా మారియా వాల్వెర్డె నటించారు.
ది యెల్లో సీ
సౌత్ కొరియన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఓ హత్య వరుస ప్రమాదాలకు దారితీసిన కథాంశంతో రూపొందింది. దీనికి నా హాంగ్ జిన్ దర్శకత్వం వహించారు. గు నామ్ అనే కొరియాకు చెందిన క్యాబ్ డ్రైవర్ చైనాలో నివాసం ఉంటాడు. స్థానిక గ్యాంగ్‌స్టర్ ఓ ప్రొఫేసర్ని హత్య చేసే ఆఫర్‌ని గు నామ్‌కి ఇస్తాడు. దీంతో ఆ ప్రొఫేసర్ హత్య చేసిన అనంతరం తాను చేసిన మిస్టేక్ వల్ల పోలీసులు ఇతన్నీ వెంటాడుతుంటారు. దీంతో రోడ్డుపై వరుసగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అనేక మంది మృత్యువాత పడటంతోపాటు గాయాలపాలవుతారు. చివరికి కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది సినిమా. క్రైమ్‌తోపాటు అనేక అంశాలను అండర్ కరెంట్‌గా చర్చించిందీ చిత్రం. 2010లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. అనేక అవార్డులను సొంతం చేసుకుంది. గు నామ్ పాత్రలో హ జంగ్ వూ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
లాఫ్ట్
బెల్జియంకి చెందిన ఎరోటిక్ మిస్టరీ చిత్రమిది. ఎరిక్ వాన్ లూవే దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓ వంపుడుగత్తె హత్య కేసు మిస్టరీ ప్రధానంగా సాగుతుంది. అయిదుగురు పెళ్లైన మార్కెటింగ్ ఉద్యోగులు లాఫ్ట్ అనే అపార్ట్మెంట్లో ఉంటారు. అందులో వీళ్ళు తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. అంతేకాదు అందులో ఓ వంపుడుగత్తెని కూడా పెట్టుకుంటారు. ఓ రోజు ఆమె హత్యకు గురై కనిపిస్తుంది. దీంతో ఐదుగురిలో ఒకరిపై ఒకరు అనుమానం కలుగుతుంది. మరి అసలు హత్యకు కారకులెవరనేది మిగిలిన సినిమా. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సస్పెన్స్‌కి గురి చేస్తూ సాగే ఈ చిత్రం 2008లో విడుదలై ఆకట్టుకుంది. ప్రధాన పాత్రల్లో కోయెన్ డె బౌ, ఫిలిప్ పీటర్స్, మ్యాథియాస్ స్కోనీయార్ట్స్, బ్రూనో వాండెన్, కోయిన్ డె గ్రీవ్ నటించారు. వంపుడు గత్తెగా వీర్లె బీటెన్స్ ఆకట్టుకున్నారు.
టైమ్ క్రైమ్స్
స్పానిష్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. నాచో విగలోండో దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రధానంగా టైమ్ మిషన్ నేపథ్యంలో సాగుతుంది. ఓ మధ్యవయస్కుడు హెక్టర్, తన కిష్టమైన భార్య క్లారాతో కలిసి ఓ అటవి ప్రాంతంలో నివాసం ఉంటాడు. ఓ రోజు మాస్క్‌తో ఉన్న ఓ వ్యక్తి ఒక అమ్మాయిని హత్య చేస్తాడు. దాన్ని హెక్టర్ చూస్తాడు. సమీపంలో ఉన్న టైమ్ మిషన్ ల్యాబ్‌కి వెళ్ళి హంతకుడెవరనేది కనుగొనేందుకు ఓ గంట వెనక్కి వెళతాడు. ఈ క్రమంలో అతను ఇద్దరవుతారు, ఆ తర్వాత ముగ్గురవుతాడు. దీంతో చివరికి తనలోని నిజం ఎవరు?, ప్రమాదంలో ఉన్న తన భార్యని కాపాడేందుకు ఆయన ఏం చేశాడనేది సినిమా. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా, మిస్టీరియస్‌గా సాగే ఈ సినిమా 2007లో విడుదలై ఆకట్టుకుంది. హెక్టర్ పాత్రలో కర్రా ఎలెజాల్డె నటన అలరిస్తుంది.
ది వేవ్
జర్మన్ సోషియో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. డెన్నీస్ గెన్సల్ దర్శకత్వం వహించారు. ఓ స్కూల్ ఉపాధ్యాయుడి ఆగడాలను ఈ చిత్రం తెలియజేస్తుంది. అది రెండో ప్రపంచ యుద్ధం జరిగే కాలం. ప్రయోగాత్మకంగా ఓ స్కూల్‌ని నడపాలని అధికారులు నిర్ణయిస్తారు. అందులో ఒక్కడే టీచర్. తనే స్కూల్ మొత్తాన్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో తనకు ఇచ్చిన అధికారాలతో విద్యార్థులు, విద్యార్థినిలపై ఆధిపత్యం చెలాయిస్తూ, అనేక రకాలుగా వేధిస్తుంటాడు. దీంతో స్కూల్ విద్యార్థులంతా కలిసి యూనిటీగా తయారై టీచర్‌పై ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో అప్పట్లో సంచలనం సృష్టించిన ఘటన ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ఇది 2008లో విడుదలై సంచలన విజయం సాధించింది. అనేక అవార్డులను సొంతం చేసుకుంది. టీచర్‌గా జర్గెన్ వోగెల్ నటన ఆకట్టుకుంటుంది.
ది స్కిన్ ఐ లైవ్ ఇన్
స్పానిష్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రమిది. దీనికి పెడ్రో ఆల్మోడోవర్ దర్శకత్వం వహించారు. ప్లాస్టిక్ సర్జన్ రాబర్ట్ అనేక మందికి ప్లాస్టిక్ సర్జరీ చేసి సక్సెస్ఫుల్ డాక్టర్‌గా రాణిస్తాడు. కారు ప్రమాదంలో తన భార్య కాలిపోవడంతో ఆమెకి కొత్త చర్మాన్ని అందించేందుకు ప్రయోగాలు చేస్తాడు. ఈ క్రమంలో కొన్ని తప్పులు చేస్తాడు. ఈ ప్రయోగాలకు కొంత మంది మహిళలు బలవుతారు. వారు క్రమంగా ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభిస్తారు. మరి ఆ సర్జన్ చేసిన తప్పులు ఏంటి?, పలు విషాదాలకు తనకీ సంబంధమేంటనేది సినిమా. 2011లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. విశేష ఆదరణ పొందింది. ప్లాస్టిక్ సర్జన్‌గా ఆంటోనియో బాండెరాస్ తనదైన నటనతో మెప్పించారు.
నైన్ క్వీన్స్
అర్జెంటీనా క్రైమ్ డ్రామా థ్రిల్లర్ చిత్రమిది. దీనికి ఫేబియాన్ బీలింస్కీ దర్శకత్వం వహించారు. ఓ స్కామ్ ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది. జాన్, మార్కోస్ ఇద్దరు కాన్ ఆర్టిస్టులు. తమదైన నటన, హాస్యంతో జనాలను అలరిస్తుంటారు. అలాగే అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో అత్యంత అరుదైన 'ది నైన్ క్వీన్స్' అనే స్టాంప్ కుంభకోణం వీళ్ళు చేయాల్సి వస్తుంది. మరి దాన్ని విజయవంతంగా పూర్తి చేశారా?, ఈ క్రమంలో చోటు చేసుకున్న హాస్యభరిత, భావోద్వేగభరిత, క్రైమ్, థ్రిల్లింగ్ అంశాల సమాహారంగా ఈ చిత్రం రూపొందింది. 2000లో విడుదలైన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 'క్రిమినల్' పేరుతో 2004లో హాలీవుడ్లో, 'బ్లఫ్‌మాస్టర్' అని బాలీవుడ్లో, 'గులుమాల్' పేరుతో మలయాళంలో, 'ఆల్ ది బెస్ట్' పేరుతో తెలుగులో రీమేక్ చేయడం విశేషం.
టెల్ నో వన్
ఫ్రెంచ్ క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. గైల్లామె కనెట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా తెరకెక్కింది. మర్డర్ మిస్టరీ చుట్టూ సాగే చిత్రమిది. డాక్టర్ అలెగ్జాండర్ బెక్ భార్య ఎనిమిదేండ్ల క్రితం హత్యకి గురవుతుంది. ఓ సీరియల్ కిల్లర్ ఆమెని హత్య చేస్తాడు. ఈ విషాదం నుంచి డాక్టర్ నెమ్మదిగా కోలుకుంటున్న తరుణంలో ఓ రోజు తన భార్య మెయిల్ ఐడీ నుంచి తనకో మెయిల్ వస్తుంది. దాన్ని గమనిస్తే వరుసగా ఆమె హత్యకు సంబంధించిన క్లూస్ దొరుకుతుంటాయి. ఆ క్లూస్‌తో ఆ డాక్టర్ ఏం చేశాడనేది ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. 2006లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రంలో డాక్టర్‌గా ఫ్రాంకోయిస్ క్లుజెట్, భార్య పాత్రలో మ్యారీ జోసీ క్రోజ్ నటించారు.
నో మెర్సీ
సౌత్ కొరియన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రతీకారం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఐమ్ గ్యోంగ్ టీక్ దర్శకత్వం వహించారు. స్కూల్లో కొందరు దుండగులు తన చెల్లెలిని వేధించి, చిత్ర హింసలు పెట్టి, అత్యాచారం చేసి చంపేస్తారు. దీంతో చెల్లెలి మరణానికి కారణమైన వారిపై ఓ అక్క ప్రతీ కారం తీర్చుకుంటుంది. ఒక్కొక్కరిని అంతం చేసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఉత్కంఠభరిత సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. గతేడాది విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇందులో అక్కగా లీ సి యంగ్ నటించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది.
Authorization